ప్రముఖ నేపథ్య గాయని వాణీజయరామ్ మృతిపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. ఆమె బెడ్రూంలో వాణీజయరామ్ తన గదిలోని అద్దంతో కూడిన టీపాయ్‌పై పడటంతో తలకు బలమైన దెబ్బ తగలడం వల్ల మృతి చెందినట్లు ఫోరెన్సిక నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా వాణీ జయరామ్ నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ప్రాంగణంలోని సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించామని, ఎక్కడా అనుమానాస్పద కదలికలు కనిపించలేదని స్పష్టం చేశారు. దీంతో ఆమె మృతిపై ఎలాంటి సందేహాలు లేవని ,విచారణ అనంతరం ఆమెది సహజ మరణ మేనని పోలీసులు ధ్రువీకరించారు.
కాగా అంతకుముందు వాణీజయరామ్ తలకు బలమైన గాయం కావడం, ముఖం రక్తసిక్తమై ఉండటం, చేతి రేఖలు వంటి ఆధారాలను తుడిచి వేయడంతో మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం వాణీ జయరామ్ మృతి వెనుకున్న మిస్టరీ వీడింది. కాగా ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో ప్రభుత్వ లాంఛనాలతో వాణీ జయరామ్ అంత్యక్రియలు నిర్వహించారు.
తమిళనాడు సీఎం స్టాలిన్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె పార్థివేదేహానికి నివాళులు అర్పించారు. కాగా ప్రఖ్యాత గాయని పి.సుశీల వాణీజయరామ్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఆదివారం ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో తనకు ఈ విషయం ఆలస్యంగా తెలిసిందని హైదరాబాద్‌లో ఉన్న తన మనవరాలు ఫోన్ చేసి వాణీజయరామ్ కన్నుమూసిన విషయం తెలుసా అని అడిగిందన్నారు. దాంతో తాను షాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు.
వాణీజయరామ్‌తో కలిసి తాను 100 పాటలు పాడినట్లు గుర్తు చేసుకున్నారు. ఆమె పెద్దగా నవ్వే వారు కాదని, తాను జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కలిసి ఉన్నప్పుడు మాత్రమే వాణీ జయరామ్ నవ్వేవారని చెప్పారు. ఏడు స్వరాల పాటను ఆమె మినహా ఎవరు పాడలేరని, వాణీజయరామ్‌ది ప్రత్యేక స్వరం అని పి.సుశీల కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment