వాషింగ్టన్: అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం నిరీక్షిస్తున్న వారిలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారు. యూఎస్‌లో శాశ్వతంగా నివసించే అవకాశం కల్పించే గ్రీన్‌కార్డ్‌కోసం ఎదురు చూస్తున్న నిపుణుల్లో నాలుగింట మూడొంతులకు పైగా భారతీయులేనని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది మే నాటికి సుమారు 3,95,025 మంది విదేశీయులు అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు.
వీరిలో మూడొంతులకు పైగా అంటే 3,06,601మంది భారతీయులు గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారు. గ్రీన్‌కార్డ్ కోసం ఎదురు చూస్తున్న వారిలో భారత్ తర్వాతి స్థానంలో చైనా (67,031) ఉంది. మిగతా దేశాల్లో దీనికోసం ఎదురు చూస్తున్న వారు పదివేల మంది కంటే తక్కువగానే ఉన్నారు. చైనా తర్వాతి స్థానంలో ఎల్ సాల్వడార్ (7,252), గ్వాటెమాలా (6,027), హోండురస్ (5,402), ఫిలిప్పైన్స్ (1,491) దేశాలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఏ దేశానికీ ఏడు శాతానికి మించి గ్రీన్ కార్డులు జారీ చేయరాదు. దీనివల్ల భారతీయులు ఇబ్బందిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment