decreasing
-
ఏపీలో నెలనెలా తగ్గిపోతున్న పెన్షన్లు
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను టార్గెట్ చేసింది. గతం కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. నెల నెల పెన్షన్లలో కోతలు విధిస్తోంది ప్రభుత్వం. ఎన్టీఆర్ భరోసా పేరిట ప్రభుత్వం అందిస్తున్న ఫించన్ పంపిణీ కార్యక్రమం ద్వారా ఈ విషయం బయటపడుతోంది.గత నెల కంటే ఈ నెల పెన్షన్లు మళ్లీ తగ్గాయి. అక్టోబర్ నెలకి 64,38,884కు పెన్షన్లను తగ్గించింది ప్రభుత్వం. సెప్టెంబర్‌లో 64,61,485 మందికి పెంషన్లు మంజూరు చేయగా.. ఈ నెల 64,38,884కే పెన్షన్లు అందించింది. ఈ ఏడాది మేలో 65,49,864 పెన్షన్లు ఉండగా.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు లక్షా 11 వేలు మంది పెన్షన్లను తొలగించేసింది. కొత్తగా పెన్షన్లు మంజూరు చేయకుండా ఉన్నవాటిని ప్రభుత్వం తగ్గిస్తుండటంపై పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు
సాక్షి ప్రతినిధి అనంతపురం: క్రూర జంతువుగా పేరున్న తోడేళ్లు పొదలు, గుట్టలను ఆవాసాలుగా చేసుకుని జీవిస్తాయి. ఒకప్పుడు అటవీ ప్రాంతంలో ఎక్కడ చూసినా కనిపించేవి. గొర్రెలు, మేకల మంద సంచరించే ప్రాంతాల్లో తిరిగేవి. ముఖ్యంగా జీవాలు ఎక్కువగా ఉండే అనంతపురం జిల్లాలో భారీగా ఉండేవి. కానీ ప్రస్తుతం వాటి జాడ మచ్చుకైనా కనిపించడం లేదు. తాజాగా అటవీశాఖ అధికారులు వీటిని అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చారు. రెండేళ్లుగా ఎక్కడా కనిపించడం లేదని వెల్లడిస్తున్నారు. వేటలో పటిష్టమైన వ్యూహం తోడేళ్లు గుంపులుగా సంచరిస్తాయి. వేటలో పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తాయి. ఒకటి ముందుగా డెకాయ్ ఆపరేషన్ చేస్తుంది. ఆ తర్వాత మిగతా వన్నీ వస్తాయి. మేక లేదా గొర్రెను తీసుకెళ్లేటప్పుడు గొంతును నోట కరచుకుని, తన ముళ్లతోకతో వెనుక కొడుతూ ఉంటుంది. దీంతో ఆ జీవం దానితో పాటు పరిగెడుతుంది. దీని వల్ల ఈడ్చుకెళ్లే శ్రమ వాటికి తగ్గుతుంది. ఒక తోడేలు ఉందంటే రెండు మూడు నక్కలు కూడా దాని సమీపంలోకి పోలేవు. రెండు లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో 30కి మించి తోడేళ్లు ఉండేవని అంచనా. కాగా, ఒకప్పుడు ప్రతి జిల్లాలోనూ గుంటనక్కలు కనిపించేవి. ఇప్పుడు వాటి జాడ కూడా లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో నాలుగేళ్లుగా మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే పునుగుపిల్లి కూడా కనుమరుగైనట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అటవీ విస్తీర్ణం తగ్గడం వల్లే.. జనావాసాలు పెరిగాయి. అడవులు వ్యవసాయ భూములుగా మారాయి. దీంతో వన్యప్రాణుల ఆవాసానికి ఇబ్బందిగా మారింది. కొండలు ఎక్కువగా ఉన్న అనంతపురం లాంటి జిల్లాలే తోడేళ్లకు మంచి ఆవాసాలు. ఇక్కడే వీటి జాడ లేదంటే మిగతా చోట్ల అసలే కనిపించవు. వీటిని కాపాడుకునేందుకు సర్వశక్తులా యతి్నస్తున్నాం. –సందీప్ కృపాకర్, జిల్లా ఫారెస్టు అధికారి, అనంతపురం చదవండి: కొరమీను, ఇంగిలాయి, జల్ల, బొమ్మిడాయి, గొరక, వాలుగ.. ఇక్కడ పుట్టినవే! -
తగ్గుతున్న వ్యవసాయ విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: వారం క్రితం వరకు ఠారెత్తించిన వ్యవసాయ విద్యుత్ వినియోగం క్రమంగా తగ్గుతోంది. ఈ నెలాఖరు నాటికి వ్యవసాయ పంపుసెట్ల వాడకం మరింత తగ్గే వీలుందని విద్యుత్ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో గరిష్టంగా రోజుకు 234 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉన్న విద్యుత్ వినియోగం.. ఇప్పుడు 213 ఎంయూలకు తగ్గింది. రాష్ట్రంలో 17,54,906 వ్యవసాయ పంపుసెట్లున్నాయి. వీటి సామర్థ్యం 1,15,55,552 హార్స్ పవర్ (హెచ్‌పీ). ఏడాదికి 11,584.44 ఎంయూల వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉంటే.. రబీ (నవంబర్–మార్చి) వరకు 6,192 మిలియన్ యూనిట్ల వాడకం (51 శాతం) ఉంటోంది. ఖరీఫ్ (జూన్–నవంబర్)లో 4,744.44 ఎంయూ(39 శాతం)లను మాత్రమే వినియోగిస్తున్నారు. రబీ సీజన్లో వర్షాలు పెద్దగా ఉండవు. చెరువులు, కుంటలు, జలాశయాల్లోనూ నీరు తక్కువగా ఉంటుంది. రాయలసీమలో పండ్లు, కూరగాయల పంటలను బోర్ల ఆధారంగానే సాగు చేస్తారు. దీంతో ఈ సీజన్లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. 10హెచ్‌పీకి పైన ఉన్నవే ఎక్కువ 3 నుంచి 15 హెచ్‌పీల సామర్థ్యం వరకు ఉన్న వ్యవసాయ పంపుసెట్లను వాడుతున్నారు. రబీ సీజన్లో వాడే పంపుసెట్లలో 10 హెచ్‌పీకిపైన ఉన్నవే ఎక్కువ. అధికారిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 10 హెచ్‌పీ మోటర్లు 1,60,698 ఉంటే.. 10 హెచ్పీపైన ఉన్నవి 92,154 వరకూ ఉన్నాయి. దీన్నిబట్టి రబీలో ఎక్కువ వ్యవసాయ విద్యుత్ లోడ్ ఉండే వీలుంది. ఖరీఫ్‌లో సగటున రోజుకు ఒక్కో పంపుసెట్ 2.20 హెచ్‌పీలుంటే, రబీలో 4.30 హెచ్పీలు, అన్ సీజన్ (ఏప్రిల్–మే)లో 1.80 హెచ్పీలు ఉంటోంది. బొగ్గు ఇబ్బందులు, జెన్కో ప్లాంట్లలో తరచూ వస్తున్న సమస్యల వల్ల 105 ఎంయూల వరకు రావాల్సిన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రోజుకు 75 ఎంయూలకే పరిమితమవుతోంది. మరోవైపు హాట్ సమ్మర్ కావడంతో జల విద్యుత్ కేవలం 7 ఎంయూలకే పరిమితమైంది. అన్ సీజన్ కావడంతో పవన విద్యుత్ అంతంత మాత్రంగానే వస్తోంది. కేంద్ర విద్యుత్, ప్రైవేటు (పీపీఏలున్న) విద్యుత్ కలుపుకున్నా.. డిమాండ్‌ను చేరుకోవడానికి ఇంకా 35 నుంచి 40 ఎంయూలు రోజూ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కేవలం రబీలో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరగడం వల్లే. అయినా విద్యుత్ సంస్థలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. చదవండి: నాన్నా..లేరా.. నాన్నను చూడరా ఏపీకి చేరుకున్న 4.40 లక్షల వ్యాక్సిన్ డోసులు.. -
భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 79,46,000 దాటాయి. ఇదిలా వుండగా గడచిన 24 గంటలలో దేశంలో 36,470 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 488 మంది మృతి చెందారు. అదేవిధంగా గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా63, 842 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా 6,25,857 యాక్టివ్ కేసులు ఉన్నాయి. భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. చికిత్స పొంది 72,01,070 మంది దేశ వ్యాప్తంగా డిశార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా 1,19,502 మంది మృతి చెందారు. దేశంలో రికవరీ రేటు 90.62 శాతంగా ఉంది. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం కేవలం 7.88 శాతం మాత్రమే. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల సంఖ్య 1.50 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 9,58,116 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటి వరకు మొత్తం 10,44,20,894 కరోనా టెస్ట్‌లు చేశారు. చదవండి: కరోనా: భారత్‌కు ‘సెకండ్‌వేవ్’ భయం! -
94.75 శాతానికి తగ్గిన డెంగీ కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ కేసులు గణనీయంగా తగ్గాయి. గతేడాది కేసులతో పోలిస్తే ఈసారి ఏకంగా 94.75 శాతానికి తగ్గినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందుకు సంబంధించిన వివరాలను కేంద్రానికి పంపించింది. ఆ వివరాలను కేంద్రం అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలో సీజనల్ వ్యాధులపై తాజాగా జాతీయ నివేదికను విడుదల చేసింది. కరోనా కారణంగా ఇళ్లల్లో పరిశుభ్రత పెరగడం.. వైరస్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం.. ప్రజలు మాస్క్‌లు ధరించడంతో ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పరిస్థితి తగ్గిందని వెల్లడించింది. దీంతో సీజనల్ వ్యాధులు ఈసారి తగ్గిపోయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఏడాది 699 డెంగీ కేసులు.. వరుసగా మూడేళ్లపాటు దేశంలో వర్షాకాల సీజన్లో డెంగీ కేసులు గణనీయంగా నమోద య్యాయి. 2017లో దేశంలో 1.88 లక్షల కేసులు నమోదు కాగా, 325 మంది చనిపో యారు. 2018లో 1.01 లక్షల కేసులు రికార్డు కాగా, 172 మంది మరణించారు. 2019లో 1.57 లక్షల కేసులు నమోదు కాగా, 166 మం ది చనిపోయారు. ఈ ఏడాది ఆగస్టు నాటికి దేశంలో 13,587 డెంగీ కేసులు నమోదవ్వగా, 9 మంది చనిపోయారు. ఇక గతేడాది తెలంగాణలో డెంగీతో జనం విలవిలలాడిపోయారు. సరాసరి ప్రతీ ఇంట్లోనూ జ్వరం కేసులు నమోదయ్యాయి. 2017లో తెలంగాణలో 5,369 డెంగీ కేసులు నమోదైతే, 2018లో 4,592 కేసులు వచ్చాయి. 2019లో ఏకంగా 13,331 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు వరకు రాష్ట్రంలో 699 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అంటే గతేడాది కేసులతో పోలిస్తే ఈసారి 5.25 శాతమే రికార్డయ్యాయి. ఒకవేళ మున్ముందు కొద్దిపాటి కేసులు నమోదైనా సీజన్ ముగుస్తున్నందున తీవ్రత పెద్దగా ఉండదని వైద్య, ఆరోగ్య వర్గాలు చెబుతున్నాయి. ఇక గతేడాది రాష్ట్రంలో మలేరియా కేసులు 1,711 రికార్డవ్వగా, ఈ ఏడాది జూలై వరకు 570 కేసులు నమోదయ్యాయి. అలాగే చికున్‌గున్యా కేసులు గతేడాది 5,352 నమోదవ్వగా, ఈ ఏడాది ఆగస్టు నాటికి 364 కేసులే వచ్చాయి. కరోనా, సీజనల్ వ్యాధులపై సర్కార్ చర్యలు ► ఇంటింటి సర్వే చేసి జ్వర బాధితులను గుర్తించారు. కరోనా కట్టడి చర్యలను పక్కాగా అమలు చేస్తూనే, మరోవైపు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా తదితర వ్యాధులను నియంత్రించడంపై దృష్టి సారించారు. ఒక్కో ఆశ కార్యకర్త 50 ఇళ్లకు వెళ్లి జ్వర పరీక్షలు నిర్వహించారు. ► కరోనా నిబంధనలను పాటించడంపై ప్ర జలను చైతన్యం చేయడంతో పాటు దోమ ల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. ► కరోనా జాగ్రత్తలతో పాటు ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జనాన్ని జాగృతం చేశారు. ► అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ డెంగీ, మలేరియా చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. ► మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో కలసి దోమల నిర్మూలన కార్యక్రమాలను చేపట్టారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. సీజనల్ వ్యాధుల నుంచి కాపాడిన మాస్క్‌లు కరోనా నేపథ్యంలో పారిశుద్ధ్యంపై సర్కారు పటిష్టమైన చర్యలు చేపట్టింది. దీంతో దోమల నిర్మూలన జరిగింది. ప్రజలు కరోనా నుంచి బయటపడేందుకు మాస్క్ లు ధరించారు. భౌతిక దూరం పాటించారు. దీంతో జలుబు, జ్వరం వంటి ఫ్లూ వంటి లక్షణాలున్న వారి నుంచి ఇతరు లకు వ్యాప్తి తగ్గింది. దోమల నిర్మూలన కార్యక్రమాలతో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులు గణనీయంగా తగ్గాయి. ఇక ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో ప్రజల్లో రోగ నిరోధక శక్తి కూడా పెరిగింది. కరోనా నేపథ్యంలో ఇటువంటి చర్యలు తీసుకోవడంతో సీజనల్ వ్యాధులు తగ్గిపోయాయి. – డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య విభాగం సంచాలకుడు -
నెలాఖరుకు 1% తగ్గనున్న కరోనా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఈ నెలాఖరుకు స్వల్పంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (అస్కి) తాజా అధ్యయనంలో తేలింది. ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులు, రికవరీ, మరణాల రేటు నివేదికల ను పరిశీలించి శాస్త్రీయ అంచనాలను అస్కి వెల్లడించింది. ఈ నెలాఖరుకు రాష్ట్రంలో వంద కరోనా టెస్టులు చేస్తే అందులో ఐదుగురికి అంటే సుమారు 5 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. అదే ఆగస్టు చివరి నాటికి వంద మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా సరాసరిన 6 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించింది. అంటే ఈ నెలాఖరుకు ఒక్క శాతం మేర కోవిడ్ కేసులు తగ్గుతాయన్న మాట.. ఇక కరోనా రోగుల్లోనూ రోజువారీగా రికవరీ రేటు 70%గా నమోదయ్యే అవకాశాలున్నాయంది. వంద మంది కోవిడ్ రోగుల్లో డెత్ రేటు ఒక్క శాతం మాత్రమేనని వెల్లడించింది. సెప్టెంబర్ 7న కోవిడ్ వ్యాప్తి ఇలా..: రాష్ట్రవ్యాప్తంగా రోజువారీగా కోవిడ్ కేసుల వ్యాప్తి, రికవరీ రేటుపై వైద్య, ఆరోగ్య శాఖ ఇస్తున్న నివేదికల ఆధారంగా అస్కి నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. సెప్టెంబర్ 7న కోవిడ్ పాజిటివ్ కేసుల నమోదు 6 శాతంగా నమోదైందని ఈ అధ్యయనం తేల్చిం ది. పాజిటివ్ రోగుల్లో రికవరీ రేటు 73 శాతంగా ఉందని తెలిపింది. కాగా ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రంలో కోవిడ్ కేసుల వ్యాప్తిపై తాము రూపొందించిన శాస్త్రీయ అంచనాలను ప్రకటిస్తామని అస్కి నిపుణుడు డాక్టర్ సస్వత్ కుమార్ మిశ్రా ‘సాక్షి’కి తెలిపారు. ఇక సెప్టెంబర్ తొలివారంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ఆ రెండు జిల్లాల్లోనే ఎక్కువ: సెప్టెంబర్ తొలివారం నాటికి కోవిడ్ కేసు ల నమోదులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలే అగ్రభాగాన నిలిచినట్లు అస్కి అధ్యయనం వెల్లడించింది. హైదరాబాద్‌లో మొత్తం జనాభాలో 1.3% మంది, రంగారెడ్డి జిల్లాలో 1% మందికి వైరస్ సోకినట్లు తెలి పింది. తర్వాత స్థానాల్లో మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలు నిలిచాయి. ములుగు జిల్లాలో అతి తక్కువ కేసులు నమోదైనట్లు పేర్కొంది. -
తగ్గిన మరణాల రేటు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మరణాల రేటు గణనీయంగా తగ్గిందని ఆరోగ్య శాఖ తెలిపింది. జూన్ 17వ తేదీన 3.36 శాతంగా ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 2.43 శాతానికి పడిపోయిందని పేర్కొంది. కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని వెల్లడించింది. దేశంలో 24 గంటల్లో మరో 37,148 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసులు 11,55,191కు చేరుకున్నాయని తెలిపింది. యాక్టివ్ కేసులు 4,02,529 కాగా, కోలుకున్న బాధితుల సంఖ్య కూడా 7,24,577కు చేరుకుని, రికవరీ రేటు 62.72 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌తో ఒక్క రోజులోనే మరో 587 మంది మృతి చెందడంతో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 28,084కు చేరుకుంది. దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్ రేటు జాతీయ స్థాయి 8.07 శాతం కంటే తక్కువగానే ఉన్నట్లు కేంద్రం తెలిపింది. రోజుకు ప్రతి 10 లక్షల జనాభాకు 140 పరీక్షలు చేస్తే పాజిటివ్ రేటు క్రమంగా 5కు, అంతకంటే తక్కువకు దిగి వస్తుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19తో ప్రతి 10 లక్షల మందిలో సరాసరిన 77 మంది చనిపోతుండగా, భారత్‌లో అది 20.4 మాత్రమేనని కేంద్రం పేర్కొంది. ఈ నెల 20వ తేదీ వరకు దేశంలోని వివిధ ల్యాబ్‌ల్లో 1,43,81,101 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. -
కొండెక్కిన బంగారం..కొనుగోళ్లు డీలా!
ముంబై : బంగారానికి భారీ డిమాండ్ ఉండే భారత్‌లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసంలో బంగారం డిమాండ్ ఏకంగా 36 శాతం పడిపోయింది. ధరల్లో ఒడిదుడుకులు, కరోనా మహమ్మారి వ్యాప్తితో దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఈ కాలంలో బంగారం డిమాండ్ 101.9 టన్నులకే పరిమితమైంది. తొలి క్వార్టర్లో ఆభరణాల డిమాండ్, బంగారంలో పెట్టుబడులకు డిమాండ్ సైతం తగ్గిందని, ఇది స్వర్ణానికి సవాల్‌తో కూడిన సంవత్సరంగా మారే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక స్పష్టం చేసింది. 2019 తొలి త్రైమాసంలో భారత్‌లో బంగారానికి డిమాండ్ నగదు రూపంలో రూ 47,000 కోట్లు కాగా ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ (జనవరి-మార్చి)లో అది రూ 37580 కోట్లకు పడిపోయిందని ఈ నివేదిక పేర్కొంది. ధరలు పైపైకి..కొనుగోళ్లు డీలా.. ఇక గత ఏడాది ఇదే సమయంలో బంగారం ధరలు కస్టమ్స్ సుంకాలు, పన్నులు లేకుండా పదిగ్రాములకు రూ 29,555 కాగా ఈ ఏడాది మార్చి నాటికి పదిగ్రాముల పసిడి ఏకంగా 25 శాతం ఎగిసి రూ 36,875కు చేరిందని డబ్ల్యూజీసీ ఇండియా ఎండీ పీఆర్ సోమసుందరం చెప్పారు. అధిక ధరలు, ధరల్లో అనిశ్చితి, కరోనా మహమ్మారి వంటి పలు కారణాలతో ఈ ఏడాది తొలి త్రైమాసంలో భారత్‌లో గోల్డ్ డిమాండ్ గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. చదవండి : బంగారు పండగపై కరోనా పడగ మహమ్మారితో కుదేలు ఇక ఇదే కాలంలో ఆభరణాలకు డిమాండ్ సైతం 41 శాతం తగ్గిందని, రూపాయల్లో చూస్తే గత ఏడాది రూ 37,070 కోట్ల విలువైన ఆభరణాల విక్రయాలు జరగ్గా, ఈ ఏడాది తొలి మూడునెలల్లో అది 27 శాతం పతనమై రూ 27,230 కోట్లకు పడిపోయింది. ఏడాది ఆరంభంలో పసిడికి డిమాండ్, కొనుగోళ్లు బాగానే ఉన్నాయని, ఆ తర్వాత వెడ్డింగ్ సీజన్ కూడా ఆశాజనకంగానే మొదలైందని మార్చి ద్వితీయార్ధంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ అమలుతో పసిడి మార్కెట్ భారీగా పతనమైందని సోమసుందరం చెప్పుకొచ్చారు. మరోవైపు పసిడిలో పెట్టుబడుల డిమాండ్ కూడా ఈ క్వార్టర్లో తగ్గుముఖం పట్టిందని తెలిపారు. -
నేటి నుంచి సిటీ బస్సుల తగ్గింపు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సిటీ బస్సుల సంఖ్యను అధికారులు మూడు రోజుల్లో తగ్గించనున్నారు. గురువారం నుంచే కొద్దికొద్దిగా తగ్గిస్తూ శనివారం నాటికి వెయ్యి బస్సులు తొలగించాలని డిపోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వెయ్యి బస్సులు తొలగించాలని అధికారులు ఇప్పటికే నిర్ణయించారు. డిపోల వారీగా తగ్గించే బస్సుల సంఖ్య తో జాబితా కూడా సిద్ధం చేశారు. హైదరాబాద్ రీజియన్‌లో 550, సికింద్రాబాద్ రీజియన్‌లో 450 బస్సులను ఈ జాబితాలో చేర్చారు. కానీ దీనిపై అన్ని డిపోల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చార్జీలు పెంపుతో ఆదాయం పెరుగుతున్నందున, అన్ని బస్సులు సరిగ్గా నడిపితే నష్టాలు చాలా వరకు తగ్గించొచ్చని, ఇప్పుడు ఒకేసారి వెయ్యి బస్సులను ఆపేస్తే ఆదాయం పడిపోతుందని, ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతాయని డిపో మేనేజర్లు అంటున్నారు. బస్సులను తగ్గించినా సిబ్బందిని తొలగించే పరిస్థితి లేనందున వారి వేతనాల రూపంలో ఖర్చు అలాగే ఉంటుందని, అందుకే ఈ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సరుకు రవాణాకు మళ్లింపు.. రద్దు చేయబోయే బస్సులను త్వరలో ప్రారంభించబోయే సరుకు రవాణా విభాగానికి బదిలీ చేయనున్నట్లు సమాచారం. ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయమే అయినా.. దాన్ని కొనసాగించాలనే అధికారులు నిర్ణయానికి వచ్చారు. సీఎం సమావేశంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి.. అమలు విషయంలో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, బస్సుల రద్దుతో ఆర్టీసీలో కొత్త గందరగోళం నెలకొననుంది. వెయ్యి బస్సు లు రద్దుచేస్తే దాదాపు 4 వేల మంది సిబ్బంది అదనంగా ఉంటారు. ప్రస్తుతం ఆర్టీసీలో సగటు వేతనం 40 వేలు మించి ఉంది. ఈ 4 వేల మందికి పనిలేకపోగా వారికి ఊరికే వేతనం చెల్లించాల్సి వస్తుంది. ఇదో పెద్ద సమస్యగా పరిణమించనుంది. ఈ నేపథ్యంలో అదనంగా మారే సిబ్బందిని ఇతర విభాగాలకు తరలించేందుకు ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు శాఖలో డ్రైవర్లకు కొరత ఉంది. దీంతో బస్సుల రద్దుతో అదనంగా మారే 2 వేల మందికి పైగా డ్రైవర్లను పోలీసు విభాగం, అగ్నిమాపక విభాగం.. ఇలా కొరత ఉన్న విభాగాలకు బదిలీ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక కండక్టర్లను ఏం చేయాలన్న విషయంలో స్పష్టత రాలేదు. అయితే ఆర్టీసీ ఆధ్వర్యంలో కొత్తగా ప్రారంభించే సరుకు రవాణా విభాగంలో కొందరిని, ఆర్టీసీ పెట్రోల్ బంకుల్లో కొంత మందిని వినియోగించుకోవాలని చూస్తున్నారు. సీఎం పర్యవేక్షణలో ఆర్టీసీ.. సమ్మె నేపథ్యంలో గందరగోళంలో పడి చివరకు మనుగడ దిశగా అడుగులేస్తున్న ఆర్టీసీ ఇక స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలోనే ముందుకు సాగబోతోంది. ఇకపై క్ర మం తప్పకుండా సీఎం ఆర్టీసీని సమీక్షించబోతున్నారు. అ లాగే, ఇటీవల ప్రగతి భవన్లో కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకో వడంతోపాటు ఆర్టీసీపై వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ఈ హామీల అమలు ప్రధానంగా మారింది. ఇందులో భాగంగా డిపోకు ఇద్దరు చొప్పున ఉద్యోగులతో(కార్మికులు) సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆత్మీ య సమావేశంలో ఆదేశించిన నేపథ్యంలో వాటిని అధికారు లు సిద్ధం చేశారు. ఐదారు రోజుల క్రితమే డిపోల వారీగా సభ్యుల వివరాలను డీఎంలు అందజేశారు. అన్ని డిపోలు, వర్క్‌షాపులు కలిపి దాదాపు 200 మంది పేర్లను అధికారులకు పంపారు. కండక్టర్ల ఉద్యోగ భద్రతకు కూడా కొత్తగా చర్యల అమలును ప్రారంభించారు. చెర్రీ రంగు కాకుండా.. మహిళా కండక్టర్ల యూనిఫామ్‌పై త్వరలో తుది నిర్ణయం తీ సుకోబోతున్నారు. ఇప్పటికే తమకు చెర్రీ పండు ఎరుపు రంగులో ఆప్రాన్ కావాలని కండక్టర్లు కోరారు. ఆ రంగు బెదురు గా ఉండటంతో పాటు, వస్త్రం విస్తృతంగా లభించదన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ రంగును అధికారులు సూచిస్తున్నారు. -
అప్పుడే నీటి కటకట..!
సాక్షి, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల్లో ఈ ఏడాది నెలకొన్న వర్షాభావపరిస్థితులతో తాగునీటికి ఇబ్బందులు తప్పటం లేదు. అదేవిధంగా సాగునీరు అందక రైతులు పంటల సాగును తగ్గించారు. సాగుచేసిన పంటలకు కూడా సరిపడా నీరందని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. జిల్లాలో కేవలం బోర్లు, విద్యుత్ మోటార్ల కిందనే రబీ పంటలు సాగు చేపట్టారు. భూగర్భజలాలు అడుగంటడంతో పంటలకు సరిపడా నీరు అందటం లేదు. అదేవిధంగా వలస ఆదివాసీ గ్రామాల్లో ఇప్పటికే తాగునీటికి కటకట ఏర్పడింది. మారుమూల గ్రామాల ప్రజలు సమీపంలోని వాగులు, వంకలు ఎండిపోవటంతో అక్కడే లోతుగా చెలిమలు తీసి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. మార్చి మొదటి వారంలోనే ఇలాంటి పరిస్థితులుంటే మే నెలలో ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఆందోళనలో ప్రజలున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న భూగర్భ జలాల క్షీణత గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భూగర్భజలాలు గణనీయంగా పడిపోయాయి . జిల్లాలో భూగర్భ జలాల క్షీణత రోజురోజుకు ఎక్కువవుతుది. ఎండల తీవ్రత పెరిగిపోవడంతో భూగర్భజలాల వినియోగం ఎక్కువైంది. రబీలో సాగుచేసిన పంటలకు నిరంతర ఉచిత విద్యుత్‌తో సాగునీరు అందిస్తున్నారు. దీంతో భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బోర్లలో నీరు రానటువంటి పరిస్థితులున్నాయి. గుండాల, పినపాక, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో సాగునీటికి ఇబ్బందులు మొదలయ్యాయి. రబీలో సాగుచేసిన పంటలు చేతికందుతాయనే నమ్మకం రైతుల్లో సన్నగిల్లుతుంది. వరిపంటకు నీటి ఎద్దడి తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మేతకు అలమటిస్తున్న పశువులు వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగు తగ్గిపోవటంతో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఒక ఎకరం మాగాణిలో వరిగడ్డి రూ.8 వేలు పలికింది. ఎండుగడ్డి కొరతతో పాటు పశువులు పొలాలకు వెళ్లి మేసేందుకు ఎక్కడా మేతలేదు. మేతకు వెళ్లిన పశువులు కనీసం తాగేందుకు వాగులు, వంకలు, చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేదు. ఒక పశువు మేతకు రోజుకు యాభై నుంచి వంద రూపాయలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రైతులకు పశుపోషణ భారంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో రైతులు పశువులను తెగనమ్ముకుంటున్నారు. మండుతున్న ఎండలు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు భూగర్భజలాలు గణనీయంగా పడిపోతున్నాయి. రోజురోజుకు ఎండ తీవ్రత పెరిగిపోతుంది. గ్రామాలలో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మిషన్ భగీరథ పనులు పూర్తికాకపోవటంతో తాగునీటికి గ్రామాల్లో ఇబ్బందులు తప్పటం లేదు. తాగు, సాగునీటి ఇబ్బందులపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవసరముంది. అదేవిధంగా పశుగ్రాసం కొరతను నివారించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పశువుల మేత, దాణా అందించాలని రైతులు కోరుతున్నారు. -
స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : భగ్గుమంటున్న ఇంధన ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. గురువారం వరుసగా ఎనిమిదో రోజు పెట్రోల్ ధరలు లీటర్‌కు 15 పైసలు తగ్గగా, డీజిల్ లీటర్‌కు 5 పైసలు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడంతో దేశీయంగా ఇంధన ధరలు దిగివస్తున్నాయి. ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్‌కు 76 డాలర్లకు తగ్గాయి. ఈనెల ఆరంభంలో బ్యారెల్ ముడిచమురు ధర 86 డాలర్లకు ఎగబాకిన సంగతి తెలిసిందే. ఇక గురువారం హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ 85.98 కాగా, డీజిల్ ధర లీటర్‌కు రూ 81.36 పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ 81.10 కాగా, డీజిల్ లీటర్ రూ74.80గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా రూ 86.58 కాగా, డీజిల్ లీటర్‌కు రూ 78.41 పలికింది. ముడిచమురు ధరలు తగ్గడంతో డాలర్‌తో రూపాయి విలువ బలపడింది. అక్టోబర్‌లో డాలర్‌తో రూపాయి మారకం రూ 74 దాటగా ప్రస్తుతం రూ 73.31గా నమోదైంది. -
తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు
ఐక్యరాజ్యసమితి: దక్షిణాసియాలో పెట్టుబడులకు కీలక కేంద్రంగా ఎదుగుతున్నప్పటికీ.. గతేడాది భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల రాక తగ్గింది. అదే సమయంలో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్‌సీటీఏడీ) రూపొందించిన అంతర్జాతీయ పెట్టుబడుల నివేదిక (2018) ప్రకారం .. ప్రపంచ దేశాల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 23 శాతం క్షీణించాయి. 2016లో 1.87 లక్షల కోట్ల డాలర్లుగా ఉండగా... ఇవి 2017లో 1.43 లక్షల కోట్ల డాలర్లకు తగ్గాయి. ఇక భారత్‌లోకి 2016లో 44 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రాగా.. అవి గతేడాది 40 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే, అదే సమయంలో భారత్ నుంచి 11 బిలియన్ డాలర్ల మేర నిధులు తరలిపోయాయి. 2016తో పోలిస్తే ఇది రెట్టింపు. ఎఫ్‌డీఐలు తగ్గిపోవడం ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా వర్ధమాన దేశాల విధానకర్తలకు ఆందోళన కలిగిస్తోందని యూఎన్‌సీటీఏడీ సెక్రటరీ–జనరల్ ముఖిసా కిటుయి చెప్పారు. ప్రపంచ వాణిజ్యానికి పొంచి ఉన్న రిస్కు, తత్ఫలితంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులే ఈ ప్రతికూల ప్రభావానికి కారణమని తెలియజేశారు. ఈ ధోరణులు వర్ధమాన దేశాలను అత్యధికంగా దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. వాణిజ్యపరమైన యుద్ధ భయాలు, విధానాలపరమైన అనిశ్చితి వల్ల ఈ ఏడాది ఆఖరు నాటికి అంతర్జాతీయ ఎఫ్‌డీఐల పెరుగుదల 10 శాతానికి మాత్రమే పరిమితం కావొచ్చని యూఎన్‌సీటీఏడీ అంచనా వేసింది. అయితే, గడిచిన దశాబ్ద కాలంగా ఉన్న ధోరణులను చూస్తే.. ఇది సగటు కన్నా తక్కువ స్థాయేనని పేర్కొంది. దూకుడుగా ఓఎన్జీసీ విదేశీ పెట్టుబడులు.. ప్రభుత్వ రంగ చమురు ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ ఇటీవలి కాలంలో విదేశీ ఆస్తుల్లో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తోంది. 2016లో రష్యన్ దిగ్గజం రాస్‌నెఫ్ట్ పీజేఎస్సీలో భాగమైన వాంకోర్‌నెఫ్ట్‌లో 26 శాతం వాటాలు కొనుగోలు చేసింది. 2017లో టులో ఆయిల్ నుంచి నమీబియాలోని ఒక ఆఫ్‌షోర్ క్షేత్రంలో 15 శాతం వాటా కొనుగోలు చేసింది. మొత్తంగా 2017 ఆఖరు నాటికి ఓఎన్జీసీకి 18 దేశాల్లో 39 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి రోజుకు 2,85,000 బ్యారెళ్ల చమురు, తత్సమాన గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని యూఎన్‌సీటీఏడీ పేర్కొంది. పెరుగుతున్న సీమాంతర లావాదేవీలు.. భారత్‌లో సీమాంతర విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు గణనీయంగా పెరిగాయని వివరించింది. ఇంధనాల ఉత్పత్తి, టెక్నాలజీ రంగాల్లో కొన్ని భారీ డీల్స్ ఊతంతో వీటి పరిమాణం 8 బిలియన్ డాలర్ల నుంచి 23 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు పేర్కొంది. రష్యన్ సంస్థ రాస్‌నెఫ్ట్ గ్యాజ్కి చెందిన పెట్రోల్ కాంప్లెక్స్.. భారత్‌లో రెండో అతి పెద్ద ప్రైవేట్ ఆయిల్ కంపెనీ ఎస్సార్ ఆయిల్లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం 13 బిలియన్ డాలర్లు వెచ్చించింది. అటు వివిధ దేశాలకు చెందిన ఇన్వెస్టర్ల గ్రూప్.. దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 1.4 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. అమెరికా ఈ–కామర్స్ సంస్థ ఈబే, టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌తో పాటు చైనాకి చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్ ఈ గ్రూప్‌లో ఉన్నాయి. -
జపాన్ను వణికిస్తున్న ‘జనాభా’
టోక్యో : ఏ దేశాభివృద్ధికైనా కీలకం యువశక్తి. దేశ జనాభాలో యువతరం ఎంత ఎక్కువగా ఉంటే ఆర్ధికాభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది. ప్రసుత్తం ఈ విషయమే జపాన్ దేశంలో తీవ్ర ఆందోళనలు కల్గిస్తోంది. ఎందుకంటే గత 30 ఏళ్లుగా జపాన్ దేశ జనాభాలో యువతరం క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్ అంతర్గ వ్యవహారాలు, సమాచార మంత్రిత్వ శాఖ 2018, ఏప్రిల్ 1న విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది యువతరం జనాభా 1,70,000 తగ్గింది. ఆందోళన కల్గించే మరో అంశం వృద్దుల జనాభా పెరగడం. ప్రస్తుతం జపాన్ దేశ జనాభా 12.6 కోట్లు. కాగా వారిలో యువతరం(12 నుంచి 14 సంవత్సరాలలోపు) జనాభా కేవలం 32 లక్షలు మాత్రమే. అదే అమెరికాలో 18.9 శాతం, చైనాలో 16.8 శాతం, భారత దేశంలో 30.8 శాతం యువతరం జనాభా ఉండగా జపాన్‌లో మాత్రం 12.3 శాతం యువతరం జనాభా ఉన్నది. రోజురోజుకు తగ్గిపోతున్న జనాభాను పెంచడం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ప్రజలను ఎక్కువ మంది పిల్లల్ని కనమని ప్రోత్సాహించడమే కాక నగదు ప్రోత్సాహకాలను కూడా అందిస్తోంది. ఈ చర్యల ఫలితంగా 2015 వరకూ 1.4 శాతంగా ఉన్న సంతానోత్పత్తి 2025 నాటికి 1.8 శాతానికి పెరుగుతుందని అంచనా. యువతరం - ఆర్థికాంశాలు రోజురోజుకు తగ్గిపోతున్న జనాభా వల్ల ప్రస్తుతం ఉన్న 12.6 కోట్ల జనాభా, 2060 నాటికి 8.67 కోట్లకు పడిపోనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. యువతరం జనాభా తగ్గడమే కాక వృద్ధుల సంఖ్య పెరుగుతండటంతో దేశ ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనున్నట్లు ప్రభుత్వ గణంకాలు వెల్లడిస్తున్నాయి. పనిచేసే వారు తగ్గినప్పుడు పన్నులు కట్టే వారి సంఖ్య కూడా తగ్గుతుంది. ఫలితంగా దేశ ఖజానాకు గండి పడుతుంది. పెరుగుతున్న వృద్ధులకు ఆరోగ్య సేవలు, పెన్షన్లు ఇవ్వడం ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ వలసదారుల విషయంలో జపాన్ వైఖరి మాత్రం మారటంలేదు. ఎక్కువ మొత్తంలో వలసదారులకు అనుమతిచ్చి, జనాభాను పెంచే ప్రయత్నాలు మాత్రం చేయట్లేదు. అమెరికాలో మొత్తం జనాభాలో 7 శాతం విదేశీయుల సంతానం ఉండగా జపాన్‌లో మాత్రం వలసదారుల సతానం కేవలం 1.3 శాతం మాత్రమే. అంతేకాక తక్కువ జనాభా కారణంగా ఇక్కడ పనివారి కొరత కూడా తీవ్రంగా ఉంది. ఇందుకు లింగవివక్ష కూడా మరో కారణం. జపాన్‌లో స్త్రీ, పురుషలకు చెల్లిస్తున్న వేతానాల్లో 25 శాతం వ్యత్యాసం ఉంది. అంతేకాక పిల్లల సంరక్షణ, లైంగిక వేధింపులు, అసమానతలు వంటి అంశాల వల్ల ఇప్పటికి కొన్నిరకాల విధులు నిర్వహించడానికి జపాన్ మహిళలు ముందుకురావడం లేదు. మానవ వనరుల కొరతను తగ్గించుకోవాలంటే 2050 నాటికి జపాన్ తన దేశ జనాభాలో, మూడొంతులు యువతరం ఉండేలా జాగ్రత్త పడాలి. అంతేకాక వేతనాలు పెంచడం, పని ప్రదేశాల్లో మహిళలకు మెరుగైన సౌకర్యాల కల్పన, భద్రతను పెంచడమే కాక వలసదారులను ఎక్కువ మొత్తంలో అనుమతిస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. -
ఇంజనీరింగ్ సీట్లలో భారీ కోత
సాక్షి, న్యూఢిల్లీ : ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది 80,000 సీట్లు తగ్గనున్నాయి. దీంతో 2018-19 విద్యా సంవత్సరం కలుపుకుని నాలుగేళ్లలో దాదాపు 3.1 లక్షల సీట్లు పడిపోనున్నాయి. 2012-13 నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్లు క్రమంగా తగ్గుతూ వస్తున్న క్రమంలో సీట్ల సంఖ్య పడిపోతున్నది. ప్రమాణాలకు అనుగుణంగా లేని 200 ఇంజనీరింగ్ కాలేజీల మూసివేతతో సీట్ల సంఖ్య తగ్గిందని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కాలేజీలు కొత్తగా విద్యార్ధులను అడ్మిట్ చేసుకోకున్నా ప్రస్తుత బ్యాచ్ గ్రాడ్యుయేషన్ ముగిసేవరకూ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. 2016 నుంచి ఇంజనీరింగ్ సీట్లు ఏటా తగ్గుతున్నాయి. ఈ ఏడాది పలు కాలేజీలు మూసివేత కోరుతూ దరఖాస్తు చేయడంతో 80,000 వరకూ ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య తగ్గనున్నదని ఏఐసీటీఈ చైర్పర్సన్ అనిల్ సహస్రబుధే చెప్పారు. మరోవైపు ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల సంఖ్య పెరిగింది. ఇక ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచేందుకు 2022 నాటికి అన్ని సాంకేతిక విద్యా సంస్థలు తమ ప్రోగ్రామ్లన్నింటికీ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) నుంచి అక్రిడిటేషన్ పొందాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. -
అతిగా టీవీ చూస్తే అంతే..
సాక్షి, న్యూఢిల్లీ : రోజుకు ఐదు గంటలు మించి టీవీ చూసే పురుషులను తాజా అథ్యయనం హెచ్చరించింది. అతిగా టీవీ చూసే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య 35 శాతం పైగా తగ్గే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. అతిగా టీవీ చూడటం అధిక క్యాలరీలతో కూడిన జంక్ ఫుడ్ తీసుకోవడానికి, సోమరితనానికి దారితీస్తుందని పేర్కొంది. టీవీలకు అడిక్ట్ వాయిన వారి వీర్యకణాల సంఖ్య చురుకుగా ఉండే వారితో పోలిస్తే 38 శాతం తక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. వారానికి కనీసం 15 గంటల వ్యాయామం లేదా ఆటల్లో పాల్గొనే వారిలో శారీరకంగా చురుకుగా లేనివారి కన్నా వీర్యకణాల సంఖ్య మెరుగ్గా ఉన్నట్టు తేలిందని నిపుణులు చెప్పారు. అయితే అధిక వ్యాయామంతో పాటు అతిగా టీవీ చూడటం శరీరంలో ఫ్రీ రాడికల్స్ వ్యాప్తి చెంది మృత కణాలు పేరుకుపోతాయని, వీర్యకణాలు తగ్గి సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని దెబ్బతీస్తాయని అథ్యయనం హెచ్చరించింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమాలజీలో ఈ పరిశోధన ప్రచురితమైంది. -
అమెరికాలో తగ్గుతున్న ‘చిట్టి తల్లులు’
అమెరికాలో పిల్లలను కనే టీనేజ్ తల్లుల సంఖ్య బాగా తగ్గుతోంది. 2015తో పోల్చితే కిందటేడాది ఇలాంటి ‘చిట్టి తల్లుల’ సంఖ్య 9శాతం తగ్గిందని ప్రభుత్వ తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. 1970లు, 80ల్లో అమెరికాను కలవరపెట్టిన టీనేజ్ తల్లుల సంఖ్య గత కొంత కాలంగా పడిపోతూనే ఉంది. 1991 నుంచి దేశంలో టీనేజ్ ఆడపిల్లలు కనే సంతానం సంఖ్య 67శాతం తగ్గిపోయిందని అమెరికా ఆరోగ్య గణాంక కేంద్రం వివరించింది. టీనేజీ పిల్లలు తల్లులు కావడం కావాలని జరిగేది కాదని, సంతాన నిరోధక సాధనాల విస్తృత వినియోగం వల్లే ఇలాంటి జననాలు తగ్గుతున్నాయని ప్రఖ్యాత వైద్యురాలు డా.ఎలిస్ బెర్లాన్ చెప్పారు. 2016లో మొత్తం జననాల సంఖ్య 39, 41, 109. అంటే 2015తో పోల్చితే జననాలు ఒక శాతం తగ్గాయి. ప్రతి వేయి మంది స్త్రీలు సగటున 62 మంది పిల్లలను కనడమంటే అమెరికాలో ఆడవాళ్లు పిల్లలు కనడం బాగా తగ్గించేశారనే భావించాలి. లేటు వయసులో తల్లులు! ఓ పక్క టీనేజ్ తల్లుల సంఖ్య తగ్గుతుంటే, లేటుగా జన్మనిచ్చే స్త్రీలు అమెరికాలో పెరుగుతున్నారు. 30, 34 ఏళ్ల మధ్య తల్లులవుతున్నవారి సంఖ్య 1964 తర్వాత మొదటిసారి ఒక శాతం పెరిగింది. ఇక 40-44 ఏళ్ల వయసులో పిల్లలు కనే స్త్రీల సంఖ్య అంతకుముందు ఏడాది కన్నా(2015) నాలుగు శాతం (1966 తర్వాత మొదటిసారి) పెరగడం విశేషం. 45 ఏళ్లు దాటాక పిల్లలు కనే మహిళల సంఖ్య పెరగలేదుగాని నిలకడగా ఉంది. అలాగే, పెళ్లాడని జంటలకు పుట్టే సంతానం సంఖ్య 3 శాతం తగ్గింది. అందరికీ ఆరోగ్య-వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి వాటిని యువతులు ఉపయోగించుకోవడం వల్లే మహిళలకు ముఖ్యంగా గర్భధారణ, ప్రసూతికి సంబంధించిన మంచి ఫలితాలు వచ్చాయని ఈ నివేదిక విశ్లేషించిన బెర్లాన్, సారా వెర్బియెస్ట్ చెప్పారు. కోత కాన్పులు వరుసగా నాలుగో ఏడాది తగ్గాయి! అమెరికాలో కొన్ని దశాబ్దాల క్రితం ప్రజలను బెంబేలెత్తించిన కోత కాన్పులు వరుసగా నాలుగో ఏడాది కూడా తగ్గాయి. దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు, సంస్థల ప్రచారం వల్ల సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా చేసే కాన్పుల సంఖ్య 32 శాతానికి పడిపోయింది. 2009లో ఇలాంటి కోత కాన్పులు 33 శాతం దాకా పెరిగి అప్పటి నుంచి తగ్గనారంభించాయి. మహిళా సంఘాలు, బీమా కంపెనీలు, వైద్యసహాయ సంస్థలు, వైద్యులు, మంత్రసానులు, నర్సులు చేసిన కృషి వల్చేల ఇది ఽసాధ్యమైంది. అదీగాక టీనేజ్ ఆడపిల్లల్లో వైద్య, ఆరోగ్య విషయాల్లో పెరిగిన చైతన్యం, సామాజిక మార్పుల కారణంగా సంతాన నిరోధక సాధనాలను ఉపయోగిస్తున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
మెదక్, నల్లగొండల్లో చలి ప్రతాపం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని, మరో నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని, చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో మెదక్, నల్లగొండల్లో చలి ప్రతాపం చూపింది. మెదక్‌లో సాధారణం కంటే ఐదు డిగ్రీల తక్కువగా 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. నల్లగొండలో ఆరు డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో నాలుగు డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, హన్మకొండల్లో 3 డిగ్రీలు తక్కువగా 17 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
తగ్గుతున్న మహిళా ఉద్యోగుల సంఖ్య
అసోచామ్ సర్వే న్యూఢిల్లీ: దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య పదేళ్ల కాలంలో 10 శాతం మేర పడిపోవడంతో తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని అసోచామ్ ప్రభుత్వానికి సూచించింది. 2000-2005 మధ్య దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య 34 శాతం నుంచి 37 శాతానికి పెరగగా... 2005 నుంచి 2014కు వచ్చేసరికి 27 శాతానికి పడిపోయినట్టు ప్రపంచ బ్యాంకు పేర్కొనడాన్ని అసోచామ్ ‘భారత్‌లో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం’ పేరిట నిర్వహించిన అధ్యయనంలో ప్రధానంగా ప్రస్తావించింది. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణం ఉద్యోగావకాశాల కల్పన, వ్యాపార అవకాశాల సృష్టి ద్వారా మహిళల సాధికారతకు చర్యలు చేపట్టాలని కోరింది. మహిళా ఉద్యోగుల సంఖ్య పరంగా బ్రిక్స్ దేశాల్లో భారత్ మాత్రమే అట్టడుగున ఉండడాన్ని ప్రముఖంగా పేర్కొంది. బ్రిక్స్ దేశాల్లో బ్రెజిల్లో మహిళా ఉద్యోగులు 59 శాతం, రష్యాలో 57 శాతం, దక్షిణాఫ్రికాలో 45% ఉండగా, భారత్‌లో 27శాతంగా ఉంది. ఉన్నత విద్యావకాశాల్ని పొందలేకపోవడం, ఉద్యోగావకాశాలు లేకపోవడం, పని ప్రదేశంలో సౌకర్యాలు లేకపోవడం వల్ల మహిళలు ఇంటి పనులకే పరిమితం అవుతున్నారని అసోచామ్ వెల్లడించింది. వివాహం కూడా మహిళా ఉద్యోగుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమని పేర్కొంది. -
గంగా.. పాతాళాన్ని తాకంగా..!
- ఈ ఫిబ్రవరిలో 14.3 మీటర్ల లోతుల్లోకి అడుగంటిన వైనం - గతేడాది కంటే 2.66 మీటర్ల అదనపు లోతుల్లోకి... - వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడి సాక్షి, హైదరాబాద్: గంగా పాతాళానికి చేరింది. భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. రబీ పంటలు, భూగర్భ జలాలపై వ్యవసాయశాఖ బుధవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో భూగర్భజలాల తాజా లెక్కలను వెల్లడించింది. దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఫిబ్రవరిలో 14.3 మీటర్ల లోతుల్లోకి భూగర్భజలాలు అడుగంటాయి. గత ఏడాది ఇదే నెలలో 11.7 మీటర్ల లోతుల్లో లభించిన జలాలు, ఏడాదిలో 2.66 మీటర్ల అదనపు లోతుల్లోకి దిగజారిపోయాయి. వేసవి సమీపిస్తుండటంతో రాబోయే రెండు, మూడు నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో రాష్ట్ర వ్యాప్తంగా బోర్లు వట్టిపోయాయి. బావులు ఎండిపోయాయి. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. గత ఖరీఫ్ సీజన్లో 15 శాతం లోటు వర్షపాతం నమోదైతే, రబీలో 70 శాతం లోటు ఉండటం గమనార్హం. రబీలో 146 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 44 ఎంఎంలే రికార్డు అయింది. ప్రధాన జలాశయాల్లోని నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గతేడాది మార్చి 16న ప్రధాన జలాశయాల్లో 280.95 టీఎంసీల నీటి నిల్వలుండగా, ఈ ఏడాది అదే రోజున 250.76 టీఎంసీలకు పడిపోయాయి. నాగార్జునసాగర్‌లో గతేడాది అదే తేదీలో 147.28 టీఎంసీల నీరుంటే, ఈ ఏడాది 128.97 టీఎంసీలకు పడిపోయింది. శ్రీరాంసాగర్‌లో గతేడాది 14.23 టీఎంసీల నీటి నిల్వలుంటే, ఈ ఏడాది ఏకంగా 5.16 టీఎంసీలకు పడిపోయాయి. -
తగ్గుతున్న జన ధన యోజన ఖాతాలు
ఎస్బీఐ చైర్ పర్సన్ వెల్లడి ముంబై: జీరో బ్యాలెన్స్ అకౌంట్ల సంఖ్య ప్రారంభించడం తగ్గుతోందని ఎస్బీఐ తెలిపింది. ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంలో భాగంగా అందరికీ బ్యాంక్ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి జనధనయోజన(పీఎంజేడీవై) పేరుతో జీరో బ్యాలెన్స్ అకౌంట్లను బ్యాంక్‌లు ఆఫర్ చేస్తున్నాయి. ఈ జీరో బ్యాలెన్స్ ఖాతాలు ప్రారంభించడం క్రమక్రమంగా తగ్గుతోందని, మొత్తం ఖాతాల సంఖ్య 46 శాతానికి తగ్గిందని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. ఇక్కడ జరిగిన ఒక సిబిల్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పీఎంజేడీవై కార్యక్రమం లాంఛనంగా ముగింపుకు వస్తోందని, అయితే బ్యాంకింగ్ సౌకర్యాలు అందని ప్రజలు చాలా మంది ఉన్నారని వివరించారు. ఈ అకౌంట్ల ప్రారంభించడానికి రూ.20 చొప్పున నామమాత్ర రుసుము వసూలు చేస్తున్నామని తెలిపారు. ఇలా వసూలు చేయడం ప్రభుత్వానికి నచ్చలేదని అయితే ఉచితంగా ఇచ్చినా ఒక విలువ ఉంటుందని ప్రజలకు అర్థం కావడానికే ఈ నామమాత్ర రుసుమును వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇలా వసూలు చేసిన ఖాతాలకు చెందిన ఖాతాదారుల్లో పలువురు తమ ఖాతాల్లో కనీసం రూ. 500 బ్యాలెన్స్‌ను నిర్వహిస్తున్నారని వివరించారు. క్రెడిట్ బ్యూరో సంస్థల రాకవల్ల బ్యాంకులకు రుణాలు ఇవ్వడం సులభం, వేగవంతం అవుతోందని పేర్కొన్నారు. -
పెరిగే గుడ్డు - తరిగే గుడ్డు
ఆరోగ్యవంతమైన జీవనం కోసం రోజూ ఓ గుడ్డు తినమని చెబుతారు వైద్యులు. పోషక విలువలు మెండుగా కలిగిన ఆహారంగా దీనికి పేరు. శరీరానికి ఇది చేసే మేలును పక్కనబెడితే.. గుడ్డుతో ఎన్నో ప్రయోగాలు చేయవచ్చు. అందులో కొన్ని వంటకు సంబంధించినవి, మరికొన్ని వైజ్ఞానిక విషయాలకు చెందినవి. ఈ రోజు మనం గుడ్డుతో చేయదగిన సరికొత్త వైజ్ఞానిక ప్రయోగాన్ని గురించి తెలుసుకుందాం..! ప్రయోగం: గుడ్డు పరిమాణం మార్పు కావాల్సినవి: రెండు గుడ్లు కారో కార్న్ సిరప్ మంచినీళ్లు రెండు గాజు గ్లాసులు వినెగర్ పెద్దల పర్యవేక్షణ ఏం చేయాలి? తొలుత రెండు గాజు గ్లాసులను తీసుకుని, రెండిట్లోనూ వినెగర్ను నింపండి. ఇప్పుడు రెండు గుడ్లను తీసుకుని వాటిని గ్లాసుల్లోకి జారవిడవండి. 24 గంటలపాటు వాటిని వినెగర్‌లో మునగనివ్వండి. ఇలా చేయడం ద్వారా గుడ్డుపై ఉన్న పెంకులు కరిగిపోయి, మెత్తటి గుడ్డు మాత్రమే మిగులుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఓ గ్లాసులో సిరప్‌ని, మరో గ్లాసులో మంచినీటిని నింపండి. ఈ రెండింటిలోకీ వినెగర్‌లో తడిసిన గుడ్లను నెమ్మదిగా జారవిడవండి. మరో 24 గంటలపాటు వాటి జోలికి వెళ్లకండి. ఇప్పుడు రెండు గుడ్లనూ గ్లాసుల నుంచి వెలుపలికి తీసి పరీక్షించండి. ఏం జరుగుతుంది? మొదట సమాన పరిమాణంలో ఉన్న గుడ్లు ఇప్పుడు వేర్వేరు పరిమాణాల్లో దర్శనమిస్తాయి. నీటిని నింపిన గ్లాసులో ఉన్న గుడ్డు, సిరప్‌లో మునిగిన గుడ్డు కంటే పెద్దదిగా కనిపిస్తుంది. అదే సమయంలో సిరప్‌లో ఉంచిన గుడ్డు కుంచించుకుపోయినట్టుగా ఉంటుంది. ఏంటీ కారణం? ప్రయోగం ప్రారంభంలో గుడ్లను వినెగర్‌లో ముంచినపుడు రసాయనిక చర్యలు జరుగుతాయి. వినెగర్‌లోని ఎసిటిక్ ఆమ్లం, గుడ్డు పెంకులోని కాల్షియం కార్బొనేట్‌తో చర్య జరుపుతుంది. ఫలితంగా కార్బన్ డై ఆక్సైడ్, నీరు, కాల్షియం ఏర్పడతాయి. నీరు, కాల్షియం వంటివి మన కంటికి కనిపించవు. అయితే, గ్లాసులోంచి పైకి వెళ్లే బుడగల రూపంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను మాత్రం గమనించవచ్చు. ఈ ప్రక్రియ కారణంగా పెంకులు లేని గుడ్లను పొందవచ్చు. కుంచించుకుపోవడం... తర్వాతి దశలో సిరప్ ఉన్న గ్లాసును పరీక్షిస్తే.. అందులో కరిగి ఉన్న చక్కెర గాఢత దృష్ట్యా సిరప్ అధిక సాంద్రత కలిగి ఉంటుంది. ఈ చక్కెర అణువులు గుడ్డు పైపొరలోకి చొచ్చుకుపోలేవు. అయితే, గుడ్డులోని నీటి అణువులు మాత్రం పైపొరను దాటుకుని బయటకు రాగలవు. గ్లాసులోని చక్కెర గాఢతతో నీటి గాఢత సరితూగే వరకూ గుడ్డులోని నీటి అణువులు బయటకు వస్తూనే ఉంటాయి. ఇలా గుడ్డు నుంచి సిరప్‌లోకి నీరు బదిలీ కావడంతో గుడ్డు కుంచించుకుపోతుంది. పెరగటం... మరోవైపు, మంచినీటి గ్లాసును పరిశీలిస్తే.. అందులోని గుడ్డు సాధారణం కంటే పెద్దదిగా కనిపిస్తుంది. దీనికి కారణం గుడ్డులో ఉన్న నీటి అణువుల గాఢత కంటే గ్లాసులోని నీటి గాఢత ఎక్కువ కావడమే. దీంతో గుడ్డు నుంచి నీరు బయటకు పోవడానికి బదులుగా బయటి నీరు గుడ్డులోకి వచ్చి చేరుతుంది. ఇంకేముంది! గుడ్డు తన పరిమాణం కంటే పెద్దదిగా మారుతుంది. -
ఉల్లి, టమాట ధరలు తగ్గుముఖం
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: రెండు రోజుల క్రితం వరకు అధిక ధరలతో సామాన్య, మధ్య తరగతి వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఉల్లి, టమాట ఇప్పుడిప్పుడే దిగివస్తూ ఉరటనిస్తున్నాయి. మహారాష్ట్రలోని పండిన ఉల్లి దిగుబడుల రాక ప్రారంభం కావడంతో జిల్లాలో ఉల్లికి డిమాండ్ తగ్గింది. మూడు నెలల క్రితం ఉల్లి క్వింటాలు ధర రూ.4,900 వరకు వెళ్లింది. రిటైల్‌గా కిలో రూ.60 వరకు అమ్మారు. తర్వాత రూ.3800కు తగ్గి మూడు నెలల పాటు ఇదే ధర కొనసాగుతుండడంతో రెండేళ్లుగా నష్టాలను భరిస్తూ వచ్చిన రైతులు ఈ ఏడాది లాభాలు పండించుకున్నారు. నాలుగు నెలలుగా ఉల్లికి డిమాండ్ ఉండటంతో దాదాపు 80 శాతం మంది రైతులు గిట్టుబాటు ధర అంటే క్వింటాలు రూ.3 వేల పైనే అమ్ముకున్నారు. ఇప్పుడిప్పుడే ఉల్లి ధర తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతుండగా వినియోగదారులు ఉపశమనం పొందుతున్నారు. అక్టోబర్ 31న క్వింటాలు గరిష్ట ధర రూ.2810కి పడిపోయింది. అంటే ఒక్క రోజులోనే రూ.1000 వరకు తగ్గడం గమనార్హం. ఈనెల 1వ తేదీ మరింత తగ్గి గరిష్ట ధర రూ.2,650కి చేరింది. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకమాదిరి నాణ్యత కల్గిన ఉల్లి కిలో ధర రూ.15 ఉండగా, నాణ్యత కల్గిన ఉల్లి రూ.30 వరకు అమ్ముతున్నారు. టమాటను తీసుకుంటే మొన్నటికి కిలో ధర రూ.30 ఆపైన ఉండగా ఆదివారం కిలో రూ.16కు తగ్గిపోయింది. మార్కెట్లోకి టమాట దిగుబడులు అధికంగా వస్తుండడంతో డిమాండ్ తగ్గి ఆ మేరకు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వినియోగ దారులు ఉపశమనం పొందుతున్నారు.