అమెరికాలో భారతీయులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన విదేశీయుల్లో ప్రథమస్థానంలో నిలవడం ద్వారా...
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినపుడు అదుపులోకి తీసుకున్న భారతీయుల సంఖ్య ఈ ఏడాది దాదాపు మూడు రెట్లు పెరిగిందని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) విభాగం తాజాగా ప్రకటించింది. యూఎస్–మెక్సికో సరిహద్దును అక్రమంగా దాటేందుకు ఒక్కొక్కరికీ 25–50 వేల డాలర్ల మధ్యలో ‘మనుషుల స్మగ్లింగ్ బందాల’కు చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. ఇలా దొంగతనంగా అమెరికాలోకి ప్రవేశించేవారు స్వదేశాల్లో తాము హింసను, పీడనను ఎదుర్కొంటున్న కారణంగా అక్కడ ఆశ్రయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సెప్టెంబర్ 30తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 9 వేల మంది (గతేడాది 3,162 మంది) భారతీయులను సరిహద్దుల్లో అరెస్ట్ చేసినట్టు సీబీపీ అధికారి సాల్వడార్ జమోరా వెల్లడించారు. వీరిలో 4వేల మంది దాకా అమెరికాలోకి అక్రమ ప్రవేశానికి అనుకూలంగా ఉందని భావిస్తున్న మెక్సికాలి సరిహద్దు కంచెను దాటి వచ్చినట్టు చెప్పారు.
రకరకాల కారణాలు చెప్పి...
ఆశ్రయం పొందేందుకు భారతీయులు అనేక కారణాలు చెబుతున్నారు. కులాంతర వివాహాలు చేసుకున్నందున తమను చంపుతారనే భయంతో అమెరికాకు పారిపోయి వచ్చినట్టు కొందరు చెబుతుండగా, సిక్కులు మాత్రం భారత్‌లో రాజకీయ పీడన కారణంగానే తాము ఇక్కడకు రావాల్సి వచ్చిందని చెబుతున్నారని ఇమిగ్రేషన్ లాయర్లు తెలిపారు. ఇతర వలసదారులు చెప్పే కారణాలనే కొందరు వెల్లడిస్తూ ఆశ్రయం కోసం ప్రభుత్వాన్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారని జమోరా పేర్కొన్నారు.
2012–17 మధ్యకాలంలో ఆశ్రయం కోసం అర్జీలు పెట్టుకున్న 42.2 శాతం భారతీయుల విజ్ఞప్తులను తోసిపుచ్చినట్టు సైకాక్యూస్ యూనివర్శిటీ ట్రాన్సాక్షనల్ రికార్డ్స్ యాక్సెస్ క్లియరింగ్ హౌజ్ తెలియజేసింది. ఈ విషయంలో 79 శాతంతో ఎల్‌సాల్వడార్ వాసులు మొదటిస్థానంలో, 78 శాతంతో హ్యుండరస్‌కు చెందినవారు రెండోస్థానంలో నిలిచారు. అమెరికాలో పట్టుబడ్డాక భారతీయులకు బాండ్లు కట్టి మానవ అక్రమరవాణా బందాలు విడిపిస్తున్నట్టు జమోరా తెలిపారు. బాండ్లపై విడుదలయ్యాక హోటళ్లు, ఇతర స్టోర్లలో ఇండియన్లు పనిచేసి డబ్బు సంపాదిస్తున్నారు. ఆ విధంగా వచ్చిన ఆదాయంతో ఆ బందాలకు బాండ్ ఫీజు రుసుమును తిరిగి చెల్లించడంతో పాటు, అక్రమంగా ప్రవేశించేందుకు చేసిన అప్పులను తీర్చేందుకు ఉపయోగిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment