న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో దేశీ పర్యాటక రంగం కుదేలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెలరోజులపాటు వీసాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ట్రావెల్, టూరిజం, ఏవియేషన్ రంగాలు దాదాపు రూ. 8,500 కోట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కంపెనీలు.. రిక్రూట్‌మెంట్ నిలిపివేయడం, అంతగా అవసరం ఉండని సిబ్బందిని తొలగించడం వంటి చర్యలు తీసుకోనుండటంతో ఆయా రంగాల్లో భారీగా ఉద్యోగాల కోతలు కూడా ఉండొచ్చని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఏఐటీవో), అసోచాం వంటి పరిశ్రమల సమాఖ్యలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో వీసాలపై నెల రోజుల నిషేధాన్ని పది రోజుల తర్వాతైనా పునఃసమీక్షించాలని, కొన్ని నగరాల నుంచైనా భారత్‌కి ప్రయాణాలను అనుమతించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కరోనా వైరస్ బైటపడినప్పటికీ ఇప్పటిదాకా ఎంతో కొంతైనా పర్యాటకం కొనసాగుతుండటం వల్ల సిబ్బందిని, ఖర్చులను కాస్తయినా నిర్వహించుకోగలుగుతున్నామని.. వీసాల రద్దుతో గట్టి దెబ్బే తగలనుందని అసోచాం టూరిజం, హాస్పిటాలిటీ కౌన్సిల్ చైర్మన్ సుభాష్ గోయల్ చెప్పారు.
దేశీ ఏవియేషన్ క్రాష్: అత్యవసరంగా వెళ్లాల్సిన పనుల మీద తప్పించి.. సాధారణ ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకుంటున్న నేపథ్యంలో దేశీ విమానయానం ఈ మధ్యకాలంలో 15% వరకు తగ్గిపోయిందని అంచనా. ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి రాకపోకలు గణనీయం గా తగ్గిపోయాయి. టికెట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు కూడా ఆఖరి నిమిషంలో రద్దు చేసుకుంటున్నారని ఎయిర్‌లైన్స్ చెబుతున్నాయి. ఆక్యుపెన్సీ రేటు తగ్గిపోతున్న కారణంగా విమాన సేవలు నడిపేందుకయ్యే కనీస ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని, ఫలితంగా ఎయిర్‌లైన్స్ ఆదాయాలు పడిపోతున్నాయని జేఎం ఫైనాన్షియల్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే.. కరోనా వైరస్ మహమ్మారి ధాటికి బ్రిటన్‌కు చెందిన విమానయాన సంస్థ ఫ్లైబీ మాదిరిగానే ఇక్కడి సంస్థలు కూడా కుప్పకూలొచ్చని తెలిపింది.
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో తగ్గిన ట్రాఫిక్..
బెంగళూరు విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య 50 శాతం తగ్గిపోయింది. కరోనావైరస్ భయాలతో పలు దేశాలు ట్రావెల్‌పరమైన ఆంక్షలు విధించడం, పలు ఫ్లయిట్లు రద్దు కావడం తదితర అంశాలు దీనికి కారణం. ఇటు దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య కూడా 2–4 శాతం తగ్గిందని, కరోనా కేసులు పెరిగిన పక్షంలో ఇది ఇంకా పెరగవచ్చని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (బీఐఏఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. దేశీ విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్యాసింజర్ల సంఖ్య గతంలో రోజుకు 70,000 స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం 62,000కు తగ్గిపోయినట్లు పౌర విమానయాన మంత్రి హర్‌దీప్ సింగ్ తెలిపారు. ఇది 40,000కు కూడా పడిపోవచ్చన్నారు.
వోల్వో బస్సు టికెట్ రేటుకే..
ఆఖరి నిమిషంలో టికెట్ల రద్దుతో నిర్వహణ ఖర్చులైనా రాబట్టుకునేందుకు ఎయిర్‌లైన్స్ ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు.. చెన్నై నుంచి బెంగళూరుకు వోల్వో బస్సు టికెట్ ధర రూ.1,100 ఉండగా.. ఇదే ధరకు పలు కంపెనీల విమాన టికెట్ లభిస్తోంది. ఇంకా చాలా రూట్లలో ఇదే తరహాలో విమాన టికెట్ల రేట్లు పడిపోయాయి.
‘బేర్’ గుప్పిట్లోకి..
ఈ ఏడాది జనవరిలో సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ ఏడాది జనవరి 20న నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయి, 12,431 పాయింట్లకు చేరింది. ఈ గరిష్ట స్థాయిల నుంచి చూస్తే గురువారం నాడు నిఫ్టీ 22 శాతం మేర నష్టపోయింది. ఈ దృష్ట్యా చూస్తే, మన స్టాక్ మార్కెట్ బేర్ దశలోకి జారిపోయిందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా షేర్ గానీ, సూచీ గాని ఇటీవలి గరిష్ట స్థాయి నుంచి 20 శాతం పతనమైతే, బేర్ దశ ప్రారంభమైనట్లుగా పరిగణిస్తారు. మన మార్కెట్ బేర్ దశలోకి జారిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2015లో, 2010లో కూడా బేర్ దశలోకి జారిపోయింది. ఈ బేర్ దశ చాలా కాలం కొనసాగవచ్చు. సాధారణంగా బేర్ మార్కెట్ రెండేళ్ల పాటు ఉంటుంది. 2015 బేర్ మార్కెట్ నుంచి 2017లో మన స్టాక్ మార్కెట్ కోలుకుంది. ఇక తాజా బేర్ మార్కెట్ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 వైరస్ కల్లోలం సద్దుమణగగానే మార్కెట్ మళ్లీ పుంజుకోగలదని వారంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment