రాష్ట్రాభివృద్ధిలో అమెరికా భాగస్వామ్యం
- రెండు వారాల పర్యటనపై మంత్రి కేటీఆర్
- వ్యాపార, వాణిజ్య ఒప్పందాల్లో సఫలమయ్యాం
- పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించేందుకు అమెరికాలోని పలు రాష్ట్రాలు సానుకూలత వ్యక్తం చేశాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. అమెరికాలోని పలు రాష్ట్రాలతో వాణిజ్య, వ్యాపార సంబంధాలు ఏర్పర్చుకోవడంలో తెలంగాణ సఫలమైందని పేర్కొన్నారు. రెండు వారాలపాటు అమెరికాలో పర్యటించి వచ్చిన మంత్రి కేటీఆర్ ఆ విశేషాలతో శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి హోదాలో తమ అమెరికా పర్యటన విజయవంతమైందని తెలి పారు. పలురాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యామని, తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, నూతన పారిశ్రామిక విధా నం గురించి వివరించామని వెల్లడించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానానికి ఆకర్షితులైన ప్రఖ్యాత కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేం దుకు సుముఖత వ్యక్తం చేశాయని, ఐటీ, ఇన్నోవేషన్ రంగాల్లో తమ విధానాలను డ్రీమ్‌వర్క్స్ సీఈవో జెఫ్రీ కాట్జన్‌బర్గ్ ప్రశంసించారని వివరించారు. వచ్చే ఏడాది అక్టోబర్‌లో సిలికాన్‌వ్యాలీలో జరిగే ‘స్టార్టప్ ఫెస్టివల్’కు తనకు ఆహ్వానం అందినట్లు వెల్లడించారు.
సిలికాన్ వ్యాలీలో టీ-హబ్ ఔట్‌పోస్టు
సిలికాన్ వ్యాలీలోని వివిధ కంపెనీలు, పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపినట్లు కేటీఆర్ వెల్లడించారు. ప్రవాస భారతీయుల సహకారంతో సిలికాన్‌వ్యాలీలో ‘టీ-హబ్ ఔట్‌పోస్టు’ ఏర్పాటుకు మార్గం సుగమమైందని చెప్పారు. ఐటీ, బయోటెక్నాలజీ, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, క్లీన్‌టెక్ రంగాల్లోని కంపెనీలతో జరిగిన సమావేశాలు ఫలితాన్నిచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఐటీ దిగ్గజ కంపెనీలతో జరిగిన సమావేశాలు రాష్ట్రంలో ఐటీ రంగానికి ఊతమిస్తాయని వెల్లడించారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చేలా పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించగలిగామని వెల్లడించారు.