
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా దేశంలో నిరసన ఉద్యమాల్లో ఎక్కువ మంది అమెరికన్లు పాల్గొంటున్నారు. ఆయన అధ్యక్ష పదవికి ఎన్నికవడానికి పది నెలల ముందు నుంచే అనేక అంశాలపై వీధుల్లోకి వచ్చే పౌరుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రఖ్యాత దినపత్రిక వాషింగ్టన్ పోస్ట్-కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ జరిపిన తాజా సర్వేలో తేలింది. 2016 ఆరంభం నుంచి ప్రతి ఐదుగురు అమెరికన్లలో ఒకరు నిరసన తెలపడానికి వీధికెక్కడమో లేదా రాజకీయ ర్యాలీల్లో పాల్గొనడమో జరిగిందని ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా ట్రంప్ పోకడలకు వ్యతిరేకంగా, కొంత అనుకూలంగా, ఇంకా ఇతర అంశాలపై ప్రదర్శనల్లో పాల్గొన్నవారిలో 19 శాతం మంది తాము మొదటిసారి ఇలా వీధుల్లోకి వచ్చామని తెలిపారు.
ఈ సర్వే కోసం మాట్లాడినవారిలో 19 శాతం ట్రంప్‌కు మద్దతుగా, 32 శాతం ఆయన విధానాలకు నిరసనగా ర్యాలీల్లో చేరామని వివరించారు. 2018 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ సర్వే నిర్వహించారు. అంటే అమెరికాలో తుపాకులపై నియంత్రణ ఉండాలని కోరుతూ మార్చిలో మార్చ్ ఫర్ అవర్ లైవ్జ్ మ్యాటర్ ప్రదర్శనకు ముందే ఈ అధ్యయనం జరిపారు. ఈ నిరసనకారుల్లో ట్రంప్ పార్టీకి చెందినవారు (రిపబ్లికన్లు) కేవలం 20 శాతం ఉన్నారు. ప్రతిపక్ష డెమొక్రాట్లు 40 శాతం, స్వతంత్రులు 36 శాతం ఉన్నారు. కేవలం ట్రంప్ విషయాలకే పరిమితం కాకుండా విస్తృత అంశాలపై తమ భావాలు వ్యక్తం చేయడానికి ఈ ర్యాలీల్లో పాల్గొంటున్నామని వారు చెప్పారు. ట్రంప్‌కు సంబంధం లేని అంశాలపై కొన్ని ర్యాలీలు జరిగాయిగాని, అత్యధిక నిరసన ప్రదర్శనలు ట్రంప్ పోకడలకు సంబంధించినవే.
వలసదారుల అణచివేత, ఒబామా కేర్ కోత, వాతావరణ పరిరక్షణపై నిర్లక్ష్యం
వాతావరణ మార్పులపై పారిస్ ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలగడం, చట్టబద్ధ, చట్టవ్యతిరేక వలసల తగ్గింపునకు చర్యలు, సైన్యంలోకి ట్రాన్స్జెండర్స్ ప్రవేశంపై నిషేధం వంటి అంశాల కారణంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న అమెరికన్ల సంఖ్య బాగా పెరుగుతోందని ఈ సర్వే వివరించింది. అయితే, మహిళల హక్కుల కోసం జరిగే ప్రదర్శనలు ఎక్కువ మంది పౌరులను ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి ర్యాలీలకు హాజరయ్యామని 46 శాతం ప్రజలు చెప్పారని ఈ సర్వే వెల్లడించింది. 2017 జనవరి 20న ట్రంప్ ప్రమాణం తర్వాత జరిగిన మహిళల ర్యాలీల్లో దేశవ్యాప్తంగా 42 లక్షల మంది పాల్గొన్నారు. స్త్రీల హక్కులపై 2018లో జరిగిన ప్రదర్శనల్లో 16 నుంచి 25 లక్షల మంది పాల్గొన్నారని అంచనా. ట్రంప్ విధానాలపై ప్రతిఘటనకు లక్షలాది మంది అమెరికన్లు ముందుకొస్తున్నారని ఈ సర్వే చెబుతోందని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ మైకేల్ కాజిన్ చెప్పారు. పౌరులకు రాజకీయాలపై ఆసక్తి పెరుగుతోందని ఈ సర్వే తెలిపింది. తాము ఏదో ఒక ప్రజాందోళనలో పాల్గొన్నామని, ఒక బహిష్కరణ(బాయ్‌కాట్) ఉద్యమంలో పాల్గొనడమేగాక వాటికి విరాళాలు కూడా ఇచ్చామని సర్వేచేసిన ప్రతి నలుగురిలో ఒకరు వెల్లడించారు.
ప్రదర్శకులందరూ ఓటేస్తారా?
ఓటు హక్కు ఉన్నవారిలో 40 శాతం మంది కిందటి అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. మరి ఈ రెండేళ్ల ప్రజాందోళనలు, ర్యాలీల ఫలితంగా 2018 నవంబర్ చట్టసభలు, గవర్నర్ తదితర పదవులకు జరిగే ఎన్నికల్లో పోలింగ్ పెరుగుతుందని స్పష్టమౌతోంది. ప్రదర్శనల్లో పాల్గొంటున్న వారిలో 83 శాతం మంది తాము వచ్చే ఎన్నికల్లో ఓటేస్తామని తెలిపారు. ట్రంప్ హయాంనాటి ర్యాలీల ప్రత్యేకత ఏమంటే 1960ల నాటి నిరసన ఆందోళనలతో పోల్చితే వాటికి హాజరవుతున్న వయోజనుల సంఖ్య బాగా పెరుగుతోంది. 50 ఏళ్ల కిందటి వియత్నాం యుద్ధ వ్యతిరేక ప్రదర్శనల్లో విద్యార్థులు ముందుండి నడిచారు. నేటి ఆందోళనల కోసం వీధుల్లోకి వస్తున్న జనంలో వృద్ధులు, శ్వేతజాతీయులు, విద్యావంతులు, సంపన్నులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటున్నారని ఈ సర్వే వివరించింది. వారిలో 50 ఏళ్లు దాటిన ప్రదర్శకులు 44 శాతం, లక్ష డాలర్ల వార్షికాదాయం ఉన్న పౌరులు 36 శాతం ఉన్నారని ఈ సర్వేలో తేలింది. అలాగే, శివారు ప్రాంతాల్లో నివసించే జనం ఎక్కువ మంది ఈ ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు.