Traveling
-
భర్తతో కలిసి విదేశాల్లో విహరిస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ (ఫొటోలు)
-
మ్యాగ్నెటిస్ట్.. విపిన్..
సాక్షి, సిటీబ్యూరో: జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అని నానుడి.. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక హాబీ ఉంటుంది. కొందరికి కాయిన్స్ సేకరించడం అలవాటు అయితే మరికొందరికి స్టాంప్స్ సేకరించడం అలవాటు. కానీ అందరికీ భిన్నంగా ఫ్రిడ్జ్ లకు అంటించే బొమ్మల మ్యాగ్నెట్స్ సేకరించడం ఆయనకు అలవాటు. ఆయన వృత్తి కంటి వైద్యం.. ఆయన ప్రవృత్తి ట్రావెలింగ్. అందరి లాగా ఏదో వెళ్లామా.. వచ్చామా అన్నట్టు కాకుండా ఆ ప్రదేశం చరిత్రను అందరికీ తెలియజేసేలా మ్యాగ్నెట్స్ సేకరించడం హాబీగా మలుచుకున్నాడు. అతడి పేరే డాక్టర్ అంథోనీ విపిన్ దాస్.ట్రావెల్లింగ్ ప్రాణం..విపిన్ దాస్ వృత్తి రీత్యా ఎంత బిజీ అయినా కూడా ఖాళీ సమయాల్లో ట్రావెలింగ్ చేయడం ఇష్టం. ట్రావెలింగ్‌తో ఎన్నో అనుభవాలు, సంస్కృతి, సంప్రదాయాల గురించి ఎంతో తెలుసుకున్నానని విపిన్ చెబుతున్నాడు. అయితే ఏదైనా విభిన్నంగా చేయాలనే తలంపుతో కొత్తగా మ్యాగ్నెట్స్ సేకరించడం ప్రారంభించాడు.అలా దాదాపు ఏకంగా 500లకు పైగా మ్యాగ్నెట్స్ సేకరించాడు. అలా ఒక్కో ప్రదేశం చరిత్రను ఒక్కో మ్యాగ్నెట్ రూపంలో ఉండేలా చూసుకున్నాడు. అలా ఎన్నో దేశాలు, ప్రదేశాల చరిత్ర, సంప్రదాయాల గురించి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాడు. ట్రావెలర్స్ కోసం ప్రత్యేకంగా ట్రావెరి్నయా ఫెస్ట్‌ను నవంబర్ 15న హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరుపనున్నారు.తెలంగాణ చరిత్ర తెలుసుకునేలా.. సాధారణంగా ఒక్కో దేశం గురించి మ్యాగ్నెట్స్ సేకరించడం విపిన్ కు అలవాటు. కానీ తెలంగాణపై మక్కువతో తెలంగాణ పర్యాటక ప్రదేశాలపై వినూత్నంగా మ్యాగ్నెట్స్ రూపొందించాడు విపిన్. అంతే కాకుండా తెలంగాణ సంస్కృతిపై మ్యాగ్నెట్స్ తో పాటు.. త్రీడీ బొమ్మలు కూడా రూపొందించారు. దీంతోపాటు అరౌండ్ ది వరల్డ్ పేరుతో తన అనుభవాలతో ఒక పుస్తకాన్ని కూడా రూపొందించాడు. -
మనోళ్లు విదేశాలను చుట్టేస్తున్నారు..!
న్యూఢిల్లీ: సానుకూల స్థూలఆర్థిక పరిస్థితుల దన్నుతో విదేశాల్లో పర్యటించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏటా రెండుసార్లు లేదా అంతకు మించి పర్యటిస్తున్న వారి సంఖ్య 32 శాతం పెరిగింది. ఇక అంతర్జాతీయంగా ప్రయాణాలకు సంబంధించి ఎక్కువగా సెర్చ్‌లు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ టాప్‌లో ఉన్నాయి. 2023 జూన్ నుంచి 2024 మే మధ్య కాలానికి సంబంధించి ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫాం మేక్మైట్రిప్ రూపొందించిన ’హౌ ఇండియా ట్రావెల్స్ ఎబ్రాడ్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం విదేశాలకు వెళ్లే భారతీయులకు యూఏఈ, థాయ్‌లాండ్, అమెరికా టాప్ గమ్యస్థానాలుగా ఉంటున్నాయి. ఇప్పుడిప్పుడే కజకిస్తాన్, అజర్బైజాన్, భూటాన్‌లపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ‘చేతిలో కొంత మిగిలే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం, అంతర్జాతీయ సంస్కృతుల గురించి మరింతగా తెలుస్తుండటం, ప్రయాణాలు సులభతరం కావడం తదితర అంశాల కారణంగా విహారయాత్రలు లేదా వ్యాపార అవసరాల రీత్యా దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణించే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. దేశీయంగా పర్యాటకం ప్రోత్సాహకరంగానే ఉండగా మా తాజా విశ్లేషణ ప్రకారం స్థూలఆర్థిక అంశాల ఊతంతో భారతీయుల్లో అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసే ధోరణులు గణనీయంగా పెరుగుతున్నాయి‘ అని మేక్మైట్రిప్ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ మెగో తెలిపారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ⇒ టాప్ 10 వర్ధమాన గమ్యస్థానాలకు సంబంధించి సెర్చ్ చేయడం 70 శాతం పెరిగింది. అజర్‌బైజాన్‌లోని అల్మటీ, బకూ కోసం సెర్చ్‌లు వరుసగా 527 శాతం, 395 శాతం పెరిగాయి. ⇒ విలాసవంతమైన ప్రయాణాలపై కూడా భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇంటర్నేషనల్ సెగ్మెంట్లో బిజినెస్ తరగతి ఫ్లయిట్స్ కోసం చేసే సెర్చ్‌లు 10 శాతం పెరగడం ఇందుకు నిదర్శనం. ⇒ సెర్చ్‌లలో 131 శాతం వృద్ధితో హాంకాంగ్ టాప్‌లో ఉంది. శ్రీలంక, జపాన్, సౌదీ అరేబియా, మలేíÙయా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ⇒ ఇంటర్నేషనల్ హోటల్ బుకింగ్స్‌లో దాదాపు సగం బుకింగ్స్ టారిఫ్ రోజుకు రూ. 7,000 పైనే ఉంటున్నాయి. హోటళ్ల విషయంలో న్యూయార్క్ అత్యంత ఖరీదైన నగరంగా ఉంది. ఈ విషయంలో బడ్జెట్‌కు అనుకూలంగా ఉండే టాప్ గమ్యస్థానాల జాబితాలో దక్షిణాసియాలోని పోఖారా, పట్టాయా, కౌలాలంపూర్ మొదలైనవి ఉన్నాయి. ⇒ సీజన్లతో పనిలేకుండా విదేశీ ప్రయాణాలకు సంబంధించి సెర్చ్‌ల పరిమాణం అన్ని కాలాల్లోనూ స్థిరంగా ఉంటోంది. డిసెంబర్లో మాత్రం అత్యధికంగా సెర్చ్‌లు నమోదవుతున్నాయి. -
స్కేట్‌బోర్డ్‌పై మనాలి టు కన్యాకుమారి
‘మనాలి నుంచి కన్యాకుమారికి ఎలా వెళతాం?’ అనే ప్రశ్నకు ‘స్కేట్‌బోర్డ్ మీద’ అని ఎవరూ చెప్పరు. ‘మీరు చెప్పకపోతేనేం... నేనైతే స్కేట్‌బోర్డ్ మీదే వెళ్లాను’ అంటున్నాడు రితిక్. ప్రెషనల్ స్కేట్ బోర్డర్ అయిన రితిక్ క్రాడ్జెల్ మనాలి నుంచి కన్యాకుమారికి స్కేట్‌బోర్డ్ మీద వెళ్లాడు. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు నెట్లోకాన్ని అబ్బురపరుస్తున్నాయి. చిన్న బ్యాక్‌ప్యాక్‌తో బయలుదేరిన రితిక్ 100 రోజుల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు. రీల్స్, వీడియోలలో తనకు ఎదురైన అనుభవాలను నెటిజనులతో పంచుకున్నాడు. గూగుల్ మ్యాప్స్ పనిచేయకపోవడం నుంచి దట్టమైన ΄పొగమంచుతో హైవేల జీరో విజిబిలిటీ వరకు రితిక్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకే వెళ్లాడు. రితిక్ సాహసం, ఓపికకు నెటిజనులు ప్రశంసల వర్షం కురిపించారు. -
ముంబై లోకల్ రైల్లో ఆర్థిక మంత్రి నిర్మల
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ముంబై లోకల్ ట్రైన్లో ఘాట్కోపర్ నుంచి కళ్యాణ్ దాకా దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించారు. ప్రయాణికులంతా ఆమెతో సెలీ్ఫలు తీసుకున్నారు. ముంబై సబర్బన్ రైళ్లలో రోజుకు 65 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. నిర్మలతో ప్రయాణికుల సెలీ్ఫలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. లోకల్ రైలు ప్రయాణ కష్టాలను కొందరు మహిళా ప్రయాణికులు ఆమెకు ఏకరవు పెట్టారు. గతేడాది నవంబర్‌లో కేరళలో నిర్మల వందేభారత్ రైలులో ప్రయాణించి అందులోని ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. -
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? టికెట్లు తీశారా? లగేజ్ సర్దారా?
బస్సెక్కి వెళ్లాలా? కారెక్కి వెళ్లాలా? ఏ రోజు వెళ్లాలి.. ఎప్పుడు రావాలి... సెలవు అడగాలా వద్దా? డబ్బులు సమకూరాయా లేదా? సంక్రాంతి వచ్చేసింది. కొందరు మాత్రం చివరి వరకూ ఏ విషయం తేల్చకుండా హడావిడిగా ప్రయాణం పెట్టుకుని ట్రబుల్స్‌లో పడతారు. వద్దు. సంక్రాంతికి ఊరెళ్లేందుకు హాయిగాప్లాన్ చేసుకోండి. సంతోషంగా పండక్కు పదండి. పండగని తెలుసు. వెళ్లాలనీ తెలుసు. కాని ఏదీ తెమల్దు. నెలా రెండు నెలల ముందు భార్యాభర్తలు కూచుని మాట్లాడుకుని కచ్చితంగా ఫలానా డేట్‌కు బయలుదేరి వెళ్దాం అనుకుని ఉంటే ట్రైన్ టికెట్లు ఉంటాయి. తత్కాల్లో చూసుకోవచ్చులే అనుకుంటారు. బస్సులు దొరుకుతాయిలే అనుకుంటారు. అంతగాకుంటే కారుంది కదా పోదాం అనుకుంటారు. అనుకోవడం ఎందుకు? ఖరారు చేసుకోకపోవడం ఎందుకు? చివరి నిమిషంలో హైరానా పడటం ఎందుకు? ఎప్పుడు? ఎక్కడకు? సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండుగ. అయినవారితో కలిసి చేసుకుంటే సంతోషాన్ని పెంచే పండగ. అయితే ఈ అయిన వారు ఎవరు అనేది ఒక్కోసారి స్పష్టత రాదు. భార్యకు పుట్టింటికి వెళ్లాలని ఉండొచ్చు. భర్తకు తన సొంతూరికి వెళ్లాలని ఉండొచ్చు. ఈ పండక్కు ఈ ఊరు... మరో పండక్కి ఆ ఊరు అని టక్కున నిశ్చయించుకుంటే సగం చింత ఉండదు. కాని తేల్చరు. మరికొన్ని కారణాలు ఉంటాయి. భర్త గమనించాల్సినవి భార్య పుట్టింటికి వెళితే ఎవరికో ఏవో కానుకలు ఇచ్చుకోవాలనుకోవచ్చు. తల్లిదండ్రులకు బట్టలు తీసుకెళ్లాలనుకోవచ్చు. మేనకోడలికి పట్టీలు తీసుకెళ్లాలనుకోవచ్చు. వీటికి బడ్జెట్ కేటాయించబడిందా? అవి లేక ఆమె ఏ విషయం తేల్చకుండా ఉందా? భార్య అత్తింటికి వెళితే అక్కడ పనులన్నీ నెత్తిన పడే ప్రమాదం ఉందా? మరో కోడలి ఎదుట ఆర్థిక స్థితిగతుల విషయంలో ఏమైనా చిన్నబుచ్చుకునే ప్రమాదం ఉందా? ఈ సంవత్సరం నేను ఈ నగ చేయించుకున్నాను అనంటే నేను ఏమీ చేయించుకోలేదు వంటి జవాబు చె΄్పాలనుకోవడం లేదా? అందుకే అత్తారింటికి వెళ్లడం గురించి ఆమె ఏ విషయం మాట్లాడటం లేదా? భార్య గమనించాల్సినవి పుట్టింటి నుంచి అల్లుడికి సరైన పిలుపు అందిందా? అక్కడకు వచ్చాక మంచి మర్యాదే దొరుకుతుందనే నమ్మకం ఉందా? తోడల్లుడు, బావమరిది... వీళ్లు ఆదరంగా చూసే వీలుందా? పండక్కు వస్తే భర్త ఏదైనా కానుక ఆశిస్తాడా? మంచి బట్టలైనా పెట్టాలని కోరుకుంటాడా? అలా కోరుకుంటున్నట్టయితే ఆ కోరిక నెరవేర్చే స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారా? తీరా వచ్చాక అలకలు ఏర్పడతాయా? అందుకే అతను అత్తగారిల్లు అనే మాట ఎత్తడం లేదా? టికెట్లు.. పాట్లు ► తాత్కాల్ను ఇలాంటి టైమ్‌లో నమ్ముకోలేము. ►ఆర్టీసి బస్సులు ఎన్ని స్పెషల్స్ వేసినా సీటు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ►ప్రయివేటు ట్రావెల్స్ డబుల్ రేట్ చెప్తాయి. ఇంకా ఎక్కువే చెప్పాచ్చు. ►సొంత కారు ఉన్నా పండగ ముందు రోజు బయలుదేరితే టోల్గేట్ల దగ్గరే సమయం సరిపోతుంది. ►ముందే టికెట్లు బుక్ చేసుకోకపోవడం వల్ల తత్కాల్ చార్జీలు, ప్రయివేట్ బస్సుల చార్జీలు భరించలేక భార్యాభర్తలు టికెట్లు తీసుకుని పిల్లలకు తీసుకోకుండా ఫైన్లు కట్టి లేదా ఒళ్లు కూచోబెట్టుకుని ప్రయాణం చేస్తూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండటం అవసరమా? ►మరో విషయం ఎలాగోలా చేరుకుంటే ఎలాగోలా వెనక్కు రావచ్చు అనుకుంటారు. కాని తిరుగు ప్రయాణానికి అసలు టికెట్లు దొరకవు. దాంతో సెలవు పొడిగించుకుని, సద్ది బంధువుగా మారి ఇబ్బంది పడటం అవసరమా? ఇప్పుడైనాప్లాన్ చేయండి ఆదివారం భోగి, సోమవారం సంక్రాంతి, మంగళవారం కనుమ. శనివారం ప్రయాణం అనుకోకండి. గురువారం ఉదయం నుంచి రైళ్లు, బస్సులు, కారు ప్రయాణంప్లాన్ చేసుకుంటే చాలా సమస్యలు తీరుతాయి. పోనీ శుక్రవారం తెల్లవారు జాము నుంచి బయల్దేరండి. డబ్బు ఈ ఒక్కసారికే దుబారా అనుకుంటే కారు, ప్రయివేటు బస్సులో ప్రయాణం ఎంజాయ్ చేసేలా వెళ్లండి. పండగ మూడ్‌తో వెళ్లండి. వెళ్లే ముందు భార్య తరపు ఇంటికి వెళ్లినా, భర్త తరపు ఇంటికి వెళ్లినా మన ఆర్థిక స్థితి మనది... మన ఆనంద స్థితి మనది... వేరొకరితో పోటీ వద్దు... తల్లిదండ్రులను అత్తామామలను ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా గడిపి వద్దాం అనుకుని బయలుదేరండి. -
ఆర్థిక, దౌత్యంలో నూతనాధ్యాయం
నాగపట్నం/న్యూఢిల్లీ: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత్, శ్రీలంక మధ్య మొదలైన పడవ ప్రయాణ సేవలు ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని సుధృడం చేస్తాయని ప్రధాని మోదీ అభిలíÙంచారు. శనివారం తమిళనాడులోని నాగపట్నం, జాఫా్నలోని కంకెసంథురై మధ్య ఫెర్రీ సేవలు మొదలవడం అనేది ఇరుదేశాల మైత్రీ బంధంలో కీలకమైన మైలురాయి అని మోదీ శ్లాఘించారు. షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ హైస్పీడ్ ఫెర్రీ సేవలు మొదలయ్యాయి. సముద్రమార్గంలో 110 కిలోమీటర్ల దూరాన్ని 3.5 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. ఫెర్రీ సేవలను లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా చెరియాపని అనే పడవ 50 మంది ప్రయాణికులతో శ్రీలంకకు బయల్దేరింది. సాయంత్రం కల్లా భారత్‌కు తిరిగొచి్చంది. ‘ఇరుదేశాల మధ్య కనెక్టివిటీతోపాటు వాణిజ్యం, బంధాల బలోపేతానికి ఫెర్రీ సేవలు ఎంతో కీలకం’ అని ప్రధాని మోదీ తన వీడియో సందేశంలో వ్యాఖ్యానించారు. ‘ ఈ బంధం ఈనాటిదికాదు. ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ దీని ప్రస్తావన ఉంది. సంగం కాలం నాటి పట్టినాప్పలై, మణిమేఖలై సాహిత్యంలోనూ భారత్, శ్రీలంక నౌకల రాకపోకల వివరణ ఉంది. ప్రఖ్యాత కవి సుబ్రమణ్యభారతి రాసిన పాట ‘సింధు నదియన్ మిసై’లోనూ రెండుదేశాల బంధాన్ని వివరించారు. చారిత్రక, సాంస్కృతిక బంధాల్లో ఈ పడవ ప్రయాణాల మధుర జ్ఞాపకాలు సజీవంగా ఉన్నాయి. ఇటీవల భారత్‌లో పర్యటించిన సందర్భంగా విక్రమసింఘే అనుసంధాన సంబంధిత విజన్ డాక్యుమెంట్‌ను భారత్‌తో పంచుకున్నారు. 2015లో శ్రీలంకలో నేను పర్యటించాకే ఢిల్లీ, కొలంబో మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి ’ అని మోదీ గుర్తుచేసుకున్నారు. మనసులనూ దగ్గర చేస్తోంది ‘ఈ అనుసంధానం రెండు పట్టణాలను మాత్రమే కాదు. రెండు దేశాలను, దేశాల ప్రజలను, వారి మనసులనూ దగ్గర చేస్తోంది. ‘పొరుగుదేశాలకు ప్రాధాన్యం’ అనే మోదీ సర్కార్ విధానాన్ని మరింత తీసుకెళ్తున్నాం’ అని ఈ సేవలను లాంఛనంగా పచ్చజెండా ఊపి ప్రారంభించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నౌకలు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య అనుసంధానం, వాణిజ్యం, పర్యాటకం, సాంస్కృతిక అనుబంధాలను మరింత మెరుగుపరిచేందుకు ఈ సేవలు దోహదపడతాయని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే వ్యాఖ్యానించారు. గతంలో చెన్నై, కొలంబోల మధ్య తూత్తుకుడి మీదుగా ఇండో–సియోల్ ఎక్స్‌ప్రెస్ ఆధ్వర్యంలో పడవ ప్రయాణలు కొనసాగేవి. అయితేశ్రీలంకలో పౌర సంక్షోభం తలెత్తాక 1982లో ఆ సేవలు నిలిచిపోయాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఇలా పడవ సేవలు పునఃప్రారంభమయ్యాయి. -
తార్‌మార్ తక్కెడ మార్
‘రోడ్డుపై నడుస్తుంటే రోడ్డు పైనే–ఫుడ్డు తింటుంటే ఫుడ్డు పైనే దృష్టి పెట్టాలి’ అని చెప్పడానికి ఏ తత్వవేత్త అక్కర్లేదు. అదొక సహజ విషయం. అయితే ఈ బిజీబిజీ గజిబిజీ లైఫ్‌లో అన్నీ తార్‌మార్ తక్కెడ మార్ అవుతున్నాయి. బెంగళూరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడిపై ఎన్నో జోక్స్ ఉన్నాయి. వాటి సంగతి ఎలా ఉన్నా ఒక వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ ఫొటో మాత్రం తెగ వైరల్ అయింది. 7.32 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దక్షిణ బెంగళూరులో టూ–వీలర్ ర్యాపిడో(బైక్ ట్యాక్సీ సర్వీస్)పై వెళుతున్న యువతి ఒకరు లాప్‌టాప్‌పై పనిచేస్తుంది. ఈ వైరల్ ఫొటో నేపథ్యంలో అంతర్జాల వాసులు పని ఒత్తిడి, సాధ్యం కాని డెడ్లైన్లు, హసిల్ కల్చర్ గురించి చర్చించారు. ఒక యూజర్ గత నెల వైరల్ అయిన వీడియో పోస్ట్ చేశాడు. సదరు ఈ వీడియోలో సినిమా హాల్లో యువ ఉద్యోగి ఒకరు ఒకవైపు సినిమా చూస్తూనే మధ్యమధ్యలో లాప్‌టాప్‌పై వర్క్ చేస్తూ కనిపిస్తాడు!! -
Aakanksha Monga: ఆమె ఊరి పేరు... ప్రపంచం
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘లింక్డ్ ఇన్’లో క్రియేటర్‌గా పని చేసేది దిల్లీకి చెందిన ఆకాంక్ష మొంగా. తన పాషన్, ప్రాణం ట్రావెలింగ్. అయితే ఉద్యోగ బాధ్యతల వల్ల ‘ఇంటి నుంచి ఆఫీసుకు–ఆఫీసు నుంచి ఇంటికి’ మాత్రమే జీవితం పరిమితమైపోయింది. రొడ్డకొట్టుడు జీవనశైలితో విసిగిపోయిన ఆకాంక్ష తన పాషన్‌కు తిరిగి ప్రాణం పోసింది. ఉద్యోగానికి రాజీనామా చేసి బ్యాగు సర్దుకొని బయలుదేరింది. కంటెంట్ క్రియేటర్‌గా మారింది. సోషల్ మీడియాలో వందల మందితో తనదైన కమ్యూనిటీని సృష్టించుకుంది. పన్నెండు దేశాలు తిరిగిన ఆకాంక్ష ఆరుమంది సభ్యులతో ‘ట్రావెల్ ఏ మోర్’ పేరుతో ఒక గ్రూప్‌ను క్రియేట్ చేసింది. తాజాగా... ట్విట్టర్లో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా నిలిచింది. ‘ఒక విషయంపై పాషన్ ఉండి కూడా దానికి దూరం అవుతూ, మనసులోనే కుమిలిపోయేవారు ఎందరో. అలాంటి వారికి ఆకాంక్ష కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కొత్త దారి చూపించింది’ ‘డెస్క్ టు డెస్టినేషన్స్’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. -
డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్
ముంబై: డీసీబీ బ్యాంక్.. డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్‌ను విడుదల చేసింది. అంతర్జాతీయ పర్యటనలు, వ్యాపార పర్యటనలు, వేకేషన్ల కోసం దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. భారత్‌లో ఉన్నప్పుడు ఇది డెబిట్ కార్డ్‌గా పనిచేస్తుందని తెలిపింది. ఈ కార్డ్ ఉంటే విదేశీ కరెన్సీలను కొనుగోలు చేయాల్సిన అవరం లేకుండా సులభంగా ఎక్కడైనా ప్రయాణించొచ్చని, బీమా కవరేజీ, అదే సమయంలో డీసీబీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని బ్యాలన్స్‌పై ఆకర్షణీయమైన వడ్డీ రేటును ఆఫర్ చేసే మూడు రకాల ప్రయోజనాలతో డీసీబీ ట్రావెల్ స్మార్ట్ కార్డ్ వస్తుందని బ్యాంక్ తెలిపింది. ఇందులో ఫారీన్ కరెన్సీ మార్కప్ చార్జీలు అతి తక్కువగా 2 శాతమేనని పేర్కొంది. వీసా కార్డ్‌ను ఆమోదించే అన్ని అంతర్జాతీయ వేదికల వద్ద ఈ కార్డ్‌ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. -
హ్యాపీ జర్నీ
సంక్రాంతి సెలవులు పూర్తయ్యాయి. స్కూళ్లు తిరిగి మొదలయ్యాయి. వేసవి సెలవుల కోసం ఎదురు చూపులూ మొదలయ్యాయి. పరీక్షలు పూర్తవడమే తరువాయి, ఓ వారమైనా ఎటైనా వెళ్లి వస్తే తప్ప మనసు రీచార్జ్ కాదు. కొత్త ఏడాదికి సిద్ధం కాదు. ఇదిలా ఉంటే కరోనా వచ్చింది, వెళ్లింది, మళ్లీ వచ్చింది, వెళ్లింది. వేవ్‌ల నంబరు పెరుగుతోంది. మరో వేవ్‌కి సిద్ధంగా ఉండమనే సూచనలు షురూ అవుతున్నాయి. ఇలాంటప్పుడు ‘క్షేమంగా వెళ్లి, సంతోషంగా రావాలి’ అంటే ఏం చేయాలి? దేశవిదేశాల్లో విస్తృతంగా పర్యటించిన హైదరాబాద్, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ నీలిమ... కరోనా జాగ్రత్తల గురించి సాక్షితో పంచుకున్న వివరాలివి. వర్క్ ఫ్రమ్ వెకేషన్! ‘‘కరోనా నా ట్రావెల్ లైఫ్‌ను పెద్ద మలుపు తిప్పింది. నేను 2015 నుంచి కరోనా లాక్డౌన్ వరకు 60 దేశాల్లో పర్యటించాను. ఇండియా టూర్ వార్ధక్యం వచ్చిన తర్వాత అనుకునేదాన్ని. లాంగ్ వీకెండ్ వస్తే ఏదో ఒక దేశానికి వెళ్లిపోయేదాన్ని. కరోనాతో విదేశాలకు విమాన సర్వీసులు నిలిపి వేయడంతో మనదేశంలో పర్యటించడం మొదలుపెట్టాను. ఈశాన్య రాష్ట్రాలు, రాజస్థాన్ మినహా ఇండియాని దాదాపుగా చూసేశాను. ఈ సంక్రాంతికి కూడా ఓ వారం అనుకుని వెళ్లిన పాండిచ్చేరి వెకేషన్‌ని నెలకు పొడిగించుకున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్‌ని వర్క్ ఫ్రమ్ వెకేషన్‌గా మార్చుకున్నాను. నేను చూసినంత వరకు జనంలో కరోనా భయం దాదాపుగా పోయిందనే చెప్పాలి. దేశంలో 99 శాతం వ్యాక్సిన్ వేయించుకున్నారు. కో మార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్లు డాక్టర్ సలహా తీసుకుని బూస్టర్ డోస్ కూడా వేయించుకున్న తర్వాత మాత్రమే టూర్లు ప్లాన్ చేసుకోవడం మంచిది. ఈ సమస్యలు లేని వాళ్లయితే ఏ మాత్రం సందేహం లేకుండా పర్యటనలు చేస్తున్నారు. అనేక పర్యాటక ప్రదేశాల్లో మాస్క్ లేకపోతే ప్రవేశం లేదనే బోర్డులున్నాయి, కానీ మాస్క్ నిబంధన మీద పట్టింపుగా కనిపించలేదు. అలాగని నిర్లక్ష్యం చేయకుండా రద్దీ ఉన్న చోట్ల తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే. ప్రకృతి పిలుస్తోంది! కరోనా భయం ఓ పక్క వెంటాడుతూనే ఉంది, కాబట్టి పర్యటనలకు ప్రకృతి ఒడినే ట్రావెల్ డెస్టినేషన్‌గా మార్చుకోవడం మంచిది. జలపాతాలు, సముద్ర తీరాలు, నదీతీరాలు, ట్రెకింగ్, స్కీయింగ్ జోన్లను ఎంచుకోవాలి. ఈ ప్రదేశాల్లో మనుషుల రద్దీ తక్కువగా ఉంటుంది. మాస్కు లేకుండా హాయిగా విహరించగలిగిన ప్రదేశాలివి. హిమాలయాల్లో ట్రెకింగ్‌కి మంచి లొకేషన్లున్నాయి. స్పితి వ్యాలీ, త్రియుండ్ కుండ్, కీర్‌గంగ, రూప్‌కుండ్, బ్రిబ్లింగ్, థషర్ మషర్ ట్రెక్, బ్రమ్‌తాల్, పిన్ పార్వతి, హమ్తా పాస్ ట్రెక్‌లను దాదాపుగా అందరూ చేయవచ్చు. యూత్‌కి హిమాలయాల్లో పన్నెండు రోజులపాటు సాగే సర్పాస్ ట్రెక్ మంచి థ్రిల్‌నిస్తుంది. నేను కశ్మీర్– గుల్మార్గ్, ఉత్తరాఖండ్– ఔలిలలో ఐస్‌స్కీయింగ్, ఆరోవిల్లెలో సర్ఫింగ్ కరోనా విరామాల్లోనే చేశాను. చార్‌థామ్ యాత్రలో నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు, కానీ యాత్ర ముగించుకుని ఫ్లయిట్ ఎక్కిన తర్వాత భయం వేసింది. ఆ టూర్ అంతటిలో తుమ్ములు, దగ్గులు వినిపించింది ఫ్లయిట్లోనే. శాంతియాత్ర లాక్డౌన్ విరమించిన తర్వాత నా ట్రావెల్ లిస్ట్‌లో ఈజిప్టు, టర్కీ దేశాలు చేరాయి. పాండిచ్చేరి బీచ్‌లో సర్ఫింగ్, ఆరోవిల్లెలో మెడిటేషన్ నాకు అత్యంత సంతోషాన్నిచ్చాయి. జీవితంలో శాంతికంటే మరేదీ ముఖ్యంకాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే అరోవిల్లెకి మరో లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నాను. ఆ తర్వాత యూఎస్‌కి వెళ్లి నా వందదేశాల టార్గెట్‌ని పూర్తి చేయాలనేది కోరిక’’ అని చెప్పారు గమనంలోనే గమ్యాన్ని వెతుక్కుంటున్న నీలిమ. వర్క్ చేస్తూ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నారామె. ఇలాంటి పర్యాటక ప్రియుల వల్లనే ‘వర్కేషన్’ అనే పదం పుట్టింది. కేర్‌ఫుల్‌గా వెళ్లిరండి! కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చేతులను తరచు శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ, ఆహారపానీయాల పరిశుభ్రత పాటిస్తూ హాయిగా పర్యటించవచ్చనేది నా అభిప్రాయం. అయితే పర్యాటక ప్రదేశాల్లో షాపింగ్ కోసం మార్కెట్లలో ఎక్కువ సేపు గడపకపోవడమే శ్రేయస్కరం. నేను గమనించిన ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే... కాశీ అనగానే అది అరవై దాటిన తర్వాత వెళ్లే ప్రదేశం అనుకునే దాన్ని, ఇటీవల అది యూత్ ట్రావెల్ డెస్టినేషన్ అయింది. అక్కడ డిఫరెంట్ వైబ్స్ ఉన్నాయి. – పొనుగోటి నీలిమారెడ్డి, ట్రావెలర్ – వాకా మంజులారెడ్డి -
40 రోజులు.. 200 కోట్ల ప్రయాణాలు
షాంఘై: చైనాలో ఒక వైపు భారీగా కరోనా కేసులు నమోదవుతుండగా ‘చున్ యున్’లూనార్ కొత్త సంవత్సరం వచ్చిపడింది. శనివారం నుంచి మొదలైన ‘చున్ యున్’వేడుకల 40 రోజుల సమయంలో చైనీయులు దేశ, విదేశాల నుంచి సొంతూళ్లకు 200 కోట్ల ప్రయాణాలు సాగించనున్నట్లు అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఇది 99.5% ఎక్కువని, 2019 ప్రయాణాల్లో 70.3% అని చైనా రవాణా శాఖ తెలిపింది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద వలస సందర్భంగా పేర్కొంది. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020 నుంచి చైనీయులు కొత్త ఏడాది ఉత్సవాలకు, ప్రయాణాలకు దూరంగా ఉండిపోయారు. ఇటీవల ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో ఈసారి భారీగా ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి అధికారికంగా మొదలయ్యే లూనార్ కొత్త ఏడాది ఉత్సవాలు 40 రోజులపాటు కొనసాగుతాయి. జనమంతా సొంతూళ్లకు చేరుకుని కుటుంబసభ్యులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే దేశం కోవిడ్‌తో సతమతమవుతుండగా, కోట్లాదిగా జనం రాకపోకలు సాగించడం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో కేసులు పెరిగితే, ఆస్పత్రుల్లో సరిపడా ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు లేవని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కోవిడ్ పరీక్షలను నిలిపివేసి చికిత్సలు, వ్యాక్సిన్ల పంపిణీపై దృష్టి పెట్టింది. మార్చి 31వ తేదీ వరకు బాధితులకయ్యే చికిత్స ఖర్చులో 60% తగ్గిస్తామని ప్రభుత్వం తెలిపింది. జనరిక్ కరోనా టీకా పాక్స్‌లోవిడ్‌ను చైనాలో తయారు చేసి, పంపిణీ చేసే విషయమై ఫైజర్ కంపెనీతో చర్చలు జరుపుతోంది. -
‘స్మార్ట్’ గైడ్.. ఒక్క క్లిక్‌తో ఎక్కడెక్కడికో.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ‘స్మార్ట్ ట్రావెలింగ్’ కొత్తపుంతలు తొక్కుతోంది. ప్రయాణికులు స్మార్ట్ ఫోన్‌ను ట్రావెల్ టూల్‌గా ఉపయోగిస్తూ దేశ, విదేశాలను చుట్టేస్తున్నారు. మధ్యవర్తులు, టూర్ ఆపరేటర్లు లేకుండానే ఒక్క క్లిక్‌తో అరచేతిలో సమాచారాన్ని వీక్షిస్తూ ప్రయాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అంతర్జాతీయంగా 18 నుంచి 64 ఏళ్ల వయసు గల ప్రయాణికుల్లో 71% మంది తమ పర్యటనల కోసం స్మార్ట్ ఫోన్లపై ఆధారపడుతున్నారు. భారతదేశంలో అత్యధికంగా 87% మంది ప్రయాణికులు స్మార్ట్ ఫోన్ సాయంతోనే తమ ప్రయాణాలు చేస్తున్నట్లు గూగుల్, ఫోకస్ రైట్ సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. ఫోన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లోని వాయిస్ మోడ్‌లో సూచనలు, టికెట్ బుకింగ్‌లో డిజిటల్ అసిస్టెంట్ సేవలు సులభంగా లభిస్తున్నాయి. పర్యాటకులు ఎంపిక చేసుకున్న ప్రదేశాలకు నావిగేషన్ సాయంతో తేలికగా చేరుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రావెల్ కంపెనీలు కూడా కస్టమర్ జర్నీకి అనుగుణంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సేవలను ప్రవేశపెడుతున్నాయి. పర్యాటక రంగానికి ఊతం... భారతదేశం నుంచి 2024 నాటికి సుమారు 8 కోట్ల మంది విదేశీ పర్యటనలు చేస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆసియా పసిఫిక్ డెస్టినేషన్ ఫోర్కాస్ట్–2022–24 రిపోర్టు ప్రకారం రానున్న రెండేళ్లలో 1.34 కోట్ల మంది విదేశీయులు భారతదేశాన్ని సందర్శిస్తారని అంచనా. దీనివల్ల కోవిడ్ వల్ల దెబ్బతిన్న పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. ప్రచారంలో డిజిటల్ పోటీ... కేరళ, మధ్యప్రదేశ్, గోవా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఆన్లైన్ వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే కేరళ ప్రభుత్వం వర్చువల్ ట్రావెల్ గైడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ ద్వారా టూరిజం లొకేషన్లను సులభంగా తెలుసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో వాటిని విరివిగా ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) కూడా సాంకేతిక వ్యవస్థను మెరుగుపరుస్తోంది. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్)ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా పర్యాటకులు కచ్చితత్వంతో తమ ప్రయాణాలను ఎంపిక చేసుకునేలా సేవలు అందించనుంది. స్థానిక కళలు, చేతివృత్తులను ప్రోత్సహించేలా పర్యాటక రంగానికి అనుసంధానిస్తూ జీఐఎస్ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. -
ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: కొన్నిచోట్ల పచ్చదనం.. మరి కొన్నిచోట్ల దట్టమైన అడవిని తలపించేలా గుబురుగా పెరిగిన చెట్లు.. కొండలు, లోయలు. మైమరిపించే అనంతగిరి ప్రాంతం.. విదేశీ వలస పక్షుల స్వర్గధామం భిగ్వాన్ బ్యాక్‌వాటర్ ప్రాంతం.. పశ్చిమ కనుమలను ముద్దాడుతూ ముందుకు సాగే బీమా నది. దానిపై నిర్మించిన ఉజ్జయినీ డ్యాం.. ఇవన్నీ రెప్ప వాల్చనీయవు.. మరో లోకానికి తీసుకువెళతాయి. చుట్టూ ఉన్న ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ ప్రయాణం చేస్తుంటే ఆ మజానే వేరు. రైలు ప్రయాణికులకు అలాంటి మధురానుభూతిని మిగిల్చేలా ఓ సరికొత్త అవకాశాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. మూడురోజుల క్రితమే ప్రారంభం ఇరువైపులా పెద్ద పెద్ద గాజు కిటికీలు, రూఫ్ భాగంలో కూడా బయటి ప్రాంతాలు కనిపించేలా ప్రత్యేకంగా అద్దాలు..ఇదే విస్టాడోమ్ కోచ్. రైల్వే పర్యాటక ప్రాంతాల్లో ఈ కోచ్‌లను వినియోగిస్తోంది. ఈ కోచ్ లోపల ఉండే ప్రయాణికులు బయటి ప్రాంతాలను ఎలాంటి అడ్డూ లేకుండా వీక్షించవచ్చన్న మాట. తాజాగా అలాంటి ఓ కోచ్‌తో కూడిన రైలు తెలంగాణ ప్రయాణికులకు కూడా అందుబాటులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అరకు మీదుగా సాగే రైలుకు గతంలో ఈ కోచ్‌ను ఏర్పాటు చేయగా, ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి పుణెకు వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు కూడా ఈ కోచ్ అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్–పుణె మధ్య ప్రకృతి రమణీయతను పంచే ప్రాంతాలున్నందున, ఈ మార్గంలో కూడా ఇలాంటి కోచ్‌ను అందుబాటులోకి తెస్తే బాగుంటుందని భావించిన రైల్వే శాఖ మూడు రోజుల క్రితం దీన్ని ప్రారంభించింది. సికింద్రాబాద్–పుణె మధ్య శతాబ్ది ఎక్స్‌ప్రెస్ గతంలోనే ప్రారంభించారు. కోవిడ్ లాక్డౌన్ తర్వాత అది నిలిచిపోయింది. మళ్లీ పరిస్థితులు మెరుగుపడ్డాయని భావిస్తుండటంతో ఆగస్టు 10న పునరుద్ధరించారు. అయితే దీనికి విస్టాడోమ్ కోచ్‌ను జత చేసి ప్రవేశపెట్టడం విశేషం. సెల్ఫీలూ క్లిక్ చేయొచ్చు ఈ శతాబ్ది రైలులో మొత్తం 12 ఏసీ కోచ్‌లుంటాయి. ఇందులో ఒక విస్టాడోమ్ కోచ్, 2 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు, 9 చైర్‌కార్ కోచ్‌లుంటాయి. ఇవన్నీ అధునాతన లింక్ హఫ్మాన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లు. విస్టాడోమ్ కోచ్‌లో ఫుల్ పుష్బ్యాక్తో ఉండే 40 సీట్లుంటాయి. ఇవి 360 డిగ్రీల మేర రొటేట్ చేసుకునేలా ఉంటాయి. కుర్చీలను పూర్తిగా కిటికీ వైపు తిప్పుకుని కూర్చోవచ్చు. వెలుపల చూడదగ్గ దృశ్యం మరో వైపు ఉంటే, వెంటనే కుర్చీలను అటు వైపు పూర్తిగా తిప్పుకోవచ్చు. ఆకాశం వైపు చూడాలంటే పూర్తిగా పుష్బ్యాక్ చేసి చేరగిలా పడుకుని చూడొచ్చు. కోచ్ వెనకభాగం మొత్తం పెద్ద అద్దంతో కిటికీ ఉంటుంది. అందులోంచి కూడా బయటకు చూసేందుకు వీలుగా విస్టాడోమ్‌ను చివరి కోచ్‌గా ఏర్పాటు చేశారు. ఇక విశాలంగా ఉంటే ఈ కోచ్‌లో సీట్లు ఉండే ప్రాంతం పోను కొంత భాగాన్ని లాంజ్‌గా ఏర్పాటు చేశారు. అక్కడ ప్రయాణికులు నిలబడి చుట్టూ చూడొచ్చు.. సెల్ఫీలు తీసుకోవచ్చు. ఆ ప్రాంతంలో కోచ్ లోపలివైపు గోడలకు టీ, స్నాక్స్ పెట్టుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు ఉంది. ఇందులో ఎల్ఈడీ లైటు వెలుగులు, ఆటోమేటిక్‌గా తెరుచుకునే తలుపులుంటాయి. మంగళవారం మినహా ప్రతిరోజూ మంగళవారం మినహా మిగతా అన్ని రోజులు తిరిగే ఈ రైలు 8.25 గంటల వ్యవధిలో గమ్యం చేరుతుంది. ఇందులో టికెట్ చార్జీలు వేర్వేరుగా ఉంటాయి. విస్టాడోమ్ కోచ్‌లో ఒక్కో ప్రయాణికుడు రూ.2,110 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైలు (నంబర్ 12026) సికింద్రాబాద్ స్టేషన్లో మధ్యాహ్నం 2.45కు బయలుదేరి పుణెకు రాత్రి 11.10కి చేరుకుంటుంది. పుణెలో (12025) ఉదయం ఆరు గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.20కి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. బేగంపేట, వికారాబాద్, తాండూరు, వాడి, కలబుర్గి, షోలాపూర్ స్టేషన్లలో ఆగుతుంది. -
ఉమెన్–ఓన్లీ: స్టార్ ట్రావెలర్
‘ప్రయాణం అంటే కొత్త ప్రదేశానికి వెళ్లి సెల్ఫీ దిగడం కాదు. మనలోకి మనం ప్రయాణించడం. కొత్త వెలుగుతో తిరిగి రావడం. కొత్తగా జీవించడం’ అంటున్న సజ్నా అలి ‘ఉమెన్–ఓన్లీ ట్రావెల్ గ్రూప్’తో గెలుపు జెండా ఎగిరేసింది. రెండు ఊళ్లు దాటి బయటికి వెళ్లని మహిళలకు కూడా ప్రయాణాలలో ఉండే మజాను పరిచయం చేసింది. వారిని ప్రయాణ ప్రేమికులుగా మార్చింది.... సజ్నా అలి (తిరువనంతపురం, కేరళ)కి ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్ ఏజెన్సీని మొదలు పెట్టేలా చేసింది. గతంలోకి వెళితే... సజ్నా నాన్న ట్రక్‌డ్రైవర్. తన వృత్తిలో భాగంగా ఎన్నో ఊళ్లు, ప్రదేశాలు తిరిగేవాడు. తాను చూసిన విశేషాలను రాత్రి పడుకునే ముందు పిల్లలకు కథలుగా చెప్పేవాడు. ఇక అప్పటి నుంచి మొదలైన ఆసక్తి తనతోపాటు ప్రయాణిస్తూనే ఉంది. ‘ఈ ప్రపంచం అంతా చుట్టి రావాలి’ అనే ఒక లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకుంది గానీ, ఆర్థికపరిమితుల వల్ల అది సాధ్యం కాక ఒక్క దేశాన్ని కూడా చూడలేకపోయింది. తిరువనంతపురం టెక్నోపార్క్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో తన మనసంతా ప్రయాణాల చుట్టే తిరిగేది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ఉమెన్–వోన్లీ ట్రావెల్ గ్రూప్’కు శ్రీకారం చుట్టింది. ‘ఇదేం చోద్యమమ్మా’ అన్నారు చాలామంది. ‘బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్ ఏజెన్సీ నడపాలనుకోవడం తెలివైన పని కాదు’ అన్నారు. ‘ట్రావెల్ ఏజెన్సీ రంగంలో మహిళలు విజయం సాధించలేరు’ అని నిరాశ పరిచారు. కట్ చేస్తే... సజ్నా ట్రావెల్ ఏజెన్సీ కేరళలో అగ్రస్థానంలో ఉంది. తమ ట్రావెల్ ప్లాన్స్, ప్రత్యేకతలను ప్రచారం చేయడానికి సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా వాడుకుంటుంది సజ్నా. 22 వాట్సాప్ గ్రూప్‌లకు తాను అడ్మినిస్ట్రేటర్. ‘నా యాభై ఏళ్ల జీవితంలో విందువినోదాలు, ఇతర శుభకార్యాలకు పక్కఊళ్లకు వెళ్లడం తప్ప, జిల్లా దాటింది లేదు. సోషల్ మీడియాలో సజ్నా పోస్ట్‌లు ఆసక్తి కలిగించేవి. అలా నాకు ప్రయాణాలపై ఆసక్తి మొదలైంది. తొలిసారిగా సోలో ట్రావెల్ చేసినప్పుడు ఎంత గర్వంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఆ ప్రయాణం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అంటుంది చందన. ఇప్పటివరకు సజ్నా ట్రావెల్ గ్రూప్ తరపున వందలాది మంది మహిళలు దేశంలోని వివిధ ప్రాంతాలకు ట్రావెల్ చేశారు. ఈ సంవత్సరం చివరిలోపు ట్రావెల్ ఏజెన్సీ 400 ట్రిప్ మైలురాయిని చేరుకోనుంది. ‘సంవత్సరం తిరక్కుండానే మీ ట్రావెల్ కంపెనీ మూత పడుతుంది... లాంటి మాటలను పట్టించుకోలేదు. నాపై నాకు ఉన్న నమ్మకమే తిరుగులేని విజయానికి కారణం అయింది. దీనిద్వారా ఎంతోమంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి ఉపకరిస్తుంది’ అంటుంది సజ్నా. ‘మా ప్రథమ ప్రాధాన్యత మహిళా ట్రావెలర్స్ భద్రత. ఈ విషయంలో రాజీపడం’ అని చెబుతున్న సజ్నా రకరకాల సేఫ్టీ యాప్‌లను సమకూర్చుకోవడంతో పాటు ఆత్మ–రక్షణ పరికరాలను కూడా ట్రావెలర్స్‌కు అందిస్తుంది. బడ్జెట్–ట్రిప్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడానికి ముందు ఆ ప్రదేశాలకు స్వయంగా వెళ్లి పరిశీలించి రావడం సజ్నా అలవాటు. దీని ద్వారా ప్రయాణికులకు ఏవిధమైన ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అవుతుంది. ‘మనవంతుగా సమాజానికి ఇవ్వాలి’ అనే ఆదర్శ భావనతో ‘గివ్–బ్యాక్–టు–ది–కమ్యూనిటీ’ట్రిప్‌కు స్వీకారం చుట్టింది. ఇది ప్రయాణమే కాని సేవాప్రయాణం. ఇందులోని సభ్యులు వివిధ ప్రాంతాలకు వెళ్లి అట్టడుగు వర్గాల ప్రజలకు లాంగ్వేజ్ స్కిల్స్ నుంచి లైఫ్‌స్కిల్స్ వరకు ఎన్నో నేర్పిస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. -
మోటార్‌బైక్‌పై దేశాన్ని చుట్టేస్తున్న నెల్లూరు యువకుడు
సాక్షి, నెల్లూరు డెస్క్: రోజుకో కొత్త ప్రదేశం.. కొత్త మనుషులు, కొత్త ఆచార వ్యవహారాలు.. కొత్త రుచులు.. ఇలా జీవితాన్ని ఆస్వాదించడం అందరికీ సాధ్యం కాదు. చాలామంది బిజీ లైఫ్‌లో పడి ప్రపంచాన్ని మర్చిపోతుంటారు. కొందరు మాత్రం ప్రయాణాలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. నెల్లూరు నగరానికి చెందిన వెంకట కార్తీక్ తూపిలి ఏడాదిపాటు దేశాన్నే తన ఇల్లుగా చేసుకునేందుకు మోటార్‌బైక్‌పై ముందుకు కదిలాడు. ఇప్పటికే పలు రాష్ట్రాలు చుట్టేశాడు. చదవండి: గోదావరి వరదలు.. ఏ హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు? నెల్లూరులోని ఉస్మాన్‌సాహెబ్‌పేటలో మల్లికార్జునరావు, సుజాత దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. తండ్రిది అరటికాయల వ్యాపారం. తల్లి గృహిణి. కొడుకు కార్తీక్ 2013 సంవత్సరంలో బీటెక్ చేశాడు. సంవత్సరంపాటు సివిల్స్ కోచింగ్ తీసుకున్నాడు. అయితే ఇది తన గమ్యం కాదని తెలుసుకుని తల్లిదండ్రులకు నచ్చజెప్పి సివిల్స్ ప్రయత్నాలకు స్వస్తి పలికాడు. కొంతకాలంపాటు ఆహా, తదితర చోట్ల వెబ్ సిరీస్‌లకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. కొత్త ప్రపంచంలోకి.. కార్తీక్‌కు మొదటి నుంచి ప్రకృతి, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలకు వెళ్లి మనుషులతో మాట్లాడుతుంటాడు. ఫొటోలు తీసుకుని జ్ఞాపకాలుగా మార్చుకోవడం అలవాటు. తనను తాను కొత్తగా పరిచయం చేసుకునేందుకు ఇండియా మొత్తం చుట్టాలని 2021 చివర్లో నిర్ణయించుకున్నాడు. కొత్త ప్రదేశాలు చూడడం, మనుషులతో మమేకమవడం, మారుమూల పల్లెలకు వెళ్లి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?, వారి సంస్కృతి, సంప్రదాయాలేంటో తెలుసుకునేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌బైక్‌పై యాత్రకు శ్రీకారం చుట్టాడు. 400 రోజులపాటు తన ప్రయాణం సాగేలా ప్రణాళిక వేసుకున్నాడు. మొత్తం 1,50,000 కిలోమీటర్లు తిరిగి లాంగెస్ట్ జర్నీ ఇన్ సింగిల్ కంట్రీ పేరుతో గిన్నీస్‌బుక్ రికార్డు సాధించాలని కార్తీక్‌కు ఉన్న మరో లక్ష్యం. అందుకోసం గిన్నీస్ రికార్డు సంస్థకు దరఖాస్తు చేశాడు. రోజుకు 350కి పైగా కి.మీ. కార్తీక్ తొలుత మన రాష్ట్రంలో ఐదురోజులపాటు వివిధ ప్రాంతాలు తిరిగి ఆ తర్వాత తమిళనాడుకి వెళ్లాడు. అలా పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, గోవా చుట్టి ప్రస్తుతం మహారాష్ట్రలో తిరుగుతున్నాడు. ఈనెల 17వ తేదీ నాటికి 41,200 కిలోమీటర్లు తిరిగాడు. రోజుకు 350 నుంచి 450 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాడు. తన పర్యటనలో భాగంగా అధికంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తాడు. మొదట్లో భయమేసింది కార్తీక్ దేశమంతా బైక్‌పై తిరుగుతానంటే మొదట్లో భయమేసింది. సంవత్సరానికి పైగా దూరంగా ఉండాలి. ఆలోచించుకోమని చెప్పాం. వాడికి పట్టుదల ఎక్కువ. జాగ్రత్తగా వెళ్తానన్నాడు. ప్రోత్సహించాం. రోజూ ఫోన్ చేసి మాట్లాడుతుంటాం. – మల్లికార్జునరావు, సుజాత, కార్తీక్ పేరెంట్స్ కుటుంబసభ్యుల సహకారం మోటార్‌బైక్ యాత్రకు కార్తీక్ కుటుంబసభ్యులు ఎంతగానో సహరిస్తున్నారు. తండ్రి ఆర్థికంగా అండగా నిలిచారు. అమ్మ, చెల్లి, బావ, స్నేహితులు పెళ్లూరు హరీ‹Ù, సూర్యప్రకాష్, సందీప్ (ఇతను 25,000 కి.మీ సైకిల్ యాత్ర చేశాడు.) ప్రోత్సాహం ఎంతో ఉందని కార్తీక్ చెబుతున్నాడు. ఏం చేస్తాడంటే.. ఉదయం లేచాక ఆరోజు ఎంత దూరం వెళ్లాలి?, చూడాల్సిన ప్రదేశాలేంటి?, ఎక్కడ ఆగాలి? తదితర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుంటాడు. దారి మధ్యలో గ్రామాల్లో ఆగుతాడు. స్కూళ్లు, ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడుతాడు. కొత్త ప్రదేశాలు చూస్తాడు. సాయంత్రం చీకటి పడే సమయానికి ప్రయాణాన్ని ముగిస్తాడు. ఎవరైనా గ్రామస్తులు, పట్టణవాసులు ఆశ్రయమిస్తే అక్కడుంటాడు. లేకపోతే స్కూల్స్, గురుద్వారాలు, ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండి పక్కరోజు ఉదయం మరో ఊరికి ప్రయాణమవుతాడు. ఇవి అందుబాటులో లేనప్పుడు ట్రావెలర్స్ కోసం ఉన్న కౌచ్ సర్ఫింగ్ యాప్‌ను ఉపయోగించుకుంటాడు. అటవీ ప్రాంతాలకు సమీపంలో టెంట్ వేసుకున్న సందర్భాలున్నాయి. ప్రయాణం ముగిసిన తర్వాత ఆరోజు చూసిన విశేషాలు, తీసిన ఫొటోలు తదితరాలను ది ట్రావెలర్ కార్తీక్ అనే ఇన్స్టాగ్రాం అకౌంట్లో పోస్ట్ చేస్తాడు. తిరిగిన రూట్, ఎన్ని కి.మీ ప్రయాణించింది తదితర వివరాలను గిన్నీస్‌బుక్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంటాడు. ఘన స్వాగతం చెబుతున్నారు యాత్ర మొదలుపెట్టినప్పుడు ఎన్నో అనుమానాలున్నాయి. వెళ్తున్న కొద్దీ అవన్నీ నివృత్తి అయిపోయాయి. కులం, మతం, భాషతో సంబంధం లేకుండా వెళ్లిన ప్రతిచోట బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రేమని పంచుతున్నారు. తమిళనాడులోని మల్లిపట్టినం హార్బర్లో టెంట్ వేసుకుని ఉన్నప్పుడు ప్రజలు వచ్చి ఊర్లోకి తీసుకెళ్లి ఆశ్రయమిచ్చారు. అక్కడి విశేషాలు చెప్పారు. మహారాష్ట్రలోని అహ్మద్పూర్కి వెళ్లినప్పుడు స్థానికులు ఘన స్వాగతం పలికారు. నన్ను చూసి హైదరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి తాను బైక్‌పై ట్రావెలింగ్ చేస్తానన్నాడు. ప్రకృతి, ట్రావెలింగ్ జీవితాన్ని కొత్తగా చూపిస్తాయి. నా ప్రయాణంలో నేను ఎన్నో చూశాను. మా అమ్మా, నాన్న వల్లే ఈ యాత్ర సాగుతోంది. తల్లిదండ్రులు పిల్లలకు ఫ్రీడం ఇవ్వాలి. అప్పుడే వారు తమకు నచ్చిన రంగాల్లో రాణించగలరు. – కార్తీక్ -
తెలుగు మహిళ తొలి యాత్రా కథనం
తెలుగువారి ఘన చరిత్ర తెలుగువారు ప్రత్యేకంగా చెప్పుకోరు. ఇంటి గడప దాటడం కూడా మహా వింత అయిన రోజుల్లో, సముద్రం దాటడం అంటే కుల భ్రష్టత్వం అని భావించే రోజుల్లో 1873లో తెలుగు మహిళ పోతం జానకమ్మ ఇంగ్లండ్, పారిస్‌లను చుట్టి ఆ విశేషాలను యాత్రాకథనంగా రాశారు. 1876లో ఇంగ్లిష్‌లో వెలువడ్డ ఈ పుస్తకం ఒక విలువైన డాక్యుమెంట్‌గా నిలిచి ఉంది. బహుశా భారతీయ మహిళల్లోనే యాత్రా కథనం రాసిన తొలి మహిళ పోతం జానకమ్మ. ఇన్నాళ్లకు ఈ పుస్తకం తెలుగులో రానుంది. అందులో ఏముంది? జానకమ్మ ఎవరు? ‘సాక్షి’కి ప్రత్యేకం. తెలుగు కథకు ఆద్యుడు గురజాడ అప్పారావు అని చాలాకాలం భావించినా ఆయన కంటే ముందే భండారు అచ్చమాంబ తెలుగులో కథలు రాశారు అని పరిశోధకులు తేల్చారు. కాని ఈ పరిశోధన తెలుగు స్త్రీల కృషిని విశద పరిచింది. చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారవేత్తలుగా ఎదగడానికి సమాజ చట్రాలను దాటి సంఘర్షించిన, కొత్త మార్గాలు తెరిచిన తెలుగు మహిళలు ఎందరో ఉన్నారు. ఆ వరుసలో పోతం జానకమ్మ కూడా ఇప్పుడు పరిచయం అవుతున్నారు. 1838లో మద్రాసు నుంచి ఏనుగుల వీరాస్వామయ్య ప్రకటించిన ‘కాశీ యాత్రా చరిత్ర’ విఖ్యాతం. అయితే ఆయన చేసిన యాత్ర స్వదేశానికి పరిమితం. కాని 1873లో అదే మద్రాసు నుంచి పోతం జానకమ్మ చేసిన ‘జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర’ అంతే విశిష్టమైనది. అయితే కాశీ యాత్రకు లభించినంత ప్రచారం ఈ పుస్తకానికి లభించలేదు. ఎవరీ జానకమ్మ పోతం జానకమ్మ అచ్చ తెలుగు ఆడపడుచు. మద్రాసులో (చెన్నై) ఆమె వ్యాపారవేత్త రాఘవయ్యతో జీవించారు. ఈ రాఘవయ్య తమ్ముడు వెంకటాచల చెట్టి లండన్‌లో పత్తి దళారిగా పని చేస్తే, మరో తమ్ముడు జయరాం అక్కడే చదువుకున్నట్టు తెలుస్తోంది. పోతం జానకమ్మ చదువుకున్న మహిళ. ఇంగ్లిష్ కూడా మాట్లాడటం వచ్చు. ఆమె ప్రధానంగా చిత్రకళా ప్రియురాలు. దేశాలు, ప్రాంతాలు చూడాలనే ఆమె అభిలాషను భర్త గౌరవించాడు. ప్రోత్సహించాడు. భర్తతో కలిసి జానకమ్మ 1871లో ఇంగ్లాండ్‌కు వెళ్లాలనుకుని ప్రయత్నం చేస్తే ఆ సంవత్సరం ఓడలో ‘కుటుంబాలు వెళ్లడం లేదని’ మానుకున్నారు. 1873లో ఆమె ప్రయత్నం సఫలమైంది. ఆ సంవత్సరం ‘ఇండియన్ ఫైనాన్స్ కమిషన్’కు మహజర్లు సమర్పించడానికి మన దేశం నుంచి వ్యాపారవేత్తల బృందం లండన్ వెళ్లింది. బహుశా ఆ బృందంలో జానకమ్మ బృందం చేరి ఉంటుంది. 1873 జూలై 20న మద్రాసు ఓడరేవు నుంచి లండన్ బయలుదేరి వెళ్లిన జానకమ్మ 1874 ఫిబ్రవరిలో తిరిగి వచ్చారు. తన యాత్రానుభవాన్ని తెలుగులో రాసి ‘ఆంధ్ర భాష సంజీవని’ లో ప్రచురించారు. పుస్తకాన్ని ఆమె తెలుగులోనే రాసినా అనువాదమయ్యి మొదట ఇంగ్లిష్‌లోనే 1876లో వెలువడింది. దీనిని జానకమ్మ నాటి మద్రాసు యాక్టింగ్ గవర్నర్ విలియం రోజ్ రాబిన్సన్ భార్య ఎలిజిబత్ రాబిన్సన్కు అంకితం ఇచ్చింది. అంటే బ్రిటిష్ అధికార కుటుంబాలతో ఆమె పరిచయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ముద్రణ అత్యంత ఖరీదు కనుక కాపీ వెల రెండున్నర రూపాయి పెట్టారు (సగటు కుటుంబం నెల ఖర్చు). ఆమె ఉండగా తెలుగులో పుస్తకం రాకపోవడం బాధాకరమే. 150 పేజీల ఈ పుస్తకంలో జానకమ్మ హైందవ ధర్మాల పట్ల తన నిష్ఠను వ్యక్తం చేస్తూనే ఆధునిక దృష్టి, స్త్రీ పురుష సమభావన దృష్టి, భారతీయుల పరిమితులపై విమర్శనా దృష్టి వ్యక్తం చేసింది. యాత్రాకథనంలో చాలా చోట్ల చిన్న పిల్లలా ఆశ్చర్యపోవడం ఉన్నా ఆమె ఆలోచనాపరురాలైన స్త్రీగా ఈ యాత్రనంతటినీ దర్శించడం విశేషం. ఈ పుస్తకాన్ని ఇప్పుడు నెల్లూరుకు చెందిన ప్రముఖ చరిత్ర పరిశోధకులు పురుషోత్తం కాళిదాసు అనువాదం చేశారు. రచయిత పి.మోహన్ ప్రచురణకర్తగా ఉన్నారు. మరో వారం రోజుల్లో వెలువడనుంది. పుస్తకంలో ఏముంది? కొన్ని పేరాగ్రాఫ్‌లు అక్కడక్కడ నుంచి ఎంచినవి ► 1873– జూలై 20వ తేదీ వేకువజాము. కెప్టెన్ ముర్రే సారథ్యంలో సౌతాంప్టన్ వెళ్లే ఓడ కలకత్తా నుంచి మద్రాస్ వచ్చేసిందని తెలుపుతూ మూడు తుపాకులు పేలడంతో మేం ప్రయాణానికి హడావుడిగా సిద్ధమయ్యాం. బంధుమిత్రుల ఆశీస్సులు తీసుకున్నాం. సహ ప్రయాణికులతో కలిసి రేవు నుంచి ఓడలోకి చేరవేసే మసూలా బోట్లు ఎక్కాం. మా సుదీర్ఘమైన ప్రయాణంలో ఏయే కష్టాలు ఎదురవుతాయోనని దిగాలు పడుతూ విషాద వదనాలతో ఉన్నాం. ముప్పై రోజులో ఇంకా ఎక్కువరోజులో ఎటు చూసినా సముద్ర జలాలు తప్ప మరేం కనిపించవు. ► నేను ఇంగ్లండ్ పర్యటన తల పెట్టగానే ఆ ప్రయత్నం మానిపించడానికి, నన్ను భయపెట్టడానికి మావాళ్లు ఎన్ని తెలివితక్కువ అపోహలు కల్పించారని. వాళ్లకు నచ్చజెప్పడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తానికి యూరప్ చూడాలనే కోరికను నెరవేర్చుకొన్నాను. అక్కడకు వెళ్లాక విక్టోరియా రాణి ఏలుబడిలో లేని దేశాలను కూడా చూసి రావాలనే కోరిక కలిగింది. మాతో వచ్చిన బృందంతో కలిసి ఫ్రాన్స్ రాజధాని పారిస్ చూడటానికి బయల్దేరాం. మా పర్యటన ఏర్పాటు చేసిన థామస్ కుక్ అండ్ సన్స్ కంపెనీ ద్వారా టికెట్లు కొని నవంబర్ నెలలో అందరం న్యూ హేవన్ మీదుగా ఇంగ్లిష్ చానల్లో డియప్ మీదుగా పయనమయ్యాం. ► ఇంగ్లండ్ వెళ్లక పూర్వం బ్రిటిష్ ప్రజల గురించి అనేక అసంబద్ధ ఆలోచనలు నా బుర్రలో ఉండేవి. అక్కడి సామాజిక, రాజకీయ సమూహాల్లో మెలిగాక నా అభిప్రాయాలు మారాయి. పొరపాటేమిటంటే ఆంగ్లేయులు హిందూ దేశాన్ని తమదిగా భావించకపోవడం. ఏదో కొంతకాలమిక్కడ గడపడానికి వచ్చామనుకొంటారు కాబట్టే తరచూ తమ విధులను యాంత్రికంగా నిర్వర్తిస్తారు. ► మన హిందూ దేశస్తులు ఓడలు నిర్మించి సముద్రాల మీద విదేశాలకు వెళ్లి అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలను తెలుసుకొని ఆ దేశాలతో మైత్రి చేసినట్లు గ్రంథస్తమైన ఆధారాలు లేవు. పైపెచ్చు మనవాళ్లు సముద్ర యానాన్ని, విదేశాలకు వెళ్లి రావడాన్ని నిషేధించారు కూడా. ఇటువంటి నిషేధాల వల్ల మన పూర్వీకులకు ఏం మేలు జరిగిందో ఏమో కానీ మనకిప్పుడు అపారమైన కీడు మాత్రమే కలుగుతోంది. ► సందర్భం, అవసరం వస్తే ఆంగ్లేయ మహిళలు శాస్త్రీయ విషయాల గురించి మాట్లాడతారు. ఎప్పుడో తప్ప వాళ్లు పోచికోలు కబుర్లతో కాలం వెళ్ళబుచ్చరు. ఆ దేశంలో దంపతుల మధ్య ప్రేమ చాలా గొప్పది. మగవాళ్లు స్త్రీలను హీనంగా చూడరు. ఏ విషయంలోనైనా తమతో సమానంగా చూస్తారు. హిందూ దేశ స్త్రీల కంటే ఇక్కడి స్త్రీలు మంచిస్థితిలో ఉన్నారు. మన దేశంలో పురుషులు స్త్రీలను బానిసల్లా చూస్తున్నారు. ► ఎర్ర సముద్రం అంతటా చిన్న చిన్న కొండలు, గుట్టలు తల పైకెత్తుకొని కనిపిస్తాయి. ఓడ ప్రయాణం చెయ్యక ముందు సముద్రంలో కొండలు, గుట్టలు ఉంటాయన్న వాస్తవం నాకు తెలియదు. పర్వతాలకు రెక్కలుండి ఎగిరే కాలంలో అవి ఊళ్ల మీద పడి నాశనం చేసేవి. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు ఖండిస్తున్నపపుడు మైనాక పర్వతం సముద్రుణ్ణి శరణుగోరి సాగరగర్భంలో దాగిందన్న రామాయణ గాథ ఈ సందర్భంలో నా మనసులో మెదిలింది. ► మేం లండన్‌లో ఉన్నప్పుడు లార్డ్ బైరన్ రాసిన నాటకం మాన్‌ఫ్రెడ్‌ను ప్రదర్శించారు. నాటకం సాగుతున్నప్పుడు తరచూ సందర్భానికి అనువుగా నేపథ్య దృశ్యాలను మార్చేవాళ్లు. ఆ దృశ్యాలు చాలా సహజంగా ఉండేవి. ► ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏ ఒడిదొడుకులూ లేకుండా మమ్మల్ని క్షేమంగా వెనక్కి చేర్చిన దైవానికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాం. ఈ ప్రయాణాన్ని ఎంతో ఇష్టపడ్డాను. పర్యటనలో ఎన్నో నేర్చుకున్నాను. నేను సంపాదించుకున్న జ్ఞానంతో, ఎరుకతో మరొకసారి అవకాశం లభిస్తే ఆ అద్భుతమైన పశ్చిమ దేశాలకు వెళ్లి అవి కళల్లో, శాస్త్ర విజ్ఞానంలో, పారిశ్రామిక ఉత్పత్తుల్లో సాధించిన విశేష ప్రగతిని అర్థం చేసుకోవడానికి అవసరమైన ఆత్మస్థయిర్యం నాకు చేకూరింది. -
12 ఏళ్లుగా ఆ జంట ప్రయాణం.. బహుశా ఎవరూ చేసుండకపోవచ్చు!
సాక్షి, చెన్నై: జర్మనీకి చెందిన ఓ జంట 12 సంవత్సరాల క్రితం చేపట్టిన పర్యాటక యాత్ర తాజాగా చెన్నైకు చేరింది. లగ్జరీ వసతులతో కూడిన వాహనం ద్వారా ఈ జంట చెన్నై శివారులోని ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం మహాబలిపురానికి చేరుకుంది. జర్మనీకి చెందిన తోల్సన్(30), మిక్కి(36) తొంభై దేశాల్లో పర్యటించేందుకు నిర్ణయించారు. 12 ఏళ్లుగా ఈ జంట ఇజ్రాయిల్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దుబాయ్ తదితర దేశాల్లో పర్యటించింది. గత వారం ఈ వీరు ఓ నౌక ద్వారా ముంబైకు చేరుకున్నారు. ఈ జంట తమ పర్యటనలో లగ్జరీ సౌకర్యంతో కూడిన వాహనం కూడా తెచ్చుకున్నారు. ఇందులో చిన్న పాటి కిచెన్, బెడ్ రూమ్, స్నానపు గది తదితర వసతుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాహనం ప్రస్తుతం మహాబలిపురం సముద్ర తీర ఆలయానికి కూత వేటు దూరంలో ఉంది. ఈ జంటకు స్థానిక పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించారు. అలాగే, అక్కడి గైడ్లు మహాబలిపురం విశిష్టతను వారికి వివరించారు. మరో నాలుగైదు రోజులు చెన్నైలో ఈ జంట పర్యటించనుంది. -
బస్సులో చిల్లర అడిగితే జైలుశిక్ష..
సాక్షి,శివాజీనగర(కర్ణాటక): బస్సుల్లో చిల్లర డబ్బు కోసం కండక్టర్‌ను ప్రయాణికులు అడగడం, కొన్నిసార్లు గొడవ జరగడం అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో కూడా ఈ ఉదంతాలు నవ్విస్తాయి. చిల్లర ఇవ్వాల్సిందేనని ప్రయాణికులు కండక్టర్లపై ఒత్తిడి తెస్తుండడాన్ని అరికట్టడానికి వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ వివాదాస్పద పోస్టర్లను బస్టాండ్లలో అతికించింది. సంస్థ ఏకపక్ష ధోరణిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆ పోస్టర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంతకీ పోస్టర్లో ఏముందంటే.. బస్సుల్లో చిల్లర అడగడం ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడమే అవుతుంది. నేరం రుజువైతే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది అని పోస్టర్లో హెచ్చరిక ఉంది. చిల్లర అడిగితే జైలుకు పంపుతారా, ఇదెక్కడి చోద్యం అని ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. -
నాకు రెండే రెండిష్టం: ఒకటి స్మిమ్మింగ్, మరొకటి టూర్
ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుండాల్సిందేనా?! మనకు మనంగా ఎక్కడికీ వెళ్లలేమా! వెళ్లిరాలేమా! మనకోసం ఒకరు తోడు ఉండటం మంచిదే. స్కూల్‌కి అక్క తోడు. కాలేజ్‌కి అన్న తోడు. పెళ్లయ్యాక భర్త తోడు. ఎప్పుడైనా మనసు ‘సోలో’గా వెళ్లానుకుంటే? తోడు రావడానికి సిద్ధంగా ఉండాల్సింది మనకు మనమేగా!! బళ్ళారి నివాసి రజని లక్కా ట్రావెల్ అనుభవాలు.. ఆమె మాటల్లో... నా ప్రధానమైన ఇష్టాల్లో ఒకటి స్మిమ్మింగ్, మరొకటి టూర్. అయితే సోలో ట్రావెలర్‌ని కాదు. ఎప్పుడూ బంధువులు, స్నేహితులతో కలిసి వెళ్లేదాన్ని. కానీ 2014 ఆగస్టులో కెనడాకి ఒక్కదాన్నే వెళ్లాను. ఒంటరిగా ప్రయాణించడం అదే తొలిసారి, కెనడాకు వెళ్లడమూ మొదటిసారే. అప్పుడు మాంట్రియెల్‌లో ‘ఫినా మాస్టర్స్ స్విమ్మింగ్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ జరిగింది. ఆ పోటీల కోసం కెనడాలో అడుగుపెట్టాను. పోటీలు పది రోజులు, కానీ మరో ఇరవై రోజులు దేశంలో పర్యాటక ప్రదేశాలను చూడడానికే ఉండిపోయాను. వెనక్కి చూసుకుంటూ వెళ్లాను మాంట్రియెల్‌లో యాక్సెసరీ కార్డు తీసుకున్నాను. ఆ కార్డు ఉంటే నగరంలో బస్సులు, మెట్రో రైళ్లు అన్నింటిలోనూ ప్రయాణించవచ్చు. చూడాలనిపించిన పర్యాటక ప్రదేశానికి ఏ రూట్లో వెళ్లాలో మ్యాప్ చూసి తెలుసుకోవడం, ఆ రూట్ రైలు, బస్సు ఎక్కి వెళ్లిపోవడమే. అక్కడ రైల్వే లైన్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. రైళ్లు పైకి కనిపించవు. రైల్వే స్టేషన్ నుంచి బయటపడడం అంటే ఆ స్టేషన్‌తో కలిసి ఉన్న మాల్‌లోకి వెళ్లడమే. మాల్ నుంచి రోడ్డు మీదకు రావాలి. నేను మాంట్రియెల్‌లో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నప్పుడు బస్ పాయింట్ నుంచి వాళ్ల ఇంటి వరకు దాదాపు ఒకటిన్నర కిలోమీటరు నడిచి వెళ్లాను. నడిచినంత సేపూ భయం, నేను ఒంటరిగా ఉండడంతో ఎవరైనా ఫాలో అవుతారేమోననే బెరుకుతో పది అడుగులకోసారి వెనక్కి చూసుకున్నాను. నేను భయపడినట్లు ఎవరూ ఫాలో కాలేదు. అక్కడ సిస్టమ్ చాలా సెక్యూర్డ్‌గా ఉంది. ఇండియాలో కూడా అంత ధైర్యంగా ఒంటరిగా తిరగలేమేమో అనిపించింది. రెండు గంటల ఆలస్యం... అంతే! ఒకరోజు స్విమ్మింగ్ చాంపియన్ షిప్ ఓపెనింగ్ సెరిమనీ పూర్తయిన తర్వాత మెట్రో రైల్లో ఇంటికి రావాలి. ఆ రోజు అక్కడ పబ్లిక్ హాలిడే అనుకుంటాను. ఆ రష్ చూస్తే జనం అంతా రోడ్లమీదనే ఉన్నారా అనిపించింది. ఆ రష్లో రైలు ఎక్కలేక కొంచెం ఖాళీగా ఉన్న రైలు కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాను. తీరా మా ఫ్రెండ్స్ ఇంటికి చేరేసరికి రెండు గంటలు ఆలస్యం అయింది. ఈ లోపు నేనింకా ఇంటికి రాలేదని మా ఫ్రెండ్స్ పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం, పోలీసులు వచ్చి ఆ ఇంట్లో నా గది, బ్యాగ్ తనిఖీ చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత కూడా నేను ఇల్లు చేరినట్లు నిర్ధారణ అయ్యే వరకు ఫోన్లో ఫాలో అప్ చేశారు. ట్రైన్ రష్ కారణంగా ఆలస్యం అవుతోందని ఇంట్లో వాళ్లకు తెలియచేయడానికి నా దగ్గర ఫోన్ లేదు. కెనడా సిమ్ అప్పటికింకా రాకపోవడంతో నా దగ్గర మొబైల్ ఫోన్ లేకపోయింది. ఆ మరుసటి రోజు ఫ్రెండ్స్ వాళ్ల సిమ్ ఒకటి ఇవ్వడంతో ఒక సమస్య తీరింది. నయాగరా వీక్షణం మాంట్రియెల్ నుంచి టొరంటోలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాను. అదొక అనుభవం. మాంట్రియెల్‌లో ఫ్రెండ్స్ ఇచ్చిన మొబైల్ సిమ్ వాళ్లకు ఇచ్చేసి టొరంటోకెళ్లాను. అక్కడ దిగగానే పబ్లిక్ ఫోన్ నుంచి బంధువులకు ఫోన్ చేసి నగరంలో దిగినట్లు చెప్పి, నయాగరా వాటర్ ఫాల్స్ చూసుకుని సాయంత్రానికి ఇంటికి వస్తానని సమాచారం ఇచ్చాను. నయాగరా నుంచి మా బంధువులుండే ఏరియా వరకు బస్‌లో వచ్చేశాను. పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేశాను. వాళ్లు ఫోన్ తీయలేదు. ఏం చేయాలో తోచలేదు. దగ్గరలో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంటే చూస్తూ ఓ గంట సేపు గడిపాను. మళ్లీ ఫోన్ చేసినప్పుడు వాళ్లు ఫోన్ తీశారు. ఇంటికి అడ్రస్, డైరెక్షన్ చెప్పారు. టొరంటో తర్వాత మా అన్న కూతురు ఉండే కాల్గరీలో పదిహేను రోజులున్నాను. కాల్గరీ గ్లేసియర్లు, లేక్‌లకు ప్రసిద్ధి. బాగా ఎంజాయ్ చేశాను. తిరిగి మాంట్రెయల్కు వచ్చి ఇండియాకి వచ్చే విమానం ఎక్కాను. నెలరోజుల కెనడా ట్రిప్ అలా జరిగింది. నేను చెప్పేదొక్కటే భయపడితే సాధించేదేమీ ఉండదు. ధైర్యం ఉంటే వయసు కూడా అడ్డంకి కాదు. సోలో ట్రిప్కెళ్లినప్పుడు నా వయసు 54. టూర్ బస్సులో తొమ్మిది దేశాలు ఒక రోజు టూరిస్టు బస్‌లో క్యూబెక్ సిటీ టూర్కెళ్లాను. మాంట్రియెల్‌లో పికప్ చేసుకుని టూర్ పూర్తయ్యాక మాంట్రియెల్‌లో దించింది. అప్పుడు ఆ బస్సులో ప్రయాణించింది పదిహేను మందిమి మాత్రమే. వాళ్లలో తొమ్మిది దేశాల వాళ్లం కలిసి ప్రయాణించాం. -
పర్యాటకం ఢమాల్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో దేశీ పర్యాటక రంగం కుదేలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెలరోజులపాటు వీసాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ట్రావెల్, టూరిజం, ఏవియేషన్ రంగాలు దాదాపు రూ. 8,500 కోట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కంపెనీలు.. రిక్రూట్మెంట్ నిలిపివేయడం, అంతగా అవసరం ఉండని సిబ్బందిని తొలగించడం వంటి చర్యలు తీసుకోనుండటంతో ఆయా రంగాల్లో భారీగా ఉద్యోగాల కోతలు కూడా ఉండొచ్చని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఏఐటీవో), అసోచాం వంటి పరిశ్రమల సమాఖ్యలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వీసాలపై నెల రోజుల నిషేధాన్ని పది రోజుల తర్వాతైనా పునఃసమీక్షించాలని, కొన్ని నగరాల నుంచైనా భారత్‌కి ప్రయాణాలను అనుమతించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కరోనా వైరస్ బైటపడినప్పటికీ ఇప్పటిదాకా ఎంతో కొంతైనా పర్యాటకం కొనసాగుతుండటం వల్ల సిబ్బందిని, ఖర్చులను కాస్తయినా నిర్వహించుకోగలుగుతున్నామని.. వీసాల రద్దుతో గట్టి దెబ్బే తగలనుందని అసోచాం టూరిజం, హాస్పిటాలిటీ కౌన్సిల్ చైర్మన్ సుభాష్ గోయల్ చెప్పారు. దేశీ ఏవియేషన్ క్రాష్: అత్యవసరంగా వెళ్లాల్సిన పనుల మీద తప్పించి.. సాధారణ ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకుంటున్న నేపథ్యంలో దేశీ విమానయానం ఈ మధ్యకాలంలో 15% వరకు తగ్గిపోయిందని అంచనా. ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి రాకపోకలు గణనీయం గా తగ్గిపోయాయి. టికెట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు కూడా ఆఖరి నిమిషంలో రద్దు చేసుకుంటున్నారని ఎయిర్‌లైన్స్ చెబుతున్నాయి. ఆక్యుపెన్సీ రేటు తగ్గిపోతున్న కారణంగా విమాన సేవలు నడిపేందుకయ్యే కనీస ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని, ఫలితంగా ఎయిర్‌లైన్స్ ఆదాయాలు పడిపోతున్నాయని జేఎం ఫైనాన్షియల్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే.. కరోనా వైరస్ మహమ్మారి ధాటికి బ్రిటన్‌కు చెందిన విమానయాన సంస్థ ఫ్లైబీ మాదిరిగానే ఇక్కడి సంస్థలు కూడా కుప్పకూలొచ్చని తెలిపింది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో తగ్గిన ట్రాఫిక్.. బెంగళూరు విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య 50 శాతం తగ్గిపోయింది. కరోనావైరస్ భయాలతో పలు దేశాలు ట్రావెల్పరమైన ఆంక్షలు విధించడం, పలు ఫ్లయిట్లు రద్దు కావడం తదితర అంశాలు దీనికి కారణం. ఇటు దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య కూడా 2–4 శాతం తగ్గిందని, కరోనా కేసులు పెరిగిన పక్షంలో ఇది ఇంకా పెరగవచ్చని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (బీఐఏఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. దేశీ విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్యాసింజర్ల సంఖ్య గతంలో రోజుకు 70,000 స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం 62,000కు తగ్గిపోయినట్లు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. ఇది 40,000కు కూడా పడిపోవచ్చన్నారు. వోల్వో బస్సు టికెట్ రేటుకే.. ఆఖరి నిమిషంలో టికెట్ల రద్దుతో నిర్వహణ ఖర్చులైనా రాబట్టుకునేందుకు ఎయిర్‌లైన్స్ ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు.. చెన్నై నుంచి బెంగళూరుకు వోల్వో బస్సు టికెట్ ధర రూ.1,100 ఉండగా.. ఇదే ధరకు పలు కంపెనీల విమాన టికెట్ లభిస్తోంది. ఇంకా చాలా రూట్లలో ఇదే తరహాలో విమాన టికెట్ల రేట్లు పడిపోయాయి. ‘బేర్’ గుప్పిట్లోకి.. ఈ ఏడాది జనవరిలో సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ ఏడాది జనవరి 20న నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయి, 12,431 పాయింట్లకు చేరింది. ఈ గరిష్ట స్థాయిల నుంచి చూస్తే గురువారం నాడు నిఫ్టీ 22 శాతం మేర నష్టపోయింది. ఈ దృష్ట్యా చూస్తే, మన స్టాక్ మార్కెట్ బేర్ దశలోకి జారిపోయిందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా షేర్ గానీ, సూచీ గాని ఇటీవలి గరిష్ట స్థాయి నుంచి 20 శాతం పతనమైతే, బేర్ దశ ప్రారంభమైనట్లుగా పరిగణిస్తారు. మన మార్కెట్ బేర్ దశలోకి జారిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2015లో, 2010లో కూడా బేర్ దశలోకి జారిపోయింది. ఈ బేర్ దశ చాలా కాలం కొనసాగవచ్చు. సాధారణంగా బేర్ మార్కెట్ రెండేళ్ల పాటు ఉంటుంది. 2015 బేర్ మార్కెట్ నుంచి 2017లో మన స్టాక్ మార్కెట్ కోలుకుంది. ఇక తాజా బేర్ మార్కెట్ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 వైరస్ కల్లోలం సద్దుమణగగానే మార్కెట్ మళ్లీ పుంజుకోగలదని వారంటున్నారు. -
ట్రావెల్ గాళ్.. సోలో జర్నీ
సిటీలోని ఇక్ఫై బిజినెస్ స్కూల్లో బీబీఏ గ్రాడ్యుయేషన్ చేస్తూ... శంకర్‌పల్లిలో నివసించే నిహారికా మోహన్ తండ్రి వ్యాపారి. అమ్మ గతంలో టీచర్‌గా పనిచేసి మానేసి ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం వరకూ నిహారిక గురించి ఇంతకు మించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అయితే టూర్ల మీద ఆమెకు ఉన్న అభిరుచి ఆమెకు కొత్త ఇమేజ్ను ఏర్పరుస్తోంది. తెలంగాణలో ట్రావెల్ వీడియోలు రూపొందిస్తున్న తొలి టీనేజర్‌గానే కాకుండా దక్షిణాదిలో సోలో జర్నీ చేస్తూ చానెల్ నిర్వహిస్తున్న మొదటి యువతిగా తనకు వస్తున్న స్పందనతో నిహారిక మరింత జోరుగా జర్నీ చేసేస్తోంది. ఈ క్రేజీగాళ్ పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే... ది 18తో... నాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎదో వెళ్లొచ్చామా అన్నట్టు కాకుండా మంచి జ్ఞాపకంలా ఉండాలనుకుంటాను. అందుకే నేను వెళ్లిన ప్రాంతాన్ని వీడియో తీయడం అలవాటుగా మారింది. ఎక్కడో ఉన్న ప్రదేశాలని వెతుక్కుంటూ వెళ్లడం కాదు, మన దగ్గర ఉన్న వాటిని సందర్శించాలి అనుకున్నాను. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన స్పాట్స్‌కి వెళ్లాను. నాకు సోలోగా వెళ్లడం ఇష్టం. వయసుకు తగ్గట్టుగా ది 18 పేరుతో ఓ చానెల్ ప్రారంభించాను. ఏడాది పాటు వీడియోస్ తయారు చేశాను. నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ వల్ల అన్నింటికన్నా ట్రావెల్ వీడియోస్ ఎడిటింగ్, ఫిల్మింగ్ బాగా అనిపించేవి. అదే సమయంలో యూట్యూబ్‌లో అప్పటికే బాగా అనుభవం ఉన్న సీఏపీడీటీకి చెందిన శరత్ అంకిత్ నన్ను కలిశారు. ఇద్దరం కలిసి ట్రావెల్ వీడియోస్ ప్లాన్ చేశాం. అక్కడ నుంచి మా జర్నీ ప్రారంభమైంది. ప్రయాణాలనేవి మామూలే కానీ... అమ్మాయిలు ఒంటరిగా జర్నీ చేయడం అనేది అడ్వంచరస్ అని కూడా అనిపిస్తుంది కదా. అందుకే సోలో గాళ్ ట్రావెలింగ్‌ని ఎంచుకుని ‘గాళ్ ఆన్ వీల్స్’ స్టార్ట్ చేశాం. అందరికీ బాగా నచ్చింది. దానికే బాగా ప్రశంసలు వచ్చాయి. స్పందన చాలా బాగుంది. నేను దీన్ని కొనసాగించగలనా? తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? వంటి సందేహాలు చాలా వచ్చాయి. ప్రకృతి ఒడిలో.... మొదటి నుంచి కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్నా, అక్కడి సంస్కృతులను అధ్యయనం చేయడమన్నా అమితమైన ఆసక్తి. ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ చారిత్రాత్మకంగా, సంస్కృతి పరంగా విశిష్టత కలిగిన వాటిని తెలుసుకొని వెళతాను. ఇప్పటి వరకు నేను వెళ్లిన ప్రాంతాల్లో తిరుమల మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది. ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగానే కాకుండా అద్భుతమైన ప్రకృతి సంపదకి నిలయం. ఇప్పటికీ సహజమైన ప్రకృతితో కనువిందు చేస్తుంది తిరుమల. అంతేకాకుండా ట్రావెలింగ్‌ని ఆస్వాదించాలంటే కచ్చితంగా కోస్తా తీరం వెళ్లాల్సిందే. నా జర్నీలో భాగంగా కాకినాడ, భద్రాచలం వెళ్లాను. గోదావరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిసరాలు మనస్సుని కట్టిపడేశాయి. పచ్చని ప్రకృతితో ఒడిలో ఒంటరిగా సేదతీరడం ఒక మధుర జ్ఞాపకంలా మిగిలి పోయింది. ఈ విధంగా మరెన్నో ప్రాంతాలకు వెళ్లి నా అభిరుచులను నెరవేర్చుకోవడం ఆనందంగా ఉంది. తదుపరి ఇతర రాష్ట్రాల ప్రయాణంలో భాగంగా కర్ణాటక వెళ్తున్నాను. బ్యాలెన్స్ చేసుకుంటూ... మా కాలేజ్‌లో అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్. 75 శాతం తప్పకుండా ఉండాలి. కాబట్టి చాలా వరకూ వారాంతపు సెలవుల్లో టూర్లు వెళ్లి వస్తున్నా. ఎడిటింగ్ డబ్బింగ్ వంటి పన్లన్నీ కాలేజ్ నుంచి వచ్చేశాక నేరుగా ఆఫీసుకి వెళ్లిపోయి సాయంత్రాలలో చేసుకుంటున్నా. రాత్రి పూట ఇంటికి తిరిగివెళుతున్నా. యూ ట్యూబ్ వాళ్లు విభిన్న ప్రాంతాల్లో నిర్వహించిన 5 ఈవెంట్స్‌కి ఆహా్వనం అందుకున్నా. అలాగే టూర్లు వెళ్లే వారికి వీలైనంత హెల్ప్‌ఫుల్‌గా, అదే సమయంలో ఎంటర్టైనింగ్గా కూడా నా వీడియోస్ ఉండాలి. ఆంధ్రా, తెలంగాణ కలిపి 4 భాగాలు, 6 వీడియోస్ పోస్ట్ చేశాను. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్‌కి నేను ప్రాధాన్యం ఇస్తాను. కాలేజ్ స్టూడెంట్‌గా ఉన్న నాకు ఒక కాలేజ్ ఫెస్ట్‌లో ప్రసంగించమని ఆహ్వానం రావడం నా లైఫ్‌లో క్రేజీ మూమెంట్‌గా చెప్పాలి. నా లాంటి సాధారణ అమ్మాయి కూడా తలచుకుంటే ఏదో ఒకటి సాధించగలదనే విషయం లైఫ్‌లో అని అందరికీ అర్థమవ్వాలి. గతంలో ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండేదాన్ని కాదు. నేనేమీ సాధించలేక పోతున్నాననే ఒక నిస్పృహ నాలో ఉండేది. అయితే ఈ వర్క్ స్టార్ట్ చేశాక అంతా మారిపోయింది. నాకు 20 ఏళ్లంటే ఎవరూ నమ్మరు. నేను బాగా కష్టపడుతున్నానంటున్నారు. అయితే నేనేం చేస్తున్నాను అనేదానిపై నాకు పూర్తి స్పష్టత ఉంది. -
విహారయాత్రకు బయలుదేరుతున్నారా?
విహార యాత్రకు వెళ్లే వారు హోటల్ గదులు, ట్రావెల్ టికెట్లను బుక్ చేసుకోవడం, కెమెరా ఎక్విప్మెంట్ తదితర కావాల్సినవి సిద్ధం చేసుకోవడం.. ఇలా ఎన్నో పనులు ఉంటాయి. పర్యటన సమయంలో ఊహించని అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, ఆర్థికంగా పడే భారం ఎంతో చెప్పలేం. వైద్య పరంగా అత్యవసర చికిత్స, లగేజీ కోల్పోవడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చు. చివరి నిమిషంలో సమీప వ్యక్తులు మరణించడం వల్ల పర్యటనను రద్దు చేసుకోవాల్సి వస్తే ఆర్థికంగానూ నష్టపోతారు. అందుకే పర్యాటకులకు సరైన ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం. ఇది ఎన్నో విధాలుగా రక్షణ కల్పిస్తుంది. మా సంస్థ అంతర్గత డేటాను పరిశీలిస్తే అధిక శాతం క్లెయిమ్‌లు 60 ఏళ్ల వయసు పైబడిన వారి నుంచే వస్తున్నా కానీ.. అదే సమయంలో 40 శాతం పర్యాటక బీమా పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లు 20–40 ఏళ్ల వయసు గ్రూపువే ఉంటున్నాయి. సగటున ఓ క్లెయిమ్ మొత్తం రూ.2,00,000గా ఉంటోంది. ముఖ్యంగా గత మూడేళ్ల కాలంలో వైద్య ఖర్చులకు సంబంధించిన క్లెయిమ్‌లలో పెరుగుదల 25 శాతంగా ఉంది. కవరేజీ.. పర్యాటక బీమా పాలసీ ప్రధానంగా.. పర్యటన సమయంలో ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్ చికిత్సలకు అయ్యే వ్యయాలను చెల్లిస్తుంది. వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కూడా ఇందులో ఉంటుంది. మణించినా లేక శాశ్వత అంగవైకల్యం పాలైనా పరిహారం పొందొచ్చు. ప్రమాదం కారణంగా గాయపడి ఆస్పత్రిపాలవడం వల్ల పడే ఖర్చులను కూడా చెల్లిస్తుంది. దేశీయ పర్యాటకులకు సంబంధించి బీమా కంపెనీలకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులతో టైఅప్ ఉంటుంది. దీంతో పర్యటన సమయంలో ప్రమాదం కారణంగా ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే నగదు రహిత చికిత్సలను పొందొచ్చు. హాస్పిటల్ డైలీ అలవెన్స్, వైద్యం కోసం అత్యవసర తరలింపు, స్వదేశానికి పంపే కవరేజీలను కూడా ప్రధాన పాలసీకి రైడర్లుగా జోడించునే ఆప్షన్ ఉంటుంది. పర్యటనను కుదించుకోవాల్సి రావడం, కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా కోల్పోవడం, విమానం, రైళ్లు ఆలస్యం కావడం, వైద్య పరంగా అత్యవసర చికిత్సలు వంటి సందర్భాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ రక్షణగా నిలుస్తుంది. బ్యాగేజీని నష్టపోయినా పరిహారం చెల్లిస్తుంది. యువత నేడు ట్రెక్కింగ్, స్కీయింగ్, వాటర్ రాఫ్టింగ్, రాపెల్లింగ్, స్కైడైవింగ్, పారాచ్యూట్, స్కూబా డైవింగ్ వంటి సాహస కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తోంది. వీటివల్ల ప్రమాదవశాత్తూ గాయాల పాలైతే ట్రావెల్ బీమా పాలసీల్లో కవరేజీ ఉండేలా చూసుకోవాలి. స్వీటీసాల్వే సీనియర్ మేనేజర్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ -
జపాన్ ప్రజలకు ఆ ‘గుణం’ ఏలా!?
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటా బయట మనం సెల్ఫోన్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. రైళ్లలో, బస్సుల్లో, కార్లలో పోతున్నప్పుడు కూడా వాటిని వాడుతుంటాం. మరికొందరు వాష్ రూముల్లోకి వెళ్లినా సెల్ఫోన్లను వెంట తీసుకెళతారు. ఇందుకు జపాన్ ప్రజలు పూర్తి విరుద్ధం. వారు సెల్ఫోన్లను వెంట తీసుకెళతారుగానీ, రైళ్లలో, బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు సెల్ఫోన్లలో మాట్లాడరు. ఎక్కువగా ఆఫ్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే వారు సెల్ఫోన్లలో మాట్లాడుతుంటే ఇతరులకు, అంటే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే అలా చేస్తారట. అంతేకాకుండా వారు తడిచిన గొడుగులు పట్టుకొని బస్సుల్లోకిగానీ, రైళ్లలోకిగానీ ఎక్కరు. వాటి కోసం స్టేషన్లో ఏర్పాటుచేసిన ‘ఓపెన్ బాస్కెట్’లో పడేసి వెళతారు. తిరుగు ప్రయాణంలో తీసుకుంటారు (వాటిని ఎవరు కూడా ఎత్తుకు పోరాట). దీనికి కారణం ఆ తడసిన గొడుగువల్ల రద్దీగా ఉండే రైళ్లలో తోటి ప్రయాణికుల బట్టలు తడుస్తాయన్న ఉద్దేశమట. ఇలాంటి మనస్తత్వం అబ్బడానికి కారణం ఏమిటన్న అంశంపై పలువురు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. మనిషి బ్రెయిన్లో ఉండే ‘మిర్రర్ న్యూరాన్స్’ స్పందన వల్ల ఇలాంటి ప్రవర్తన అబ్బుతుందని లాస్ ఏంజెలెస్‌లోని ‘డేవిడ్ జెవిన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’కు చెందిన ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ అండ్ సోషల్ బిహేవియర్, బ్రెయిన్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్’ పరిశోధకులు తేల్చి చెప్పారు. వాస్తవానికి మనిషి బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ అంటూ ప్రత్యేకమైనవి ఏమీ ఉండవని, ‘మిర్రరింగ్ బిహేవియర్’ అంటే మన వల్ల ఇతరులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? అన్న కోణంలో మనం ఆలోచించినప్పుడు, తోటి ప్రయాణికులను చూస్తూ ఆ ఇబ్బందులు ఏమిటో మనం గుర్తించినప్పుడు మెదడులోని కొన్ని న్యూరాన్లలో స్పందన కలుగుతుందని,తద్వారా అలా ప్రవర్తించరాదనే ఆలోచన వస్తోందని పరిశోధకులు తెలిపారు. ఇలాంటి ప్రవర్తన ప్రపంచంలోకెల్లా జపాన్ ప్రజల్లోనే ఎక్కువుగా ఉందట. సహజంగానే వారు సమాజంలో కలిసికట్టుగా జీవించాలనే ‘కమ్యూనిటీ ఫీలింగ్’ వారిలో ఉండడం ఒకటైతే, వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించినప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలు, వారి భిన్న సంస్కృతులను తెలుసుకోవడం ద్వారా, వారితో మమేకమవడం ద్వారా వారిలో ఆ గుణం అంటే ‘తోటివారికి ఇబ్బంది కల్గించరాదు’ అనే ఆలోచన పెరుగుతోందట. జపనీయులను చాలా గౌరవంగా చూసుకుంటారనే విషయం తెల్సిందే. ముఖ్యంగా భిన్న జాతులు, భిన్న భాషల వారు నివసించే పరాయి ప్రాంతం, అంటే విదేశాల్లో పర్యటించడం వల్ల అలాంటి గుణం ద్విగుణీకృతం అవుతుందట. జపనీయుల్లో ‘మనం’ అనే మంచి గుణం అమెరికా, బ్రిటన్ దేశాల్లో ప్రజల్లో ‘సెల్ఫ్’ ఎక్కువట. అంటే ‘నేను పైకి రావాలి, నేను ఎదగాలి. ఎవ్వరి మీద ఆధారపడరాదు’ అన్న ఆలోచనే ‘నేను’కు దారితీస్తుందట. జపాన్ ప్రజల్లో మాత్రం ‘మనం’ అనే గుణం ఉందట. ‘మనం అభివృద్ధి చెందాలి. మనం పైకి రావాలి. అందుకు పరస్పరం సహకారం అవసరం’ అని వారు భావిస్తారట. తోటి వారిని ఇబ్బంది పెట్టని ప్రవర్తన లేదా సంస్కృతి మనలో కూడా పెరగాలంటే దేశ, విదేశాలు తిరుగుతూ భిన్న సంస్కృతుల ప్రజలను కలుసుకుంటూ వారితో కలిసి మమేకం కావాల్సిందేనని పరిశోధకులు చెబుతున్నారు. రోజువారి డ్యూటీలకు స్వస్తి చెప్పి సుందర పర్యాటక ప్రాంతాలకు, అందమైన జలపాతాలను ఆస్వాదించేందుకు వెళితే మనసు ఉల్లాసంగా ఉంటుందనే విషయం అనుభవ పూర్వకంగా మనందరికి తెల్సిందే. ప్రవర్తనలో మార్పు రావాలంటే మాత్రం ఇతర పర్యాటకులతో కలిసిపోవడం లేదా అక్కడి స్థానికులతో కలిసి పోవడం అవసరం అట. విమానాల్లో తిరుగుతూ లగ్జరీ హోటళ్లలో గడపడం కంటే రైళ్లలోనో, సొంత వాహనాల్లోనో తిరుగుతూ స్థానిక ప్రజలను కలుసుకునే చోట బస చేయాలట. ముఖ్యంగా మానవ హక్కులను గౌరవించే దేశాల్లో ముందుగా పర్యటించడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. -
ప్రయాణాల్లో ప్రధానం.. ఆరోగ్యం!
కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నత హోదాలు, బరువైన వేతన ప్యాకేజీ అందుకోవాలంటే ఎంతో శ్రమించాలి. కెరీర్లో ఎదగడానికి ఎన్నో సవాళ్లను, ఒత్తిళ్లను అధిగమించి పనిచేయాలి. విధుల్లో భాగంగా తరచుగా దూర ప్రాంతాలకు, ఒక్కోసారి ఇతర దేశాలకు కూడా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ట్రావెలింగ్‌లో బడలిక ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులు త్వరగా అలసిపోతుంటారు. ప్రయాణాలు అధికంగా చేసేవారిలో మానసిక సమస్యలు తలెత్తుతుంటాయి. అనారోగ్యం పాలవుతుంటారు. కార్పొరేట్ ఉద్యోగులు స్ట్రెస్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి. తాజా ఆహారం: ఇతర నగరాలకు వెళ్లేవారు హోటళ్లలో బస చేస్తుంటారు. అక్కడ రకరకాల ఆహార పదార్థాలు కళ్లముందు కనిపిస్తుంటాయి. నోరూరించే వంటకాలు మనసును సులువుగా ఆకర్షిస్తాయి. వాటిని చూస్తూ నోరు కట్టేసుకోవడం కష్టమే. ఇలాంటి సందర్భాల్లోనే సంయమనం పాటించాలి. మీరేం తింటున్నారో ఎప్పటికప్పుడు గమనించండి. మసాలాలు, రంగులతో కూడిన తిండికి దూరంగా ఉండండి. మసాలా ఫుడ్‌తో ఆరోగ్యం పాడవుతుంది. ఒత్తిడి ఎక్కువవుతుంది. కాబట్టి తాజా ఆహారం, పండ్లు ఎక్కువగా తీసుకోండి. అమితంగా మంచినీరు : మంచినీరు తగినంత తీసుకోకపోతే శరీరంలో శక్తి హరించుకుపోతుంది. ఎండలో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తాగునీటి విషయంలో నియంత్రణ పనికిరాదు. వీలైనంత ఎక్కువగా మంచినీరు తాగండి. ఆ నీరు శుద్ధమైనదై ఉండాలి. అదేసమయంలో ఆలోచనా శక్తిని, ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆల్కహాల్‌ను పూర్తిగా తిరస్కరించండి. ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడమే అన్నివిధాలా మంచిది. నిత్యం వ్యాయామం : ఆధునిక యుగంలో ఉద్యోగులు తమ ఫిట్నెస్ను కాపాడుకోవడం నిజంగా ఒక సవాలే. ట్రావెలింగ్‌లో వ్యాయామం మర్చిపోవద్దు. హోటల్ జిమ్‌ను ఉపయోగించుకోవాలి. రకరకాల వ్యాయామాలు చేయాలి. జిమ్ సౌకర్యం అందుబాటులో లేకపోతే రోజూ కనీసం అరగంట సేపు బయట వాకింగ్ చేయాలి. ఫిట్నెస్ ఉన్న ఉద్యోగులే మెరుగైన పనితీరును కనబరుస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. కొత్త టైమ్‌జోన్ : విదేశాలకు వెళ్లి వచ్చే ఉద్యోగులు కొత్త టైమ్‌జోన్‌కు త్వరగా అలవాటుపడడం తప్పనిసరి. మీరు వెళ్లిన ప్రాంతంలోని టైమ్‌జోన్‌కు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు శీఘ్రంగా మార్చుకోవాలి. క్రమశిక్షణతో ప్రయత్నిస్తే ఇది సులువేనని నిపుణులు చెబుతున్నారు. స్థానిక టైమ్‌జోన్‌కు అలవాటుపడలేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కొత్త ప్రాంతంలో కంటినిండా నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి. తగినంత నిద్ర లేకపోతే అలసట, చికాకు అధికమవుతాయి. ఇవి మీ పనితీరును దెబ్బతీస్తాయి.