‘గల్ఫ్’ మోసాలు | agents cheats unemployees in the name of gulf | Sakshi
Sakshi News home page

‘గల్ఫ్’ మోసాలు

Published Sun, Jan 31 2016 9:15 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

agents cheats unemployees in the name of gulf

అమాయకులను టార్గెట్ చేస్తున్న ఏజెంట్లు
లెసైన్స్ లేకుండా విచ్చల విడిగా వీసాల దందా
నిరుద్యోగులకు టోకరా
రూ.కోట్లు    కాజేస్తున్న వైనం

 
 మోర్తాడ్ :
 గల్ఫ్ ఏజెంట్లు నిరుద్యోగులకు ఉద్యోగ ఆశ చూపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. నట్టేట ముంచుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గల్ఫ్ ఏజెంటు భూమేశ్ రూ.60 లక్షలకుపైగా నిరుద్యోగులకు టోకరా వేశాడు. భూమేశ్ చేసిన మోసాన్ని పరిశీలిస్తే ఇమిగ్రేషన్ చట్టానికి అనుగుణంగా గల్ఫ్ కంపెనీలు రిక్రూట్‌మెంట్ సాగించడం లేదని స్పష్టం అవుతుంది. ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం.. గల్ఫ్, ఇతర దేశాలలోని కంపెనీలకు అవసరమైన కార్మికులను పంపడానికి లెసైన్స్ ఉన్న ఏజెంట్లే ఇంటర్వ్యూలను నిర్వహించి విదేశాలకు పంపించాలి. కానీ.. లెసైన్స్ ఉన్న ఏజెంట్లు సబ్ ఏజెంట్లను నియమించుకుని వీసాల దందాను జోరుగా సాగిస్తున్నాయి. ఇమిగ్రేషన్ చట్టంపై నిరుద్యోగులకు అవగాహన లేకపోవడంతో గల్ఫ్ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోతున్నారు.

 లెసైన్స్ ఉన్న ఏజెన్సీలు 33 మంది
 తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ దేశాలకు కార్మికులను ఎగుమతి చేసే ఏజెన్సీలు 33 ఉన్నాయి. హైదరాబాద్‌లో 32 లెసైన్స్‌డ్ ఏజెన్సీలు.. ఒకటి కరీంనగర్ జిల్లా జగిత్యాల్‌లో ఉంది. గతంలో లెసైన్స్ ఏజెన్సీలు చాలానే ఉన్నా ఇమిగ్రేషన్ చట్టాలకు లోబడి పని చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం లెసైన్స్‌లను రద్దు చేసింది. విదేశాలలోని కంపెనీలకు కార్మికులను పంపించడానికి లెసైన్స్ పొందాలంటే ప్రభుత్వానికి బ్యాంకు గ్యారెంటీ కింద రూ.50 లక్షల స్థిరాస్తి లేదా బ్యాంకు బాండ్‌లను చూపాలి. కార్మికులకు ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేంట్(పీవోఈ) కార్యాలయం నుంచి అనుమతి పొందాలి. దినపత్రికలో ప్రకటన ఇచ్చిన తరువాత ఏజెన్సీ కార్యాలయంలోనే ఇంటర్వ్యూలను నిర్వహించాలి. సర్వీసు చార్జీగా రూ.20 వేలు లేదా కార్మికుడు కంపెనీలో చేరిన తరువాత 45 రోజుల వేతనంను పొందాలి.

 విచ్చలవిడిగా దోపిడీ
 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల నుంచి లెసైన్స్‌డ్ ఏజెన్సీలు తక్కువ సర్వీసు చార్జీలు వసూలు చేయాలి. కానీ.. సబ్ ఏజెంట్లను నియమించుకుంటూ వారి ద్వారా గల్ఫ్ వెళ్లే వారి నుంచి విచ్చలవిడిగా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఏజెన్సీలు ఇమిగ్రేషన్ నియమనిబంధనల ప్రకారం రిక్రూట్‌మెంట్‌లను నిర్వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీలు వీసా ఖర్చుల పేరిట రూ.60 వేల నుంచి రూ.ఒక లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. లెసైన్స్ ఉన్న ఏజెన్సీలు సబ్ ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. పేరుకే లెసైన్స్ ఏజెన్సీలు. అయినా సబ్ ఏజెంట్ల ద్వారా వీసాల దందాను జోరుగా సాగిస్తున్నాయి.

సబ్ ఏజెంట్‌లకు అధికారిక గుర్తింపు ఏది ఉండదు. దీంతో వారు గ్రామీణ ప్రాంతాలలో పర్యటిస్తూ మొదట ఒకరిద్దరు కార్మికులను గల్ఫ్‌కు పంపించి వారిని చూపుతూ.. మిగతా కార్మికులను నట్టేట ముంచుతున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో చాలా చోటు చేసుకున్నాయి. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో పని చేయడానికి మన దేశం నుంచి కార్మికులను పంపించడంపై నిషేధం ఉంది. కానీ, ఏజెంట్లు దుబాయ్ దేశానికి విజిట్ వీసాలు తీసి అక్కడి నుంచి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌కు కార్మికులను పంపిస్తున్నారు. ఇరాక్‌లో యుద్ధం ముగియడంతో ఇటీవలే అక్కడి కంపెనీలకు సంబంధించిన వీసాలు ఇప్పుడిప్పుడే జారీ అవుతున్నాయి. కానీ, ఏజెంట్లు మాత్రం ఇమిగ్రేషన్ చట్టాన్ని తుంగలోకి తొక్కుతూ విచ్చలవిడిగా వీసాల దందా చేస్తున్నాయి.

 ఇమిగ్రేషన్ చట్టానికి లోబడి సాగని ఇంటర్వ్యూలు
 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం లెసైన్స్‌డ్ ఏజెన్సీలు ఏజెన్సీ ఉన్న చోటనే ఇంటర్వ్యూలు నిర్వహించాలి. జిల్లా కేంద్రాలు, ప్రధాన ప ట్టణాల్లోని స్టార్ హోటళ్లలో ఏజెంట్లు బస చే స్తు గల్ఫ్ వీసాల పేరిట ఇంటర్వ్యూలను సా గిస్తున్నాయి. నిజామాబాద్, ఆర్మూర్ తదిత ర పట్టణాల్లో వారానికి ఒక సారి గల్ఫ్ ఏజెం ట్లు భారీ ఎత్తున ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం నిరుద్యోగి పాస్‌పోర్టు జిరాక్సు కాపీని మాత్ర మే ఏజెంట్లు తీసుకోవాలి. ఒరిజినల్ పాస్‌పోర్టు తీసుకుంటున్నారు. గల్ఫ్‌కు కార్మికున్ని పంపించకున్నా ఒరిజినల్ పాస్‌పోర్టు తమ చేతిలో ఉందనే భావనతో ఏజెంట్లు కార్మికులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీసా ఇవ్వకపోయినా పాస్‌పోర్టును వాపసు చేయడానికి ఏజెంట్లు డబ్బులు గుంజుతున్న సంఘటనలు ఉన్నాయి.

 గల్ఫ్ ఏజెంట్లపై కఠిన చర్యలు శూన్యం
 నిరుద్యోగులను నిండాముంచుతున్న ఏజెంట్లపై కఠిన చర్యలను పోలీసులు తీసుకోకపోవడంతో ఏజెంట్ల మోసాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రెండేళ్ల కింద లిబియాలో ఉద్యోగాల పేరుమీద వేల్పూర్‌కు చెందిన నిరుద్యోగులను ముంచిన ఏజెంటుకు అప్పటి పోలీసు అధికారి ఒకరు వత్తాసు పలికినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆర్మూర్‌లో ఒక ఏజెంటు ట్రావెల్స్ పేరుమీద వీసాల దందా చేసి రూ.కోటికి ముంచినా ఎలాంటి రికవరీ చేయలేదు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వీసాల పేరిట ముంచిన ఏజెంట్లు కనీసం 100 మంది వరకు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాల్లో ఏజెంట్ల దందా జోరుగా ఉంది. ఏజెంట్లపై చర్యలు తీసుకున్న సందర్భాలు తక్కువగా ఉన్నాయి. ఏజెంట్లకు రాజకీయ నాయకులు అండదండలు ఉండటం వల్ల వారి మోసాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది.
 
 ఇమిగ్రేషన్ చట్టంను పకడ్బందీగా అమలు చేయాలి
 ప్రభుత్వం గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టడానికి ఇమిగ్రేషన్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. కాని ప్రభుత్వం ఎక్కడ కూడా ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్న సంఘటనలు లేవు. ఎజెంట్ల స్థిరాస్తులను రికవరీ చేసి నిరుద్యోగులకు అందాల్సిన సొమ్మును పంపిణి చేయాలి. ఏజెంట్లపై నిఘా ఉంచి వారి కదలికలను గమనించాలి. అలా అయితేనే గల్ఫ్ మోసాలను అడ్డుకోవచ్చు.
 - చాంద్ పాషా, గల్ఫ్ రిటర్నింగ్
 మెంబర్స్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement