![US Deportation Flight For Each Migrant Likely Costs More](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/mig.jpg.webp?itok=GSmVJfDn)
వాషింగ్టన్: అధికారంలోకి వస్తే అమెరికా చరిత్రలోనే లేనంతటి భారీ ఆపరేషన్‌తో వలసదారులను వెనక్కి పంపిస్తామంటూ ఇచ్చిన హామీ అమలుకు ట్రంప్ సర్కారుకు భారీగానే చేతి చమురు వదులుతోంది. ఈ నెల 5న అమెరికా నుంచి అమృత్‌సర్‌కు 104 మంది అక్రమ వలసదారులతో చేరుకున్న అమెరికా వైమానిక దళ భారీ విమానం సీ–17ఏ గ్లోబ్‌మాస్టర్ 3 ప్రయాణ ఖర్చు చూస్తే ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే.
అమెరికా తమ దేశంలోని వలసదారులను సైనిక విమానంలో పంపడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) విభాగం అంచనాల ప్రకారం..వలసదారుల కోసం వాడే చార్టర్ విమానం ప్రతి గంట ప్రయాణానికి 8,577 డాలర్ల ఖర్చవుతుంది. ప్రమాదకరమైన వలసదారుల కోసమైతే ఈ ఖర్చు మరికాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే, బలగాలు, వాహనాలు, ఇతర సరఫరాల రవాణా కోసం గ్లోబ్ మాస్టర్‌ను 1995 నుంచి అమెరికా ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తోంది.
ఈ భారీ విమానం ఖర్చు ఏకంగా గంటకు 28,562 డాలర్ల వరకు ఉంటుందని అమెరికా ఎయిర్ మొబిలిటీ కమాండ్ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ చార్టర్ విమానం ఖర్చుకు ఇది మూడు రెట్లు ఎక్కువ. ఎందుకంటే, ఇతర విమానాల మాదిరిగా కాకుండా ఇంధన కోసం మిలటరీ ఎయిర్ బేస్‌ల వద్దే ల్యాండవుతుంది. సైనిక విమానం అయినందున ప్రయాణం కూడా ఇతర దేశాల గగనతలంలో చేసే ప్రయా ణంతో పొలిస్తే వేరుగా ఉంటుంది. ఫ్లయిట్‌రాడార్ 24 రికార్డు ప్రకారం ఈ విమానం సోమవారం కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరింది.
హవాయికి వెళి పసిఫిక్ మహా సముద్రం మీదుగా ఫిలిప్పీన్స్ పమీపంలోని లుజాన్‌కు చేరుకుంది. అటు నుంచి ఇండోనేసియా, మలేసియాల మీదుగా హిందూ మహాసముద్రంలోని డీగో గార్సియా ఎయిర్ బేస్‌కు చేరుకుంది. అటు నుంచి ఇండియాలో ప్రవేశించింది. మొత్తంగా 43 గంటల ప్రయాణానికి గాను కనీసం 10 లక్షల డాలర్లు అంటే సుమారు రూ.8.78 కోట్ల వరకు ఖర్చయినట్లు లెక్కలేస్తున్నారు. అంటే ఒక్కో వలసదారుడికి 10వేల డాలర్ల వరకు అంటే రూ.8.78 లక్షల సొమ్మును ట్రంప్ ప్రభుత్వం వెచ్చించినట్లవుతోంది. సాధారణ ఎయిర్‌లైన్స్ విమానంలో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి న్యూఢిల్లీ టిక్కెట్ ఖరీదు కనిష్టంగా వెయ్యి డాలర్లు, బిజినెస్ క్లాస్‌ౖకైతే నాలుగు వేల డాలర్లు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment