సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ
సాక్షి, హైదరాబాద్: నగరం పల్లెబాట పట్టింది. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో గత రెండు రోజులుగా బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగింది. పండగకు మరో మూడు రోజులే ఉండడడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో బయలుదేరారు. దీంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లు, ఎల్‌బీనగర్, ఉప్పల్ తదితర కూడళ్ల వద్ద ప్రయాణికుల రద్దీ కనిపించింది. అలాగే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్‌ల నుంచి కూడా ప్రయాణికులు సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ సంఖ్యలో బయలుదేరారు.
ఈ సంవత్సరం ఆర్టీసీ పుణ్యమా అని పండగ ప్రయాణికులకు కాస్త ఊరట లభించింది. ఆర్టీసీ బస్సుల్ని సాధారణ చార్జీలపైనే ప్రత్యేక బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికుల ఆదరణ పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కడప, కర్నూలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో మాత్రం యథావిధిగా దారిదోపిడీ కొనసాగుతోంది. రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు.
దక్షిణమధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు అరకొరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. డిమాండ్ మేరకు రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలకు అదనంగా ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా వరకు బస్సులపైనే ఆధారపడి ప్రయాణం చేయవలసి వస్తోంది.
అరకొర రైళ్లే...
► ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయవలసి ఉండగా, ఈసారి అదనపు రైళ్లను చాలా వరకు తగ్గించారు.
► కొన్ని ప్రాంతాలకు మాత్రమే సుమారు 20 రైళ్లను అదనంగా ఏర్పాటు చేశారు.
► దసరా సందర్భంగా ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాలకు ► అదనపు రైళ్లను ఏర్పాటు చేయకపోవడంతో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేక ఇబ్బందులకు గురవుతున్నారు.
► ‘కనీసం జనరల్ బోగీలను కూడా అదనంగా ఏర్పాటు చేయడం లేదు. ఒక్కో బోగీలో వందలకొద్దీ కిక్కిరిసి ప్రయాణం చేయవలసి వస్తుంది’. అని కాగజ్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫణీంద్ర విస్మయం వ్యక్తం చేశారు.
► తెలంగాణ ప్రాంతాలకు రైలు సర్వీసుల విస్తరణలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని సికింద్రాబాద్ నుంచి వికారాబాద్‌కు వెళ్తున్న మరో ప్రయాణికుడు శ్రీనివాస్ ఆరోపించారు. దూరప్రాంతాలకు మాత్రమే పరిమితంగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు...
► తెలుగు రాష్ట్రాలకు ప్రతి రోజు సుమారు 3500 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని 4400కు పైగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
► విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, అమలాపురం, ఏలూరు, కర్నూలు, కడప, తిరుపతి తదితర నగరాలతో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.
► అక్టోబర్ 1 నుంచి రద్దీ మరింత పెరగనున్న దృష్ట్యా రోజుకు 500 నుంచి 1000 వరకు అదనపు బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఏ బస్సులు ఎక్కడి నుంచి బయలుదేరుతాయి..
సీబీస్: అనంతపూర్, చిత్తూరు, కడప,కర్నూలు,ఒంగోలు, తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు
ఉప్పల్ క్రాస్‌రోడ్డు: వరంగల్, హనుమకొండ, జనగామ, యాదగిరిగుట్ట వైపు
దిల్‌సుఖ్‌నగర్: నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట ..
జేబీఎస్: కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వైపు వెళ్లేవి..
ఎల్‌బీనగర్: వైజాగ్, విజయవాడ, గుంటూరు వైపు ..
ఎంజీబీఎస్: మహబూబ్‌నగర్,వికారాబాద్, తాండూరు, భద్రాచలం, తదితర ప్రాంతాలకు..
సాధారణ చార్జీలే..
ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించరాదని, సాధారణ చార్జీలపైనే ఆర్టీసీ బస్సులు అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న దృష్ట్యా సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ నాయక్ కోరారు. ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లు నమోదు చేసుకోవచ్చునని, నేరుగా ప్రయాణసమయంలోనూ టిక్కెట్‌లు తీసుకోవచ్చునని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment