ఈ వీసాతో వెళ్తే ‘తిరుగు టపా’నే!
♦ అమెరికా, బ్రిటన్‌లోని నిషేధిత యూనివర్సిటీలతో కాంట్రాక్ట్
♦ బోగస్ ధ్రువీకరణ పత్రాలతో స్టూడెంట్ వీసా ప్రాసెసింగ్
♦ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అమెరికా ప్రభుత్వం నిషేధించిన కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీ, నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులుగా చేరడానికి వెళ్తున్న 20 మందిని శనివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్ అధికారులు ఆపేసిన విషయం మరువకముందే.. ఇదే తరహా వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని, విద్యార్థుల్ని మోసం చేస్తున్న బోగస్ కన్సల్టెన్సీ గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రట్టు చేశారు. ప్రధాన నిందితుడు మీర్ ఆమిర్ అలీఖాన్‌ను అరెస్టు చేసి, భారీగా బోగస్ పత్రాలు, స్టాంపులను స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. నానల్‌నగర్‌కు చెందిన అలీఖాన్ ఎంబీఏ పూర్తి చేశాడని, 2009లో మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో పసిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ ఓవర్సీస్ కెరియర్స్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడని, ఇతడికి నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్సిటీతో ఒప్పందం ఉందని చెప్పారు.
అటు విజిట్.. ఇటు స్టడీ వీసాలు..
తొలినాళ్లల్లో అలీఖాన్.. విజిటింగ్ వీసాలతో పాటు స్టడీ వీసాలు ఇప్పించేవాడు. వీటి ప్రాసెసింగ్‌కు అవసరమైన బ్యాంక్ స్టేట్‌మెంట్లు, రుణ మంజూరు పత్రాలు, వివిధ కాలేజీల పేర్లతో ఉండే సిఫార్సు పత్రాలు, చార్టెడ్ అకౌంటెంట్ నివేదికలు, అఫిడవిట్లు, నాన్-జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు.. బోగస్‌వి తయారు చేసేవాడు. స్టాంపులు కూడా నకిలీవి రూపొందించాడు. అతని కార్యాలయంలో ఏడెనిమిది మంది ఉద్యోగుల్నీ నియమించుకున్నా డు. నకిలీ పత్రాలు అందించడానికి ఒక్కో వ్యక్తి దగ్గర రూ.30 వేల నుంచి రూ.60 వేల వర కు వసూలు చేసేవాడు.
బోగస్ వర్సిటీలతో ఒప్పందాలు..
నిషేధిత జాబితాలో చేర్చే వర్సిటీలు యూఎస్, యూకేల్లో అనేకం ఉన్నాయి. ఇలాంటి కోవకే చెందిన ఫ్రెండ్లీ వర్సిటీ, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ యూఎస్‌ఏలతో పాటు నిషేధిత జాబితాలో చేరిన నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్సిటీతోనూ ఇతడికి ఒప్పందాలున్నాయి. వర్సిటీలో చేర్చిన ఒక్కో విద్యార్థికి 600 నుంచి వెయ్యి డాలర్ల వరకు అలీఖాన్‌కు కమీషన్ ఇచ్చేవి. విదేశాల్లో చదువు కోసం ప్రయత్నించే విద్యార్థుల పాస్‌పోర్ట్‌తో పాటు ఇతర వివరాలు తీసుకునేవాడు. ఆయా వర్సిటీల నుంచి కొరియర్ ద్వారా ‘ఐ-20’ ఫామ్‌ను తెప్పించేవాడు. ఆ వర్సిటీల్లో సీటు ఇప్పించడం ద్వారా రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేసేవాడు.
అలా వెళ్తే ఇక్కట్లు పడాల్సిందే..
అలీఖాన్ ఈ రకంగా కొన్నేళ్లుగా దాదాపు 300 మందిని విదేశాలకు పంపినట్లు పోలీసులు చెపుతున్నారు. ఇతడి మాటలు నమ్మి ఆయా వర్సిటీల్లో చేరడానికి వెళ్లేవారు ఇక్కట్లు పడాల్సిందే. అయితే వెళ్లేప్పుడు విమానాశ్రయంలో ఆపేయడమో, వెళ్ళినా.. అక్కడి విమానాశ్రయం నుంచి వెనుక్కి పంపడమో జరుగుతుందని, తిరిగి వచ్చే చార్జీలు సైతం విద్యార్థులే భరించాల్సి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ కేసును సైఫాబాద్ పోలీసులకు అప్పగించిన అధికారులు అలీఖాన్‌కు సహకరించిన వీరాస్వామి అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు.