ఐక్యరాజ్యసమితి: దక్షిణాసియాలో పెట్టుబడులకు కీలక కేంద్రంగా ఎదుగుతున్నప్పటికీ.. గతేడాది భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల రాక తగ్గింది. అదే సమయంలో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే పెట్టుబడులు దాదాపు రెట్టింపయ్యాయి. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ (యూఎన్‌సీటీఏడీ) రూపొందించిన అంతర్జాతీయ పెట్టుబడుల నివేదిక (2018) ప్రకారం .. ప్రపంచ దేశాల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 23 శాతం క్షీణించాయి. 2016లో 1.87 లక్షల కోట్ల డాలర్లుగా ఉండగా... ఇవి 2017లో 1.43 లక్షల కోట్ల డాలర్లకు తగ్గాయి. ఇక భారత్‌లోకి 2016లో 44 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు రాగా.. అవి గతేడాది 40 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. అయితే, అదే సమయంలో భారత్ నుంచి 11 బిలియన్ డాలర్ల మేర నిధులు తరలిపోయాయి. 2016తో పోలిస్తే ఇది రెట్టింపు. ఎఫ్‌డీఐలు తగ్గిపోవడం ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా వర్ధమాన దేశాల విధానకర్తలకు ఆందోళన కలిగిస్తోందని యూఎన్‌సీటీఏడీ సెక్రటరీ–జనరల్ ముఖిసా కిటుయి చెప్పారు. ప్రపంచ వాణిజ్యానికి పొంచి ఉన్న రిస్కు, తత్ఫలితంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులే ఈ ప్రతికూల ప్రభావానికి కారణమని తెలియజేశారు. ఈ ధోరణులు వర్ధమాన దేశాలను అత్యధికంగా దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. వాణిజ్యపరమైన యుద్ధ భయాలు, విధానాలపరమైన అనిశ్చితి వల్ల ఈ ఏడాది ఆఖరు నాటికి అంతర్జాతీయ ఎఫ్‌డీఐల పెరుగుదల 10 శాతానికి మాత్రమే పరిమితం కావొచ్చని యూఎన్‌సీటీఏడీ అంచనా వేసింది. అయితే, గడిచిన దశాబ్ద కాలంగా ఉన్న ధోరణులను చూస్తే.. ఇది సగటు కన్నా తక్కువ స్థాయేనని పేర్కొంది.
దూకుడుగా ఓఎన్‌జీసీ విదేశీ పెట్టుబడులు..
ప్రభుత్వ రంగ చమురు ఉత్పత్తి దిగ్గజం ఓఎన్‌జీసీ ఇటీవలి కాలంలో విదేశీ ఆస్తుల్లో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తోంది. 2016లో రష్యన్ దిగ్గజం రాస్‌నెఫ్ట్ పీజేఎస్‌సీలో భాగమైన వాంకోర్‌నెఫ్ట్‌లో 26 శాతం వాటాలు కొనుగోలు చేసింది. 2017లో టులో ఆయిల్ నుంచి నమీబియాలోని ఒక ఆఫ్‌షోర్ క్షేత్రంలో 15 శాతం వాటా కొనుగోలు చేసింది. మొత్తంగా 2017 ఆఖరు నాటికి ఓఎన్‌జీసీకి 18 దేశాల్లో 39 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి రోజుకు 2,85,000 బ్యారెళ్ల చమురు, తత్సమాన గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని యూఎన్‌సీటీఏడీ పేర్కొంది.
పెరుగుతున్న సీమాంతర లావాదేవీలు..
భారత్‌లో సీమాంతర విలీనాలు, కొనుగోళ్ల లావాదేవీలు గణనీయంగా పెరిగాయని వివరించింది. ఇంధనాల ఉత్పత్తి, టెక్నాలజీ రంగాల్లో కొన్ని భారీ డీల్స్ ఊతంతో వీటి పరిమాణం 8 బిలియన్ డాలర్ల నుంచి 23 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు పేర్కొంది. రష్యన్ సంస్థ రాస్‌నెఫ్ట్ గ్యాజ్‌కి చెందిన పెట్రోల్ కాంప్లెక్స్.. భారత్‌లో రెండో అతి పెద్ద ప్రైవేట్ ఆయిల్ కంపెనీ ఎస్సార్ ఆయిల్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం 13 బిలియన్ డాలర్లు వెచ్చించింది. అటు వివిధ దేశాలకు చెందిన ఇన్వెస్టర్ల గ్రూప్.. దేశీ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 1.4 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. అమెరికా ఈ–కామర్స్ సంస్థ ఈబే, టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్‌తో పాటు చైనాకి చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్ ఈ గ్రూప్‌లో ఉన్నాయి.
తగ్గుతున్న విదేశీ పెట్టుబడులు
Published Fri, Jun 8 2018 1:17 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment