హెచ్‌1బీ మరింత కఠినతరం | Hiring employees under H1-B visas to get tougher for US companies | Sakshi
Sakshi News home page

హెచ్‌1బీ మరింత కఠినతరం

Published Sat, Nov 3 2018 3:36 AM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM

Hiring employees under H1-B visas to get tougher for US companies - Sakshi

వాషింగ్టన్‌: ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పించే హెచ్‌–1బీ వీసా నిబంధనలను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. హెచ్‌–1బీ వీసాకు కంపెనీలు సమర్పించే దరఖాస్తుల్లో తాజాగా మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం హెచ్‌–1బీ వీసా కోసం కంపెనీలు దరఖాస్తు చేసే సమయంలోనే.. అప్పటికే తమ కంపెనీలో విదేశీ ఉద్యోగులు ఎంత మంది పనిచేస్తున్నారో కూడా ఆయా కంపెనీలు తెలియజేయాల్సి ఉంటుంది.

అలాగే కొత్తగా విదేశీయులను ఏ పని కోసం నియమించుకుంటున్నారో కూడా కంపెనీలు దరఖాస్తులో పేర్కొనాలి. ఆ పని చేయగలిగిన వారు అమెరికాలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతనే విదేశీయుడిని నియమించుకునేందుకు కంపెనీకి అనుమతి లభిస్తుంది. కొత్త వారిని ఏయే ప్రదేశాల్లో, ఏయే స్థానాల్లో నియమిస్తారు? ఎంత కాలం వరకు వారు ఉద్యోగాల్లో ఉంటారు? ఇప్పటికే ఆ ప్రదేశం/స్థానంలో ఎంత మంది విదేశీ ఉద్యోగులు పనిచేస్తున్నారు? తదితర వివరాలన్నింటినీ కంపెనీలు అమెరికా కార్మిక విభాగానికి తెలియజేయాల్సి ఉంటుంది.

అలాగే హెచ్‌–1బీ వీసాపై పనిచేస్తున్న ఉద్యోగులు అమెరికా ప్రభుత్వానికి ఫిర్యాదులు సమర్పించే పత్రంలోనూ ప్రభుత్వం పలు మార్పులు తీసుకొచ్చింది. సంస్థలు నిబంధనలను ఉల్లంఘించినప్పుడు ఫిర్యాదు స్వభావం, తీవ్రతను మరింత విపులంగా తెలిపేలా ఈ మార్పులు ఉన్నాయి. కొత్త మార్పులన్నీ రాబోయే కొన్ని వారాల తర్వాత అమలవుతాయనీ, కచ్చితంగా ఎప్పటి నుంచి అమలవుతాయో కార్మిక విభాగం ప్రకటిస్తుందని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. అయితే విదేశీయులకు ఉద్యోగాలు కల్పించే కంపెనీలను లక్ష్యంగా చేసుకునే తాజా నిబంధనలు రూపుదిద్దుకున్నాయని పలువురు పేర్కొంటున్నారు.



త్వరలోనే గ్రీన్‌కార్డులు: ట్రంప్‌
అమెరికా పౌరులు కానప్పటికీ ఆ దేశంలో శాశ్వతంగా నివసించే అవకాశం కల్పించే గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి ట్రంప్‌ శుభవార్త చెప్పారు. సంవత్సరాలుగా వేచి చూస్తున్న వారందరికీ గ్రీన్‌కార్డులు వస్తాయన్నారు. అక్రమ వలసలపై తమ ప్రభుత్వ విధానం గురించి ట్రంప్‌ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గ్రీన్‌ కార్డుల కోసం కొంత మంది చాలా ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్నారు. చాలా కాలం నుంచి వారు ఓపికగా ఉంటున్నారు. వాళ్లు అన్నింటినీ అద్భుతంగా చేశారు. వారికి త్వరలోనే గ్రీన్‌ కార్డులు అందబోతున్నాయి.

చాలా మందికి అతి త్వరలోనే గ్రీన్‌కార్డులు రాబోతున్నాయి. మా దేశానికి కంపెనీలు వస్తున్నాయి. వాటిలో పనిచేసేందుకు ఉద్యోగులు కావాలి. ప్రస్తుతం గ్రీన్‌ కార్డు కోసం వేచి చూస్తున్న వారంతా ప్రతిభతో ఇక్కడికొచ్చిన వారు. కాబట్టి వారందరికీ త్వరలోనే మంచి జరుగుతుంది’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఎల్‌ సాల్వడార్, హోండురాస్, గ్వాటెమాల దేశాల నుంచి దాదాపు 5 వేల నుంచి 7 వేల మంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు వస్తుండటంపై ఉద్రిక్తతలు ఏర్పడుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే దాదాపు 6 లక్షల మంది భారతీయులు అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసి నిరీక్షిస్తున్నారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి స్థిరపడిపోయే వారి వల్ల దేశంలోకి ప్రతిభతో, చట్టబద్ధంగా వచ్చిన వారి హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇతరులను తమ దేశ పౌరులుగా చేర్చుకునేందుకు ఏ దేశానికైనా ఓ పరిమితి ఉంటుందనీ, ఇప్పటికే అన్ని దేశాల కన్నా అమెరికాలోకే విదేశీయులను ఎక్కువగా ఆహ్వానించేలా తమ వలస విధానాలు ఉన్నాయని ట్రంప్‌ పేర్కొన్నారు. 1970 నుంచి ఇప్పటి వరకు 4 కోట్ల మందికి అమెరికా గ్రీన్‌ కార్డులు మంజూరు చేసిందని వివరించారు.

రాళ్లు విసిరితే కాల్చేస్తారు
మూడు దేశాల నుంచి అమెరికాకు తరలి వస్తున్న దాదాపు 7 వేల మంది సమూహాన్ని అడ్డుకుంటామనీ, వారు భద్రతా సిబ్బందిపై రాళ్లు విసిరితే సైన్యం ఆ ప్రజలపై కాల్పులు జరిపే అవకాశం ఉంటుందని ట్రంప్‌ అన్నారు. ఈ చొరబాటుదారులను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో వేలాది సైనికులను మోహరించారు. అక్రమ చొరబాటుదారులపై అమెరికా అనుసరిస్తున్న ‘పట్టుకోడం, వదిలేయడం’ విధా నం లోపభూయిష్టంగా ఉందనీ, దేశంలోకి అనవసర వలసలు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. ఇకపై అక్రమ చొరబాటు దారులను పట్టుకోవడమే కానీ వదిలిపెట్టడం ఉండదని హెచ్చరించారు. అమెరికాలో బిడ్డ పుట్టినంత మాత్రాన అమెరికా పౌరసత్వం ఇచ్చేస్తుండటంతో ఇది ‘బర్త్‌ టూరిజం’గా మారిందనీ, చైనీయులు ఈ ‘వెర్రి, పిచ్చి’ విధానం వల్ల లాభం పొందారని ట్రంప్‌ ఆరోపించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement