మిల్పీటస్ లో ఘనంగా 'మనబడి' స్నాతకోత్సవం
కాలిఫోర్నియా: అమెరికా, కెనడా, స్కాట్లాండ్ లలో దాదాపు 50 కేంద్రాలలో 1423 మంది సిలికానాంధ్ర మనబడి విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలలో 99.8 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్ధులకు కాలిఫోర్నియాలోని మిల్పీటస్ నగరంలో ఆదివారం ధృవీకరణ పత్రాలను అందజేసారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలో అత్యంత వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు.
తెలుగు విశ్వవిద్యాలయం అందించే కర్ణాటక శాస్త్రీయ సంగీతం, హిందుస్తానీ సంగీతం, కథక్, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, వేణువు, వయోలిన్, వీణ, మృదంగం, తబలా కోర్సుల్లోనూ జూనియర్, సీనియర్ సర్టిఫికేట్ స్థాయి పరీక్షలను సిలికానాంధ్రతో కలిసి నిర్వహించడానికి సంబంధించిన అవగాహన పత్రాలపై పరస్పరం అందజేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంపద (SAMPADA - Silicon Andhra Music, Performing Arts & Dance Academy) అని పేరు పెట్టారు . ఈ పరీక్షలలో పాల్గొనే విద్యార్ధులు సెప్టెంబర్ 10, 2017 లోగా sampada.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవలసిందిగా ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ హృద్రోగ నిపుణులు డా. హనిమిరెడ్డి లకిరెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సత్తి రెడ్డి, పరీక్ష నిర్వహణ అధికారి ప్రొఫెసర్ రెడ్డి శ్యామల, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అద్యక్షులు ఆచార్య మునిరత్నం నాయుడు, జర్నలిజం పీఠాధిపతి డా. కడియాల సుధీర్ కుమార్ పాల్గొన్నారు. మనబడి దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో మరొక విశిష్టమైన గుర్తింపు లభించింది.
ప్రతిష్టాత్మక గుర్తింపు సంస్థ ఏసీఎస్ వాస్క్ (Accreditation Commission of Schools -Western Association of Schools & Colleges ) డైరెక్టర్ డా. జింజర్ హావనిక్ స్నాతకోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేసి, అమెరికాలోని 35 పైగా రాష్ట్రాలలోని 250 ప్రాంతాలలో నిర్వహిస్తున్న అన్ని మనబడి కేంద్రాలకు, వాస్క్ గుర్తింపునిస్తున్నట్టు ప్రకటించి, అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను మనబడి అద్యక్షులు రాజు చమర్తికి అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ కూచిభొట్ల, దిలీప్ కొండిపర్తి, దీనబాబు కొండుభట్ల, ప్రభ మాలెంపాటి, శాంతి కూచిభొట్ల, శరత్ వేట, శ్రీదేవి గంటి, శ్రీరాం కోట్ని, అనిల్ అన్నం, ఫణి మాధవ్ కస్తూరి, సిలికానాంధ్ర-మనబడి కార్యనిర్వాహక బృందం తదితరులు పాల్గొన్నారు.