జంధ్యాల
ఏ ప్రత్యేకతా లేకపోవడమే మధ్యతరగతి ప్రత్యేకత. ఏదైనా ప్రత్యేకత కోసం ప్రయత్నించడం కూడా మధ్యతరగతి ప్రత్యేకతే. కవిత్వం చదవడమో కొత్త వంట నేర్చుకోవడమో సంగీతం సాధన చేయడమో ‘క’ భాషో, కలం స్నేహమో ఏవైనా హాస్యాలు తెచ్చేవే. మందహాసాలు పూయించేవే. కోవిడ్ మన పెదాల మీద నవ్వులు దోచుకుపోయింది. నవ్వు చాలా పెద్ద ఇమ్యూనిటీ బూస్టర్. జంధ్యాల వర్థంతి సందర్భంగా ఆయన నవ్వులు తలుచుకుని ఆ కామిక్ టానిక్ తాగుదామా?
ఔత్సాహికులతో కొంచెం గడబిడే. వీళ్లు తమకు ఫలానాది వచ్చు అని గట్టిగా నమ్ముతారు. ఫలానాది నిజంగా తెలిసినవాళ్లు గతుక్కుమంటారు. ‘చారు ఎలా చేయాలో ఒక పాత్ర చేత చెప్పించి కథ అంటావా’ అంటాడు పొట్టి ప్రసాద్ ‘చంటబ్బాయ్’లో శ్రీలక్ష్మితో. ఏమో. అది కథెందుకు కాదు. ‘నెత్తికి రీటా కాలికి బాటా నాకిష్టం సపోటా’ ఇది కూడా కవిత్వమే అని అనుకుంటుంది శ్రీలక్ష్మి. కాని పొట్టి ప్రసాద్ మాత్రం ‘నీకూ నాకూ టాటా... నన్నొదిలెయ్ ఈ పూట’ అని పారిపోవడానికి చూస్తాడు.
‘మనిషికి కాసింత కళాపోషణ ఉండాలి’ అని పూర్వం ముళ్లపూడి మునివర్యుడు అన్నాడు నిజమే. ఆ పోషణ ఎదుటివారి ప్రాణాలకై సాగే అన్వేషణ కారాదు కదా. పెళ్లిచూపులకు వచ్చిన సుత్తి వీరభద్రరావు నోరు మూసుకుని పిల్లను చూసి ఊరుకోకుండా ‘నాకు పాటలు పాడేవారం టే ఇష్టం’ అని అంటాడు పెళ్లికూతురైన శ్రీలక్ష్మి తో. అది శ్రీలక్ష్మి మనసులో పడిపోతుంది. నాకు పాట రాకపోయినా ఇతను పెళ్లి చేసుకున్నాడు.. ఇతన్ని ఏనాటికైనా నా పాటతో మెప్పిస్తాను అని హార్మోనియం పెట్టె ముందేస్కోని సా.. కీ.. కే...ఙ అనే రాగం తీస్తూ ఉంటుంది. భరించువాడు భర్తే అయితే సుత్తి వీరభద్రరావు నిజంగా భర్తే.
అయితే ఈ కళలలో రాణించాలనే పిచ్చి స్త్రీలకే ఉండదు. పురుషులకు కూడా ఉంటుంది. ‘నడుస్తోంది నడుస్తోంది నడుస్తోంది జీవితం’ అని కవిత్వానికి తగులుకుంటాడు సుత్తి వీరభద్రరావు తాను కవి అని నమ్మి ‘పుత్తడిబొమ్మ’ సినిమాలో. ఊళ్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే అతడు పంచ రత్నాలు చదివిస్తాడు. ‘రంగ పెళ్లికొడుకు... గంగ పెళ్లికూతురు.. కిష్టిగాడు గంగ తండ్రి... వీరమ్మ రంగ తల్లి... ఇక మున్ముందు కిష్టిగాడు రంగమామ.. వీరమ్మ గంగ అత్త.. గంగను సింగారించి రంగకు జత కలిపారు... ’ ఇలా సాగుతుంది సుత్తి కవిత్వం. జనం ఇలా కాదని అతన్ని శిక్షించడానికి ఏకంగా ఏనుగునే బహూకరిస్తారు.
ఏంటో.. బతుకులిలా ఏడుస్తున్నాయి అని అంటారుగాని అవి ఏడుస్తున్నాయా? వెతికితే ఎంత నవ్వు. ‘లేడీస్ స్పెషల్’లో శ్రీలక్ష్మి ఇంటికి ఎవరొచ్చినా తంటే. ఉదాహరణకు పోస్ట్‌మేన్ వచ్చి లెటర్ ఇస్తే అతణ్ణి పరీక్షగా చూసి ‘మీరు కనకమేడల సుందర్రావు కదూ’ అంటుంది. అతను ఆశ్చర్యపోతాడు. ‘మీకెలా తెలుసు’ అంటాడు. ‘నేను కుక్కమూతుల కుటుంబరావు గారి అమ్మాయిని. మీరు నన్ను పెళ్లిచూపులు చూసెళ్లిన పద్నాలుగో పెళ్లికొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడులడ్లు కారప్పూసా పెట్టారు. నేను సామజ వర గమనా పాడుతుంటే మీరు పారిపోయారు’ అని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆమె పాటను గుర్తు చేసుకుని అతడు హడలిపోతూ ‘అది చెవిలో విషప్రయోగమండీ’ అంటాడు.
సినిమా పిచ్చోళ్లు కూడా ఉంటారు ఇళ్లల్లో. భర్తకు సినిమా చూసే తీరిక ఉండదు. భార్యకు సినిమా కథ చెప్పక మనసు ఆగదు. ‘శ్రీవారి ప్రేమలేఖ’లో భర్త నూతన్ ప్రసాద్‌కు భార్య శ్రీలక్ష్మి తాను చూసొచ్చిన సినిమా కథలు చెబుతుంటుంది. కాని ఎలా? టైటిల్స్ నుంచి. ‘ఏబిసిడిఇఎఫ్ ప్రొడక్షన్స్ వారి ‘చిత్రవధ’.. కథానువాదం, దర్శకత్వం– శకుని, తారాగణం– జబ్బర్, ఉన్ని.. ’ ఆమె చెప్పే కథలకు సూపర్ ఫ్లాప్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ల కంటే ఎక్కువ బాధ నూతన్ ప్రసాద్‌కు.
సగటు జీవితాల్లో తిప్పలను చూసి ఏడ్వలేక నవ్వాడు దర్శకుడు జంధ్యాల. వాటిని చూపించి, ఎగ్జాగరేట్ చేసి నవ్వించే ప్రయత్నం చేశాడు. చెప్పిందే చెప్పే పెద్దవాళ్లను ‘సుత్తి’ చేశాడు. ఆ దెబ్బలకు నలిగిపోయే వాళ్లకు కూడా ఒక చాన్స్ ఇచ్చి ‘రివర్స్ హామరింగ్’ వేసే చాన్స్ ఇచ్చాడు. కోడిని వేళ్లాడగట్టి అదే చికెన్ కర్రీ అని తినేసేవాళ్లను, మొగుని వొంటి మీద బట్టలు తప్ప తక్కినవన్నీ స్టీలు సామాన్ల వాడికేసి స్పూన్లు గరిటెలు తీసుకునే సాధ్వీమణులను, చనిపోయిన సంతానాన్ని తలుచుకుంటూ ప్రతివాడిని ‘బాబూ చిట్టీ’ అని కావలించుకునే వెర్రిబాగుల పాత్రలను చూపి కాసేపు హాయిగా నవ్వించాడు.
నవ్వడం ఒక భోగం అన్నాడు జంధ్యాల. మార్కెట్‌లో ఇప్పుడు రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు అమ్ముతున్నారు. కాని హాస్యం అనే గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్లను రెగ్యులర్‌గా ఇస్తూ తెలుగు వారి ఆరోగ్యాన్ని సుసంపన్నం చేసిన వాడు జంధ్యాల.
ఎన్ని కష్టాలు ఉన్నా నవ్వడం మర్చిపోకూడదు. నవ్వే మనిషినే ఇష్టపడతాడు మనిషి. నవ్వే మనిషిని చూసి ధైర్యం తెచ్చుకుంటాడు. తోడు నవ్వుదామని చూస్తాడు.
నవ్వుతూ ఉందాం. ఇటీవలి బాధల్ని వేదనల్ని భయాలను పూర్తిగా మర్చిపోయేంత వరకూ మంచి హాస్యాన్ని మూడు పూటలా తీసుకుంటూనే ఉందాం.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment