నాన్నను తలిస్తే ధైర్యం | Special Story On Director Jandhyala Daughters | Sakshi
Sakshi News home page

నాన్నను తలిస్తే ధైర్యం

Published Wed, Jan 15 2020 2:13 AM | Last Updated on Wed, Jan 15 2020 10:29 AM

Special Story On Director Jandhyala Daughters - Sakshi

ఎన్నో సినిమాలకు డైలాగ్స్‌ రాసినా, దర్శకత్వం వహించినా జంధ్యాల ఇష్టపడింది మాత్రం ‘ఆపద్బాంధవుడు’లో చేసిన ఆడపిల్ల తండ్రి పాత్రనే. స్త్రీలు కూడా సరదాగా తీసుకునేలా ఆయన వారిపై జోకులు వేశారు గానీ నొచ్చుకునేలా కాదు. ఆయనకు దేవుడు ఇద్దరు అమ్మాయిలను ఇచ్చాడు. ఆయన దేవుడి దగ్గరకు వెళ్లిపోయినా ఆయన జ్ఞాపకాలు వారికి స్థైర్యాన్ని ఇస్తూనే ఉన్నాయి.

హాస్యబ్రహ్మగా పేరు సంపాదించుకున్న జంధ్యాలకు కొంచెం లేటు వయసులో సాహితి, సంపద కవలపిల్లలుగా పుట్టారు. వారి ముద్దుమురిపాలు పూర్తిగా చూడకుండానే, ‘మాకు హాస్యాన్ని పంచడానికి రావయ్యా’ అంటూ స్వర్గలోకం నుంచి పిలుపు వచ్చినట్టుంది వెళ్లిపోయారు.‘నాన్న ప్రేమను ఆస్వాదించినది తక్కువ రోజులే అయినా ఆ ఆప్యాయతను మరచిపోలేం. సినిమాల ద్వారా నాన్న చిరంజీవిగా ఉండిపోయారు’ అంటూ తండ్రి జ్ఞాపకాలను తడుముకోకుండా సాక్షితో పంచుకున్నారు సాహితి, సంపద.

సాహితి: మాకు నాలుగేళ్ల వచ్చేసరికి నాన్న మాకు దూరమైపోయారు. ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్‌ ఆఖరి సంవత్సరం ఇంటెర్న్‌షిప్‌లో ఉన్నాను. నాన్నని ఎక్కువ కాలం చూడకపోయినా, ఆయన జ్ఞాపకాలను అందరినోటా విని తెలుసుకుంటున్నాం. నాన్న గురించి మాట్లాడమని ఎవరడిగినా నాన్న సినిమాలే గుర్తుకు వస్తాయి.

సంపద: మేమిద్దరం కవల పిల్లలం. సాహితి కంటె నేను ఒక్క నిమిషం చిన్నదానిని. బి.కామ్‌. సిఏ చేస్తున్నాను.

సాహితిసంపద: మా బారసాలకు మేమే అందరినీ ఆహ్వానిస్తున్నట్లుగా ఆహ్వాన పత్రిక వేయించారు నాన్న.
సాహితి: బారసాలలో నేను పెన్ను ముట్టుకున్నాను.

సంపద: నేను డబ్బులు ముట్టుకున్నాను.

సాహితిసంపద: మా పుట్టిన రోజుకి తీసిన సీడీలు చూస్తే ఎంత గ్రాండ్‌గా చేశారో అర్థం అవుతుంది. ఏనుగులు, గుర్రాలు, ఎర్ర తివాసీ... ఎంతో ఘనంగా చేశారు. సినిమా పరిశ్రమ తరలి వచ్చింది. ఏయన్నార్‌ అంకుల్, ‘ఏమిటయ్యా! పెళ్లిలా చేస్తున్నావు’ అన్నారట నాన్నతో. నాన్న బతికి ఉంటే ప్రతి పుట్టినరోజు ఇలాగే చేసేవారేమో.

సాహితి: నేను నారాయణరెడ్డి తాతగారి జేబులో నుంచి పెన్ను తీసుకున్నానట. అప్పుడు ఆయన ‘పేరుకి తగ్గట్టు పెన్ను తీశావు’ అన్నారట. మేం అన్నం తినకుండా మారాం చేస్తుంటే నాన్న మమ్మల్ని కారులో నెక్లెస్‌రోడ్‌కి తీసుకెళ్లి తినిపించేవారని అమ్మ చెబుతుంటే, నాన్నకు మా మీద ఎంత ప్రేమో అనిపిస్తుంది. అవకాశం ఉన్నప్పుడు ఇంటిల్లిపాదినీ ప్రివ్యూకి తీసుకెళ్లే వారట నాన్న. నాన్న తీసిన సినిమాలలో ‘అహనా పెళ్లంట’ చిత్రంలోని బ్రహ్మానందంగారి కామెడీ, డైలాగులు ఇష్టం. హాస్య సంభాషణలే నాన్న ప్రత్యేకత. ‘నాలుగు స్తంభాలాట’, ‘వివాహæభోజనంబు’ సినిమాలు బాగా ఇష్టం. ‘వివాహభోజనంబు’లో  సుత్తి వీరభద్రరావు అంకుల్, ‘హైదరాబాదు, సికింద్రాబాదు, అహమ్మదాబాదు...’ అంటూ నగరాల పేర్లు, విజయవాడ వీధుల పేర్లన్నీ చెప్పిన సీన్లు బాగా ఇష్టం.

సంపద: ‘చంటబ్బాయ్‌’లో శ్రీలక్ష్మి ఆంటీ ‘నన్ను కవిని కాదన్నవాడిని కత్తితో పొడుస్తాను’ అని కవిత్వం చెప్పడం సరదాగా అనిపిస్తుంది.
సాహితి: చాలా సీన్లు చూస్తుంటే, మా ఇంట్లో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తుంటాయి. జీవితంలో తాను ప్రేరణ పొందిన వాటిని పాత్రలుగా సృష్టించి, హాస్యాన్ని పండించారు నాన్న. ‘రావూ – గోపాలరావూ’ చిత్రంలో రాధాకుమారి ‘స్టీల్‌ సీత’ పాత్ర అమ్మ వాళ్ల ఫ్రెండ్‌ను చూసి తీశారని అమ్మే చెప్పింది.

సంపద: ‘మొగుడు – పెళ్లాలు’ చిత్రంలో ఒక దృశ్యంలో ఇంటికి వచ్చిన బంధువులంతా ఎక్కడా కాలు పెట్టడానికి లేకుండా పడుకుంటారు. అది నాన్న జీవితంలో జరిగిందే. అమ్మవాళ్లు వాళ్ల పెళ్లిరోజున బయటకు వెళదామనుకున్నారుట. ఈలోగా అమ్మ వాళ్ల చుట్టాల వాళ్లు ఒక బస్సులో మా ఇంటికి వచ్చేశారట. ఇల్లంతా నిండి మెట్ల మీద పడుకున్నారట.

సాహితి: ‘ఆనందభైరవి’ చిత్రంలో శ్రీలక్ష్మి పాత్రకు ఈల వేయడం అలవాటు. రాజమండ్రి లో ఉంటున్న మా అత్త కామేశ్వరిని చూసి ఆ సీన్లు పెట్టారట. ఆవిడ సినిమాకి వెళ్లినప్పుడు మంచి సీన్‌ వస్తే విజిల్‌ వేస్తారు.

సంపద: అమ్మవాళ్లు చెన్నైలో ఉండగా నీళ్ల ఇబ్బందులు ఉండటంతో, నీళ్లు వదిలినప్పుడు చిన్న చిన్న గ్లాసుల్లో కూడా పట్టుకునేవారుట. ఆ సీన్‌ని దృష్టిలో ఉంచుకుని, ‘అహ నా పెళ్లంట’ చిత్రంలో నీళ్ల కరవు సీన్‌ను హాస్యం చేశారట నాన్న. తన జీవితంలో ఎక్కడ ఏ మేనరిజమ్‌ చూసినా దానిని తన సినిమాలలో పెట్టే వారని మా గణేశ్‌ బావ ఇప్పటికీ చెబుతుంటాడు.

సాహితి: నాన్న రాసిన ‘పరమబోరింగ్‌ మొహం’ డైలాగులని డబ్‌స్మాష్‌లో చేశాను. ‘చంటబ్బాయ్‌’, ‘అహ నా పెళ్లంట’ చిత్రాలలో సన్నివేశాలు కూడా చేశాను. మా సంపద ఏదైనా సినిమా చూస్తే బ్యానర్‌ నుంచి శుభం కార్డు వరకు కథ ఆపకుండా చెప్తుంది. నాన్న ఉండి ఉంటే ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రంలో శ్రీలక్ష్మి పాత్ర పుట్టింది అనుకునేవారేమో.

సంపద: ‘ష్‌!గప్‌చుప్‌’ చిత్రంలో ఏవిఎస్‌ పాత్ర భలే నవ్వొస్తుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్, అనిల్‌ రావిపూడి, హరీశ్‌ శంకర్‌ల కామెడీ బాగా ఇష్టం. వారంతా నాన్న సినిమాలు వేసుకుని చూసి సినిమాలు తీస్తారని చెప్పడం విన్నాను.

సాహితి: నాన్న రాసిన నాటకాలను షార్ట్‌ ఫిల్మ్స్‌లా తీయాలనుకుంటున్నాం. అందులో మేమే నటించాలనుకుంటున్నాం. నాన్న రాసుకున్న స్క్రిప్ట్‌ మా దగ్గర రెడీగా ఉన్నాయి. వాటిని ప్రచురించాలని కూడా ఉంది.

సాహితి: నాన్న అంటే ఒక ధైర్యం.

సంపద: నాన్న అంటే అభిమానం, గౌరవం.
– సంభాషణ: వైజయంతి పురాణపండ

చాలా కాలం తరవాత ఇద్దరం పుట్టడంతో ‘నేను ఒకటి కోరుకుంటే నాకు భగవంతుడు రెండు ఇచ్చాడు’ అన్నారట. నాన్న ఏది చేసినా చాలా ప్రత్యేకంగా విలక్షణంగా ఉంటుంది. నేను (సాహితి) కొంచెం సన్నగా ఉంటాననని నన్ను రస్కు అని, నేను (సంపద) కొద్దిగా బొద్దుగా ఉంటానని నన్ను బన్ను అని పిలిచేవార ని అమ్మ చెప్పింది.
– సాహితి

నాన్న బయటకు నవ్వేవారు కాదట. సీరియస్‌ గా ఉంటూ, అందరినీ నవ్వించేవారట. అమ్మ తెలుగు మాట్లాడుతూ ఒత్తులు సరిగ్గా పలకలేకపోతే ‘ఒత్తుల డబ్బా పక్కన పెట్టుకో’ అనేవారని అమ్మచెబుతూ ఉంటుంది. నాయనమ్మతో కలిసి అమ్మ మైసూర్‌పాక్‌ వంటివి చేస్తుంటే ‘రాళ్లు పెట్టి కొట్టుకుని తినాలా, మామూలుగానే చేశావా’ అని సరదాగా ఆట పట్టించేవారట.
– సంపద

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement