సాక్షి, అమరావతి: వారం క్రితం వరకు ఠారెత్తించిన వ్యవసాయ విద్యుత్ వినియోగం క్రమంగా తగ్గుతోంది. ఈ నెలాఖరు నాటికి వ్యవసాయ పంపుసెట్ల వాడకం మరింత తగ్గే వీలుందని విద్యుత్ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో గరిష్టంగా రోజుకు 234 మిలియన్ యూనిట్లు (ఎంయూ) ఉన్న విద్యుత్ వినియోగం.. ఇప్పుడు 213 ఎంయూలకు తగ్గింది. రాష్ట్రంలో 17,54,906 వ్యవసాయ పంపుసెట్లున్నాయి. వీటి సామర్థ్యం 1,15,55,552 హార్స్ పవర్ (హెచ్‌పీ). ఏడాదికి 11,584.44 ఎంయూల వ్యవసాయ విద్యుత్ వినియోగం ఉంటే.. రబీ (నవంబర్–మార్చి) వరకు 6,192 మిలియన్ యూనిట్ల వాడకం (51 శాతం) ఉంటోంది. ఖరీఫ్ (జూన్–నవంబర్)లో 4,744.44 ఎంయూ(39 శాతం)లను మాత్రమే వినియోగిస్తున్నారు. రబీ సీజన్‌లో వర్షాలు పెద్దగా ఉండవు. చెరువులు, కుంటలు, జలాశయాల్లోనూ నీరు తక్కువగా ఉంటుంది. రాయలసీమలో పండ్లు, కూరగాయల పంటలను బోర్ల ఆధారంగానే సాగు చేస్తారు. దీంతో ఈ సీజన్‌లో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటోంది.
10హెచ్‌పీకి పైన ఉన్నవే ఎక్కువ
3 నుంచి 15 హెచ్‌పీల సామర్థ్యం వరకు ఉన్న వ్యవసాయ పంపుసెట్లను వాడుతున్నారు. రబీ సీజన్‌లో వాడే పంపుసెట్లలో 10 హెచ్‌పీకిపైన ఉన్నవే ఎక్కువ. అధికారిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 10 హెచ్‌పీ మోటర్లు 1,60,698 ఉంటే.. 10 హెచ్‌పీపైన ఉన్నవి 92,154 వరకూ ఉన్నాయి. దీన్నిబట్టి రబీలో ఎక్కువ వ్యవసాయ విద్యుత్ లోడ్ ఉండే వీలుంది. ఖరీఫ్‌లో సగటున రోజుకు ఒక్కో పంపుసెట్ 2.20 హెచ్‌పీలుంటే, రబీలో 4.30 హెచ్‌పీలు, అన్ సీజన్ (ఏప్రిల్–మే)లో 1.80 హెచ్‌పీలు ఉంటోంది. బొగ్గు ఇబ్బందులు, జెన్‌కో ప్లాంట్లలో తరచూ వస్తున్న సమస్యల వల్ల 105 ఎంయూల వరకు రావాల్సిన థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రోజుకు 75 ఎంయూలకే పరిమితమవుతోంది. మరోవైపు హాట్ సమ్మర్ కావడంతో జల విద్యుత్ కేవలం 7 ఎంయూలకే పరిమితమైంది. అన్ సీజన్ కావడంతో పవన విద్యుత్ అంతంత మాత్రంగానే వస్తోంది. కేంద్ర విద్యుత్, ప్రైవేటు (పీపీఏలున్న) విద్యుత్ కలుపుకున్నా.. డిమాండ్‌ను చేరుకోవడానికి ఇంకా 35 నుంచి 40 ఎంయూలు రోజూ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కేవలం రబీలో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరగడం వల్లే. అయినా విద్యుత్ సంస్థలు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
చదవండి:
నాన్నా..లేరా.. నాన్నను చూడరా
ఏపీకి చేరుకున్న 4.40 లక్షల వ్యాక్సిన్ డోసులు..
Comments
Please login to add a commentAdd a comment