అమెరికాలో పిల్లలను కనే టీనేజ్ తల్లుల సంఖ్య బాగా తగ్గుతోంది. 2015తో పోల్చితే కిందటేడాది ఇలాంటి ‘చిట్టి తల్లుల’ సంఖ్య 9శాతం తగ్గిందని ప్రభుత్వ తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. 1970లు, 80ల్లో అమెరికాను కలవరపెట్టిన టీనేజ్ తల్లుల సంఖ్య గత కొంత కాలంగా పడిపోతూనే ఉంది. 1991 నుంచి దేశంలో టీనేజ్ ఆడపిల్లలు కనే సంతానం సంఖ్య 67శాతం తగ్గిపోయిందని అమెరికా ఆరోగ్య గణాంక కేంద్రం వివరించింది. టీనేజీ పిల్లలు తల్లులు కావడం కావాలని జరిగేది కాదని, సంతాన నిరోధక సాధనాల విస్తృత వినియోగం వల్లే ఇలాంటి జననాలు తగ్గుతున్నాయని ప్రఖ్యాత వైద్యురాలు డా.ఎలిస్ బెర్లాన్ చెప్పారు. 2016లో మొత్తం జననాల సంఖ్య 39, 41, 109. అంటే 2015తో పోల్చితే జననాలు ఒక శాతం తగ్గాయి. ప్రతి వేయి మంది స్త్రీలు సగటున 62 మంది పిల్లలను కనడమంటే అమెరికాలో ఆడవాళ్లు పిల్లలు కనడం బాగా తగ్గించేశారనే భావించాలి.
లేటు వయసులో తల్లులు!
ఓ పక్క టీనేజ్ తల్లుల సంఖ్య తగ్గుతుంటే, లేటుగా జన్మనిచ్చే స్త్రీలు అమెరికాలో పెరుగుతున్నారు. 30, 34 ఏళ్ల మధ్య తల్లులవుతున్నవారి సంఖ్య 1964 తర్వాత మొదటిసారి ఒక శాతం పెరిగింది. ఇక 40-44 ఏళ్ల వయసులో పిల్లలు కనే స్త్రీల సంఖ్య అంతకుముందు ఏడాది కన్నా(2015) నాలుగు శాతం (1966 తర్వాత మొదటిసారి) పెరగడం విశేషం. 45 ఏళ్లు దాటాక పిల్లలు కనే మహిళల సంఖ్య పెరగలేదుగాని నిలకడగా ఉంది. అలాగే, పెళ్లాడని జంటలకు పుట్టే సంతానం సంఖ్య 3 శాతం తగ్గింది. అందరికీ ఆరోగ్య-వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి వాటిని యువతులు ఉపయోగించుకోవడం వల్లే మహిళలకు ముఖ్యంగా గర్భధారణ, ప్రసూతికి సంబంధించిన మంచి ఫలితాలు వచ్చాయని ఈ నివేదిక విశ్లేషించిన బెర్లాన్, సారా వెర్బియెస్ట్ చెప్పారు.
కోత కాన్పులు వరుసగా నాలుగో ఏడాది తగ్గాయి!
అమెరికాలో కొన్ని దశాబ్దాల క్రితం ప్రజలను బెంబేలెత్తించిన కోత కాన్పులు వరుసగా నాలుగో ఏడాది కూడా తగ్గాయి. దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు, సంస్థల ప్రచారం వల్ల సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా చేసే కాన్పుల సంఖ్య 32 శాతానికి పడిపోయింది. 2009లో ఇలాంటి కోత కాన్పులు 33 శాతం దాకా పెరిగి అప్పటి నుంచి తగ్గనారంభించాయి. మహిళా సంఘాలు, బీమా కంపెనీలు, వైద్యసహాయ సంస్థలు, వైద్యులు, మంత్రసానులు, నర్సులు చేసిన కృషి వల్చేల ఇది ఽసాధ్యమైంది. అదీగాక టీనేజ్ ఆడపిల్లల్లో వైద్య, ఆరోగ్య విషయాల్లో పెరిగిన చైతన్యం, సామాజిక మార్పుల కారణంగా సంతాన నిరోధక సాధనాలను ఉపయోగిస్తున్నారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
అమెరికాలో తగ్గుతున్న ‘చిట్టి తల్లులు’
Published Fri, Jun 30 2017 7:57 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM
Advertisement
Advertisement