తెలుగువారి ఘన చరిత్ర తెలుగువారు ప్రత్యేకంగా చెప్పుకోరు. ఇంటి గడప దాటడం కూడా మహా వింత అయిన రోజుల్లో, సముద్రం దాటడం అంటే కుల భ్రష్టత్వం అని భావించే రోజుల్లో 1873లో తెలుగు మహిళ పోతం జానకమ్మ ఇంగ్లండ్, పారిస్‌లను చుట్టి ఆ విశేషాలను యాత్రాకథనంగా రాశారు. 1876లో ఇంగ్లిష్‌లో వెలువడ్డ ఈ పుస్తకం ఒక విలువైన డాక్యుమెంట్‌గా నిలిచి ఉంది. బహుశా భారతీయ మహిళల్లోనే యాత్రా కథనం రాసిన తొలి మహిళ పోతం జానకమ్మ. ఇన్నాళ్లకు ఈ పుస్తకం తెలుగులో రానుంది. అందులో ఏముంది? జానకమ్మ ఎవరు?
‘సాక్షి’కి ప్రత్యేకం.
తెలుగు కథకు ఆద్యుడు గురజాడ అప్పారావు అని చాలాకాలం భావించినా ఆయన కంటే ముందే భండారు అచ్చమాంబ తెలుగులో కథలు రాశారు అని పరిశోధకులు తేల్చారు. కాని ఈ పరిశోధన తెలుగు స్త్రీల కృషిని విశద పరిచింది. చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారవేత్తలుగా ఎదగడానికి సమాజ చట్రాలను దాటి సంఘర్షించిన, కొత్త మార్గాలు తెరిచిన తెలుగు మహిళలు ఎందరో ఉన్నారు.
ఆ వరుసలో పోతం జానకమ్మ కూడా ఇప్పుడు పరిచయం అవుతున్నారు. 1838లో మద్రాసు నుంచి ఏనుగుల వీరాస్వామయ్య ప్రకటించిన ‘కాశీ యాత్రా చరిత్ర’ విఖ్యాతం. అయితే ఆయన చేసిన యాత్ర స్వదేశానికి పరిమితం. కాని 1873లో అదే మద్రాసు నుంచి పోతం జానకమ్మ చేసిన ‘జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర’ అంతే విశిష్టమైనది. అయితే కాశీ యాత్రకు లభించినంత ప్రచారం ఈ పుస్తకానికి లభించలేదు.
ఎవరీ జానకమ్మ
పోతం జానకమ్మ అచ్చ తెలుగు ఆడపడుచు. మద్రాసులో (చెన్నై) ఆమె వ్యాపారవేత్త రాఘవయ్యతో జీవించారు. ఈ రాఘవయ్య తమ్ముడు వెంకటాచల చెట్టి లండన్‌లో పత్తి దళారిగా పని చేస్తే, మరో తమ్ముడు జయరాం అక్కడే చదువుకున్నట్టు తెలుస్తోంది. పోతం జానకమ్మ చదువుకున్న మహిళ. ఇంగ్లిష్ కూడా మాట్లాడటం వచ్చు. ఆమె ప్రధానంగా చిత్రకళా ప్రియురాలు. దేశాలు, ప్రాంతాలు చూడాలనే ఆమె అభిలాషను భర్త గౌరవించాడు. ప్రోత్సహించాడు.
భర్తతో కలిసి జానకమ్మ 1871లో ఇంగ్లాండ్‌కు వెళ్లాలనుకుని ప్రయత్నం చేస్తే ఆ సంవత్సరం ఓడలో ‘కుటుంబాలు వెళ్లడం లేదని’ మానుకున్నారు. 1873లో ఆమె ప్రయత్నం సఫలమైంది. ఆ సంవత్సరం ‘ఇండియన్ ఫైనాన్స్ కమిషన్’కు మహజర్లు సమర్పించడానికి మన దేశం నుంచి వ్యాపారవేత్తల బృందం లండన్ వెళ్లింది. బహుశా ఆ బృందంలో జానకమ్మ బృందం చేరి ఉంటుంది. 1873 జూలై 20న మద్రాసు ఓడరేవు నుంచి లండన్ బయలుదేరి వెళ్లిన జానకమ్మ 1874 ఫిబ్రవరిలో తిరిగి వచ్చారు.
తన యాత్రానుభవాన్ని తెలుగులో రాసి ‘ఆంధ్ర భాష సంజీవని’ లో ప్రచురించారు. పుస్తకాన్ని ఆమె తెలుగులోనే రాసినా అనువాదమయ్యి మొదట ఇంగ్లిష్‌లోనే 1876లో వెలువడింది. దీనిని జానకమ్మ నాటి మద్రాసు యాక్టింగ్ గవర్నర్ విలియం రోజ్ రాబిన్సన్ భార్య ఎలిజిబత్ రాబిన్సన్‌కు అంకితం ఇచ్చింది. అంటే బ్రిటిష్ అధికార కుటుంబాలతో ఆమె పరిచయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ముద్రణ అత్యంత ఖరీదు కనుక కాపీ వెల రెండున్నర రూపాయి పెట్టారు (సగటు కుటుంబం నెల ఖర్చు). ఆమె ఉండగా తెలుగులో పుస్తకం రాకపోవడం బాధాకరమే.
150 పేజీల ఈ పుస్తకంలో జానకమ్మ హైందవ ధర్మాల పట్ల తన నిష్ఠను వ్యక్తం చేస్తూనే ఆధునిక దృష్టి, స్త్రీ పురుష సమభావన దృష్టి, భారతీయుల పరిమితులపై విమర్శనా దృష్టి వ్యక్తం చేసింది. యాత్రాకథనంలో చాలా చోట్ల చిన్న పిల్లలా ఆశ్చర్యపోవడం ఉన్నా ఆమె ఆలోచనాపరురాలైన స్త్రీగా ఈ యాత్రనంతటినీ దర్శించడం విశేషం. ఈ పుస్తకాన్ని ఇప్పుడు నెల్లూరుకు చెందిన ప్రముఖ చరిత్ర పరిశోధకులు పురుషోత్తం కాళిదాసు అనువాదం చేశారు. రచయిత పి.మోహన్ ప్రచురణకర్తగా ఉన్నారు. మరో వారం రోజుల్లో వెలువడనుంది.
పుస్తకంలో ఏముంది?
కొన్ని పేరాగ్రాఫ్‌లు అక్కడక్కడ నుంచి ఎంచినవి
► 1873– జూలై 20వ తేదీ వేకువజాము. కెప్టెన్ ముర్రే సారథ్యంలో సౌతాంప్టన్ వెళ్లే ఓడ కలకత్తా నుంచి మద్రాస్ వచ్చేసిందని తెలుపుతూ మూడు తుపాకులు పేలడంతో మేం ప్రయాణానికి హడావుడిగా సిద్ధమయ్యాం. బంధుమిత్రుల ఆశీస్సులు తీసుకున్నాం. సహ ప్రయాణికులతో కలిసి రేవు నుంచి ఓడలోకి చేరవేసే మసూలా బోట్లు ఎక్కాం. మా సుదీర్ఘమైన ప్రయాణంలో ఏయే కష్టాలు ఎదురవుతాయోనని దిగాలు పడుతూ విషాద వదనాలతో ఉన్నాం. ముప్పై రోజులో ఇంకా ఎక్కువరోజులో ఎటు చూసినా సముద్ర జలాలు తప్ప మరేం కనిపించవు.
► నేను ఇంగ్లండ్ పర్యటన తల పెట్టగానే ఆ ప్రయత్నం మానిపించడానికి, నన్ను భయపెట్టడానికి మావాళ్లు ఎన్ని తెలివితక్కువ అపోహలు కల్పించారని. వాళ్లకు నచ్చజెప్పడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తానికి యూరప్ చూడాలనే కోరికను నెరవేర్చుకొన్నాను. అక్కడకు వెళ్లాక విక్టోరియా రాణి ఏలుబడిలో లేని దేశాలను కూడా చూసి రావాలనే కోరిక కలిగింది. మాతో వచ్చిన బృందంతో కలిసి ఫ్రాన్స్ రాజధాని పారిస్ చూడటానికి బయల్దేరాం. మా పర్యటన ఏర్పాటు చేసిన థామస్ కుక్ అండ్ సన్స్ కంపెనీ ద్వారా టికెట్లు కొని నవంబర్ నెలలో అందరం న్యూ హేవన్ మీదుగా ఇంగ్లిష్ చానల్లో డియప్ మీదుగా పయనమయ్యాం.
► ఇంగ్లండ్ వెళ్లక పూర్వం బ్రిటిష్ ప్రజల గురించి అనేక అసంబద్ధ ఆలోచనలు నా బుర్రలో ఉండేవి. అక్కడి సామాజిక, రాజకీయ సమూహాల్లో మెలిగాక నా అభిప్రాయాలు మారాయి. పొరపాటేమిటంటే ఆంగ్లేయులు హిందూ దేశాన్ని తమదిగా భావించకపోవడం. ఏదో కొంతకాలమిక్కడ గడపడానికి వచ్చామనుకొంటారు కాబట్టే తరచూ తమ విధులను యాంత్రికంగా నిర్వర్తిస్తారు.
► మన హిందూ దేశస్తులు ఓడలు నిర్మించి సముద్రాల మీద విదేశాలకు వెళ్లి అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలను తెలుసుకొని ఆ దేశాలతో మైత్రి చేసినట్లు గ్రంథస్తమైన ఆధారాలు లేవు. పైపెచ్చు మనవాళ్లు సముద్ర యానాన్ని, విదేశాలకు వెళ్లి రావడాన్ని నిషేధించారు కూడా. ఇటువంటి నిషేధాల వల్ల మన పూర్వీకులకు ఏం మేలు జరిగిందో ఏమో కానీ మనకిప్పుడు అపారమైన కీడు మాత్రమే కలుగుతోంది.
► సందర్భం, అవసరం వస్తే ఆంగ్లేయ మహిళలు శాస్త్రీయ విషయాల గురించి మాట్లాడతారు. ఎప్పుడో తప్ప వాళ్లు పోచికోలు కబుర్లతో కాలం వెళ్ళబుచ్చరు. ఆ దేశంలో దంపతుల మధ్య ప్రేమ చాలా గొప్పది. మగవాళ్లు స్త్రీలను హీనంగా చూడరు. ఏ విషయంలోనైనా తమతో సమానంగా చూస్తారు. హిందూ దేశ స్త్రీల కంటే ఇక్కడి స్త్రీలు మంచిస్థితిలో ఉన్నారు. మన దేశంలో పురుషులు స్త్రీలను బానిసల్లా చూస్తున్నారు.
► ఎర్ర సముద్రం అంతటా చిన్న చిన్న కొండలు, గుట్టలు తల పైకెత్తుకొని కనిపిస్తాయి. ఓడ ప్రయాణం చెయ్యక ముందు సముద్రంలో కొండలు, గుట్టలు ఉంటాయన్న వాస్తవం నాకు తెలియదు. పర్వతాలకు రెక్కలుండి ఎగిరే కాలంలో అవి ఊళ్ల మీద పడి నాశనం చేసేవి. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కలు ఖండిస్తున్నపపుడు మైనాక పర్వతం సముద్రుణ్ణి శరణుగోరి సాగరగర్భంలో దాగిందన్న రామాయణ గాథ ఈ సందర్భంలో నా మనసులో మెదిలింది.
► మేం లండన్‌లో ఉన్నప్పుడు లార్డ్ బైరన్ రాసిన నాటకం మాన్‌ఫ్రెడ్‌ను ప్రదర్శించారు. నాటకం సాగుతున్నప్పుడు తరచూ సందర్భానికి అనువుగా నేపథ్య దృశ్యాలను మార్చేవాళ్లు. ఆ దృశ్యాలు చాలా సహజంగా ఉండేవి.
► ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఏ ఒడిదొడుకులూ లేకుండా మమ్మల్ని క్షేమంగా వెనక్కి చేర్చిన దైవానికి కృతజ్ఞతలు చెప్పుకొన్నాం. ఈ ప్రయాణాన్ని ఎంతో ఇష్టపడ్డాను. పర్యటనలో ఎన్నో నేర్చుకున్నాను. నేను సంపాదించుకున్న జ్ఞానంతో, ఎరుకతో మరొకసారి అవకాశం లభిస్తే ఆ అద్భుతమైన పశ్చిమ దేశాలకు వెళ్లి అవి కళల్లో, శాస్త్ర విజ్ఞానంలో, పారిశ్రామిక ఉత్పత్తుల్లో సాధించిన విశేష ప్రగతిని అర్థం చేసుకోవడానికి అవసరమైన ఆత్మస్థయిర్యం నాకు చేకూరింది.
Comments
Please login to add a commentAdd a comment