అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ప్రకటన
న్యూయార్క్: అమెరికా వలసల నియంత్రణ అధికారిగా యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మాజీ డైరెక్టర్ టామ్ హొమన్‌ను నియమిస్తున్నట్లు అధ్యక్ష పదవికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దేశం నుంచి అక్రమ వలసదారులను వెళ్లగొడతానన్న ఎన్నికల హామీకి అనుగుణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘వలసల నియంత్రణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే టామ్ హొమన్‌ను మన దేశ సరిహద్దులకు ఇన్‌చార్జిగా నియమిస్తున్నానని తెలిపేందుకు సంతోషిస్తున్నా’అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ సైట్‌లో వెల్లడించారు.
దేశ దక్షిణ, ఉత్తర సరిహద్దులతోపాటు సముద్ర, గగనతల బాధ్యతలను కూడా ఆయన తీసుకుంటారన్నారు. దేశంలో అక్రమ వలసదారులను గుర్తించి వారి సొంత దేశాలకు పంపేయడాన్ని ఆయన పర్యవేక్షిస్తారన్నారు. ఈ బాధ్యతలకు టామ్ హొమన్‌నే ట్రంప్ నియమిస్తారంటూ ఇటీవల పలు కథనాలొచ్చాయి.కాగా, తాజా నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం లేదు. అక్రమ వలసదారులను దేశం నుంచి పంపేందుకు సైన్యం సాయం తీసుకోబోమంటూ ఇటీవల టాప్ హొమన్ ఇటీవల ఫాక్స్ న్యూస్ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది సమర్థంగా ఇటువంటి విధులను నిర్వర్తిస్తారని ఆయన అన్నారు. అదేవిధంగా, ఐరాసలో అమెరికా రాయబారిగా కాంగ్రెస్ సభ్యురాలు ఎలిస్ స్టెఫానిక్‌ను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment