సంక్రాంతి ప్రయాణం సాఫీగా..  | Precautionary measures by the police force for sankaranthi journeys | Sakshi
Sakshi News home page

సంక్రాంతి ప్రయాణం సాఫీగా.. 

Published Fri, Jan 12 2024 4:57 AM | Last Updated on Fri, Jan 12 2024 4:57 AM

Precautionary measures by the police force for sankaranthi journeys - Sakshi

చౌటుప్పల్, కోదాడ :  సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగిపోయేందుకు జీఎంఆర్‌ సంస్థ, పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతున్నాయి. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై పండగ వేళ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు సంక్రాంతి పండుగకు తమ స్వస్థలాలకు వెళ్తారు. ముఖ్యంగా హైదరాబాద్, ఆ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి వెళ్లేవారితో 65వ నంబర్‌ హైవేపై విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయలసీమ మినహా మిగతా అన్ని ప్రాంతాలకు రోడ్డుమార్గంలో వెళ్లే వారికి ఇదే ప్రధాన రహదారి. లెక్కకు మించిన వాహనాలు బారులు తీరడంతో సంక్రాంతి సమయంలో ఈ హైవేపై ట్రాఫిక్‌ నత్తనడకన సాగుతుంది. ఇక సంక్రాంతికి ముందు రోజైతే టోల్‌గేట్ల వద్ద గంటల తరబడి స్తంభించిపోతుంది.

ఇక ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఇక అంతే. ఈ నేపథ్యంలో.. శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు దృష్టిలో ఉంచుకుని జీఎంఆర్‌ సంస్థ ఇప్పటికే తగు చర్యలు చేపట్టింది. మరోవైపు పోలీసులు కూడా అవసరమైన చర్యలు చేపట్టారు. కాగా స్వస్థలాలకు బయలుదేరిన ప్రయాణికులతో గురువారం నాడే హైవేపై రద్దీ పెరిగింది. 

సొంతవాహనాలపైనే రాక పోకలు 
సంక్రాంతి సమయంలో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోంది. గతంలో ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకునేవారు. ప్రస్తుతం ఎక్కువగా సొంత వాహనాల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. రైళ్లు, బస్సుల్లోని రద్దీని తట్టుకోలేక కొందరు అద్దె వాహనాలను తీసుకొని స్వస్థలాలకు వెళ్లి వస్తుంటారు. దీంతో హైవేపై రద్దీ ఏర్పడుతోంది. గతేడాది సంక్రాంతి పండుగ సమయంలో రోజూ 55 నుంచి 60 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 70 నుంచి 75 వేల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

బ్లాక్‌స్పాట్ల వద్ద భద్రంగా వెళ్లాలి
హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించినప్పటికీ వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు 275 కి.మీ. దూరం ఉండగా అందులో చౌటుప్పల్‌ మండలంలోని దండుమల్కాపురం నుంచి కృష్ణా జిల్లా నందిగామ శివారు వరకు 181 కి.మీ. మేర టోల్‌రోడ్డు ఉంది. కాగా ఈ మార్గంలో ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలు (బ్లాక్‌ స్పాట్లు) చాలా ఉన్నాయి.

ఆయా ప్రాంతాలను అధికారులు గుర్తించారు. దండుమల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, చౌటుప్పల్, అంకిరెడ్డిగూడెం, పంతంగి, రెడ్డిబావి, పెద్దకాపర్తి, చిట్యాల, గోపలాయిపల్లి, ఏపీ లింగోటం, కట్టంగూర్, పద్మానగర్‌ జంక్షన్, ఇనుపాముల, కొర్లపహాడ్, టేకుమట్ల, చీకటిగూడెం, సూర్యాపేట శివారు (జనగామ క్రాస్‌రోడ్డు), మునగాల, ముకుందాపురం, ఆకు పాముల బైపాస్, కొమరబండ వై జంక్షన్‌ కట్టకొమ్ముగూడెం క్రాస్‌రోడ్డు, రామాపురం క్రాస్‌రోడ్డు, నవాబ్‌పేట, షేర్‌మహమ్మద్‌పేట ప్రాంతాలను ప్రధాన బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించారు.

ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణకు లైటింగ్, సైన్‌ బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు చేపట్టారు. రేడియం స్టిక్కర్లతో కూడిన రోడ్‌ మార్జిన్‌ మార్కింగ్‌లూ వేశారు. 

ప్రతి 20 కిలోమీటర్లకుఒక అంబులెన్స్‌  
సంక్రాంతి రద్దీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీఎంఆర్‌ సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసింది. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్‌తో కూడిన వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచుతోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ క్రేన్‌లను సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో టోల్‌ప్లాజా పరిధిలో షిప్టుకు 20మంది చొప్పున అదనపు సిబ్బందిని జీఎంఆర్‌ సంస్థ ఏర్పాటు చేసింది.

ఈ హైవేపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు, కీసర ప్రాంతాల్లో టోల్‌ప్లాజాలు ఉన్నా యి. పోలీస్‌శాఖ ప్రతి టోల్‌ప్లాజా వద్ద 20 మంది పోలీస్‌లతో ప్రత్యేక టీమ్‌లను నియమించనుంది. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా 1033 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.  

పొద్దునే ప్రయాణం వద్దు 
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఉదయం పొగమంచు అధికంగా ఉంటోంది. దీని వల్ల రహదారిపై ప్రమా దాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువ. ఉదయం పొగమంచు తగ్గిన తర్వాతే ప్రయాణాలు పెట్టుకోవాలని కూడా పోలీసులు చెపుతున్నారు. రహదారిపై ప్రమాదం జరిగే చాన్స్‌ ఉన్న ప్రదేశాలను ముందుగానే తెలుసుకుని జాగ్రత్తగాప్రయాణించాలని పేర్కొంటున్నారు. 

ఫాస్టాగ్‌ సరిచూసుకోండి 
వాహనదారులు తమ వాహనాలకు ఫాస్టాగ్‌ వ్యాలిడిటీ ఉందో లేదో చూసుకోవాలి. సరిపడా నగదు ఉందో లేదో గమనించాలి. బ్లాక్‌లిస్టులో పడితే తిరిగి అప్‌డేట్‌ కావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉన్నా నగదు లేకపోతే టోల్‌ బూత్‌లోకి వెళ్లాక ఆ విషయం తెలిస్తే లైన్‌లోనే చిక్కుకోవాల్సి వస్తుంది. అప్పటికప్పుడు రీచార్జ్‌ చేసినా సేవలు అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. 

అక్కడ కాస్త జాగ్రత్త 
అబ్దుల్లాపూర్‌ మెట్‌: హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌ నుంచి చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపూర్‌ వరకు 24 కిలోమీటర్ల మేర విజయవాడ జాతీయ రహదారిని ఆరులేన్లుగా విస్తరించే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వనస్థలిపురం నుంచి దండుమల్కాపూర్‌ వరకు పనులు ప్రారంభంగా కాగా నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో మాత్రమే రోడ్డు విస్తరణ పూర్తి దశకు చేరుకుంది. చాలా చోట్ల రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వాహనాల సంఖ్య పెరిగిన సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 

ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు 
హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై ప్రమాదాల నివారణకు పెట్రోలింగ్‌ పెంచాం. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపకుండా, రాంగ్‌ రూట్, ఓవర్‌ స్పీడ్‌ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా పరిధిలో కొన్ని ప్రధాన బ్లాక్‌ స్పాట్స్‌ గుర్తించాం. ఇక్కడ ప్రమాదాలు సంభవించకుండా నిబంధనలు అమలు చేస్తున్నాం. స్పీడ్‌ లిమిట్‌ బ్లింక్‌ లైట్స్‌ ఏర్పాటుతో రోడ్డుపై లైనింగ్‌ వేస్తాం. హైవే వెంట ఉన్న గ్రామాల ప్రజలకు, రైతులకు రాంగ్‌ రూట్‌లో వెళ్లవద్దని చెబుతున్నాం. –రాహుల్‌హెగ్డే, ఎస్పీ, సూర్యాపేట జిల్లా

సురక్షిత ప్రయాణానికి తగిన ఏర్పాట్లు 
సంక్రాంతి పండుగ రద్దీని ఇప్పటికే అంచనా వేశాం. ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం.  – శ్రీధర్‌రెడ్డి, జీఎంఆర్‌ సంస్థ మేనేజర్‌ 

రోడ్డుపై వాహనాలు నిలపొద్దు 
జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్‌ల వద్ద అధికారులు వేగాన్ని, వాహనాలను నియంత్రించడానికి స్పీడ్‌ కంట్రోల్‌ స్టాపర్లను, బారికేడ్లను ఏర్పాటు
చేస్తున్నారు. తక్కువ వేగంతో ప్రయాణించడంతో పాటు రోడ్డుమీద ఉన్న స్పీడ్‌ స్టాపర్లను గమనించాలని, అతివేగంగా వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుపై వాహనాలను నిలపవద్దని కోరుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement