విహారయాత్రకు బయలుదేరుతున్నారా? | vacation travel insurance policy | Sakshi
Sakshi News home page

విహారయాత్రకు బయలుదేరుతున్నారా?

Published Mon, Dec 23 2019 5:07 AM | Last Updated on Mon, Dec 23 2019 5:32 AM

vacation travel insurance policy - Sakshi

విహార యాత్రకు వెళ్లే వారు హోటల్‌ గదులు, ట్రావెల్‌ టికెట్లను బుక్‌ చేసుకోవడం, కెమెరా ఎక్విప్‌మెంట్‌ తదితర కావాల్సినవి సిద్ధం చేసుకోవడం.. ఇలా ఎన్నో పనులు ఉంటాయి. పర్యటన సమయంలో ఊహించని అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, ఆర్థికంగా పడే భారం ఎంతో చెప్పలేం. వైద్య పరంగా అత్యవసర చికిత్స, లగేజీ కోల్పోవడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చు. చివరి నిమిషంలో సమీప వ్యక్తులు మరణించడం వల్ల పర్యటనను రద్దు చేసుకోవాల్సి వస్తే ఆర్థికంగానూ నష్టపోతారు. అందుకే పర్యాటకులకు సరైన ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ అవసరం. ఇది ఎన్నో విధాలుగా రక్షణ కల్పిస్తుంది.   మా సంస్థ అంతర్గత డేటాను పరిశీలిస్తే అధిక శాతం క్లెయిమ్‌లు 60 ఏళ్ల వయసు పైబడిన వారి నుంచే వస్తున్నా కానీ.. అదే సమయంలో 40 శాతం పర్యాటక బీమా పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లు 20–40 ఏళ్ల వయసు గ్రూపువే ఉంటున్నాయి. సగటున ఓ క్లెయిమ్‌ మొత్తం రూ.2,00,000గా ఉంటోంది. ముఖ్యంగా గత మూడేళ్ల కాలంలో వైద్య ఖర్చులకు సంబంధించిన క్లెయిమ్‌లలో పెరుగుదల 25 శాతంగా ఉంది.  

కవరేజీ..
పర్యాటక బీమా పాలసీ ప్రధానంగా.. పర్యటన సమయంలో ఇన్‌పేషెంట్, అవుట్‌ పేషెంట్‌ చికిత్సలకు అయ్యే వ్యయాలను చెల్లిస్తుంది. వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కూడా ఇందులో ఉంటుంది. మణించినా లేక శాశ్వత అంగవైకల్యం పాలైనా పరిహారం పొందొచ్చు. ప్రమాదం కారణంగా గాయపడి ఆస్పత్రిపాలవడం వల్ల పడే ఖర్చులను కూడా చెల్లిస్తుంది. దేశీయ పర్యాటకులకు సంబంధించి బీమా కంపెనీలకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులతో టైఅప్‌ ఉంటుంది. దీంతో పర్యటన సమయంలో ప్రమాదం కారణంగా ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే నగదు రహిత చికిత్సలను పొందొచ్చు. హాస్పిటల్‌ డైలీ అలవెన్స్, వైద్యం కోసం అత్యవసర తరలింపు, స్వదేశానికి పంపే కవరేజీలను కూడా ప్రధాన పాలసీకి రైడర్లుగా జోడించునే ఆప్షన్‌ ఉంటుంది. పర్యటనను కుదించుకోవాల్సి రావడం, కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా కోల్పోవడం, విమానం, రైళ్లు ఆలస్యం కావడం, వైద్య పరంగా అత్యవసర చికిత్సలు వంటి సందర్భాల్లో ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ రక్షణగా నిలుస్తుంది. బ్యాగేజీని నష్టపోయినా పరిహారం చెల్లిస్తుంది. యువత నేడు ట్రెక్కింగ్, స్కీయింగ్, వాటర్‌ రాఫ్టింగ్, రాపెల్లింగ్, స్కైడైవింగ్, పారాచ్యూట్, స్కూబా డైవింగ్‌ వంటి సాహస కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తోంది. వీటివల్ల ప్రమాదవశాత్తూ గాయాల పాలైతే ట్రావెల్‌ బీమా పాలసీల్లో కవరేజీ ఉండేలా చూసుకోవాలి.

స్వీటీసాల్వే

సీనియర్‌ మేనేజర్, హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement