కాలిఫోర్నియా : అమెరికా, కెనడాలలో సంగీతం, నాట్యంలో శిక్షణపొందుతున్న విద్యార్ధులను ప్రొత్సహిస్తూ, వారిని గొప్ప కళాకారులుగా సంగీత విధ్వాంసులుగా చూడాలనే ఆశయంతో సిలికానాంధ్ర ప్రారంభించిన మరో వినూత్న కార్యక్రమం 'సంపద '(సిలికానాంధ్ర మ్యూజిక్, ఫర్ఫార్మింగ్ ఆర్ట్ అండ్ డాన్స్ అకాడమీ). పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్యప్రణాళిక ప్రకారం కర్ణాటక సంగీతంలో గాత్రం, వయోలిన్, వీణ, వేణువు(ఫ్లూట్), మృదంగం, హిందుస్తానీ సంగీతంలో గాత్రం, వయొలిన్, సితార్, ఫ్లూట్, తబల, భారతీయ నాట్యాలలో భరతనాట్యం, కూచిపూడి, ఆంధ్ర నాట్యం తదితర కోర్సులలో, తొలిదశ (2సం) ద్వారా జూనియర్ సర్టిఫికేట్, మలిదశ (2సం) ద్వారా సీనియర్ సర్టిఫికేట్ పొందుతారు.
మొదటి సంవత్సరమే సంపదలో 800 మంది విద్యార్ధులు నమోదు చేసుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని సిలికానాంధ్ర సంపద అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరాంతపు పరీక్షలను మే 5, 6 న అమెరికా, కెనడాలలోని 600కు పైగా విద్యార్థులకు వివిధ ప్రాంతాలలో నిర్వహించడంతో పాటు, ఆన్ లైన్ ద్వారా కూడా ఈ పరీక్షలను నిర్వహించామన్నారు. ఈ పరీక్షల నిర్వహణలో అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సిలికానాంధ్ర సాంస్కృతిక సైనికులు సహకారం అందించారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2018-19 విద్యాసంవత్సరపు ప్రవేశాలు మే 15న ప్రారంభమౌతున్నాయని, సంపద గురించిన మరిన్ని వివరాలకు, కొత్త విద్యాసంవత్సరంలో నమోదు కొరకు http://sampada.siliconandhra.org సంప్రదించవచ్చని దీనబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment