
వాషింగ్టన్: రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వరుస దూకుడు నిర్ణయాలతో ట్రంప్‌కు అమెరికాలో క్రేజ్ తగ్గుతోందా..? ఆయన విధానాలతో అగ్ర దేశ ప్రజలు అంత సంతోషంగా లేరా..? అంటే తాజాగా వెల్లడైన పాపులర్ పోల్ సర్వే ఫలితాలు అవునేనే చెబుతున్నాయి. మంగళవారం(ఫిబ్రవరి 25)తో ముగిసిన రాయిటర్స్/ఇప్సోస్ తాజా పోల్‌లో ట్రంప్‌కు 44 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. జనవరి చివరి వారంలో నిర్వహించిన పోల్‌లో కంటే ట్రంప్‌కు మద్దతు పలికేవారి సంఖ్య కాస్త తగ్గింది.
జనవరిలో వరుసగా ట్రంప్‌నకు 47 శాతం మంది అనుకూలంగా ఓటు వేయగా ప్రస్తుతం ఇది 44 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో ట్రంప్‌ను వ్యతిరేకించే వారి సంఖ్య జనవరితో పోలిస్తే ఏకంగా 10 శాతం పెరిగి 51 శాతానికి చేరింది. జనవరిలో నిర్వహించిన సర్వేలో ట్రంప్‌ను కేవలం 41 శాతం మంది మాత్రమే వ్యతిరేకించారు. ట్రంప్ వలస విధానానికి అత్యధికంగా 47 శాతం మంది మద్దతు పలుకుతుండగా అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ తిరోగమనం దిశగా తీసుకెళుతున్నారని ఏకంగా 53 శాతం మంది భావిస్తున్నారు.
జనవరిలో ట్రంప్ ఆర్థిక విధానాలను కేవలం 43 శాతం మంది మాత్రమే వ్యతిరేకించగా ఇప్పుడు ఆ సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదే సమయంలో ట్రంప్ ఇతర దేశాలపై విధిస్తున్న టారిఫ్ పన్నులు, ఇతర ఆర్థిక విధానాలను కేవలం 39 శాతం మంది మాత్రమే బలపరుస్తున్నారు. ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుందని అమెరికన్లు భావిస్తుంటారు. ఇదే గతేడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చిన అంశం.
అయితే రెండో టర్ము మొదలై రెండు నెలలు కూడా కాకముందే ట్రంప్ ఈ విషయంలోనే ప్రజల మద్దతు కోల్పోతుండడంపై చర్చ జరుగుతోంది. చైనా కాకుండా ఇతర దేశాల వస్తువులపై ట్రంప్ దిగుమతి సుంకాలు విధించడాన్ని 54 శాతం మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే చైనాపై టారిఫ్‌ల విధింపు అంశంలో మాత్రం ట్రంప్‌కు 49 శాతం మంది మద్దతు లభించింది. చైనాపై టారిఫ్‌లను కూడా 47 శాతం మంది వ్యతిరేకిస్తుండడం గమనార్హం. రాయిటర్స్,ఇప్సోస్ నిర్వహించిన తాజా పోల్‌లో మొత్తం 4145 మంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment