ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ సుందర్ పిచాయ్ లండన్‌కు చెందిన క్రికెట్ జట్టు కోసం వేలం వేసే సిలికాన్ వ్యాలీ ఎగ్జిక్యూటివ్‌ల కన్సార్టియంలో చేరారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ వంటి టాప్ టెక్ లీడర్లతో కూడిన ఈ గ్రూప్ ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ లేదా ‘లండన్ స్పిరిట్’ టీమ్‌ల కోసం 80 మిలియన్ పౌండ్ల (97 మిలియన్ డాలర్లు-రూ.805.1 కోట్లు) బిడ్ వేస్తోంది.
ఈ కన్సార్టియంకు పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ సత్యన్ గజ్వానీ నేతృత్వం వహిస్తున్నారు. యువ క్రికెట్ అభిమానులను ఆకర్షించడానికి రూపొందించిన క్రికెట్ టోర్నమెంట్ ‘ది హండ్రెడ్’ ఎనిమిది జట్లలో ప్రైవేట్ పెట్టుబడులను పొందడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీఈ) చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ బిడ్ దాఖలవుతున్నట్లు తెలిసింది.
100-బాల్ ఫార్మాట్‌తో ‘ది హండ్రెడ్’
100-బాల్ ఫార్మాట్‌ను అనుసరించే ది హండ్రెడ్ 2021లో ప్రారంభించినప్పటి నుంచి అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఈ పోటీలో ఎనిమిది నగరాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. ప్రతి ఒక్కటి యూకేలోని ఒక ప్రధాన నగరానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇది స్కై స్పోర్ట్స్, బీబీసీలో ప్రసారం అవుతుంది.
ఇదీ చదవండి: ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిన ఆన్‌లైన్ సేవలు
టెక్ కంపెనీ సీఈఓలకు ఆసక్తి
సుందర్ పిచాయ్‌కు క్రికెట్ పట్ల ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే. టాప్ టెక్ కంపెనీ సారథులు క్రికెట్‌పై ఆసక్తిగా ఉంటూ దాన్ని మరింత మందికి చేరువ చేయాలని చూస్తున్నారు. ఇదిగాఉండగా, ఈసీబీ ప్రతి జట్టులో 49 శాతం వాటాను విక్రయించాలని చూస్తోంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆడే లండన్ స్పిరిట్ జట్టుకు సొంత మైదానం ఉండడంతో దాని నిర్వహణకు సంబంధించి పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment