Veteran Singer Vani Jayaram Sakshi Special Story In Telugu - Sakshi
Sakshi News home page

మూగబోయిన వాణి

Published Sun, Feb 5 2023 3:35 AM | Last Updated on Sun, Feb 5 2023 11:57 AM

Veteran Singer Vani Jayaram Sakshi Special Story

‘తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ’.. ఎంత కమ్మని గొంతు. ఉషోదయం వేళ మనసుని ఉల్లాసంగా తట్టిలేపే మృదు మధురమైన కంఠస్వరం వాణీ జయరామ్‌ సొంతం.. అలాంటి ఆ కంఠస్వరం మూగబోయింది. ప్రముఖ గాయని వాణీ జయరామ్‌ (78) కన్నుమూశారు. చెన్నైలోని నుంగంబాక్కమ్‌లో ఉన్న తన సృగృహంలో అనుమానాస్పద స్థితిలో మరణించారామె. వాణి నుదురు, భుజంపై రక్తపు గాయాలు ఉండడంతో ఆమె మృతిపై అనుమానాలు నెలకొన్నాయి.

పోలీసులు ఐపీసీ 174 సెక్షన్  కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంటిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే ఫోరెన్సిక్‌ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వాణి మృతదేహానికి ఓమందూరార్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం కేసు విచారణ ముమ్మరం అయ్యే సూచనలున్నాయి.

తమిళనాడులోని వెల్లూరులో దురైస్వామి, పద్మావతిలకు 1945 నవంబరు 30న జన్మించారు వాణీ జయరామ్‌. ఆమె అసలు పేరు కలైవాణి. పదకొండు మంది పిల్లల్లో వాణి ఎనిమిదో సంతానం. ఆమె తల్లి పద్మావతి కర్నూలులో జన్మించడంతో వాణికి తెలుగులో పాడటం అలవాటైంది. రంగరామానుజ అయ్యంగార్‌ వారి వద్ద పద్మావతి సంగీత శిక్షణ పొందారు. తన కుమార్తె వాణిని కూడా ఆయన వద్దే కర్ణాటక సంగీత శిక్షణ కోసం చేర్పించారామె.

వెల్లూరులో వాణి నాలుగో తరగతి పూర్తయ్యాక, ఆమెకు మరింత మంచి సంగీత శిక్షణ ఇప్పించేందుకు వారి కుటుంబం చెన్నైకి తరలి వెళ్లింది. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు జీఎన్‌ బాలసుబ్రహ్మణ్యం శిష్యుడైన టీఆర్‌ బాలసుబ్రహ్మణ్యం వద్ద సంగీతం నేర్చుకున్నారు వాణి. తన ఎనిమిదవ ఏటనే మద్రాసులో ఆకాశవాణిలో పాడారు. పదేళ్ల నుంచే పూర్తి స్థాయి కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీలు చేశారామె. స్కూలులో 22 వేర్వేరు కళలతో బహుముఖ ప్రజ్ఞ కలిగిన స్టూడెంట్‌గా అవార్డును పొందారు వాణి.

బీఏ ఎకనామిక్స్‌ చదువుతున్న సమయంలో కళాశాలల స్థాయిలో డిబేట్‌ కార్యక్రమాల్లో బహుమతులు పొందారామె. చదువు పూర్తయ్యాక స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చెన్నై బ్రాంచిలో ఉద్యోగంలో చేరారు వాణి. 1967లో ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆ తర్వాత 1969లో జయరామ్‌ని వివాహం చేసుకుని, ముంబయ్‌కి వెళ్లారు వాణి. భర్త  జయరామ్‌ ప్రోత్సాహంతో ఉస్తాద్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ ఖాన్‌ వద్ద హిందుస్తానీ శాస్త్రీయ సంగీత శిక్షణను పొందారామె. ఆ సమయంలోనే బ్యాంకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి పూర్తి స్థాయి సంగీత సాధనకు సమయాన్ని వెచ్చించారామె.

కర్ణాటిక్, హిందుస్థానీ సంగీతాలను నేర్చుకున్న ఆమె 1969లో ముంబయ్‌లో తొలి కచేరి ఇచ్చారు. సంగీత దర్శకుడు వసంత్‌ దేశాయ్‌కి ఆమె గొంతు నచ్చడంతో 1971లో హృషికేశ్‌ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్డి’ చిత్రంలో తొలిసారి పాట పాడే అవకాశమిచ్చారు. ఆ చిత్రం కోసం వాణీ జయరామ్‌ పాడిన ‘బోలె రే పపీ హరా..’ పాటకు మంచి స్పందన వచ్చింది. వాణికి ‘తాన్సేన్‌ సమ్మాన్, బెస్ట్‌ ప్రామిసింగ్‌ సింగర్, ఆలిండియా సినీగోయర్స్‌’ వంటి అవార్డులు దక్కాయి. ఇక ‘అభిమానవంతుడు’ (1973) చిత్రంలో ‘ఎప్పటివలె కాదురా స్వామి’ అనే పాటను వాణీ జయరామ్‌తో పాడించారు దర్శకుడు ఎస్‌.పి. కోదండపాణి. తెలుగులో ఆమెకు ఇదే తొలి చిత్రం.

1974లో ముంబయ్‌ నుండి చెన్నైకి వచ్చి స్థిరపడిన ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, భోజ్‌పురి, మరాఠీ, ఒరియా.. ఇలా 14 భాషల్లో పదివేలకుపైగా పాటలు పాడారు. కేవీ మహదేవన్, ఎం.ఎస్‌. విశ్వనాథన్ , ఇళయరాజా, పెండాల్య, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు వంటి సంగీత దర్శకుల సినిమాల్లో ఎక్కువ పాటలు పాడారామె. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ రాగంగళ్‌’ చిత్రానికి తొలిసారి జాతీయ పురస్కారం అందుకున్నారామె. ఆ తర్వాత ‘శంకరాభరణం’ చిత్రంలోని ‘మానస సంచరరే..’ గీతానికి ఆమెకు రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది.

‘స్వాతికిరణం’లోని ‘ఆనతి నీయరా హరా..’ పాటకు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు వాణి.  జాతీయ స్థాయిలోనే తెలుగు, గుజరాతీ, ఒడియా, తమిళ భాషల్లో ప్రాంతీయ స్థాయి ఉత్తమ గాయని అవార్డులు పొందారామె. ‘కలైమామణి, సంగీత పీఠ్‌ సమ్మాన్, ఎంకే త్యాగరాజ భాగవతార్‌ జీవన సాఫల్య పురస్కారం, ఫిలింఫేర్‌ జీవన సాఫల్య పురస్కారం, కాముకర అవార్డు, సుబ్రహ్మణ్య భారతి అవార్డు, ఘంటసాల జాతీయ పురస్కారం, దక్షిణ భారత మీరా అవార్డు’ వంటి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు వాణీ జయరామ్‌.


సినిమా పాటలే కాదు.. ఎన్నో భక్తి గీతాలను, లలిత గీతాలను ఆలపించారు వాణి. ‘మొరటోడు’ చిత్రంలోని ‘హే కృష్ణా మళ్లీ నీవే జన్మిస్తే’ పాటతో పాటు ‘ప్రేమలేఖలు’లోని ‘ఈరోజు మంచిరోజు’ అంటూ సుశీలతో కలసి పాడిన పాట తనకెంతో ఇష్టం అని వాణి గతంలో పేర్కొన్నారు. తమకు పిల్లలు లేకున్నా ఆ లోటును సంగీతమే తీర్చిందని చెప్పేవారామె. వాణి భర్త జయరామ్‌ 2018లో మృతి చెందారు. కాగా సంగీత రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022కిగాను ఇటీవల ‘పద్మ భూషణ్‌’ అవార్డు ప్రకటించింది. అయితే ఆ పురస్కారాన్ని స్వీకరించకుండానే వాణి ఈ లోకాన్ని వదిలి వెళ్లడం బాధాకరం. ఆమె మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.             

భర్త ప్రోత్సాహంతో...
ప్రతి మగాడి విజయం వెనక మహిళ ఉంటుందంటారు. కానీ వాణీ జయరామ్‌ విజయం వెనక ఆమె భర్త జయరామ్‌ ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా సంగీతంలో ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. ముంబయ్‌లోని ఇండో–బెల్జియం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీగా చేసిన జయరామ్‌ సంగీతప్రియులు. పండిట్‌ రవిశంకర్‌ దగ్గర ఆరేళ్లు ఆయన సితార్‌ నేర్చుకున్నారు. వాణీతో వివాహం తర్వాత తన భార్యలోని సంగీత ప్రావీణ్యతను గుర్తించారు జయరామ్‌. ఆల్రెడీ కర్ణాటిక్, శాస్త్రియ సంగీతాలను ఔపోసన పట్టిన ఆమెను హిందుస్థానీ సంగీతాన్ని కూడా నేర్చుకోవాలని కోరారు జయరామ్‌.కేవలం నేర్చుకోమని చెప్పడమే కాకుండా.. ఉస్తాద్‌ అబ్దుల్‌ రహమాన్‌ దగ్గర సంగీత పాఠాలు నేర్పించారు. ఉస్తాద్‌ అబ్దుల్‌ రహమాన్‌ శిష్యరికంలో ఆరు నెలల కఠోర శిక్షణ తర్వాత హిందుస్థానీ సంగీతంలో కూడా వాణి ప్రతిభ చూపారు. 18 గంటల పాటు ఏకధాటిగా శిక్షణ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇక బ్రహ్మాండంగా కచేరీలు చేసుకోవచ్చని వాణీకి భరోసా ఇచ్చారు రహమాన్‌. ఆత్మవిశ్వాసం, గురువు రహమాన్‌ ఇచ్చిన భరోసాతో చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి స్వస్తి పలికారు వాణి. 1969లో తొలిసారిగా ముంబయ్‌లో కచేరి ఇచ్చారామె. ఆ తర్వాత సినీ గాయనిగా ఎంతో బిజీ అయ్యారు.

సంగీతమే సంతానం... 
వాణీ జయరామ్‌ దంపతులకు సంతానం లేరు. సంగీతాన్నే సంతానంలా భావించారు. ‘‘సంగీతంతో సంతానం లేని లోటు తీరిపోయిందనుకుంటాం’’ అని పలు సందర్భాల్లో వాణి పేర్కొన్నారు.

కొత్త నాయికలకు ఆ వాణీయే...
ఓ కొత్త హీరోయిన్‌ వెండితెరకు పరిచయం అవుతుందంటే వెంటనే వాణీ జయరామ్‌కు కబురు వెళ్లేది. అలా పలువురు హీరోయిన్లు నటించిన తొలి సినిమాకు పాటలు పాడారు వాణీ జయరామ్‌. శ్రీదేవి హీరోయిన్‌గా పరిచయమైన తొలి తమిళ (‘మూండ్రు ముడుచ్చు – ‘ఆడి వెళ్లి’), హిందీ (సోల్వా సావన్‌ – గోరియా హో గోరియా) చిత్రాల్లో పాటలు పాడారు వాణీ జయరామ్‌. అలాగే షబానా ఆజ్మీ, జూహీ చావ్లా, పర్విన్‌ బాబీ, జయబాధురీ హీరోయిన్లుగా పరిచయం అయిన తొలి చిత్రాలకు వాణీ జయరామ్‌ పాటలు పాడారు.

వాణి తెలుగు హిట్‌ సాంగ్స్‌ కొన్ని...
► అభిమానవంతులు – ‘ఎప్పటివలె కాదురా నా సామి...’
► ‘స్వాతి కిరణం’ – తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ, ఆనతినీయరా హరా..,  శివానీ భవానీ..
►  ‘శంకరాభరణం’ – దొరకునా ఇటువంటి సేవ.., ఏ తీరుగ నను..,
► పలుకే బంగారమాయెనా..
► ‘పూజ’ – పూజలు చేయ పూలు తెచ్చాను...
► ‘సీతామాలక్ష్మి’ – ఏ పాట నే పాడను...
► శ్రుతిలయలు – ఆలోకయే శ్రీ బాలకృష్ణమ్‌...
► ‘తిరుపతి’ – తప్పెట్లోయి తాళాలోయి
► ‘సీతాకోక చిలుక’ – సాగర సంగమమే..., అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి
► ‘స్వర్ణకమలం’ –  అందెల రవమిది పదములదా...
► ‘మంగమ్మగారి మనవడు’ – శ్రీ సూర్యనారాయణ మేలుకో...
► ‘గుప్పెడు మనసు’ – నేనా పాడనా పాట.. మీరా అన్నదీ మాట..
► ‘ఘర్షణ’– ఒక బృందావనం సోయగం...


అది దైవ సంకల్పం
1970 నుంచి 1990 వరకూ బిజీ గాయనిగా సాగిన వాణీ జయరామ్‌ ఆ తర్వాత కాస్త స్లో అయ్యారు. కాగా పలు భాషల సినిమాలకు పాడుతూనే మరోవైపు ఎన్నో భజన పాటలు కూడా పాడారు వాణి. ‘అది పూర్తిగా దైవ సంకల్పం. ఆ దేవుడికి ధన్యవాదాలు. భజనలు పాడినప్పుడు నా మనసెంతో ఆనందంగా ఉంటుంది’ అని పలు సందర్భాల్లో ఆమె పేర్కొన్నారు. హిందీలో తొలి చిత్రం ‘గుడ్డి’కి తొలుత ఆమె పాడినది భజన పాటే. అయితే సినిమా విడుదల తర్వాత చూస్తే సిల్వర్‌ స్క్రీన్‌పై ఆ పాట వినబడలేదు. అలా ఎందుకు జరిగిందో ఎప్పటికీ అర్థం కాలేదని ఓ సందర్భంలో వాణి పేర్కొన్నారు.
ఈ ఒక్క పాటే కాదు.. వాణి పాడిన పాటల్లో తెరపై వినిపించనవి ఎన్నో ఉన్నాయి. ‘ఇలాంటివాటి గురించి తలచుకుంటే బాధ రెట్టింపు అవుతుందే కానీ, తగ్గదు. అందుకే  వాటి గురించి ఆలోచించను’ అని ఓ సందర్భంలో వాణి పేర్కొన్నారు.
వాణీ జయరామ్‌ అంత పాజిటివ్‌ పర్సన్‌.

ప్రముఖుల నివాళి
తన మధురమైన గాత్రంతో సినీ సంగీతానికి విశేష సేవలందించి ఎంతోమంది హృదయాలను గెలిచారు వాణీ జయరామ్‌గారు. పాన్  ఇండియా స్థాయిలో బలమైన శాస్త్రీయ పునాదిని నిర్మించారామె. వాణీగారి మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి.. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
– వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి

వాణీ జయరామ్‌గారి మృతి బాధాకరం. 14 భాషల్లో 10 వేలకుపైగా పాటలు పాడిన ఆమె సినీ రంగానికి అందించిన సేవలు మరువలేనివి. ఆమె మృతి భారత సినీ పరిశ్రమకు, సంగీత ప్రపంచానికి తీరని లోటు.. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.    
– కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

ప్రఖ్యాత భారతీయ సినీ సంగీత గాయనీమణిగా ఖ్యాతి సంపాదించుకున్న ‘కలైమామణి’ వాణీ జయరామ్‌ మరణ వార్త చాలా బాధించింది. ఆమె లేని లోటును భారతీయ సినిమాలో ఎవరూ భర్తీ చేయలేరు. వాణీ జయరామ్‌ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.
– ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి

పదాలకు పదోన్నతి చేకూరేలా ఒక వినూత్నమైన బాణీతో ప్రపంచానికి ఎన్నో పాటలను బహుమతిగా ఇచ్చిన కోకిలలా జీవించిన వాణీ జయరామ్‌గారు ఇప్పుడు ప్రశాంతించారు. ఆవిడ పాటలు మనతోనే ఉంటాయి. 
– కమల్‌హాసన్‌

మీరు (వాణీని) నాకు పాడిన తొలి పాటనే మీకు నివాళిగా అర్పిస్తున్నాను. ‘మేఘమే మేఘమే.. పాల్‌ నిలా తేయందదే. దేగమే తేయినుమ్‌ తేనొళీ వీసుదే.. ఎనక్కొరు మలర్‌ మాలై నీ వాంగ వేండుమ్‌’ (తమిళ చిత్రం ‘పాలవన్న చోలై’లోని పాట.. ఈ చిత్రం తెలుగులో ‘మంచు పల్లకి’గా రీమేక్‌ అయింది. తెలుగులో ‘మేఘమా..’ పాటని ఎస్‌. జానకి పాడారు). పాటలో ‘ఎనక్కొరు మలర్‌ మాలై నీ వాంగ వేండుమ్‌’ అంటే నాకోసం నువ్వొక పూలదండ కొనాలని అర్థం. ఈ సాహిత్యాన్ని ‘ఉనక్కొరు మలర్‌ మాలై నాన్‌ వాంగ వేండుమ్‌’.. (నీకోసం నేనో పూలదండ కొనాలని అర్థం) అని మార్చి... ‘ఆ పూలదండ దీనికోసమేనా?’ (వాణి మరణాన్ని ఉద్దేశించి) అంటూ ముగించారు.
తమిళ ప్రముఖ రచయిత వైరముత్తు.

చాలా షాక్‌కి గురి చేసే వార్త ఇది. నమ్మశక్యంగా లేదు. జస్ట్‌ రెండు రోజుల క్రితమే వాణీ అమ్మతో మాట్లాడాను. నిజమైన లెజెండ్‌. బలమైన శాస్త్రీయ పునాదితో బహుముఖ ప్రతిభ గల బహు భాషా గాయనిని కోల్పోయాం.       
– చిత్ర

నిన్న (శుక్రవారం) రాత్రే కె. విశ్వనాథ్‌ సార్‌ సినిమాల్లో వాణీగారి పాటలు వింటూ, ‘ఎంత అద్భుతంగా పాడారో వినండీ.. అని మా ఆయన (నటుడు శరత్‌కుమార్‌)తో అన్నాను. ఆ మర్నాడే ఆమె మరణ వార్త విని షాకయ్యాను.  
– రాధికా శరత్‌కుమార్‌

ఎంత గొప్ప గాత్రం. చివరిసారిగా ఆమెను కలిసినప్పుడూ ఆ గాత్రంలో అదే స్పష్టత. ‘ఏళు స్వరంగళ్, మల్లిగై, నానే నానా వంటి పాటలతో పాటు నాకు పాడిన ‘మేఘమే మేఘమే’... ఇలా ఆమె పాడిన ఎన్నో పాటలు హృదయాల్లో నిలిచిపోతాయి.           
– సుహాసినీ మణిరత్నం

► భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రసంశలు పొందారు వాణీ జయరామ్‌. ఓ కచేరీలో ఇందిరా గాంధీ తన ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నట్లు పలు సందర్భాల్లో వాణి స్వయంగా చెప్పారు.
► హేమమాలిని, వినోద్‌ ఖన్నా ప్రధాన తారాగణంగా గుల్జార్‌ దర్శకత్వంలో 1979లో హిందీలో ‘మీరా’ అనే చిత్రం వచ్చింది. ఈ సినిమాలో ఉన్న 13 పాటల్లో 12 పాటలను వాణీ జయరామ్‌  పాడటం విశేషం.
► గంగామహోత్సవ్, స్వామి హరిదాస్‌ ఫెస్టివల్, ఛండీఘడ్‌లోని పంచకుల, ఛిత్తోడ్‌ఘడ్‌లో మీరా ఫెస్టివల్స్‌.. ఇలా పలు పండగలకు ఆమె కచేరిలు చేశారు. బద్రినాథ్‌లో రెండుసార్లు పాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement