vissas
-
పర్యాటకం ఢమాల్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో దేశీ పర్యాటక రంగం కుదేలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెలరోజులపాటు వీసాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ట్రావెల్, టూరిజం, ఏవియేషన్ రంగాలు దాదాపు రూ. 8,500 కోట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కంపెనీలు.. రిక్రూట్మెంట్ నిలిపివేయడం, అంతగా అవసరం ఉండని సిబ్బందిని తొలగించడం వంటి చర్యలు తీసుకోనుండటంతో ఆయా రంగాల్లో భారీగా ఉద్యోగాల కోతలు కూడా ఉండొచ్చని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఏఐటీవో), అసోచాం వంటి పరిశ్రమల సమాఖ్యలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వీసాలపై నెల రోజుల నిషేధాన్ని పది రోజుల తర్వాతైనా పునఃసమీక్షించాలని, కొన్ని నగరాల నుంచైనా భారత్‌కి ప్రయాణాలను అనుమతించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కరోనా వైరస్ బైటపడినప్పటికీ ఇప్పటిదాకా ఎంతో కొంతైనా పర్యాటకం కొనసాగుతుండటం వల్ల సిబ్బందిని, ఖర్చులను కాస్తయినా నిర్వహించుకోగలుగుతున్నామని.. వీసాల రద్దుతో గట్టి దెబ్బే తగలనుందని అసోచాం టూరిజం, హాస్పిటాలిటీ కౌన్సిల్ చైర్మన్ సుభాష్ గోయల్ చెప్పారు. దేశీ ఏవియేషన్ క్రాష్: అత్యవసరంగా వెళ్లాల్సిన పనుల మీద తప్పించి.. సాధారణ ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకుంటున్న నేపథ్యంలో దేశీ విమానయానం ఈ మధ్యకాలంలో 15% వరకు తగ్గిపోయిందని అంచనా. ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి రాకపోకలు గణనీయం గా తగ్గిపోయాయి. టికెట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు కూడా ఆఖరి నిమిషంలో రద్దు చేసుకుంటున్నారని ఎయిర్‌లైన్స్ చెబుతున్నాయి. ఆక్యుపెన్సీ రేటు తగ్గిపోతున్న కారణంగా విమాన సేవలు నడిపేందుకయ్యే కనీస ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని, ఫలితంగా ఎయిర్‌లైన్స్ ఆదాయాలు పడిపోతున్నాయని జేఎం ఫైనాన్షియల్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే.. కరోనా వైరస్ మహమ్మారి ధాటికి బ్రిటన్‌కు చెందిన విమానయాన సంస్థ ఫ్లైబీ మాదిరిగానే ఇక్కడి సంస్థలు కూడా కుప్పకూలొచ్చని తెలిపింది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో తగ్గిన ట్రాఫిక్.. బెంగళూరు విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య 50 శాతం తగ్గిపోయింది. కరోనావైరస్ భయాలతో పలు దేశాలు ట్రావెల్పరమైన ఆంక్షలు విధించడం, పలు ఫ్లయిట్లు రద్దు కావడం తదితర అంశాలు దీనికి కారణం. ఇటు దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య కూడా 2–4 శాతం తగ్గిందని, కరోనా కేసులు పెరిగిన పక్షంలో ఇది ఇంకా పెరగవచ్చని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (బీఐఏఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. దేశీ విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్యాసింజర్ల సంఖ్య గతంలో రోజుకు 70,000 స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం 62,000కు తగ్గిపోయినట్లు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. ఇది 40,000కు కూడా పడిపోవచ్చన్నారు. వోల్వో బస్సు టికెట్ రేటుకే.. ఆఖరి నిమిషంలో టికెట్ల రద్దుతో నిర్వహణ ఖర్చులైనా రాబట్టుకునేందుకు ఎయిర్‌లైన్స్ ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు.. చెన్నై నుంచి బెంగళూరుకు వోల్వో బస్సు టికెట్ ధర రూ.1,100 ఉండగా.. ఇదే ధరకు పలు కంపెనీల విమాన టికెట్ లభిస్తోంది. ఇంకా చాలా రూట్లలో ఇదే తరహాలో విమాన టికెట్ల రేట్లు పడిపోయాయి. ‘బేర్’ గుప్పిట్లోకి.. ఈ ఏడాది జనవరిలో సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ ఏడాది జనవరి 20న నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయి, 12,431 పాయింట్లకు చేరింది. ఈ గరిష్ట స్థాయిల నుంచి చూస్తే గురువారం నాడు నిఫ్టీ 22 శాతం మేర నష్టపోయింది. ఈ దృష్ట్యా చూస్తే, మన స్టాక్ మార్కెట్ బేర్ దశలోకి జారిపోయిందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా షేర్ గానీ, సూచీ గాని ఇటీవలి గరిష్ట స్థాయి నుంచి 20 శాతం పతనమైతే, బేర్ దశ ప్రారంభమైనట్లుగా పరిగణిస్తారు. మన మార్కెట్ బేర్ దశలోకి జారిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2015లో, 2010లో కూడా బేర్ దశలోకి జారిపోయింది. ఈ బేర్ దశ చాలా కాలం కొనసాగవచ్చు. సాధారణంగా బేర్ మార్కెట్ రెండేళ్ల పాటు ఉంటుంది. 2015 బేర్ మార్కెట్ నుంచి 2017లో మన స్టాక్ మార్కెట్ కోలుకుంది. ఇక తాజా బేర్ మార్కెట్ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 వైరస్ కల్లోలం సద్దుమణగగానే మార్కెట్ మళ్లీ పుంజుకోగలదని వారంటున్నారు. -
ట్రంప్ మార్కు మార్పు..!
దరఖాస్తులో తప్పులు దొర్లినా, జత చేయాల్సిన డాక్యుమెంట్లలో ఏవైనా మర్చిపోయినా లేదా మిస్ అయినా అమెరికా వీసా కోసం పెట్టుకున్న దరఖాస్తు, పిటిషన్ లేదా విజ్ఞప్తిని (హెచ్1బీ సహా) ఆ దేశ అధికారులు ఇప్పుడు తిరస్కరించవచ్చు. వీసా లేదా గ్రీన్‌కార్డు కోసం చేసుకున్న దరఖాస్తులు అసంపూర్తిగా ఉంటే వాటిని సరిచేసుకునేందుకు దరఖాస్తుదారులకు గతంలో ఉన్న అవకాశం ఇప్పుడుండదు. అమెరికాలో చట్టపరంగా శాశ్వత నివాసులుగా (గ్రీన్‌కార్డ్‌పై) ఉండేందుకు, తాత్కాలికంగా అక్కడ నివసిస్తూ ఉద్యోగం (నాన్ ఇమిగ్రెంట్) చేసే వారు లేదా అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారిపైనా తాజా నిబంధన ప్రభావం పడుతుంది. ఇప్పటిదాకా ప్రతీ ఏడాది దాదాపు 70 లక్షల వరకు ఇలాంటి దరఖాస్తులను అక్కడి అధికారులు పరిష్కరిస్తున్నారు. అయితే పర్యటనలు, వ్యాపార అవసరాల నిమిత్తం స్వల్పకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిపై కొత్త నిబంధన వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. గత మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధన విధానపరంగా పెద్దమార్పుగానే ఇమిగ్రేషన్ లాయర్లు, కార్యకర్తలు, ఈ ప్రభావానికి గురయ్యే వారు భావిస్తున్నారు. కొత్త నిబంధన వల్ల వీసా దరఖాస్తు ప్రక్రియకయ్యే ఖర్చు మరింత పెరుగుతుందని, దరఖాస్తు పరిశీలన మామూలు కంటే ఎక్కువ కాలం తీసుకుంటుందనే అభిప్రాయంతో ఉన్నారు. నిబంధనలో తాజా మార్పు వల్ల ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారి దరఖాస్తులు అసంపూర్తిగా ఉన్నట్టుగా తేలితే వారిని స్వదేశాలకు కూడా తిప్పి పంపించే అవకాశాలున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒబామా విధానానికి ట్రంప్ మార్పులు.. 2013లో బరాక్ ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన నిబంధన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ కొత్త మార్పు తీసుకొచ్చింది. వీసా, గ్రీన్‌కార్డు దరఖాస్తుల్లో తప్పులు, జత చేయని పత్రాలున్న అన్ని కేసుల్లో అభ్యర్థి పనిచేసుకునేందుకు వీలుగా రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ (ఆర్ఎఫ్ఈ), నోటీస్ ఆఫ్ ఇంటెంట్ టు డినై (ఎన్ఓఐడీ) జారీ చేసేలా యూఎస్సీఐఎస్ అధికారులకు ఒబామా ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్త నిబంధన ద్వారా ఆ అవకాశం ఉండదు. విచారణలో ఉన్న స్వాప్నికుల (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్డీఏసీఏ) కేసులు మినహా కొత్త పాలసీ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి అందే అన్ని దరఖాస్తులు, పిటిషన్లు, విజ్ఞప్తులు దీని పరిధిలోకి వస్తాయని అమెరికా పౌరసత్వ, వలససేవల విభాగం (యూఎస్సీఐఎస్) ప్రతినిధి మైఖేల్ బార్స్ తెలిపారు. -
‘గల్ఫ్’ మోసాలు
అమాయకులను టార్గెట్ చేస్తున్న ఏజెంట్లు లెసైన్స్ లేకుండా విచ్చల విడిగా వీసాల దందా నిరుద్యోగులకు టోకరా రూ.కోట్లు కాజేస్తున్న వైనం మోర్తాడ్ : గల్ఫ్ ఏజెంట్లు నిరుద్యోగులకు ఉద్యోగ ఆశ చూపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. నట్టేట ముంచుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గల్ఫ్ ఏజెంటు భూమేశ్ రూ.60 లక్షలకుపైగా నిరుద్యోగులకు టోకరా వేశాడు. భూమేశ్ చేసిన మోసాన్ని పరిశీలిస్తే ఇమిగ్రేషన్ చట్టానికి అనుగుణంగా గల్ఫ్ కంపెనీలు రిక్రూట్మెంట్ సాగించడం లేదని స్పష్టం అవుతుంది. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం.. గల్ఫ్, ఇతర దేశాలలోని కంపెనీలకు అవసరమైన కార్మికులను పంపడానికి లెసైన్స్ ఉన్న ఏజెంట్లే ఇంటర్వ్యూలను నిర్వహించి విదేశాలకు పంపించాలి. కానీ.. లెసైన్స్ ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లను నియమించుకుని వీసాల దందాను జోరుగా సాగిస్తున్నాయి. ఇమిగ్రేషన్ చట్టంపై నిరుద్యోగులకు అవగాహన లేకపోవడంతో గల్ఫ్ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోతున్నారు. లెసైన్స్ ఉన్న ఏజెన్సీలు 33 మంది తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ దేశాలకు కార్మికులను ఎగుమతి చేసే ఏజెన్సీలు 33 ఉన్నాయి. హైదరాబాద్‌లో 32 లెసైన్స్డ్ ఏజెన్సీలు.. ఒకటి కరీంనగర్ జిల్లా జగిత్యాల్లో ఉంది. గతంలో లెసైన్స్ ఏజెన్సీలు చాలానే ఉన్నా ఇమిగ్రేషన్ చట్టాలకు లోబడి పని చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లెసైన్స్‌లను రద్దు చేసింది. విదేశాలలోని కంపెనీలకు కార్మికులను పంపించడానికి లెసైన్స్ పొందాలంటే ప్రభుత్వానికి బ్యాంకు గ్యారెంటీ కింద రూ.50 లక్షల స్థిరాస్తి లేదా బ్యాంకు బాండ్లను చూపాలి. కార్మికులకు ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేంట్(పీవోఈ) కార్యాలయం నుంచి అనుమతి పొందాలి. దినపత్రికలో ప్రకటన ఇచ్చిన తరువాత ఏజెన్సీ కార్యాలయంలోనే ఇంటర్వ్యూలను నిర్వహించాలి. సర్వీసు చార్జీగా రూ.20 వేలు లేదా కార్మికుడు కంపెనీలో చేరిన తరువాత 45 రోజుల వేతనంను పొందాలి. విచ్చలవిడిగా దోపిడీ ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల నుంచి లెసైన్స్డ్ ఏజెన్సీలు తక్కువ సర్వీసు చార్జీలు వసూలు చేయాలి. కానీ.. సబ్ ఏజెంట్లను నియమించుకుంటూ వారి ద్వారా గల్ఫ్ వెళ్లే వారి నుంచి విచ్చలవిడిగా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఏజెన్సీలు ఇమిగ్రేషన్ నియమనిబంధనల ప్రకారం రిక్రూట్మెంట్లను నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీలు వీసా ఖర్చుల పేరిట రూ.60 వేల నుంచి రూ.ఒక లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. లెసైన్స్ ఉన్న ఏజెన్సీలు సబ్ ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. పేరుకే లెసైన్స్ ఏజెన్సీలు. అయినా సబ్ ఏజెంట్ల ద్వారా వీసాల దందాను జోరుగా సాగిస్తున్నాయి. సబ్ ఏజెంట్లకు అధికారిక గుర్తింపు ఏది ఉండదు. దీంతో వారు గ్రామీణ ప్రాంతాలలో పర్యటిస్తూ మొదట ఒకరిద్దరు కార్మికులను గల్ఫ్‌కు పంపించి వారిని చూపుతూ.. మిగతా కార్మికులను నట్టేట ముంచుతున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో చాలా చోటు చేసుకున్నాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో పని చేయడానికి మన దేశం నుంచి కార్మికులను పంపించడంపై నిషేధం ఉంది. కానీ, ఏజెంట్లు దుబాయ్ దేశానికి విజిట్ వీసాలు తీసి అక్కడి నుంచి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌కు కార్మికులను పంపిస్తున్నారు. ఇరాక్‌లో యుద్ధం ముగియడంతో ఇటీవలే అక్కడి కంపెనీలకు సంబంధించిన వీసాలు ఇప్పుడిప్పుడే జారీ అవుతున్నాయి. కానీ, ఏజెంట్లు మాత్రం ఇమిగ్రేషన్ చట్టాన్ని తుంగలోకి తొక్కుతూ విచ్చలవిడిగా వీసాల దందా చేస్తున్నాయి. ఇమిగ్రేషన్ చట్టానికి లోబడి సాగని ఇంటర్వ్యూలు ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం లెసైన్స్డ్ ఏజెన్సీలు ఏజెన్సీ ఉన్న చోటనే ఇంటర్వ్యూలు నిర్వహించాలి. జిల్లా కేంద్రాలు, ప్రధాన ప ట్టణాల్లోని స్టార్ హోటళ్లలో ఏజెంట్లు బస చే స్తు గల్ఫ్ వీసాల పేరిట ఇంటర్వ్యూలను సా గిస్తున్నాయి. నిజామాబాద్, ఆర్మూర్ తదిత ర పట్టణాల్లో వారానికి ఒక సారి గల్ఫ్ ఏజెం ట్లు భారీ ఎత్తున ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం నిరుద్యోగి పాస్‌పోర్టు జిరాక్సు కాపీని మాత్ర మే ఏజెంట్లు తీసుకోవాలి. ఒరిజినల్ పాస్‌పోర్టు తీసుకుంటున్నారు. గల్ఫ్‌కు కార్మికున్ని పంపించకున్నా ఒరిజినల్ పాస్‌పోర్టు తమ చేతిలో ఉందనే భావనతో ఏజెంట్లు కార్మికులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీసా ఇవ్వకపోయినా పాస్‌పోర్టును వాపసు చేయడానికి ఏజెంట్లు డబ్బులు గుంజుతున్న సంఘటనలు ఉన్నాయి. గల్ఫ్ ఏజెంట్లపై కఠిన చర్యలు శూన్యం నిరుద్యోగులను నిండాముంచుతున్న ఏజెంట్లపై కఠిన చర్యలను పోలీసులు తీసుకోకపోవడంతో ఏజెంట్ల మోసాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రెండేళ్ల కింద లిబియాలో ఉద్యోగాల పేరుమీద వేల్పూర్‌కు చెందిన నిరుద్యోగులను ముంచిన ఏజెంటుకు అప్పటి పోలీసు అధికారి ఒకరు వత్తాసు పలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్మూర్‌లో ఒక ఏజెంటు ట్రావెల్స్ పేరుమీద వీసాల దందా చేసి రూ.కోటికి ముంచినా ఎలాంటి రికవరీ చేయలేదు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వీసాల పేరిట ముంచిన ఏజెంట్లు కనీసం 100 మంది వరకు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాల్లో ఏజెంట్ల దందా జోరుగా ఉంది. ఏజెంట్లపై చర్యలు తీసుకున్న సందర్భాలు తక్కువగా ఉన్నాయి. ఏజెంట్లకు రాజకీయ నాయకులు అండదండలు ఉండటం వల్ల వారి మోసాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇమిగ్రేషన్ చట్టంను పకడ్బందీగా అమలు చేయాలి ప్రభుత్వం గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టడానికి ఇమిగ్రేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. కాని ప్రభుత్వం ఎక్కడ కూడా ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్న సంఘటనలు లేవు. ఎజెంట్ల స్థిరాస్తులను రికవరీ చేసి నిరుద్యోగులకు అందాల్సిన సొమ్మును పంపిణి చేయాలి. ఏజెంట్లపై నిఘా ఉంచి వారి కదలికలను గమనించాలి. అలా అయితేనే గల్ఫ్ మోసాలను అడ్డుకోవచ్చు. - చాంద్ పాషా, గల్ఫ్ రిటర్నింగ్ మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్