Travel Insurance Policies
-
విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..
దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల అక్టోబర్ 14న వివిధ నగరాల నుంచి గరిష్ఠంగా 4,84,263 మంది విమానాల్లో ప్రయాణం సాగించారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన 4,71,751 రికార్డుతో పోలిస్తే ఇది 2.6 శాతం అధికం. విహార యాత్రల కోసం విదేశాలకు వెళ్లేప్పుడు ఎన్ని రోజులు వెళ్లాలి.. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకుని పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. మరి, వెళ్లినచోట ఏదైనా అనారోగ్య పరిస్థితి ఎదురైతే..వెంటతీసుకెళ్లిన సామాగ్రి పోగొట్టుకుంటే.. కంగారు పడకండి.. అలాంటి వారికోసమే చాలా కంపెనీలు ప్రయాణబీమా అందిస్తున్నాయి. దానికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం.ఆరోగ్య అత్యవసర పరిస్థితి కోసం..నిత్యం వేలసంఖ్యలో విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్తూంటారు. వారికి వెళ్లినచోట ఎప్పుడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి రావొచ్చు. అలాంటి వారి అవసరాలకు తగ్గట్టుగా ప్రయాణ బీమా పాలసీలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల చికిత్సలు కవర్ అయ్యేలా ఉండే బీమా పాలసీను ఎంచుకోవాలి. ఎలాంటి షరతులూ, నిబంధనలు లేకుండా పూర్తి వైద్య ఖర్చులను చెల్లించే పాలసీను తీసుకువాలి.విభిన్న దేశాలు.. ఒకే పాలసీ..ఒకసారి బీమా తీసుకుంటే చాలా ప్రయాణాలకు ఉపయోగపడే పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివి ముఖ్యంగా వ్యాపారవేత్తలకు సరిపోతాయి. ఒకటికి మించి దేశాలకు ప్రయాణించే వారు ఆయా దేశాలన్నింటిలోనూ పాలసీ అమలయ్యేలా ఒకే పాలసీని ఎంచుకోవచ్చు. అమెరికాలో ఏడు రోజులపాటు పర్యటించాలనుకుంటే బీమా ప్రీమియం కంపెనీను అనుసరించి దాదాపు రూ.800-రూ.900 వరకు ఉంటుంది.ఇదీ చదవండి: ఎక్కేద్దాం... ఎగిరిపోదాం! విమాన ప్రయాణికుల జోరుసామాగ్రి అందకపోయినా ధీమాగా..ఒకటి కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించేవారు నిత్యం సామాగ్రి వెంట తీసుకెళ్లాలంటే కష్టం. కాబట్టి ఇతరదేశంలోని చిరునామాలో తమ సామగ్రి చేరేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక్కోసారి ఆ సామగ్రి చేరడం ఆలస్యం అవుతుంది. దాంతో వారు ఇబ్బందులు పడకుండా బీమా సంస్థ పరిహారం ఇచ్చేలా పాలసీలున్నాయి. మొదటిసారి విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు సామాగ్రి అందకపోతే ఆర్థికంగా ఎంతో నష్టపోతారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణ బీమా వారికి పరిహారం అందిస్తుంది. -
ప్రయాణ బీమా.. టూరుకు ధీమా!
అన్ని సమయాల్లోనూ బీమా రక్షణ ఉంటేనే నిశ్చింత. విదేశీ ప్రయాణం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అందరూ తీసుకోరు. కానీ, ప్రతి ప్రయాణికుడు తప్పకుండా తీసుకోవాల్సిన ప్లాన్ ఇది. ఊహించని అత్యవసర పరిస్థితుల్లో మనల్ని ఆదుకునే రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నది పూర్తి అధ్యయనం తర్వాతే తీసుకోవాలి. ఏదో ఒకటి తీసుకుంటే అవసరంలో ఆదుకోకపోవచ్చు. ఆదుకున్నా, సంపూర్ణంగా ఉండకపోవచ్చు. విదేశాలకు వెళుతున్న వారు, అసలు ఎటువంటి రిస్క్‌లను ఎదుర్కోవాల్సి వస్తుందో అవగాహన కలిగి ఉండాలి. ఆ రిస్క్‌లు అన్నింటికీ ప్లాన్‌లో కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను నిజాయితీగా వెల్లడించాలి. ఈ అంశాల పరంగా జాగ్రత్తగా, నిజాయితీగా వ్యవహరించినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంతో ఉపయోగకరం అవుతుంది. ప్రయాణ సమయంలో లగేజీ పోవచ్చు. ప్రమాదం జరగొచ్చు. ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. దాడికి గురికావచ్చు. ఏ రూపంలో రిస్క్ ఎదురవుతుందో ఊహించడం కష్టం. అందుకుని తీసుకునే ప్లాన్‌లో కవరేజీ సమగ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. రిస్క్‌లకు కవరేజీ ఇచ్చేదే బీమా పాలసీ. రిస్క్‌లు అన్నవి తెలియకుండా వస్తాయి. కానీ, రిస్క్‌కు దారితీసే అంశాలపై ఎవరికైనా అవగాహన ఉంటుంది. ఈ రిస్క్ అంశాలనేవి పాలసీ దారఖాస్తు పత్రంలో వెల్లడించడం వల్ల, వీటికి కవరేజీ ఇస్తూ, ప్రీమియం సహేతుకంగా నిర్ణయించేందుకు బీమా సంస్థకు అవకాశం ఉంటుంది. కనుక వీటిని దాచకూడదు. ఇందులో ప్రధానమైనది ముందు నుంచి ఉన్న వ్యాధులు. మెడికల్ కవరేజీ ఉన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్.. విదేశీ పర్యటన సమయంలో ఏదైనీ కారణంతో అత్యవసరంగా ప్రయాణికుడు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే కవరేజీ ఇస్తుంది. ముందు నుంచి ఉన్న వ్యాధులను వెల్లడించలేదని అనుకుందాం. అప్పుడు ముందు నుంచి ఉన్న వ్యాధి వల్ల హాస్పిటల్లో చేరినట్టు వైద్యుడు నిర్ధారిస్తే కవరేజీ సమస్యాత్మకంగా మారొచ్చు. వైద్యుల నోట్ ఆధారంగా సదరు క్లెయిమ్‌ను బీమా కంపెనీ తిరస్కరిస్తుంది. అదే ముందస్తు వ్యాధులను (ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్/పీఈడీ) వెల్లడించి, వాటికి కూడా పాలసీలో కవరేజీ ఉంటే ఈ సమస్య ఎదురుకాదు. పీఈడీలను వెల్లడించడం వల్ల ప్రీమియం కొంచెం పెరుగుతుంది అంతే. పీఈడీని పాలసీలో చేర్చకపోతే వైద్య వ్యయాలు భారీగా ఉండే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరైనా కానీ, తమకు అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కలిగి ఉంటారు. కానీ, వాటి కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని ఎవరికీ తెలియదు. అందుకే తెలిసిన వివరాలను పూర్తిగా వెల్లడించాల్సిందే. సాహస క్రీడలకూ ఇదే వర్తిస్తుంది. సాహస క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లేవారు వాటికి సంబంధించిన పాలసీలను ఎంపిక చేసుకోవాలి. 70 ఏళ్లకు పైన వయసులో విదేశాలకు వెళ్లొచ్చే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. ఈ వయసులో ఉన్న వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ పరంగా పరిమితులు ఉన్నాయి. బీమా సంస్థలు 10,000–20,000 డాలర్లకే కవరేజీని పరిమితం చేస్తున్నాయి. వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కేవలం కొన్ని బీమా కంపెనీలే ఈ వయసు వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయి. టీపీఏ, నెట్వర్క్ ఆసుపత్రులు బీమా సంస్థలు స్వయంగా అందించే సేవలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) రూపంలో అందించే సేవలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. అందుకని పాలసీదారులు టీపీఏను ఎలా సంప్రదించాలన్నది ముందే తెలుసుకోవాలి. చికిత్స అవసరమైనప్పుడు ముందుగా సంప్రదించాల్సింది టీపీఏనే. క్లెయిమ్‌తోపాటు, బీమా సంస్థ అందించే సేవలకూ టీపీఏనే అనుసంధానకర్తగా ఉంటారు. టీపీఏ లేనప్పుడు నేరుగా బీమా కంపెనీలను సంప్రదించాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆమోదించే నెట్వర్క్ హాస్పిటల్స్ పాత్ర కీలకం అని చెప్పుకోవాలి. విదేశానికి వెళ్లినప్పుడు వైద్య సాయం అవసరమైతే బీమా కార్డుతో నెట్వర్క్ ఆసుపత్రిని సంప్రదిస్తే చాలు. అయితే, అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లడం సాధ్యపడకపోవచ్చు. అయినా కానీ, దీనికి ప్రాధాన్యం ఎక్కువే. ఎందుకంటే నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఖరీదైన వైద్యం పొందొచ్చు. ముందుగా డబ్బులు చెల్లించి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవడం కంటే, నగదు రహిత బీమా కవరేజీ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో చిన్న పాటి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా బిల్లు 10,000–20,000 డాలర్లు అవుతోంది. కనుక ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు ముందుగానే తగిన కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లో ఎన్నో వేదికలు ఈ విషయంలో తగిన సమాచారాన్ని అందిస్తున్నాయి. టీపీఏ సేవల తీరు, నెట్వర్క్ హాస్పిటల్స్ సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఊహించని అవరోధాలు.. ప్రయాణ సమయంలో ఎన్నో ఊహించని రిస్క్‌లు ఎదురవుతుంటాయి. అందుకని పాలసీ తీసుకోవడానికి ముందే అన్ని రిస్క్‌లను అధ్యయనం చేసి, ఎక్కువ వాటికి కవరేజీ ఇచ్చే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. యుద్ధం, వాతావరణం, దాడుల వల్ల విదేశీ ట్రిప్‌కు ఆటంకాలు ఏర్పడవచ్చని భావిస్తే.. ఫ్లయిట్ రద్ధు అయితే ఎక్కువ పరిహారాన్ని ఇచ్చే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఫ్లయిట్ రద్ధయితే ఇచ్చే పరిహారం 5 లక్షల డాలర్ల ప్లాన్‌లో 1,000–2,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒకవేళ విదేశాలకు వెళ్లిన తర్వాత పర్యటనను పొడిగించుకోవాలని భావిస్తే టీపీఏను ఎలక్ట్రానిక్ రూపంలో సంప్రదించాల్సి ఉంటుంది. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ గడువును పొడిగించుకునేందుకు బీమా సంస్థలు అనుమతిస్తాయి. కొన్ని అనుకోని పరిణామాలు.. ఉదాహరణకు యుద్ధం, అంటువ్యాధులు తదితర పరిస్థితుల్లో బీమా సంస్థలే ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఏడు రోజుల వరకు ఆటోమేటిక్‌గా పొడిగిస్తుంటాయి. ప్రయాణంలో సొంతంగా కారు నడపేది ఉంటే, అప్పుడు తీసుకునే ట్రావెల్ ప్లాన్ థర్డ్ పార్టీ లయబిలిటీతో ఉండేలా జాగ్రత్త పడాలి. బ్యాగేజీకి కూడా కవరేజీ ఉంటుంది. ప్రయాణించే సమయంలోనే కాకుండా, ట్రిప్ మొత్తంలో బ్యాగేజీకి ఈ కవరేజీ వర్తిస్తుంది. కాకపోతే బ్యాగేజీ రక్షణకు తనవైపు నుంచి తగినన్ని చర్యలు తీసుకున్నట్టు పాలసీదారు నిరూపించుకోవాలి. అప్పుడే పోయిన బ్యాగేజీకి నష్ట పరిహారాన్ని అందుకోగలరు. అందుకని ప్లాన్ తీసుకునే వారు తప్పనిసరిగా నియమ, నిబంధనలతో కూడిన డాక్యుమెంట్‌ను చదవాలి. అప్పుడే వేటికి కవరేజీ లభిస్తుంది, పరిమితులు ఏవైనా ఉన్నాయా? షరతుల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. -
విహారయాత్రకు బయలుదేరుతున్నారా?
విహార యాత్రకు వెళ్లే వారు హోటల్ గదులు, ట్రావెల్ టికెట్లను బుక్ చేసుకోవడం, కెమెరా ఎక్విప్మెంట్ తదితర కావాల్సినవి సిద్ధం చేసుకోవడం.. ఇలా ఎన్నో పనులు ఉంటాయి. పర్యటన సమయంలో ఊహించని అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, ఆర్థికంగా పడే భారం ఎంతో చెప్పలేం. వైద్య పరంగా అత్యవసర చికిత్స, లగేజీ కోల్పోవడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చు. చివరి నిమిషంలో సమీప వ్యక్తులు మరణించడం వల్ల పర్యటనను రద్దు చేసుకోవాల్సి వస్తే ఆర్థికంగానూ నష్టపోతారు. అందుకే పర్యాటకులకు సరైన ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అవసరం. ఇది ఎన్నో విధాలుగా రక్షణ కల్పిస్తుంది. మా సంస్థ అంతర్గత డేటాను పరిశీలిస్తే అధిక శాతం క్లెయిమ్‌లు 60 ఏళ్ల వయసు పైబడిన వారి నుంచే వస్తున్నా కానీ.. అదే సమయంలో 40 శాతం పర్యాటక బీమా పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లు 20–40 ఏళ్ల వయసు గ్రూపువే ఉంటున్నాయి. సగటున ఓ క్లెయిమ్ మొత్తం రూ.2,00,000గా ఉంటోంది. ముఖ్యంగా గత మూడేళ్ల కాలంలో వైద్య ఖర్చులకు సంబంధించిన క్లెయిమ్‌లలో పెరుగుదల 25 శాతంగా ఉంది. కవరేజీ.. పర్యాటక బీమా పాలసీ ప్రధానంగా.. పర్యటన సమయంలో ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్ చికిత్సలకు అయ్యే వ్యయాలను చెల్లిస్తుంది. వ్యక్తిగత ప్రమాద బీమా రక్షణ కూడా ఇందులో ఉంటుంది. మణించినా లేక శాశ్వత అంగవైకల్యం పాలైనా పరిహారం పొందొచ్చు. ప్రమాదం కారణంగా గాయపడి ఆస్పత్రిపాలవడం వల్ల పడే ఖర్చులను కూడా చెల్లిస్తుంది. దేశీయ పర్యాటకులకు సంబంధించి బీమా కంపెనీలకు దేశవ్యాప్తంగా ఆస్పత్రులతో టైఅప్ ఉంటుంది. దీంతో పర్యటన సమయంలో ప్రమాదం కారణంగా ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే నగదు రహిత చికిత్సలను పొందొచ్చు. హాస్పిటల్ డైలీ అలవెన్స్, వైద్యం కోసం అత్యవసర తరలింపు, స్వదేశానికి పంపే కవరేజీలను కూడా ప్రధాన పాలసీకి రైడర్లుగా జోడించునే ఆప్షన్ ఉంటుంది. పర్యటనను కుదించుకోవాల్సి రావడం, కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా కోల్పోవడం, విమానం, రైళ్లు ఆలస్యం కావడం, వైద్య పరంగా అత్యవసర చికిత్సలు వంటి సందర్భాల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ రక్షణగా నిలుస్తుంది. బ్యాగేజీని నష్టపోయినా పరిహారం చెల్లిస్తుంది. యువత నేడు ట్రెక్కింగ్, స్కీయింగ్, వాటర్ రాఫ్టింగ్, రాపెల్లింగ్, స్కైడైవింగ్, పారాచ్యూట్, స్కూబా డైవింగ్ వంటి సాహస కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తోంది. వీటివల్ల ప్రమాదవశాత్తూ గాయాల పాలైతే ట్రావెల్ బీమా పాలసీల్లో కవరేజీ ఉండేలా చూసుకోవాలి. స్వీటీసాల్వే సీనియర్ మేనేజర్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ -
ట్రా‘వెల్’ చేయండిలా..
సాక్షి, సిటీబ్యూరో: నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకుల సంఖ్య ఏటా రెట్టింపవుతోంది. అయితే టూర్లకు వెళ్లాలనే సరదానే తప్ప... ముందస్తుగా తగిన ప్రణాళిక లేకపోవడంతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నగరానికి చెందిన పర్యాటక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి ట్రావెల్ ఇన్సూరెన్స్ మంచి పరిష్కారమని చెబుతున్నారు. విద్య, వ్యాపారం, వ్యక్తిగతం మరెన్నో అవసరాలతో ప్రయాణం అనేది తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం దాదాపు 5కోట్ల మంది ప్రయాణికులతో భారతీయ పర్యాటక పరిశ్రమ రానున్న 2020 వరకు రూ.28 వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకుంటుందని అంచనా. ఫ్లైట్స్ లేట్.. లగేజీ మిస్ జర్నీ సమయంలో పాస్‌పోర్టు పోగొట్టుకోవడం, ఫ్లైట్స్ మిస్సవడం లేదా ఆలస్యం కావడం, లగేజీ పోగొట్టుకోవడం, ట్రిప్స్ క్యాన్సిల్ కావడం, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు... ఇలా ఎన్నో ఇబ్బందులు వెలుగులోకి వస్తున్నాయి. వీటిపై ముందస్తుగా సంసిద్ధత లేకపోతే ఎన్నో వ్యయప్రయాసలు, ఆర్థిక నష్టాలు తప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2016లో విమాన ప్రయాణికులు 2.16 కోట్లకు పైగా బ్యాగ్స్ పోగొట్టుకున్న కేసులు నమోదయ్యాయి. మన దేశంలో అయితే ప్రతి వెయ్యి మందిలో ఏడుగురు పోగొట్టుకుంటున్నారని 2014లో ఓ నివేదిక పేర్కొంది. ఇలా దుస్తులు, మందులు తదితర లగేజీ పోగొట్టుకోవడం మరిన్ని వ్యయప్రయాసలకు కారణమవుతోంది. ఇక ఫ్లైట్స్ ఆలస్యంగా రావడమో, రద్దు కావడమో జరిగితే మరిన్ని సమస్యలు తప్పడం లేదు. ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి... అత్యవసర పరిస్థితుల్లో ఉపకరించేలా పర్యాటకులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చింది. కేవలం వైద్యపరమైన అంశాలకు మాత్రమే కాకుండా ఇతరత్రా అవసరాలకు కూడా బీమా సౌకర్యం అందుబాటులో ఉందనే విషయంపై నగరవాసుల్లో చాలా మందికి అవగాహన లేదు. వీటిలో నాన్ మెడికల్ వ్యక్తిగత అనిశ్చిత పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, తీవ్రవాద చర్యలు తదితర అనేక రకాల ఎమర్జెన్సీ పరిస్థితుల నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 24/7 సేవలు సైతం బీమా కంపెనీలు అందిస్తున్నాయి. ఒక పరిశోధన ప్రకారం కేవలం 40శాతం మంది మాత్రమే ఈ తరహా ఇన్సూరెన్స్‌కి ప్రాధాన్యతనిస్తున్నారని తేలింది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఫ్లైట్ మిస్సవడం తరహా నష్టాలకు కూడా భధ్రత కల్పిస్తున్నాయి. లగేజీ నష్టాలకు రూ.77వేల వరకు, ఫ్లైట్ ఆలస్యం లేదా క్యాన్సిలేషన్లకు రూ.1.12 లక్షల వరకూ బీమా కవరేజ్ లభిస్తోంది. విదేశీ వైద్యం వ్యయభరితం... ఇక వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు రక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సింగపూర్, కెనడా, హాంకాంగ్, అమెరికా లాంటి దేశాల్లో వైద్య సేవలు చాలా ఖరీదు. ఒక్క రోజు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చినా రూ.లక్షల్లో వెచ్చించాల్సిందే. రూ.69లక్షల నుంచి రూ.1.38కోట్ల వరకు విలువైన వైద్య బీమాలను కంపెనీలు అందిస్తున్నాయి. రాజకీయపరమైన ప్రమాదాలు, ఎమర్జెన్సీ హోటల్ ఎక్స్టెన్షన్, పెద్దవాళ్లు ఆరోగ్య పరిస్థితుల కారణంగా రాలేకపోతే పిల్లలు మాత్రమే తిరిగి రావడానికి కావల్సిన ఏర్పాట్లు, జీవనశైలి అవసరాలు ఇలా విభిన్న రకాలుగా ముందస్తు బీమా అందుతోంది. ‘వీసా కోసం మాత్రమే ట్రావెల్ ఇన్సూరెన్స్ అనుకుంటున్నారే తప్ప, అది తమకు అత్యవసరమైందని 38శాతం మంది అనుకోవడం లేదని ఓ సర్వేలో తేలింది. అయితే అది సరైన అవగాహన కాదు. మన ప్రయాణం పూర్తి సురక్షితంగా మార్చడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అని అర్థం చేసుకోవాలి’ అని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ రాకేశ్‌జైన్ తెలిపారు. -
ప్రయాణానికి బీమా.. ధీమా..
విహారయాత్రలు కావొచ్చు.. లేదా ఇతరత్రా అవసరాలరీత్యా పర్యటనలు కావొచ్చు.. సాఫీగా సాగాలంటే ముందస్తుగా ప్రణాళిక ఉండాలి. ఎందుకంటే.. ఏది ఎంతగా ప్లానింగ్ చేసుకున్నా మన చేతుల్లో లేని కారణాల వల్ల ఏవయినా అవాంతరాలు కలగొచ్చు. ఫ్లయిట్ డిలే కావడమో లేదా పర్యటనలో ఏదైనా అనుకోని పరిస్థితుల్లో చిక్కుకోవడమో లాంటివి జరగొచ్చు. ఇలాంటప్పుడే ఆదుకుంటాయి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు. నిజంగా అవసరమా? తొలిసారిగా పర్యటిస్తున్న వారిలో చాలా మందిలో కలిగే సందేహమే ఇది. కొన్ని దేశాల్లో పర్యటించాలంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.. మరి కొన్ని దేశాల్లో అవసరం లేదు. ఈ నేపథ్యంలో అసలు ట్రావెల్ ఇన్సూరెన్స్‌కి ఇంత ప్రాధాన్యమివ్వడం అవసరమా అనే ప్రశ్న తలెత్తవచ్చు. అయితే, దేశం ఏదైనప్పటికీ ప్రయాణ బీమా తీసుకోవడం మంచిదే. ఉదాహరణకు సింగపూర్ లాంటి దేశానికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఏ పంటి నొప్పి వచ్చినా.. లేదా ఏదైనా ప్రమాదంలో గాయపడినా చికిత్స కోసం వేలల్లో వెచ్చించాల్సి వస్తుంది. అది కూడా డాలర్లలో. అలాంటప్పుడు అంత పెద్ద మొత్తం కట్టడం సాధ్యపడకపోవచ్చు. పైగా దీని వల్ల ట్రీట్మెంట్లోనూ జాప్యం జరిగి శాశ్వతంగా బాధపడాల్సిన పరిస్థితి ఎదురుకావొచ్చు. కేవలం ఆరోగ్యపరమైనవే కాదు.. మనం వెంట తీసుకెళ్లే ఖరీదైన కెమెరానో లేదా మరో వ్యక్తిగత ప్రాపర్టీనో పోగొట్టుకునే రిస్కులు కూడా విదేశాల్లో ఎదురవ్వొచ్చు. దేశం కాని దేశంలో .. ఏదో మారుమూల ప్రాంతంలో ఇలా జరిగినప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రయోజనాలనేకం.. అందుకే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినా పర్యటనలు సజావుగా సాగిపోగలవు. ఎందుకంటే.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంటే డైలీ అలవెన్సు, పాస్‌పోర్టులు.. టికెట్లు మొదలైన ట్రావెల్ పత్రాలు పోగొట్టుకుంటే పరిహారం, చెకిన్ బ్యాగేజీ పోయినా పరిహారం, వైద్య చికిత్స ఖర్చులు మొదలైన వాటన్నింటినీ బీమా కంపెనీయే చూసుకుంటుంది. నగదుపరమైన పరిహారం ఇవ్వడమే కాకుండా.. విస్తృతమైన నెట్వర్క్ ఉన్న పెద్ద బీమా సంస్థలు మరిన్ని అదనపు సర్వీసులు కూడా అందించగలవు. ఉదాహరణకు మొరాకో లాంటి ఏ దేశంలోనో పాలసీదారుకు అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు హెలికాప్టర్లాంటి వాటి ద్వారా సైతం వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ఆస్పత్రులకు తరలించగలవు. ప్రాణాంతక పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు ఇలాంటి సర్వీసులు ప్రాణాలు నిలబెట్టగలవు. చౌకయినవి.. నమ్మకమైనవి... ప్రస్తుతం బీమా సంస్థలు పాలసీదారుల బడ్జెట్లు, అవసరాలకు అనుగుణంగా వివిధ పాలసీలు అందిస్తున్నాయి. సుమారు రూ. 800 కడితే చాలు.. 7 రోజుల ట్రిప్‌కి 50,000 డాలర్ల మేర కవరేజీ (ఒక్కరికి) లభించగలదు. కావాలనుకుంటే కస్టమరు తనకు అవసరాన్ని బట్టి మరికొన్ని రైడర్లు కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం పాలసీ ప్రీమియంలో సుమారు 10-20 శాతం కడితే చాలు. గ్రూప్ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తరచుగా విదేశీ పర్యటనలు చేసే వారు మల్టీ-ట్రిప్ ప్లాన్స్ తీసుకుంటే మరికాస్త తక్కువ ప్రీమియంకే లభిస్తాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు చౌకైనవి, నమ్మికైనవే కాకుండా తీసుకోవడం కూడా సులభతరమైన ప్రక్రియే. వివిధ కంపెనీలు అందిస్తున్న పాలసీలను, కట్టాల్సిన ప్రీమియంలను ఆన్లైన్లో పోల్చి చూసుకుని.. సమగ్రమైనవాటిని అప్పటికప్పుడు కొనుక్కోవచ్చు. ట్రిప్ వివరాలు పొందుపరిస్తే చాలా మటుకు కంపెనీలు తమ కొటేషన్లు అందజేస్తాయి. కనుక, తప్పనిసరి అయినా.. కాకపోయినా ఏదైనా పర్యటనకు బైల్దేరినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ధీమాగా ట్రిప్ పూర్తి చేసుకురావొచ్చు.