న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్–19 మరణాల రేటు గణనీయంగా తగ్గిందని ఆరోగ్య శాఖ తెలిపింది. జూన్ 17వ తేదీన 3.36 శాతంగా ఉన్న మరణాల రేటు ప్రస్తుతం 2.43 శాతానికి పడిపోయిందని పేర్కొంది. కేంద్రం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని వెల్లడించింది. దేశంలో 24 గంటల్లో మరో 37,148 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసులు 11,55,191కు చేరుకున్నాయని తెలిపింది. యాక్టివ్ కేసులు 4,02,529 కాగా, కోలుకున్న బాధితుల సంఖ్య కూడా 7,24,577కు చేరుకుని, రికవరీ రేటు 62.72 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌తో ఒక్క రోజులోనే మరో 587 మంది మృతి చెందడంతో ఇప్పటిదాకా చనిపోయిన వారి సంఖ్య 28,084కు చేరుకుంది.
దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్ రేటు జాతీయ స్థాయి 8.07 శాతం కంటే తక్కువగానే ఉన్నట్లు కేంద్రం తెలిపింది. రోజుకు ప్రతి 10 లక్షల జనాభాకు 140 పరీక్షలు చేస్తే పాజిటివ్ రేటు క్రమంగా 5కు, అంతకంటే తక్కువకు దిగి వస్తుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్–19తో ప్రతి 10 లక్షల మందిలో సరాసరిన 77 మంది చనిపోతుండగా, భారత్‌లో అది 20.4 మాత్రమేనని కేంద్రం పేర్కొంది. ఈ నెల 20వ తేదీ వరకు దేశంలోని వివిధ ల్యాబ్‌ల్లో 1,43,81,101 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment