
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె, గాయని భవతారణి రాజా (47) కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతూ గురువారం రాత్రి శ్రీలంకలో కన్నుమూశారు. నేడు ఆమె భౌతికకాయాన్ని చెన్నైకు తీసుకురానున్నారు. శుక్రవారమే అంత్యక్రియలు జరుగుతాయని తెలిసింది. ఇళయరాజాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో కార్తీక్ రాజా, యువన్ శంకర్ రాజా సంగీత దర్శకులు. కుమార్తె భవతారణ సంగీత దర్శకురాలిగా, గాయనిగా రాణిస్తున్నారు.
మలయాళ త్రీడీ ‘మై డియర్ కుట్టి చాత్తాన్’ (1984) గాయనిగా భవతారణికి తొలి చిత్రం. ప్రభుదేవా హీరోగా నటించిన ‘రాసయ్య’ (1995) చిత్రం ద్వారా గాయనిగా కోలీవుడ్‌కి పరిచయమయ్యారు భవతారణి. అదే విధంగా ‘భారతి’ (2000) చిత్రంలోని ‘మైలు పోల పొన్ను..’ అనే పాటకు గాను జాతీయ ఉత్తమ గాయనిగా కేంద్ర ప్రభుత్వ అవార్డును అందుకున్నారామె. తెలుగులోనూ పలు పాటలు పాడారు. తండ్రి, సోదరుల సంగీత దర్శకత్వంలో అనేక పాటలను పాడారు భవతారణి. దాదాపు పాతిక చిత్రాల్లో పాటలు పాడారు.
తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం ‘గుండెల్లో గోదారి’ సినిమాలో ‘నన్ను నీతో..’ పాటను పాడారామె. మెలోడీ పాటలతో సంగీత అభిమానుల హృదయాలలో చోటు దక్కించుకున్నారు. 2002లో నటి రేవతి దర్శకురాలిగా తెరకెక్కించిన తొలి చిత్రం ‘మిత్ర్: మై ఫ్రెండ్’తో సంగీత దర్శకురాలిగా మారారు భవతారణి. సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి ముఖ్య తారలుగా వచ్చిన హిందీ చిత్రం ‘ఫిర్ మిలేంగే’ (2004) సినిమాకు ఓ సంగీత దర్శకురాలిగా చేశారు.
హిందీలో ఆమెకు ఇది తొలి చిత్రం. తెలుగులో ‘అవునా’(2003), కన్నడలో ‘గీయా గీయా’ (2005) సినిమాలకు సంగీతం అందించారు భవతారణి. దాదాపు పది చిత్రాలకు సంగీతదర్శకురాలిగా చేశారు. అడ్వరై్టజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్. శబరిరాజ్‌తో భవతారణి వివాహం జరిగింది. వీరికి సంతానం లేరు. భవతారిణి మృతి పట్ల పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment