- ఈ ఫిబ్రవరిలో 14.3 మీటర్ల లోతుల్లోకి అడుగంటిన వైనం
- గతేడాది కంటే 2.66 మీటర్ల అదనపు లోతుల్లోకి...
- వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గంగా పాతాళానికి చేరింది. భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. రబీ పంటలు, భూగర్భ జలాలపై వ్యవసాయశాఖ బుధవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలో భూగర్భజలాల తాజా లెక్కలను వెల్లడించింది. దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఫిబ్రవరిలో 14.3 మీటర్ల లోతుల్లోకి భూగర్భజలాలు అడుగంటాయి.
గత ఏడాది ఇదే నెలలో 11.7 మీటర్ల లోతుల్లో లభించిన జలాలు, ఏడాదిలో 2.66 మీటర్ల అదనపు లోతుల్లోకి దిగజారిపోయాయి. వేసవి సమీపిస్తుండటంతో రాబోయే రెండు, మూడు నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో రాష్ట్ర వ్యాప్తంగా బోర్లు వట్టిపోయాయి. బావులు ఎండిపోయాయి. తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. గత ఖరీఫ్ సీజన్‌లో 15 శాతం లోటు వర్షపాతం నమోదైతే, రబీలో 70 శాతం లోటు ఉండటం గమనార్హం.
రబీలో 146 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 44 ఎంఎంలే రికార్డు అయింది. ప్రధాన జలాశయాల్లోని నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గతేడాది మార్చి 16న ప్రధాన జలాశయాల్లో 280.95 టీఎంసీల నీటి నిల్వలుండగా, ఈ ఏడాది అదే రోజున 250.76 టీఎంసీలకు పడిపోయాయి. నాగార్జునసాగర్‌లో గతేడాది అదే తేదీలో 147.28 టీఎంసీల నీరుంటే, ఈ ఏడాది 128.97 టీఎంసీలకు పడిపోయింది. శ్రీరాంసాగర్‌లో గతేడాది 14.23 టీఎంసీల నీటి నిల్వలుంటే, ఈ ఏడాది ఏకంగా 5.16 టీఎంసీలకు పడిపోయాయి.
గంగా.. పాతాళాన్ని తాకంగా..!
Published Thu, Mar 17 2016 4:28 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement