రెండు రోజుల క్రితం దుబాయ్‌కి చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ తన వెబ్‌సైట్‌లో ఒక యాడ్ ఇచ్చింది. ఢిల్లీ నుంచి మాస్కోకి ఇరవై నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ అది. ఈ టూర్‌లో భాగంగా ఇరవై రోజులపాటు రష్యాలోని అందమైన ప్రాంతాలన్నీ తిప్పి చూపిస్తారు. ప్యాకేజీకి అయ్యే ఖర్చు సుమారు లక్షా మూడువేల రూపాయలు. అలాగని అది ఆర్డినరీ టూరేం కాదు. ఆ టూర్‌లోనే రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ డోసు అందిస్తారు. వ్యాక్సిన్ డోస్ కోసం ఎంతైనా ఖర్చుచేయాలని కొందరు సిద్ధపడుతుంటే.. వాళ్ల అవసరాన్ని క్యాష్ చేసుకోవడానికే ఇలాంటి టూర్‌లను ఆఫర్ చేస్తున్నాయి ట్రావెల్ ఏజెన్సీలు.
న్యూఢిల్లీ: దేశం మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతోంది. వ్యాక్సిన్ డోసులు ఎక్కడ దొరుకుతాయో ఆరాతీసి మరీ ఎగబడుతున్నారు జనాలు. ఇంకోవైపు వ్యాక్సిన్ కొరత పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి టైంలో వ్యాక్సిన్ కోసం వేరే దేశాలకు వెళ్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనతోనే వ్యాక్సిన్ టూరిజం మొదలైంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాకపోకలపై నిషేధం ఉండడంతో దుబాయ్ ఏజెన్సీ తన యాడ్ తొలగించింది. అయితే ఆంక్షల సడలింపు తర్వాత ఇలాంటి టూర్‌లు కొనసాగుతాయని ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ మెంబర్ సుభాష్ ఘోయల్ చెప్తున్నాడు.
పోయినేడాదే పాపులర్
లాక్‌డౌన్ సడలింపులు, ట్రావెల్ బ్యాన్ ఎత్తేసిన దేశాలు, టూరిజం లేక నష్టపోయిన కొన్ని దేశాలు ఇప్పుడు వ్యాక్సిన్ టూరిజం మీద దృష్టి పెట్టాయి. రష్యా, అమెరికా, జింబాంబ్వే.. ఇలా చిన్నాపెద్దా దేశాలన్నీ వ్యాక్సినేషన్ కోసం టూరిస్టులను ఆహ్వానిస్తున్నాయి. తక్కువ జనాభా ఉన్న సాన్ మారినో కూడా వ్యాక్సిన్ టూరిజం ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. అయితే మన దేశంలో టీకా టూరిజం ట్రెండ్ పోయినేడాది చివర్లోనే మొదలైంది. పోయినేడాది చివర్లో, ఈ ఏడాది మొదట్లో కొందరు ధనికులు, కార్పొరేట్ ప్రముఖులు ఇతర దేశాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నట్లు ఓ ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ వెల్లడించింది. అంతేకాదు పోయిన నెలలో విమాన రాకపోకలను ఆపేయడానికి ముందు దుబాయ్‌కు వెళ్లి కొందరు చైనా వ్యాక్సిన్ సినోఫార్మ్ తీసుకున్నట్లు సమాచారం.
అక్కర్లేదంటున్న సర్కార్
అయితే భారతీయులు వ్యాక్సినేషన్ కోసం కంగారు పడాల్సిన అవసరం లేదని కేంద్రం అంటోంది. ఈ ఏడాది చివరికల్లా అన్ని ఏజ్ గ్రూప్‌ల వాళ్లకు వ్యాక్సినేషన్ కోసం అనుమతి దొరకుతుందని,అది కూడా అందుబాటు ధరలోనే ఉంటుందని పర్యాటక శాఖా మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ చెప్తున్నారు. ఈ లెక్కన వ్యాక్సినేషన్ కోసం బయటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండబోదని ప్రహ్లాద్ అంచనా వేస్తున్నారు.
చైనా ముందడుగు
వ్యాక్సిన్‌ల కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేం కాదు. పైగా వ్యాక్సిన్‌ల కొరత నడుస్తున్న దేశాల్లో వ్యాక్సిన్ కోసం ఎంతైనా ఖర్చుపెట్టడానికి వెనకాడటం లేదు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ టూరిజం ట్రెండ్ మీద ఫోకస్ ఎక్కువైంది. ఇది గమనించిన కొన్ని దేశాలు స్థానికులకు మాత్రమే వ్యాక్సిన్ అనే నిబంధనలను సడలించి ఇతర దేశాల వాళ్లకూ ఆహ్వానం పలుకుతున్నాయి. అయితే చైనా మాత్రం వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఒక అడుగు ముందుకేసింది. సుమారు 120 దేశాల్లో ఉంటున్న తమ ప్రజలకు వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో ఈ ప్రక్రియను మొదలుపెట్టింది.
వ్యాక్సిన్ పాస్‌పోర్ట్ తెలుసా?
వ్యాక్సిన్ టూరిజం-వ్యాక్సిన్ పాస్‌పోర్ట్.. ఈ రెండు వేర్వేరు. ఇప్పటికే టీకా తీసుకున్న వాళ్లను మాత్రమే కొన్నిదేశాలు పర్యాటకానికి అనుమతిస్తున్నాయి. ఇందుకోసం వ్యాక్సిన్ పాస్‌పోర్ట చూపించాలని కండిషన్ పెడుతున్నాయి. ఇది ప్రత్యేకమైన పాస్‌పోర్ట్ కాదు. కొవిడ్‌కు వ్యాక్సిన్ డోస్‌లు పూర్తి అయినట్లు ప్రూవ్ చూపిస్తే సరిపోతుంది. వాళ్ల భూభాగంలోకి అనుమతిస్తారు.
చదవండి: దేశంలో కొత్తగా 2,57,299 కరోనా కేసులు
Comments
Please login to add a commentAdd a comment