SAMPADA
-
‘సంపద’పెంచుకున్న ప్రవాసాంధ్రులు
వాషింగ్టన్: డబ్బు మాత్రమే సంపద కాదు. కళ కూడా ఓ సంపదే. ఆ సంపద సంపాదనలో కొందరు ప్రవాసాంధ్రుల పిల్లలు ముందడుగేశారు. కరోనా కష్టకాలంలో ఇంటి నుంచే సాంస్కృతిక కళల పరీక్షల్లో పాల్గొన 1500 మంది ప్రవాసాంధ్రుల పిల్లలు ఉత్తీర్ణులయ్యారని సిలికానాంధ్ర మ్యూజిక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ(సంపద) డీన్, ప్రెసిడెంట్ దీనబాబు కొండుభట్ల పేర్కొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సంపద ద్వారా ప్రవాసంలో నివసిస్తున్న తెలుగు వారి పిల్లలకు కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, కూచిపూడి, భరతనాట్యంలో శిక్షణనిస్తున్నట్లు ఆయన తెలిపారు. పక్కా పాఠ్యప్రణాళికలతో నిర్వహించే కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి జూనియర్, సీనియర్ సర్టిఫికెట్స్ అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది 1500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా పాసైన వాళ్లకు సర్టిఫికేట్లు అందించినట్లు వివరించారు. కోవిడ్–19 కష్టకాలంలో పరీక్షలను ఇళ్లలో సజావుగా నిర్వహించిన సంపద సభ్యులు ఫణి మాధవ్ కస్తూరి, శాంతి కొండా, ఉష మాడభూషి , తెలుగు విశ్వ విద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డా. రెడ్డి శ్యామలను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసించారని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో చేరదలచిన విద్యార్ధులు SAMPADA.SILICONANDHRA.ORG వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. కరోనా కాలంలో ప్రవాసాంధ్రులకు సాంత్వన చేకూర్చేందుకు సంపద రూపొందించిన కార్యక్రమాలకు అద్భుతమైన స్పందన వచ్చినట్లు వెల్లడించారు. మ్యూజిక్‌పై నిర్వహించిన కాంపిటీషన్‌కు 550 మంది నమోదు చేసుకున్నట్లు చెప్పారు. తొలి విడతలో ఐదు నగరాలలో నిర్వహించిన ప్రాంతీయ పోటీలలో గెలుపొందిన 65 మంది జూలై 11, 12 తేదీల్లో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని సిలికానాంధ్ర వాగ్గేయకార ఉపాధ్యక్షుడు వంశీకృష్ణ నాదెళ్ల తెలిపారు. ఈ పోటీలకు సాంకేతిక నిర్వహణ బాధ్యతను సిలికానాంధ్ర ఉపాధ్యక్షులు ఫణిమాధవ్ కస్తూరి నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 8, 9 తేదిల్లో కర్ణాటక సంగీత వాద్య పరికరాలు వీణ, వయోలిన్, ఫ్లూట్, మృదంగంలో కుడా అంతర్జాలం ద్వారా పోటీలు నిర్వహించబోతుఉన్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనాలనుకునే వారు త్యాగయ్య, దీక్షితార్, శ్యామ శాస్త్రి కృతులను ఎంచుకుని, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు vaggeyakara.siliconandhra.org వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమాలు ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. సంపద కార్యక్రమాలు విజయవంతం కావడానికి నార్త్ కరోలినా నుంచి గౌతమి మద్దాలి, మల్లికా వడ్లమాని, వర్జీనియా నుంచి సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు మాధురి దాసరి, రత్నవల్లి తంగిరాల, మాచిరాజు సుబ్రహ్మణ్యం, న్యూజెర్సీ నుంచి విజయ తురిమెల్ల, బాలు పసుమర్తి, లక్ష్మి నండూరి, రవి కామరసు, సిలికానాంధ్ర ఉపాధ్యక్షుడు శరత్ వేట, చికాగో నుంచి మాలతీ దామరాజు, శాంతి చతుర్వేదుల, సిలికానాంధ్ర ఉపాధ్యక్షురాలు సుజాత అప్పలనేని, పద్మారావు అప్పలనేని, కాలిఫోర్నియా నుంచి మమత కూచిభొట్ల, సృజన నాదెళ్ల, నారాయణ్ రాజు, సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాధ్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ తదితరులు కృషి చేస్తున్నారు. -
నాన్నను తలిస్తే ధైర్యం
ఎన్నో సినిమాలకు డైలాగ్స్ రాసినా, దర్శకత్వం వహించినా జంధ్యాల ఇష్టపడింది మాత్రం ‘ఆపద్బాంధవుడు’లో చేసిన ఆడపిల్ల తండ్రి పాత్రనే. స్త్రీలు కూడా సరదాగా తీసుకునేలా ఆయన వారిపై జోకులు వేశారు గానీ నొచ్చుకునేలా కాదు. ఆయనకు దేవుడు ఇద్దరు అమ్మాయిలను ఇచ్చాడు. ఆయన దేవుడి దగ్గరకు వెళ్లిపోయినా ఆయన జ్ఞాపకాలు వారికి స్థైర్యాన్ని ఇస్తూనే ఉన్నాయి. హాస్యబ్రహ్మగా పేరు సంపాదించుకున్న జంధ్యాలకు కొంచెం లేటు వయసులో సాహితి, సంపద కవలపిల్లలుగా పుట్టారు. వారి ముద్దుమురిపాలు పూర్తిగా చూడకుండానే, ‘మాకు హాస్యాన్ని పంచడానికి రావయ్యా’ అంటూ స్వర్గలోకం నుంచి పిలుపు వచ్చినట్టుంది వెళ్లిపోయారు.‘నాన్న ప్రేమను ఆస్వాదించినది తక్కువ రోజులే అయినా ఆ ఆప్యాయతను మరచిపోలేం. సినిమాల ద్వారా నాన్న చిరంజీవిగా ఉండిపోయారు’ అంటూ తండ్రి జ్ఞాపకాలను తడుముకోకుండా సాక్షితో పంచుకున్నారు సాహితి, సంపద. సాహితి: మాకు నాలుగేళ్ల వచ్చేసరికి నాన్న మాకు దూరమైపోయారు. ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ ఆఖరి సంవత్సరం ఇంటెర్న్‌షిప్‌లో ఉన్నాను. నాన్నని ఎక్కువ కాలం చూడకపోయినా, ఆయన జ్ఞాపకాలను అందరినోటా విని తెలుసుకుంటున్నాం. నాన్న గురించి మాట్లాడమని ఎవరడిగినా నాన్న సినిమాలే గుర్తుకు వస్తాయి. సంపద: మేమిద్దరం కవల పిల్లలం. సాహితి కంటె నేను ఒక్క నిమిషం చిన్నదానిని. బి.కామ్. సిఏ చేస్తున్నాను. సాహితి – సంపద: మా బారసాలకు మేమే అందరినీ ఆహ్వానిస్తున్నట్లుగా ఆహ్వాన పత్రిక వేయించారు నాన్న. సాహితి: బారసాలలో నేను పెన్ను ముట్టుకున్నాను. సంపద: నేను డబ్బులు ముట్టుకున్నాను. సాహితి – సంపద: మా పుట్టిన రోజుకి తీసిన సీడీలు చూస్తే ఎంత గ్రాండ్‌గా చేశారో అర్థం అవుతుంది. ఏనుగులు, గుర్రాలు, ఎర్ర తివాసీ... ఎంతో ఘనంగా చేశారు. సినిమా పరిశ్రమ తరలి వచ్చింది. ఏయన్నార్ అంకుల్, ‘ఏమిటయ్యా! పెళ్లిలా చేస్తున్నావు’ అన్నారట నాన్నతో. నాన్న బతికి ఉంటే ప్రతి పుట్టినరోజు ఇలాగే చేసేవారేమో. సాహితి: నేను నారాయణరెడ్డి తాతగారి జేబులో నుంచి పెన్ను తీసుకున్నానట. అప్పుడు ఆయన ‘పేరుకి తగ్గట్టు పెన్ను తీశావు’ అన్నారట. మేం అన్నం తినకుండా మారాం చేస్తుంటే నాన్న మమ్మల్ని కారులో నెక్లెస్రోడ్కి తీసుకెళ్లి తినిపించేవారని అమ్మ చెబుతుంటే, నాన్నకు మా మీద ఎంత ప్రేమో అనిపిస్తుంది. అవకాశం ఉన్నప్పుడు ఇంటిల్లిపాదినీ ప్రివ్యూకి తీసుకెళ్లే వారట నాన్న. నాన్న తీసిన సినిమాలలో ‘అహనా పెళ్లంట’ చిత్రంలోని బ్రహ్మానందంగారి కామెడీ, డైలాగులు ఇష్టం. హాస్య సంభాషణలే నాన్న ప్రత్యేకత. ‘నాలుగు స్తంభాలాట’, ‘వివాహæభోజనంబు’ సినిమాలు బాగా ఇష్టం. ‘వివాహభోజనంబు’లో సుత్తి వీరభద్రరావు అంకుల్, ‘హైదరాబాదు, సికింద్రాబాదు, అహమ్మదాబాదు...’ అంటూ నగరాల పేర్లు, విజయవాడ వీధుల పేర్లన్నీ చెప్పిన సీన్లు బాగా ఇష్టం. సంపద: ‘చంటబ్బాయ్’లో శ్రీలక్ష్మి ఆంటీ ‘నన్ను కవిని కాదన్నవాడిని కత్తితో పొడుస్తాను’ అని కవిత్వం చెప్పడం సరదాగా అనిపిస్తుంది. సాహితి: చాలా సీన్లు చూస్తుంటే, మా ఇంట్లో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తుంటాయి. జీవితంలో తాను ప్రేరణ పొందిన వాటిని పాత్రలుగా సృష్టించి, హాస్యాన్ని పండించారు నాన్న. ‘రావూ – గోపాలరావూ’ చిత్రంలో రాధాకుమారి ‘స్టీల్ సీత’ పాత్ర అమ్మ వాళ్ల ఫ్రెండ్‌ను చూసి తీశారని అమ్మే చెప్పింది. సంపద: ‘మొగుడు – పెళ్లాలు’ చిత్రంలో ఒక దృశ్యంలో ఇంటికి వచ్చిన బంధువులంతా ఎక్కడా కాలు పెట్టడానికి లేకుండా పడుకుంటారు. అది నాన్న జీవితంలో జరిగిందే. అమ్మవాళ్లు వాళ్ల పెళ్లిరోజున బయటకు వెళదామనుకున్నారుట. ఈలోగా అమ్మ వాళ్ల చుట్టాల వాళ్లు ఒక బస్సులో మా ఇంటికి వచ్చేశారట. ఇల్లంతా నిండి మెట్ల మీద పడుకున్నారట. సాహితి: ‘ఆనందభైరవి’ చిత్రంలో శ్రీలక్ష్మి పాత్రకు ఈల వేయడం అలవాటు. రాజమండ్రి లో ఉంటున్న మా అత్త కామేశ్వరిని చూసి ఆ సీన్లు పెట్టారట. ఆవిడ సినిమాకి వెళ్లినప్పుడు మంచి సీన్ వస్తే విజిల్ వేస్తారు. సంపద: అమ్మవాళ్లు చెన్నైలో ఉండగా నీళ్ల ఇబ్బందులు ఉండటంతో, నీళ్లు వదిలినప్పుడు చిన్న చిన్న గ్లాసుల్లో కూడా పట్టుకునేవారుట. ఆ సీన్‌ని దృష్టిలో ఉంచుకుని, ‘అహ నా పెళ్లంట’ చిత్రంలో నీళ్ల కరవు సీన్‌ను హాస్యం చేశారట నాన్న. తన జీవితంలో ఎక్కడ ఏ మేనరిజమ్ చూసినా దానిని తన సినిమాలలో పెట్టే వారని మా గణేశ్ బావ ఇప్పటికీ చెబుతుంటాడు. సాహితి: నాన్న రాసిన ‘పరమబోరింగ్ మొహం’ డైలాగులని డబ్స్మాష్లో చేశాను. ‘చంటబ్బాయ్’, ‘అహ నా పెళ్లంట’ చిత్రాలలో సన్నివేశాలు కూడా చేశాను. మా సంపద ఏదైనా సినిమా చూస్తే బ్యానర్ నుంచి శుభం కార్డు వరకు కథ ఆపకుండా చెప్తుంది. నాన్న ఉండి ఉంటే ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రంలో శ్రీలక్ష్మి పాత్ర పుట్టింది అనుకునేవారేమో. సంపద: ‘ష్!గప్‌చుప్’ చిత్రంలో ఏవిఎస్ పాత్ర భలే నవ్వొస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ల కామెడీ బాగా ఇష్టం. వారంతా నాన్న సినిమాలు వేసుకుని చూసి సినిమాలు తీస్తారని చెప్పడం విన్నాను. సాహితి: నాన్న రాసిన నాటకాలను షార్ట్ ఫిల్మ్స్‌లా తీయాలనుకుంటున్నాం. అందులో మేమే నటించాలనుకుంటున్నాం. నాన్న రాసుకున్న స్క్రిప్ట్ మా దగ్గర రెడీగా ఉన్నాయి. వాటిని ప్రచురించాలని కూడా ఉంది. సాహితి: నాన్న అంటే ఒక ధైర్యం. సంపద: నాన్న అంటే అభిమానం, గౌరవం. – సంభాషణ: వైజయంతి పురాణపండ చాలా కాలం తరవాత ఇద్దరం పుట్టడంతో ‘నేను ఒకటి కోరుకుంటే నాకు భగవంతుడు రెండు ఇచ్చాడు’ అన్నారట. నాన్న ఏది చేసినా చాలా ప్రత్యేకంగా విలక్షణంగా ఉంటుంది. నేను (సాహితి) కొంచెం సన్నగా ఉంటాననని నన్ను రస్కు అని, నేను (సంపద) కొద్దిగా బొద్దుగా ఉంటానని నన్ను బన్ను అని పిలిచేవార ని అమ్మ చెప్పింది. – సాహితి నాన్న బయటకు నవ్వేవారు కాదట. సీరియస్ గా ఉంటూ, అందరినీ నవ్వించేవారట. అమ్మ తెలుగు మాట్లాడుతూ ఒత్తులు సరిగ్గా పలకలేకపోతే ‘ఒత్తుల డబ్బా పక్కన పెట్టుకో’ అనేవారని అమ్మచెబుతూ ఉంటుంది. నాయనమ్మతో కలిసి అమ్మ మైసూర్‌పాక్ వంటివి చేస్తుంటే ‘రాళ్లు పెట్టి కొట్టుకుని తినాలా, మామూలుగానే చేశావా’ అని సరదాగా ఆట పట్టించేవారట. – సంపద -
15 నుంచి సిలికానాంధ్ర 'సంపద' ప్రవేశాలు
కాలిఫోర్నియా : అమెరికా, కెనడాలలో సంగీతం, నాట్యంలో శిక్షణపొందుతున్న విద్యార్ధులను ప్రొత్సహిస్తూ, వారిని గొప్ప కళాకారులుగా సంగీత విధ్వాంసులుగా చూడాలనే ఆశయంతో సిలికానాంధ్ర ప్రారంభించిన మరో వినూత్న కార్యక్రమం 'సంపద '(సిలికానాంధ్ర మ్యూజిక్, ఫర్ఫార్మింగ్ ఆర్ట్ అండ్ డాన్స్ అకాడమీ). పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్దేశించిన పాఠ్యప్రణాళిక ప్రకారం కర్ణాటక సంగీతంలో గాత్రం, వయోలిన్, వీణ, వేణువు(ఫ్లూట్), మృదంగం, హిందుస్తానీ సంగీతంలో గాత్రం, వయొలిన్, సితార్, ఫ్లూట్, తబల, భారతీయ నాట్యాలలో భరతనాట్యం, కూచిపూడి, ఆంధ్ర నాట్యం తదితర కోర్సులలో, తొలిదశ (2సం) ద్వారా జూనియర్ సర్టిఫికేట్, మలిదశ (2సం) ద్వారా సీనియర్ సర్టిఫికేట్ పొందుతారు. మొదటి సంవత్సరమే సంపదలో 800 మంది విద్యార్ధులు నమోదు చేసుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తోందని సిలికానాంధ్ర సంపద అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరాంతపు పరీక్షలను మే 5, 6 న అమెరికా, కెనడాలలోని 600కు పైగా విద్యార్థులకు వివిధ ప్రాంతాలలో నిర్వహించడంతో పాటు, ఆన్ లైన్ ద్వారా కూడా ఈ పరీక్షలను నిర్వహించామన్నారు. ఈ పరీక్షల నిర్వహణలో అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సిలికానాంధ్ర సాంస్కృతిక సైనికులు సహకారం అందించారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2018-19 విద్యాసంవత్సరపు ప్రవేశాలు మే 15న ప్రారంభమౌతున్నాయని, సంపద గురించిన మరిన్ని వివరాలకు, కొత్త విద్యాసంవత్సరంలో నమోదు కొరకు http://sampada.siliconandhra.org సంప్రదించవచ్చని దీనబాబు తెలిపారు. -
మిల్పీటస్ లో ఘనంగా 'మనబడి' స్నాతకోత్సవం
కాలిఫోర్నియా: అమెరికా, కెనడా, స్కాట్లాండ్ లలో దాదాపు 50 కేంద్రాలలో 1423 మంది సిలికానాంధ్ర మనబడి విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలలో 99.8 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్ధులకు కాలిఫోర్నియాలోని మిల్పీటస్ నగరంలో ఆదివారం ధృవీకరణ పత్రాలను అందజేసారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలో అత్యంత వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం అందించే కర్ణాటక శాస్త్రీయ సంగీతం, హిందుస్తానీ సంగీతం, కథక్, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, వేణువు, వయోలిన్, వీణ, మృదంగం, తబలా కోర్సుల్లోనూ జూనియర్, సీనియర్ సర్టిఫికేట్ స్థాయి పరీక్షలను సిలికానాంధ్రతో కలిసి నిర్వహించడానికి సంబంధించిన అవగాహన పత్రాలపై పరస్పరం అందజేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంపద (SAMPADA - Silicon Andhra Music, Performing Arts & Dance Academy) అని పేరు పెట్టారు . ఈ పరీక్షలలో పాల్గొనే విద్యార్ధులు సెప్టెంబర్ 10, 2017 లోగా sampada.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవలసిందిగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హృద్రోగ నిపుణులు డా. హనిమిరెడ్డి లకిరెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సత్తి రెడ్డి, పరీక్ష నిర్వహణ అధికారి ప్రొఫెసర్ రెడ్డి శ్యామల, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అద్యక్షులు ఆచార్య మునిరత్నం నాయుడు, జర్నలిజం పీఠాధిపతి డా. కడియాల సుధీర్ కుమార్ పాల్గొన్నారు. మనబడి దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో మరొక విశిష్టమైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక గుర్తింపు సంస్థ ఏసీఎస్ వాస్క్ (Accreditation Commission of Schools -Western Association of Schools & Colleges ) డైరెక్టర్ డా. జింజర్ హావనిక్ స్నాతకోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేసి, అమెరికాలోని 35 పైగా రాష్ట్రాలలోని 250 ప్రాంతాలలో నిర్వహిస్తున్న అన్ని మనబడి కేంద్రాలకు, వాస్క్ గుర్తింపునిస్తున్నట్టు ప్రకటించి, అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను మనబడి అద్యక్షులు రాజు చమర్తికి అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ కూచిభొట్ల, దిలీప్ కొండిపర్తి, దీనబాబు కొండుభట్ల, ప్రభ మాలెంపాటి, శాంతి కూచిభొట్ల, శరత్ వేట, శ్రీదేవి గంటి, శ్రీరాం కోట్ని, అనిల్ అన్నం, ఫణి మాధవ్ కస్తూరి, సిలికానాంధ్ర-మనబడి కార్యనిర్వాహక బృందం తదితరులు పాల్గొన్నారు.