US Immigration and Customs Enforcement
-
వలసల నియంత్రణాధికారిగా టామ్ హొమన్
న్యూయార్క్: అమెరికా వలసల నియంత్రణ అధికారిగా యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మాజీ డైరెక్టర్ టామ్ హొమన్ను నియమిస్తున్నట్లు అధ్యక్ష పదవికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొడతానన్న ఎన్నికల హామీకి అనుగుణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘వలసల నియంత్రణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే టామ్ హొమన్ను మన దేశ సరిహద్దులకు ఇన్చార్జిగా నియమిస్తున్నానని తెలిపేందుకు సంతోషిస్తున్నా’అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ సైట్లో వెల్లడించారు. దేశ దక్షిణ, ఉత్తర సరిహద్దులతోపాటు సముద్ర, గగనతల బాధ్యతలను కూడా ఆయన తీసుకుంటారన్నారు. దేశంలో అక్రమ వలసదారులను గుర్తించి వారి సొంత దేశాలకు పంపేయడాన్ని ఆయన పర్యవేక్షిస్తారన్నారు. ఈ బాధ్యతలకు టామ్ హొమన్నే ట్రంప్ నియమిస్తారంటూ ఇటీవల పలు కథనాలొచ్చాయి.కాగా, తాజా నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం లేదు. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపేందుకు సైన్యం సాయం తీసుకోబోమంటూ ఇటీవల టాప్ హొమన్ ఇటీవల ఫాక్స్ న్యూస్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది సమర్థంగా ఇటువంటి విధులను నిర్వర్తిస్తారని ఆయన అన్నారు. అదేవిధంగా, ఐరాసలో అమెరికా రాయబారిగా కాంగ్రెస్ సభ్యురాలు ఎలిస్ స్టెఫానిక్‌ను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. -
US returns 250 antiquities: భారత్‌కు అద్భుత కళాఖండాలు అప్పగింత
న్యూయార్క్: అపహరణకు గురైన పురాతన కళాఖండాల కార్యాచరణ దర్యాప్తులో భాగంగా సుమారు15 మిలియన్ డాలర్లు విలువ చేసే 250 పురాతన వస్తువులను భారత్‌కు యూఎస్ తిరిగి ఇచ్చింది. ఈ పురాతన వస్తువులను న్యూయార్క్ నగరంలోని ఇండియన్ కాన్సులేట్‌లో జరిగిన వేడుకలో భారత్‌కి అందజేసారు. ఈ మేరకు ఈ వస్తువులు మాన్హాటన్ జిల్లా న్యాయవాది కార్యాలయం, యూఎస్ ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ జరిపిన సుదీర్ఢ దర్యాప్తులో వెలుగు చూశాయి. ఈ సందర్భంగా యూఎస్ డిస్ట్రిక్ అటార్నీ సైరస్ వాన్స్ జూనియర్ మాట్లాడుతూ.. డీలర్ సుభాష్ కపూర్ యునైటెడ్ స్టేట్స్కు పదివేల పురాతన వస్తువులపై అక్రమంగా తరలించారని ఆరోపణల నేపథ్యంలో విస్తృత దర్యాప్తు పై దృష్టి సారించాం. తమ సుదీర్ఘ దర్యాప్తు ఫలితంగా 143 మిలియన్ల డాలర్ల విలువైన 2,500 కళాఖండాలు తిరిగి సంపాదించగలిగాం. ఈ నేరానికి పాల్పడిన కపూర్ అతని సహ కుట్రదారులు తగిన శిక్ష పడుతంది. అయితే కపూర్ ప్రస్తుతం భారతదేశం జైలులో ఉన్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు దర్యాప్తును యూఎస్ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా కపూర్ గ్యాలరీ నుంచి వాటిని సేకరించిన యూఎస్.. భారత్‌కు అప్పగించింది. భారతదేశం, ఆగ్నేయాసియాలోని వివిధ దేశాల నుండి దోచుకున్న నిధులను రవాణా చేయడానికి న్యూయార్క్‌లోని తన ఆర్ట్స్ ఆఫ్ ది పాస్ట్ గ్యాలరీని వినియోగించారు. ఈ క్రమంలో కపూర్ పురాతన వస్తువులను వెతకడానికి ప్రపంచాన్ని చుట్టివచ్చాడు. దేవాలయాల నుంచి పురాతన వస్తువుల్ని దొంగలిస్తూ వాటిని రహస్యంగా తరలించేవాడు. -
గ్రీన్‌కార్డ్ వెయిటింగ్ లిస్ట్‌లో 8 లక్షల మంది!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా యూఎస్ సిటిజన్‌షిప్ కోసం వేచిచూస్తున్న వారి జాబితా 2020లో 1.2 మిలియన్లకు చేరింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది యూఎస్ చరిత్రలో అత్యధికమని క్యాటో ఇన్స్టిట్యూట్ పేర్కొంది. యూఎస్ సిటిజన్‌షిప్‌ను కల్పించే గ్రీన్‌కార్డు పొందేందుకు వేచిచూస్తున్న జాబితాలో భారతీయుల సంఖ్య 8 లక్షలకు చేరినట్లు యూఎస్సీఐఎస్ పేర్కొంది. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారుల్లో భారతీయుల వాటా 68 శాతానికి సమానమని తెలియజేసింది. కాగా.. వెయిటింగ్ లిస్ట్ అధికంగా ఉండటం, జారీకి పట్టే కాలాన్ని పరిగణిస్తే.. సుమారు 2 లక్షల మందికి తమ జీవితకాలంలో గ్రీన్‌కార్డ్ అందే అవకాశాలు లేనట్లేనని క్యాటోకు చెందిన సెంటర్ ఫర్ గ్లోబల్ లిబర్టీ అండ్ ప్రాస్పెసరిటీ అభిప్రాయపడింది. చైనీస్‌కు రెండో ర్యాంకు యూఎస్ గ్రీన్‌కార్డులు పొందేందుకు వేచిచూస్తున్న జాబితాలో భారతీయుల తదుపరి చైనీయులు అధికంగా ఉన్నట్లు యూఎస్సీఐఎస్ తాజాగా వెల్లడించింది. ప్రపంచంలోని మిగిలిన దేశాలవారు 18 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు వివరించింది. శాశ్వత ఉపాధి కార్యక్రమంలో భాగంగా యూఎస్ ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ గ్రీన్‌కార్డులను జారీ చేస్తోంది. తద్వారా అత్యంత నైపుణ్యమున్న వారికి దేశంలో నివసించేందుకు వీలు కల్పిస్తోంది. వార్షికంగా 1.4 లక్షల మందికి మించి ఎంప్లాయ్మెంట్ గ్రీన్‌కార్డుల జారీకి అవకాశంలేదని ఈ సందర్భంగా విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జో బైడెన్ ఈ అంశంలో సంస్కరణలు తీసుకువచ్చినప్పటికీ ప్రాసెస్ పూర్తికావడానికి చాలా కాలంపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. -
ఆన్లైన్ ఎంచుకుంటే అమెరికా రావద్దు
వాషింగ్టన్: వీసా విధానంలో రోజుకో మార్పు తీసుకువస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థుల అంశంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా విద్యా సంస్థల్లో ఆన్లైన్ మాధ్యమంలో బోధనను ఎంపిక చేసుకునే కొత్త విద్యార్థులెవరినీ దేశంలోకి రానివ్వకూడదని ఆయన నిర్ణయించారు. ఈ సెప్టెంబర్ నుంచి మొదలయ్యే సెమిస్టర్లో ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులెవరూ దేశంలోకి అడుగు పెట్టకూడదని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ (ఐసీఈ) ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనికి కటాఫ్ తేదీని మార్చి 9గా నిర్ణయించింది. ఆ తేదీ తర్వాత కొత్త విద్యార్థులెవరైనా ఆన్లైన్ బోధనా పద్ధతుల్ని ఎంపిక చేసుకుంటే అమెరికా రావడానికి వీల్లేదని ఐసీఈ స్పష్టం చేసింది. కొత్తగా జాయిన్ అయిన విదేశీ విద్యార్థులెవరికీ ఫారమ్ 1–20 జారీ చేయవద్దంటూ దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను హోంల్యాండ్ సెక్యూరిటీలోని స్టూడెంట్స్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్ఈవీపీ) ఆదేశించింది. స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆ ఫారమ్స్ అత్యంత కీలకం. ఈ విద్యా సంవత్సరంలో భారత్‌కు చెందిన విద్యార్థులకే అత్యధికంగా అమెరికా విద్యాసంస్థల్లో సీటు వచ్చింది. కొత్తగా సీటు వచ్చిన భారతీయ విద్యార్థులు దాదాపుగా 2 లక్షల మంది వరకు ఉండవచ్చునని ఒక అంచనా. అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశీయ, విదేశీ విద్యార్థులు ఎక్కువ మంది ఆన్లైన్ బోధనా పద్ధతుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాలో ఉంటూ ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు ఇచ్చి సర్వత్రా నిరసనలు వెల్లువెత్తడంతో తన నిర్ణయాన్ని ట్రంప్ సర్కార్ వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. విద్యా సంస్థల్ని బలవంతంగానైనా తెరిపించడానికే ట్రంప్ ఇలా రోజుకో వివాదాస్పద నిర్ణయం తీసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. డీఏసీఏ దరఖాస్తులూ పెండింగ్‌లో చిన్నతనంలో అమెరికాకి వచ్చి, యుక్త వయసు వచ్చాక ఉద్యోగాలు చేసుకోవడానికి వీలు కల్పించే డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) దరఖాస్తులని సర్కార్ పెండింగ్‌లో ఉంచింది. గత నెలలో సుప్రీం కోర్టు డీఏసీఏని ఆపేయడం సరికాదని వ్యాఖ్యానించినప్పటికీ సర్కార్ పెడచెవిన పెట్టింది. మేరీల్యాండ్‌లో అమెరికా జిల్లా కోర్టు డీఏసీఏని తిరిగి పాత పద్ధతిలోకి తీసుకురావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆ దరఖాస్తులన్నీ పెండింగ్‌లో ఉన్నట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్క్ పర్మిట్లలోనూ జాప్యం అమెరికాలో హెచ్4 వీసాలపై ఉన్న జీవిత భాగస్వాములకు పని చేయడానికి వీలుగా జారీ చేసే వర్క్ పర్మిట్లలోనూ∙జాప్యం జరుగుతోంది. ఈ మేరకు భారత్‌కు చెందిన మహిళ రంజిత సుబ్రహ్మణ్యం ఓహియో ఫెడరల్ కోర్టుకెక్కింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న తనకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)కి ఆమోదించినప్పటికీ ఇప్పటివరకు తనకు అది అందలేదని ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అంతకు ముందు ఉన్న ఈఏడీ గడువు జూన్‌లో ముగిసిపోవడం, కొత్తది అం దకపోవడంతో తాను ఉద్యోగాన్ని కోల్పోయానని తెలిపారు. సాధారణంగా వర్క్ పర్మిట్‌కు అనుమతి వచ్చిన రెండు రోజుల్లోనే ఈఏడీ కార్డుని వారికి పం పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 75 వేల కార్డులు ప్రింట్ కాకుండా పెండింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. -
చెదురుతున్న ‘డాలర్ డ్రీమ్స్’!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదిరిపోతున్నాయి. అమెరికా ప్రభుత్వం రక్షణాత్మకంగా వ్యవహరిస్తుండటంతో అక్కడ పనిచేస్తున్న వేలాది మంది భారత ఐటీ నిపుణులు వీసా తిరస్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. తమ వీసా గడువును పొడిగించాల్సిందిగా దాఖలు చేస్తున్న దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తున్నారు. లేదంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్(ఆర్ఎఫ్ఈ)లను సమర్పించాల్సిందిగా పదేపదే అడుగుతున్నారు. ఆర్‌ఎఫ్‌ఈలను పొందిన ఉద్యోగులకు వీసా పొడిగింపు దక్కుతుందన్న గ్యారెంటీ ఏమీలేదు. ‘నా స్నేహితురాలు ఇక్కడే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమెకు ఓ బాబు ఉన్నాడు. హెచ్1బీ వీసా పొడిగింపుతో పాటు గ్రీన్‌కార్డు కోసం ఆమె దరఖాస్తు చేసుకుంది. కానీ ఆ రెండు దరఖాస్తులూ తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఆమె కుమారుడితో కలిసి అమెరికాను వీడాల్సి వచ్చింది’అని జునేజా అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. అమెరికాలో ఉండేందుకే మొగ్గు.. హెచ్1బీ వీసాల పొడిగింపు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నప్పటికీ చాలామంది టెక్కీలు స్వదేశానికి తిరిగివచ్చేందుకు బదులుగా అమెరికాలోనే పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ భారత్‌కు తిరిగివచ్చి అదే సంస్థలో పనిచేయాలన్నా, కొత్త కంపెనీలకు మారాలన్నా ఇబ్బందికరంగా ఉంటుం దని వారు భావిస్తున్నారు. అమెరికాలో దశాబ్ద(2007–17)కాలంలో 34 లక్షల మందికి హెచ్1బీ వీసాలు జారీకాగా, వీటిలో 22 లక్షల వీసాలను భారతీయులే దక్కించుకున్నారు. కఠినంగా ఇమిగ్రేషన్ ‘ఆర్ఎఫ్ఐ (రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్) అప్రూవల్ శాతం చాలా తక్కువగా ఉంది. దీంతో నా లగేజీని ప్యాక్ చేసుకున్నా. దీని కారణంగా నా ప్రాజెక్టుపై తక్కువ సమయం, వీసా పొడిగింపుపై తిరిగేందుకు ఎక్కువ సమయం తిరగాల్సి వస్తోందని క్లయింట్‌కు చెప్పడం చాలా ఇబ్బందికరంగా మారింది. ఆర్ఎఫ్ఐ ప్రక్రియలో భాగంగా 21 చెక్లిస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అలాగే రాబోయే రెండున్నరేళ్ల కాలానికి సంబంధించి మీ పని ప్రణాళికలను ఇవ్వాల్సి ఉంటుంది’అని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పారు. మరోవైపు ఈ పరిస్థితిపై ఇమిగ్రేషన్ కేసులను వాదించే లాక్వెస్ట్ సంస్థ యజమాని పూర్వీ స్పందిస్తూ.. ‘అమెరికన్లుకు ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వీసా విధానాలను మార్చడంతో ప్రస్తుతం ఇక్కడ ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది’ అని అన్నారు. గ్రీన్‌కార్డుకు పదేళ్లు ఆగాల్సిందే.. 2018లో 30 సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి 13,177 మంది హెచ్1బీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోగా, 8,742 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇలా వీసా లు తిరస్కరణకు గురైనవారిలో కాగ్నిజెంట్ సంస్థకు చెందిన 3,548 ఉద్యోగులు, ఇన్ఫోసిస్‌కు చెందిన 2,042 మంది ఉద్యోగులు, టీసీఎస్‌కు చెందిన 1,744 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికాలో మూడేళ్ల కాలానికి జారీచేసే హెచ్1బీ వీసాను మరో మూడేళ్లకు పొడిగించుకోవచ్చని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ చెప్పింది. హెచ్1బీ వీసా గడువు ముగిసే సమయంలో చాలామంది భారతీయులు అమెరికాలో శాశ్వత నివాసానికి గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకుంటారంది. ప్రస్తుతం గ్రీన్‌కార్డును పొందేందుకు భారతీయ ఐటీ నిపుణులకు సగటున పదేళ్లు పడుతోందని చెప్పింది. -
భారత విద్యార్థులతో గౌరవంగా వ్యవహరించండి
వాషింగ్టన్: అమెరికాలోని ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం వ్యవహారంలో అరెస్టయిన 129 మంది భారతీయ విద్యార్థులకు న్యాయ సహాయం అందించాలని రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు అధికారుల్ని కోరారు. వీరిపట్ల గౌరవంగా, మానవీయతతో వ్యవహరించాలని సూచించారు. ఈ మేరకు భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, థామస్ సౌజ్జి, రాబ్ వూడల్, బ్రెండా లారెన్స్ తదితరులు హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)తో పాటు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ)కు లేఖ రాశారు. అమెరికాలో అక్రమ మార్గాల్లో స్థిరపడేందుకు విదేశీయులకు సాయంచేస్తున్న వారిని పట్టుకోవడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు 2017లో ఫార్మింగ్టన్ అనే నకిలీ వర్సిటీని గ్రేటర్ డెట్రాయిట్ ప్రాంతంలో స్థాపించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు 129 మంది భారతీయ విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు స్పందిస్తూ.. అరెస్టయిన భారతీయులకు చట్ట ప్రకారం అన్ని హక్కులు కల్పించాలనీ.. తమ న్యాయవాదిని కలుసుకునేందుకు అనుమతించాలని లేఖలో కోరారు. -
మోసపోయాం : అమెరికాలో తెలుగు విద్యార్థుల గగ్గోలు
సాక్షి, టెక్సాస్ : ఆ యూనివర్సిటీ వెబ్ సైట్ చూస్తే ఎంతో నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నట్టు కనిపిస్తుంది. అందులోనూ స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) కరికులమ్ తో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యను అందిస్తామని సైట్ లో పేర్కొన్నారు. పైగా అందులోని ఫోటోలను గమనిస్తే పెద్ద పెద్ద భవనాలతో క్యాంపస్, అత్యాధునిక లైబ్రరీ, విద్యార్థులతో ఫ్యాకల్టీ మధ్య చర్చలు సాగిస్తున్నట్టు... ఎన్నో దృశ్యాలు... అదే ఫార్మింగ్టన్ యూనివర్సిటీ. అలాంటివి చూసే మోసపోయామని మొత్తుకుంటున్నారు. అడ్మిషన్ పొందిన మన తెలుగు విద్యార్థులు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఐసీఈ) కు చెందిన అండర్ కవర్ ఏజెంట్లు సృష్టించిన ఈ ఫేక్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుని వారి ట్రాప్ లో చిక్కుకున్న విద్యార్థులు ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఒక్కొక్కరిది ఒక్కో గాధ. తక్షణ కర్తవ్యమేంటో అంతుపట్టక కొట్టుమిట్టాడుతున్నారు. యూనివర్సిటీ గురించి తెలియక ఎంతో డబ్బు ఖర్చుపెట్టి యూనివర్సిటీ ఫీజులు చెల్లించి చేరిన పలువురు విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా మారినట్టు సమాచారం. ఆటా, నాటా తదితర సంస్థలు వెబినార్ కార్యక్రమం నిర్వహిస్తూ విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేస్తోంది. అక్కడి అటార్నీలతో మాట్లాడిస్తూ వారి సందేహాలను నివృతి చేయించే కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి ఆ సంఘాలు. ఆటా తాజాగా రెండో రోజు నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది ఐసీఈ ట్రాప్ లో చిక్కుకున్న పలువురు విద్యార్థులతో పాటు అనేక మంది ఇతర విద్యార్థులు కూడా పాల్గొని అనేక సందేహాలను వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఐసీఈ డిటెన్షన్ నుంచి బయటకు వచ్చిన వారు సైతం అనేక సందేహాలను వ్యక్తం చేశారు. అటార్నీలు వారందరికీ సలహాలు సూచనలు ఇచ్చారు. యూనివర్సిటీ బోగస్ అని, అక్కడ క్లాసులు జరగవని, కేవలం సీపీటీ కోసం చేరిన విద్యార్థులు మాత్రం దేశం విడిచి వెళ్లకతప్పదని తెలుస్తోంది. ఈ ఫేక్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులందరికీ ప్రస్తుతం ఐసీఈ నోటీసులను అందజేస్తోంది. ఐసీఈ డిటెన్షన్ నుంచి కొందరు ఒక రోజులోనే బయటకురాగా అమెరికాలో కొనసాగిన షెట్ డౌన్ కారణంగా కొన్ని సాంకేతిక సమస్యలతో మరికొద్ది రోజుల పాటు డిటెన్షన్ లో కొనసాగకతప్పదని అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుత సమస్యల నుంచి బయటపడటం ఎలా? ఉన్న మార్గాలేంటి? ప్రత్యామ్నాయాలేమైనా ఉన్నాయా? ఉంటే ఎలా ముందుకు వెళ్లాలి? వంటి అనేక సందేహాలను విద్యార్థులు అటార్నీలను అడిగి తెలుసుకున్నారని సంఘాల ప్రతినిధులు చెప్పారు. తక్షణం దేశం విడిచి వెళతానని చెప్పేవారు విధిగా బాండ్ తో పాటు కాన్సులేట్ లో సంప్రదించాలి. అలాగే రుజువుగా ఫ్లయిట్ టికెట్ కూడా చూపించాల్సి ఉంటుంది. అమెరికాలో అక్రమంగా గత ఆరు మాసాలుగా ఉన్నట్టు తేలితే అలాంటి వారికి కనీసం 5 సంవత్సరాలపాటు మళ్లీ దేశంలో అడుగుపెట్టకుండా బ్యాన్ విధించే అవకాశాలున్నాయి. అలాగే ఏడాదికిపైగా అక్రమంగా ఉన్నట్టు రుజువైతే కనీసం పదేళ్ల పాటు బ్యాన్ విధించే అవకాశాలున్నాయి. కొందరు విద్యార్థులు మూడవసారి సెవిస్ లో ప్రవేశించిన తర్వాత ఈ వర్సిటీలో అడ్మిషన్ పొందినట్టు తెలుస్తోంది. యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న సమయంలో తరగతులు జరగవన్న సంగతి తెలియదని, ఆ తర్వాత కాలంలో క్లాసులు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించినా ఎవరి నుంచి సమాధానం రాలేదని ఒక విద్యార్థి తెలుపగా, అలాంటి సందర్భాల్లో యూనివర్సిటీ అధికారులతో కరస్పాండెన్స్ జరిపినట్టు రుజువులు ఉన్నట్టయితే వాటి ఆధారంగా కోర్టులో సవాలు చేయొచ్చని తెలిపారు. ఫోన్ కన్వర్సేషన్స్, ఈ మెయిల్ కరస్పాండెన్స్, లెటర్స్ రాయడం వంటి ఎలాంటి ఆధారాలున్నా ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించి రిలీఫ్ పొందడానికి ఆస్కారం ఉంది. అడ్మిషన్ పొందినప్పుడు క్లాసులు నిర్వహించరన్న విషయం తెలియకపోయినా, ఆ తర్వాత కాలంలో మీ తరఫున జరిగిన ప్రయత్నాలు, వాటికి ఉన్న ఆధారాలే కీలకమని అటార్నీలు వివరించారు. సీపీటీ కోసం కాకుండా కేవలం ఉన్నత విద్యను అభ్యసించడానికే యూనివర్సిటీలో చేరినట్టు రుజువు చేసుకోగలిగినా, లేదా క్లాసులు జరగడం లేదన్న కారణంగా మధ్యలో యూనివర్సిటీని వదలివెళ్లినా అమెరికాలో ఉండటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రస్తుత చర్యను చట్టపరంగా కోర్టులో సవాలు చేసుకోవడానికి ఆస్కారం ఉందని తెలిపారు. 2016 లో యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ (యూఎన్ఎన్జే) పేరుతో ఇలాంటి స్టింగ్ ఆఫరేషన్ నిర్వహించినప్పుడు కూడా అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్థులు అమెరికా వదిలి సొంత రాష్ట్రాలకు వచ్చేశారు. మా యూనివర్సిటీలో చేరమంటూ ఒత్తిడి ఫార్మింగ్టన్ యూనివర్సిటీ వ్యవహారంలో ఇరుక్కుని విద్యార్థులు ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతుండగా, ఆటా నిర్వహించిన వెబినార్ కార్యక్రమంలో పాల్గొన్న ఒక విద్యార్థి ద్వారా మరో యూనివర్సిటీ వ్యవహారం బయటపడింది. క్లాసులు ఉండవు... కాలేజీ ఉండదు... సీపీటీ ఇస్తాం చేరండి అంటూ మిడ్ ఫ్లొరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఒక విద్యార్థి అటార్నీల దృష్టి తెచ్చారు. తొలుత ఆ ఇన్ స్టిట్యూట్ లో చేరడానికి వెళ్లానని అయితే అక్కడి పరిస్థితులు గమనించిన తర్వాత వెనక్కి వచ్చానని చెబుతూ, ఆ రోజు నుంచి కాలేజీలో చేరాలంటూ తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. ఇప్పటికే ఆ కాలేజీలో 50 మంది విద్యార్థులు చేరినట్టు చెబుతున్నారు. కాలేజీ ప్రతినిధులు ఎంత ఒత్తిడి తెచ్చినా తాను చేరలేదని, అయితే, ఇప్పుడు కొందరు తెలుగు విద్యార్థులే ఫోన్లు చేసి కాలేజీలో చేరొచ్చనీ, క్లాసులు లేకుండా హాయిగా సీపీటీ ఇస్తున్నప్పుడు ఎందుకు చేరడం లేదంటూ ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దాంతో అటార్నీలు ఆవిద్యార్థిని హెచ్చరిస్తూ, కాలేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండా సీపీటీ కోసం తొందరపడి యూనివర్సిటీలను మార్చడం మంచిది కాదని సలహా ఇచ్చారు.