ప్రయాణానికి బీమా.. ధీమా..
విహారయాత్రలు కావొచ్చు.. లేదా ఇతరత్రా అవసరాలరీత్యా పర్యటనలు కావొచ్చు.. సాఫీగా సాగాలంటే ముందస్తుగా ప్రణాళిక ఉండాలి. ఎందుకంటే.. ఏది ఎంతగా ప్లానింగ్ చేసుకున్నా మన చేతుల్లో లేని కారణాల వల్ల ఏవయినా అవాంతరాలు కలగొచ్చు. ఫ్లయిట్ డిలే కావడమో లేదా పర్యటనలో ఏదైనా అనుకోని పరిస్థితుల్లో చిక్కుకోవడమో లాంటివి జరగొచ్చు. ఇలాంటప్పుడే ఆదుకుంటాయి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు.
నిజంగా అవసరమా?
తొలిసారిగా పర్యటిస్తున్న వారిలో చాలా మందిలో కలిగే సందేహమే ఇది. కొన్ని దేశాల్లో పర్యటించాలంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.. మరి కొన్ని దేశాల్లో అవసరం లేదు. ఈ నేపథ్యంలో అసలు ట్రావెల్ ఇన్సూరెన్స్‌కి ఇంత ప్రాధాన్యమివ్వడం అవసరమా అనే ప్రశ్న తలెత్తవచ్చు. అయితే, దేశం ఏదైనప్పటికీ ప్రయాణ బీమా తీసుకోవడం మంచిదే. ఉదాహరణకు సింగపూర్ లాంటి దేశానికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఏ పంటి నొప్పి వచ్చినా.. లేదా ఏదైనా ప్రమాదంలో గాయపడినా చికిత్స కోసం వేలల్లో వెచ్చించాల్సి వస్తుంది. అది కూడా డాలర్లలో. అలాంటప్పుడు అంత పెద్ద మొత్తం కట్టడం సాధ్యపడకపోవచ్చు. పైగా దీని వల్ల ట్రీట్‌మెంట్‌లోనూ జాప్యం జరిగి శాశ్వతంగా బాధపడాల్సిన పరిస్థితి ఎదురుకావొచ్చు. కేవలం ఆరోగ్యపరమైనవే కాదు.. మనం వెంట తీసుకెళ్లే ఖరీదైన కెమెరానో లేదా మరో వ్యక్తిగత ప్రాపర్టీనో పోగొట్టుకునే రిస్కులు కూడా విదేశాల్లో ఎదురవ్వొచ్చు. దేశం కాని దేశంలో .. ఏదో మారుమూల ప్రాంతంలో ఇలా జరిగినప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ప్రయోజనాలనేకం..
అందుకే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినా పర్యటనలు సజావుగా సాగిపోగలవు. ఎందుకంటే.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంటే డైలీ అలవెన్సు, పాస్‌పోర్టులు.. టికెట్లు మొదలైన ట్రావెల్ పత్రాలు పోగొట్టుకుంటే పరిహారం, చెకిన్ బ్యాగేజీ పోయినా పరిహారం, వైద్య చికిత్స ఖర్చులు మొదలైన వాటన్నింటినీ బీమా కంపెనీయే చూసుకుంటుంది. నగదుపరమైన పరిహారం ఇవ్వడమే కాకుండా.. విస్తృతమైన నెట్‌వర్క్ ఉన్న పెద్ద బీమా సంస్థలు మరిన్ని అదనపు సర్వీసులు కూడా అందించగలవు. ఉదాహరణకు మొరాకో లాంటి ఏ దేశంలోనో పాలసీదారుకు అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు హెలికాప్టర్‌లాంటి వాటి ద్వారా సైతం వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ఆస్పత్రులకు తరలించగలవు. ప్రాణాంతక పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు ఇలాంటి సర్వీసులు ప్రాణాలు నిలబెట్టగలవు.
చౌకయినవి.. నమ్మకమైనవి...
ప్రస్తుతం బీమా సంస్థలు పాలసీదారుల బడ్జెట్‌లు, అవసరాలకు అనుగుణంగా వివిధ పాలసీలు అందిస్తున్నాయి. సుమారు రూ. 800 కడితే చాలు.. 7 రోజుల ట్రిప్‌కి 50,000 డాలర్ల మేర కవరేజీ (ఒక్కరికి) లభించగలదు. కావాలనుకుంటే కస్టమరు తనకు అవసరాన్ని బట్టి మరికొన్ని రైడర్లు కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం పాలసీ ప్రీమియంలో సుమారు 10-20 శాతం కడితే చాలు. గ్రూప్ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తరచుగా విదేశీ పర్యటనలు చేసే వారు మల్టీ-ట్రిప్ ప్లాన్స్ తీసుకుంటే మరికాస్త తక్కువ ప్రీమియంకే లభిస్తాయి.
ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు చౌకైనవి, నమ్మికైనవే కాకుండా తీసుకోవడం కూడా సులభతరమైన ప్రక్రియే. వివిధ కంపెనీలు అందిస్తున్న పాలసీలను, కట్టాల్సిన ప్రీమియంలను ఆన్‌లైన్లో పోల్చి చూసుకుని.. సమగ్రమైనవాటిని అప్పటికప్పుడు కొనుక్కోవచ్చు. ట్రిప్ వివరాలు పొందుపరిస్తే చాలా మటుకు కంపెనీలు తమ కొటేషన్లు అందజేస్తాయి. కనుక, తప్పనిసరి అయినా.. కాకపోయినా ఏదైనా పర్యటనకు బైల్దేరినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ధీమాగా ట్రిప్ పూర్తి చేసుకురావొచ్చు.