ట్రావెల్‌ గాళ్‌.. సోలో జర్నీ | Travel Video Designer Niharika Special Interview | Sakshi
Sakshi News home page

ట్రావెల్‌.. గాళ్‌

Published Wed, Mar 4 2020 11:27 AM | Last Updated on Wed, Mar 4 2020 11:32 AM

Travel Video Designer Niharika Special Interview - Sakshi

సిటీలోని ఇక్ఫై బిజినెస్‌ స్కూల్‌లో బీబీఏ గ్రాడ్యుయేషన్‌ చేస్తూ... శంకర్‌పల్లిలో నివసించే నిహారికా మోహన్‌ తండ్రి వ్యాపారి. అమ్మ గతంలో టీచర్‌గా పనిచేసి మానేసి ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం వరకూ నిహారిక గురించి ఇంతకు మించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అయితే టూర్ల మీద ఆమెకు ఉన్న అభిరుచి ఆమెకు కొత్త ఇమేజ్‌ను ఏర్పరుస్తోంది. తెలంగాణలో ట్రావెల్‌ వీడియోలు రూపొందిస్తున్న తొలి టీనేజర్‌గానే కాకుండా దక్షిణాదిలో సోలో జర్నీ చేస్తూ చానెల్‌ నిర్వహిస్తున్న మొదటి యువతిగా తనకు వస్తున్న స్పందనతో నిహారిక మరింత జోరుగా జర్నీ చేసేస్తోంది. ఈ క్రేజీగాళ్‌ పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే... 

ది 18తో... 
నాకు చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. ఎదో వెళ్లొచ్చామా అన్నట్టు కాకుండా మంచి జ్ఞాపకంలా ఉండాలనుకుంటాను. అందుకే నేను వెళ్లిన ప్రాంతాన్ని వీడియో తీయడం అలవాటుగా మారింది. ఎక్కడో ఉన్న ప్రదేశాలని వెతుక్కుంటూ వెళ్లడం కాదు, మన దగ్గర ఉన్న వాటిని సందర్శించాలి అనుకున్నాను. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన స్పాట్స్‌కి వెళ్లాను. నాకు సోలోగా వెళ్లడం ఇష్టం. వయసుకు తగ్గట్టుగా ది 18 పేరుతో ఓ చానెల్‌ ప్రారంభించాను. ఏడాది పాటు వీడియోస్‌ తయారు చేశాను. నాకున్న పర్సనల్‌ ఇంట్రెస్ట్‌ వల్ల అన్నింటికన్నా ట్రావెల్‌ వీడియోస్‌ ఎడిటింగ్, ఫిల్మింగ్‌ బాగా అనిపించేవి. అదే సమయంలో యూట్యూబ్‌లో అప్పటికే బాగా అనుభవం ఉన్న సీఏపీడీటీకి చెందిన శరత్‌ అంకిత్‌ నన్ను కలిశారు. ఇద్దరం కలిసి ట్రావెల్‌ వీడియోస్‌ ప్లాన్‌ చేశాం. అక్కడ నుంచి మా జర్నీ ప్రారంభమైంది. ప్రయాణాలనేవి మామూలే కానీ... అమ్మాయిలు ఒంటరిగా జర్నీ చేయడం అనేది అడ్వంచరస్‌ అని కూడా అనిపిస్తుంది కదా. అందుకే  సోలో గాళ్‌ ట్రావెలింగ్‌ని ఎంచుకుని ‘గాళ్‌ ఆన్‌ వీల్స్‌’ స్టార్ట్‌ చేశాం. అందరికీ బాగా నచ్చింది. దానికే బాగా ప్రశంసలు వచ్చాయి. స్పందన చాలా బాగుంది. నేను దీన్ని కొనసాగించగలనా? తెలుగు ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేస్తారా? వంటి సందేహాలు చాలా వచ్చాయి.

ప్రకృతి ఒడిలో.... 
మొదటి నుంచి కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్నా, అక్కడి సంస్కృతులను అధ్యయనం చేయడమన్నా అమితమైన ఆసక్తి. ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడ చారిత్రాత్మకంగా, సంస్కృతి పరంగా విశిష్టత కలిగిన వాటిని తెలుసుకొని వెళతాను.  ఇప్పటి వరకు నేను వెళ్లిన ప్రాంతాల్లో తిరుమల మరిచిపోలేని అనుభూతిని ఇచ్చింది. ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగానే కాకుండా అద్భుతమైన ప్రకృతి సంపదకి నిలయం. ఇప్పటికీ సహజమైన ప్రకృతితో కనువిందు చేస్తుంది తిరుమల. అంతేకాకుండా ట్రావెలింగ్‌ని ఆస్వాదించాలంటే కచ్చితంగా కోస్తా తీరం వెళ్లాల్సిందే. నా జర్నీలో భాగంగా కాకినాడ, భద్రాచలం వెళ్లాను. గోదావరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిసరాలు మనస్సుని కట్టిపడేశాయి. పచ్చని ప్రకృతితో ఒడిలో ఒంటరిగా సేదతీరడం ఒక మధుర జ్ఞాపకంలా మిగిలి పోయింది. ఈ విధంగా మరెన్నో ప్రాంతాలకు వెళ్లి నా అభిరుచులను నెరవేర్చుకోవడం ఆనందంగా ఉంది. తదుపరి ఇతర రాష్ట్రాల ప్రయాణంలో భాగంగా కర్ణాటక వెళ్తున్నాను. 

బ్యాలెన్స్‌ చేసుకుంటూ... 
మా కాలేజ్‌లో అటెండెన్స్‌ చాలా ఇంపార్టెంట్‌. 75 శాతం తప్పకుండా ఉండాలి. కాబట్టి చాలా వరకూ వారాంతపు సెలవుల్లో టూర్లు వెళ్లి వస్తున్నా. ఎడిటింగ్‌ డబ్బింగ్‌ వంటి పన్లన్నీ కాలేజ్‌ నుంచి వచ్చేశాక నేరుగా ఆఫీసుకి వెళ్లిపోయి సాయంత్రాలలో చేసుకుంటున్నా. రాత్రి పూట ఇంటికి తిరిగివెళుతున్నా. యూ ట్యూబ్‌ వాళ్లు విభిన్న ప్రాంతాల్లో నిర్వహించిన 5 ఈవెంట్స్‌కి ఆహా్వనం అందుకున్నా. అలాగే టూర్లు వెళ్లే వారికి వీలైనంత హెల్ప్‌ఫుల్‌గా, అదే సమయంలో ఎంటర్‌టైనింగ్‌గా కూడా నా వీడియోస్‌ ఉండాలి. ఆంధ్రా, తెలంగాణ కలిపి 4 భాగాలు, 6 వీడియోస్‌ పోస్ట్‌ చేశాను. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే బడ్జెట్‌ ఫ్రెండ్లీ ట్రావెల్‌కి నేను ప్రాధాన్యం ఇస్తాను. కాలేజ్‌ స్టూడెంట్‌గా ఉన్న నాకు ఒక కాలేజ్‌ ఫెస్ట్‌లో ప్రసంగించమని ఆహ్వానం రావడం నా లైఫ్‌లో క్రేజీ మూమెంట్‌గా చెప్పాలి. నా లాంటి సాధారణ అమ్మాయి కూడా తలచుకుంటే ఏదో ఒకటి సాధించగలదనే విషయం లైఫ్‌లో అని అందరికీ అర్థమవ్వాలి. గతంలో ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండేదాన్ని కాదు. నేనేమీ సాధించలేక పోతున్నాననే ఒక నిస్పృహ నాలో ఉండేది. అయితే ఈ వర్క్‌ స్టార్ట్‌ చేశాక అంతా మారిపోయింది. నాకు 20 ఏళ్లంటే ఎవరూ నమ్మరు. నేను బాగా కష్టపడుతున్నానంటున్నారు. అయితే నేనేం చేస్తున్నాను అనేదానిపై నాకు పూర్తి స్పష్టత ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement