వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఒక గ్రీన్‌కార్డ్ నిబంధనకు అమెరికా సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వలసదారులకు గ్రీన్ కార్డ్‌ను నిరాకరించే ఈ విధానం వల్ల భారతీయులు నష్టపోయే అవకాశముంది. మెడిక్ ఎయిడ్, ఫుడ్ స్టాంప్స్, హౌసింగ్ వోచర్స్ తదితర ప్రయోజనాలు పొందిన వారికి అమెరికాలో శాశ్వత నివాస సౌకర్యాన్ని కల్పించే గ్రీన్‌కార్డ్‌ను నిరాకరించాలని ప్రతిపాదిస్తూ ఆ నిబంధనను రూపొందించారు. ఆ నిబంధన అమలుకు ఆమోదం తెలుపుతూ సోమవారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ధర్మాసనంలోని న్యాయమూర్తుల్లో ఐదుగురు ఈ పాలసీకి మద్దతివ్వగా, నలుగురు వ్యతిరేకించారు. ఈ కొత్త నిబంధన అమలుపై స్టే విధిస్తూ న్యూయార్క్‌లోని రెండో సర్క్యూట్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది.
పలు రాష్ట్రాల్లో ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. తాజా నిబంధన ప్రకారం.. గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తాము ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఆశించబోమని, ఈ దేశానికి తాము భారం కాబోమని ధ్రువీకరించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు భవిష్యత్తులోనైనా ఆ ప్రయోజనాలు పొందే అవకాశముందని అధికారులు భావిస్తే.. వారికి గ్రీన్ కార్డ్‌ను నిరాకరించే అవకాశం కూడా ఉంది. ఏటా దాదాపు 5.4 లక్షల మంది గ్రీన్‌కార్డ్‌కు అప్లై చేసుకుంటారు. అయితే, వలసదారుల్లో కొందరికి మాత్రమే.. వారి ఇమిగ్రేషన్ స్టేటస్‌ను బట్టి మెడిక్ ఎయిడ్, ఫుడ్ స్టాంప్స్, హౌసింగ్ వోచర్స్.. తదితర ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అర్హత ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment