చెదురుతున్న ‘డాలర్‌ డ్రీమ్స్‌’! | H-1B visa rejection means for Indian IT companies in US | Sakshi
Sakshi News home page

చెదురుతున్న ‘డాలర్‌ డ్రీమ్స్‌’!

Published Sat, Mar 23 2019 4:20 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

H-1B visa rejection means for Indian IT companies in US - Sakshi

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయుల డాలర్‌ డ్రీమ్స్‌ చెదిరిపోతున్నాయి. అమెరికా ప్రభుత్వం రక్షణాత్మకంగా వ్యవహరిస్తుండటంతో అక్కడ పనిచేస్తున్న వేలాది మంది భారత ఐటీ నిపుణులు వీసా తిరస్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. తమ వీసా గడువును పొడిగించాల్సిందిగా దాఖలు చేస్తున్న దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. లేదంటే రిక్వెస్ట్‌ ఫర్‌ ఎవిడెన్స్‌(ఆర్‌ఎఫ్‌ఈ)లను సమర్పించాల్సిందిగా పదేపదే అడుగుతున్నారు. ఆర్‌ఎఫ్‌ఈలను పొందిన ఉద్యోగులకు వీసా పొడిగింపు దక్కుతుందన్న గ్యారెంటీ ఏమీలేదు. ‘నా స్నేహితురాలు ఇక్కడే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు ఓ బాబు ఉన్నాడు. హెచ్‌1బీ వీసా పొడిగింపుతో పాటు గ్రీన్‌కార్డు కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. కానీ ఆ రెండు దరఖాస్తులూ తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆమె కుమారుడితో కలిసి అమెరికాను వీడాల్సి వచ్చింది’అని జునేజా అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చెప్పారు.  

అమెరికాలో ఉండేందుకే మొగ్గు..
హెచ్‌1బీ వీసాల పొడిగింపు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నప్పటికీ చాలామంది టెక్కీలు స్వదేశానికి తిరిగివచ్చేందుకు బదులుగా అమెరికాలోనే పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ భారత్‌కు తిరిగివచ్చి అదే సంస్థలో పనిచేయాలన్నా, కొత్త కంపెనీలకు మారాలన్నా ఇబ్బందికరంగా ఉంటుం దని వారు భావిస్తున్నారు. అమెరికాలో దశాబ్ద(2007–17)కాలంలో  34 లక్షల మందికి హెచ్‌1బీ వీసాలు జారీకాగా, వీటిలో 22 లక్షల వీసాలను భారతీయులే దక్కించుకున్నారు.  

కఠినంగా ఇమిగ్రేషన్‌  
‘ఆర్‌ఎఫ్‌ఐ (రిక్వెస్ట్‌ ఫర్‌ ఎవిడెన్స్‌) అప్రూవల్‌ శాతం చాలా తక్కువగా ఉంది. దీంతో నా లగేజీని ప్యాక్‌ చేసుకున్నా. దీని కారణంగా నా ప్రాజెక్టుపై తక్కువ సమయం, వీసా పొడిగింపుపై తిరిగేందుకు ఎక్కువ సమయం తిరగాల్సి వస్తోందని క్లయింట్‌కు చెప్పడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఆర్‌ఎఫ్‌ఐ ప్రక్రియలో భాగంగా 21 చెక్‌లిస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అలాగే రాబోయే రెండున్నరేళ్ల కాలానికి సంబంధించి మీ పని ప్రణాళికలను ఇవ్వాల్సి ఉంటుంది’అని ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చెప్పారు.  మరోవైపు ఈ పరిస్థితిపై ఇమిగ్రేషన్‌ కేసులను వాదించే లాక్వెస్ట్‌ సంస్థ యజమాని పూర్వీ స్పందిస్తూ.. ‘అమెరికన్లుకు ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వీసా విధానాలను మార్చడంతో ప్రస్తుతం ఇక్కడ ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది’ అని అన్నారు.

గ్రీన్‌కార్డుకు పదేళ్లు ఆగాల్సిందే..
2018లో 30 సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు సంబంధించి 13,177 మంది హెచ్‌1బీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోగా, 8,742 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇలా వీసా లు తిరస్కరణకు గురైనవారిలో కాగ్నిజెంట్‌ సంస్థకు చెందిన 3,548 ఉద్యోగులు, ఇన్ఫోసిస్‌కు చెందిన 2,042 మంది ఉద్యోగులు, టీసీఎస్‌కు చెందిన 1,744 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలో మూడేళ్ల కాలానికి జారీచేసే హెచ్‌1బీ వీసాను మరో మూడేళ్లకు పొడిగించుకోవచ్చని సెంటర్‌ ఫర్‌ ఇమిగ్రేషన్‌ చెప్పింది. హెచ్‌1బీ వీసా గడువు ముగిసే సమయంలో చాలామంది భారతీయులు అమెరికాలో శాశ్వత నివాసానికి గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకుంటారంది. ప్రస్తుతం గ్రీన్‌కార్డును పొందేందుకు భారతీయ ఐటీ నిపుణులకు సగటున పదేళ్లు పడుతోందని చెప్పింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement