సాక్షి, న్యూఢిల్లీ : ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది 80,000 సీట్లు తగ్గనున్నాయి. దీంతో 2018-19 విద్యా సంవత్సరం కలుపుకుని నాలుగేళ్లలో దాదాపు 3.1 లక్షల సీట్లు పడిపోనున్నాయి. 2012-13 నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్లు క్రమంగా తగ్గుతూ వస్తున్న క్రమంలో సీట్ల సంఖ్య పడిపోతున్నది. ప్రమాణాలకు అనుగుణంగా లేని 200 ఇంజనీరింగ్ కాలేజీల మూసివేతతో సీట్ల సంఖ్య తగ్గిందని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కాలేజీలు కొత్తగా విద్యార్ధులను అడ్మిట్ చేసుకోకున్నా ప్రస్తుత బ్యాచ్ గ్రాడ్యుయేషన్ ముగిసేవరకూ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. 2016 నుంచి ఇంజనీరింగ్ సీట్లు ఏటా తగ్గుతున్నాయి.
ఈ ఏడాది పలు కాలేజీలు మూసివేత కోరుతూ దరఖాస్తు చేయడంతో 80,000 వరకూ ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య తగ్గనున్నదని ఏఐసీటీఈ చైర్‌పర్సన్ అనిల్ సహస్రబుధే చెప్పారు. మరోవైపు ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్ల సంఖ్య పెరిగింది. ఇక ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పెంచేందుకు 2022 నాటికి అన్ని సాంకేతిక విద్యా సంస్థలు తమ ప్రోగ్రామ్‌లన్నింటికీ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్‌బీఏ) నుంచి అక్రిడిటేషన్ పొందాలని ఏఐసీటీఈ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment