indians in usa
-
Pravasi Bharatiya Divas: రవి అస్తమించని ప్రవాస భారతీయం
ప్రపంచ నలుమూలలా భారతీయులు నివసిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 210 దేశాలలో భారతీయ మూలాలున్న వారు, ఎన్నారైలు కలిపి 3.2 కోట్లకు పైగానే ఉన్నారు. ప్రవాస భారతీయ జనాభా కంటే తక్కువ జనాభా కలిగిన దేశాలు 150 పైనే ఉన్నాయి. నేడు అనేక దేశాల్లో రాజకీయంగా కూడా భారతీయులు కీలక పదవుల్లో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని కమలా హారిస్ అలంకరించిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్‌లో జన్మించిన తెలుగింటి బిడ్డ అరుణ మిల్లర్ (కాట్రగడ్డ అరుణ) మేరీలాండ్ రాష్ట్రానికి గత నవంబర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వివిధ దేశాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు వివిధ దేశాలకు అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. రిషి సునాక్ (బ్రిటన్ ప్రధాని), అంటో నియ కోస్టా (పోర్చుగల్ ప్రధాని), మహ్మద్ ఇర్ఫాన్ అలీ (గయానా ప్రెసిడెంట్), పృథ్వీరాజ్ రూపన్ (మారిషస్ అధ్యక్షులు), చంద్రిక పెర్సద్ శాన్ టోఖి (సురినామ్ ప్రెసిడెంట్) లతోపాటు 200 మందికి పైగా భారతీయులు 15 దేశాల్లో వివిధ హోదాల్లో ప్రజాసేవలో ఉన్నారు. వీరంతా అమెరికా, యూకే, కెనడా, గయానా, సురినామ్, ఫిజీ, ట్రినిడాడ్ అండ్ టుబాగో, సింగపూర్, మారిషస్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మలేసియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పనిచేస్తున్నారు. వీరు కాకుండా వివిధ దేశాల్లో, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు చాలామందే ఉన్నారు. గతంలో సింగపూర్ ప్రెసిడెంట్‌గా ఉన్నఎస్.ఆర్.నాథన్ (1999–2011), దేవన్ నాయర్ (1981 –1985)లు, ఫిజీ ప్రధానిగా పనిచేసిన మహేంద్ర చౌదరి, మలేసియా ప్రధానిగా పని చేసిన మహతీర్ బిన్ మహ్మద్ వంటి వారు భారతీయ మూలాలున్నవారే. ప్రపంచంలోని అగ్రస్థానాల్లో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, ఈ మధ్య వరకు ట్విట్టర్ సీఈఓగా కొనసాగిన పరాగ్ అగర్వాల్, పెప్సికోలా ఒకప్పటి సీఈఓ ఇంద్రనూయి వంటి వారెందరో భారతీయ మూలలున్నవారే. నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ప్రవాస భారతీయులు బ్రిటిష్ రాజ్ కాలంలో, తదనంతరం విదేశాలకు వెళ్ళినవారే. ముఖ్యంగా వ్యవసాయం పనుల కోసం వెళ్ళిన భారతీయులు అక్కడ స్థిరపడ్డారు. మారిషస్, గయానా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, కెనడా, దక్షిణాఫ్రికా మలేసియా, ఫిజీ వంటి కామన్వెల్త్ దేశాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నవారు వీరే! స్వాతంత్య్రానంతరం ప్రపంచ కలల దేశమైన అమెరికాకు భారతీయ వలసలు ప్రారంభమై, నేడు సుమారు 45 లక్షల మంది ఆ గడ్డపై తమవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. 10 దేశాల్లో భారతీయుల జనాభా 10 లక్షలు దాటితే మరో 22 దేశాల్లో లక్షకు పైగా వున్నారు. డర్బన్ నగరాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారంటే ఆ నగరంలో భారతీయుల హవాని అర్థం చేసుకోవచ్చు. ప్రతీ ఏడు 25 లక్షల భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు. భారతీయ వలసల్లో ఇదే పంథా కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి భారతీయ పరిమళాలు ధరణి అంతా మరింత వ్యాపించి రవి అస్తమించని ‘భారతీయం’ సాక్షాత్కరిస్తుంది. (క్లిక్ చేయండి: నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..! - కోరాడ శ్రీనివాసరావు ప్రభుత్వాధికారి, ఏపీ (జనవరి 8–10 ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల సందర్భంగా) -
అమెరికాలో చొరబడుతున్న భారతీయులు...!
అమెరికాలో భారతీయులు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన విదేశీయుల్లో ప్రథమస్థానంలో నిలవడం ద్వారా... అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినపుడు అదుపులోకి తీసుకున్న భారతీయుల సంఖ్య ఈ ఏడాది దాదాపు మూడు రెట్లు పెరిగిందని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) విభాగం తాజాగా ప్రకటించింది. యూఎస్–మెక్సికో సరిహద్దును అక్రమంగా దాటేందుకు ఒక్కొక్కరికీ 25–50 వేల డాలర్ల మధ్యలో ‘మనుషుల స్మగ్లింగ్ బందాల’కు చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. ఇలా దొంగతనంగా అమెరికాలోకి ప్రవేశించేవారు స్వదేశాల్లో తాము హింసను, పీడనను ఎదుర్కొంటున్న కారణంగా అక్కడ ఆశ్రయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సెప్టెంబర్ 30తో ముగిసిన ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 9 వేల మంది (గతేడాది 3,162 మంది) భారతీయులను సరిహద్దుల్లో అరెస్ట్ చేసినట్టు సీబీపీ అధికారి సాల్వడార్ జమోరా వెల్లడించారు. వీరిలో 4వేల మంది దాకా అమెరికాలోకి అక్రమ ప్రవేశానికి అనుకూలంగా ఉందని భావిస్తున్న మెక్సికాలి సరిహద్దు కంచెను దాటి వచ్చినట్టు చెప్పారు. రకరకాల కారణాలు చెప్పి... ఆశ్రయం పొందేందుకు భారతీయులు అనేక కారణాలు చెబుతున్నారు. కులాంతర వివాహాలు చేసుకున్నందున తమను చంపుతారనే భయంతో అమెరికాకు పారిపోయి వచ్చినట్టు కొందరు చెబుతుండగా, సిక్కులు మాత్రం భారత్‌లో రాజకీయ పీడన కారణంగానే తాము ఇక్కడకు రావాల్సి వచ్చిందని చెబుతున్నారని ఇమిగ్రేషన్ లాయర్లు తెలిపారు. ఇతర వలసదారులు చెప్పే కారణాలనే కొందరు వెల్లడిస్తూ ఆశ్రయం కోసం ప్రభుత్వాన్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారని జమోరా పేర్కొన్నారు. 2012–17 మధ్యకాలంలో ఆశ్రయం కోసం అర్జీలు పెట్టుకున్న 42.2 శాతం భారతీయుల విజ్ఞప్తులను తోసిపుచ్చినట్టు సైకాక్యూస్ యూనివర్శిటీ ట్రాన్సాక్షనల్ రికార్డ్స్ యాక్సెస్ క్లియరింగ్ హౌజ్ తెలియజేసింది. ఈ విషయంలో 79 శాతంతో ఎల్‌సాల్వడార్ వాసులు మొదటిస్థానంలో, 78 శాతంతో హ్యుండరస్కు చెందినవారు రెండోస్థానంలో నిలిచారు. అమెరికాలో పట్టుబడ్డాక భారతీయులకు బాండ్లు కట్టి మానవ అక్రమరవాణా బందాలు విడిపిస్తున్నట్టు జమోరా తెలిపారు. బాండ్లపై విడుదలయ్యాక హోటళ్లు, ఇతర స్టోర్లలో ఇండియన్లు పనిచేసి డబ్బు సంపాదిస్తున్నారు. ఆ విధంగా వచ్చిన ఆదాయంతో ఆ బందాలకు బాండ్ ఫీజు రుసుమును తిరిగి చెల్లించడంతో పాటు, అక్రమంగా ప్రవేశించేందుకు చేసిన అప్పులను తీర్చేందుకు ఉపయోగిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. -
75శాతం భారతీయులే
వాషింగ్టన్: అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం నిరీక్షిస్తున్న వారిలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. యూఎస్‌లో శాశ్వతంగా నివసించే అవకాశం కల్పించే గ్రీన్కార్డ్కోసం ఎదురు చూస్తున్న నిపుణుల్లో నాలుగింట మూడొంతులకు పైగా భారతీయులేనని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది మే నాటికి సుమారు 3,95,025 మంది విదేశీయులు అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో మూడొంతులకు పైగా అంటే 3,06,601మంది భారతీయులు గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారిలో భారత్ తర్వాతి స్థానంలో చైనా (67,031) ఉంది. మిగతా దేశాల్లో దీనికోసం ఎదురు చూస్తున్న వారు పదివేల మంది కంటే తక్కువగానే ఉన్నారు. చైనా తర్వాతి స్థానంలో ఎల్ సాల్వడార్ (7,252), గ్వాటెమాలా (6,027), హోండురస్ (5,402), ఫిలిప్పైన్స్ (1,491) దేశాలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఏ దేశానికీ ఏడు శాతానికి మించి గ్రీన్ కార్డులు జారీ చేయరాదు. దీనివల్ల భారతీయులు ఇబ్బందిపడుతున్నారు. -
అమెరికాలో భారతీయుని ఇంటిపై దాడి
పీటన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతివిద్వేష వ్యాఖ్యల నేపథ్యంలో ప్రవాస భారతీయుడు కూచిభొట్ల శ్రీనివాస్ హత్య ఘటన మరువకముందే మరో భారతీయుడి ఇంటిపై దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ కొలరాడోలో జరిగిన ఈ దాడిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. పీటన్ నగరంలోని ఓ భారతీయుడి ఇంటిపై దాడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు అక్కడ దాదాపు 50కి పైగా జాతివిద్వేష పోస్టర్లు అతికించడంతో పాటు, గోడల మీద కోడిగుడ్లు కొట్టారు. గోడలపై కుక్క మలాన్ని పూశారు. తలుపు మీద, కిటికీల మీద, కారు అద్దాల మీద పోస్టర్లు అతికించారు. పోస్టర్లపై ‘గోధుమ వర్ణం వారు, లేదా ఇండియన్లు ఇక్కడ ఉండొద్దు’ అనే రాతలు రాశారు. అయితే.. ఈ దాడికి గురైన భారతీయుడు మాత్రం తన పేరు బయటపెట్టడానికి ఇష్టపడలేదు. అంతేకాదు.. ఎవరో ఒకరిద్దరు మాత్రమే అలా ఉన్నారు తప్ప అమెరికన్లంతా అలాంటివాళ్లు కారని, తన ఇంటి చుట్టుపక్కల వాళ్లంతా తనకు సాయంగా వచ్చి, ఇంటి గోడలను శుభ్రం చేశారని చెప్పారు. కానీ మళ్లీ తన ఇంటిపై ఇలాంటి దాడి జరుగుతుందోమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు గుంపుగా వచ్చి దాడి చేసి ఉంటారని ఎఫ్‌బీఐ భావిస్తోంది. అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’