Manabadi Graduation Ceremony
-
అమెరికాలో ఘనంగా మనబడి విద్యార్ధుల స్నాతకోత్సవం
కాలిఫోర్నియా : అమెరికా, స్కాట్లండ్, కెనడా దేశాలలోని 50కి పైగా కేంద్రాలలో మనబడి విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన పరీక్షలకు 2230 మంది విద్యార్ధులు హజరు కాగా దానిలో 99 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు కాలిఫోర్నియా, లాస్ ఎంజెలెస్, డాలస్లలో అత్యంత వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమాలలో తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్ వి సత్యనారాయణ చేతులమీదుగా విద్యార్ధులు ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. ఆచార్య ఎస్ వీ సత్యనారాయణ మాట్లాడుతూ, పుట్టిన దేశానికి ఎంతో దూరంగా ఉన్నా మాతృభాషపై మమకారంతో తెలుగు భాషను పిల్లలకు నేర్పిస్తున్న తల్లితండ్రులకు, వారికి శిక్షణనిస్తున్న గురువులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మనబడి అధ్యక్షులు రాజు చమర్తి మాట్లాడుతూ, గత 12 సంవత్సరాలలో దాదాపుగా 45,000 మందికి పైగా విద్యార్ధులు మనబడి ద్వారా తెలుగు నేర్చుకున్నారని, అమెరికా వ్యాప్తంగా 250 పైగా కేంద్రాల ద్వారా మనబడి తరగతులు నిర్వహిస్తునామని తెలిపారు. 2019-2020 విద్యాసంవత్సరానికి నమోదు కార్యక్రమం ప్రారంభమైందని, manabadi.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సిలికానాంధ్ర సంపద ద్వారా తెలుగు విశ్వవిద్యాలయం వారు కర్ణాటక శాస్త్రీయ సంగీతం, హిందుస్తానీ సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, వేణువు, వయోలిన్, వీణ, మృదంగం, తబలా కోర్సులలో నిర్వహించే జూనియర్ మరియు సీనియర్ సర్టిఫికెట్ పరీక్షలలో ఉత్తీర్ణులైన 333 మంది విద్యార్ధులకు కూడా ఈ కార్యక్రమంలో ధృవీకరణ పత్రాలను అందించారు. తెలుగు విశ్వవిద్యాలయం పరీక్ష నిర్వహణ అధికారి ప్రొఫెసర్ రెడ్డి శ్యామల, జర్నలిజం పీఠాధిపతి డా. కడియాల సుధీర్ కుమార్, తెలుగు విశ్వవిద్యాలయ అధికారులు డా. గాబ్రియెల్, డా. చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర సంపద కొసం రూపకల్పన చేసిన నూతన లోగోను, మనబడి బాలరంజని మొబైల్ అప్లికెషన్, ప్రముఖ రచయిత అనంత్ శ్రీరాం రచించిన మనబడి గీతాన్ని కూడా తెలుగు విశ్వ విద్యాలయ ఉపాధ్యక్షుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. మన సంస్కృతి పట్టుగొమ్మలైన భారతీయ కళలను రేపటి తరానికి అందించే దిశగా సిలికానాంధ్ర సంపద కృషి చేస్తోందని, మొదటి సంవత్సరమే దాదాపుగా 1400 మందికి పైగా విద్యార్ధులు, 150 మందికిపైగా సంగీత నృత్య గురువులు నమోదు చేసుకోవడం, భారతీయ కళల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందనడానికి నిదర్శనమని సిలికానాంధ్ర సంపద అధ్యక్షులు దీనబాబు కొండుభట్ల అన్నారు. మనబడి, సంపద స్నాతకోత్సవ కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ మాతృదేశాన్ని, మాతృ భాషని మర్చిపోలేమని, భారతీయ సంస్కృతి, సంప్రదాయం, కళలు ఎంతో ఉత్కృష్టమైనవి, ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శప్రాయమైనవి కాబట్టే మనబడి ద్వారా తెలుగు భాషని, సిలికానాంధ్ర సంపద ద్వారా భారతీయ కళలని ప్రవాస బాలలకు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో దిలీప్ కొండిపర్తి, శాంతి కూచిభొట్ల, శ్రీదేవి గంటి, శ్రీరాం కోట్ని, ఫణి మాధవ్ కస్తూరి, శాంతి కొండ, ఉష మాడభూషి, స్నేహ వేదుల, జయంతి కోట్ని, మనబడి కార్యనిర్వాహక బృందం తదితరులు పాల్గొన్నారు. -
మిల్పీటస్ లో ఘనంగా 'మనబడి' స్నాతకోత్సవం
కాలిఫోర్నియా: అమెరికా, కెనడా, స్కాట్లాండ్ లలో దాదాపు 50 కేంద్రాలలో 1423 మంది సిలికానాంధ్ర మనబడి విద్యార్ధులకు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్షలలో 99.8 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్ధులకు కాలిఫోర్నియాలోని మిల్పీటస్ నగరంలో ఆదివారం ధృవీకరణ పత్రాలను అందజేసారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ డా. హనిమిరెడ్డి లకిరెడ్డి భవనంలో అత్యంత వైభవంగా నిర్వహించిన స్నాతకోత్సవంలో తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం అందించే కర్ణాటక శాస్త్రీయ సంగీతం, హిందుస్తానీ సంగీతం, కథక్, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్ర నాట్యం, వేణువు, వయోలిన్, వీణ, మృదంగం, తబలా కోర్సుల్లోనూ జూనియర్, సీనియర్ సర్టిఫికేట్ స్థాయి పరీక్షలను సిలికానాంధ్రతో కలిసి నిర్వహించడానికి సంబంధించిన అవగాహన పత్రాలపై పరస్పరం అందజేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంపద (SAMPADA - Silicon Andhra Music, Performing Arts & Dance Academy) అని పేరు పెట్టారు . ఈ పరీక్షలలో పాల్గొనే విద్యార్ధులు సెప్టెంబర్ 10, 2017 లోగా sampada.siliconandhra.org ద్వారా నమోదు చేసుకోవలసిందిగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హృద్రోగ నిపుణులు డా. హనిమిరెడ్డి లకిరెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సత్తి రెడ్డి, పరీక్ష నిర్వహణ అధికారి ప్రొఫెసర్ రెడ్డి శ్యామల, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అద్యక్షులు ఆచార్య మునిరత్నం నాయుడు, జర్నలిజం పీఠాధిపతి డా. కడియాల సుధీర్ కుమార్ పాల్గొన్నారు. మనబడి దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో మరొక విశిష్టమైన గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక గుర్తింపు సంస్థ ఏసీఎస్ వాస్క్ (Accreditation Commission of Schools -Western Association of Schools & Colleges ) డైరెక్టర్ డా. జింజర్ హావనిక్ స్నాతకోత్సవానికి విశిష్ట అతిథిగా విచ్చేసి, అమెరికాలోని 35 పైగా రాష్ట్రాలలోని 250 ప్రాంతాలలో నిర్వహిస్తున్న అన్ని మనబడి కేంద్రాలకు, వాస్క్ గుర్తింపునిస్తున్నట్టు ప్రకటించి, అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను మనబడి అద్యక్షులు రాజు చమర్తికి అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ కూచిభొట్ల, దిలీప్ కొండిపర్తి, దీనబాబు కొండుభట్ల, ప్రభ మాలెంపాటి, శాంతి కూచిభొట్ల, శరత్ వేట, శ్రీదేవి గంటి, శ్రీరాం కోట్ని, అనిల్ అన్నం, ఫణి మాధవ్ కస్తూరి, సిలికానాంధ్ర-మనబడి కార్యనిర్వాహక బృందం తదితరులు పాల్గొన్నారు. -
సిలికాన్ వ్యాలీలో ఘనంగా మనబడి స్నాతకోత్సవం
సిలికాన్ వ్యాలీ : మనబడి విద్యార్ధులను చూస్తుంటే తెలుగుభాష భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోందని తెలుస్తోందని డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. మనబడి నిర్వహిస్తున్న ఈ అద్భుత కార్యక్రమం అందరికీ ఆదర్శ ప్రాయమైనది అని స్పష్టం చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా తెలుగు భాషా పరిరక్షణ కోసం కృషి చేస్తున్న సిలికానాంధ్ర మనబడి హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అనుబంధంగా నిర్వహిస్తున్న 'మనబడి ' స్నాతకోత్సవం ఆదివారం శాన్ హోసే లోని పార్క్ సైడ్ కన్వెన్షన్ సెంటర్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ శ్రీ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ... ఆంధ్రులు ఆరంభ శూరులు అని అంటుంటారని ... కానీ సిలికానాంధ్రులు ఏదైనా మొదలు పెడితే విజయం సాధించే వరకూ వెనుతిరగరని రుజువు చేశారని 150 మందితో మొదలుపెట్టి నేడు 6000 మందికి పైగా విద్యార్ధులు చదువుకునే విధంగా ఈ విద్యా వ్యవస్థను నిర్వహించడం ద్వారా సిలికానాంధ్ర మనబడి నిర్వాహుకులు ఆ సత్యాన్ని నిరూపించారని కొనియాడారు. 2015-16 విద్యా సంవత్సరానికి తెలుగు విశ్వ విద్యాలయం నిర్వహించిన పరీక్ష విశేషాలను రిజిస్ట్రార్ ఆచార్య తోమాసయ్య వివరిస్తూ మనబడి విద్యార్ధులు భాషను లోతుగా అభ్యసించడంలో చూపుతున్న అంకిత భావం తమను ముగ్ధులను చేసిందని ప్రశంసించారు. 2007లో ' మనబడి ' ప్రారంభించింది మొదలు అనేక అద్భుతాలను సృష్టిస్తూ, కొద్దికాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద తెలుగు భాషా బోధన కార్యక్రమంగా పేరు పొందిందని సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిభొట్ల ఆనంద్ సంతోషం వ్యక్తం చేశారు. మనబడి అద్యక్షులు రాజు చమర్తి ప్రసంగిస్తూ, మనబడి 10 కి పైగా దేశాల్లో, అమెరికాలో దాదాపు 35 రాష్ట్రాలలో 250 కి పైగా శాఖలతో 1000 కి పైగా భాషా సైనికులతో ఒక భాషాఉద్యమంలా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. ఈ ఏడాది 6000 మంది విద్యార్ధులు తెలుగు నేర్చుకుంటున్నారని ఆనంద్ వెల్లడించారు. మనబడి ఉపాధ్యక్షులు దీనబాబు కొండుభట్ల మాట్లాడుతూ... తెలుగు విశ్వవిద్యాలయం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తూ మనబడి కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. ఈ కోర్సు చదివిన వారికి అమెరికాలోని వివిధ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్స్ లభిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం లో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య తోమాసయ్య, అంతర్జాతీయ తెలుగు కేంద్రం అధిపతి డా. మునిరత్నం నాయుడు, పరీక్షల విభాగం అధిపతి డా. వై. రెడ్డి శ్యామల, ప్రజా సంబంధాల అధికారి డా. జె.చెన్నయ్య, సిలికానాంధ్ర వైస్ చైర్మెన్ దిలీప్ కొండిపర్తి, అద్యక్షులు సంజీవ్ తనుగుల, రవీంద్ర కూచిభొట్ల, కిషోర్ బొడ్డు, ప్రభ మాలెంపాటి, మృత్యుంజయుడు తాటిపామల, శ్రీరాం కోట్ని, మనబడి ఉపాద్యక్షులు శాంతి కూచిభొట్ల, భాస్కర్ రాయవరం, శ్రీదేవి గంటి, శిరీష చమర్తి, శ్రీవల్లి కొండుభట్ల, ప్రియ తనుగుల, స్నేహ వేదుల, అనిల్ అన్నం, జయంతి కోట్ని, పాత్రికేయులు బుద్ధవరపు జగన్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు.