Veteran actor Jamuna: నివాళి: అలిగితివా సత్యభామ | Celebrities Pays Tributes To Veteran Telugu actress Jamuna | Sakshi
Sakshi News home page

Veteran actor Jamuna: నివాళి: అలిగితివా సత్యభామ

Published Sat, Jan 28 2023 1:09 AM | Last Updated on Sat, Jan 28 2023 11:52 AM

Celebrities Pays Tributes To Veteran Telugu actress Jamuna - Sakshi

తెలుగు అలక నీవే.. తెలుగు మొలక నీవే
వాల్జడను విసిరి వలపు చూపును దూసేది నీవే
అతిశయము నీవే.. స్వాతిశయము నీవే
కనుచూపులో ధిక్కరింపు దుడుకువు నీవే
నీవు సత్యభామవు.. నీవే సతీ అనసూయవు
నీవే రాణి మాలినీదేవివి.. నీవే కలెక్టర్‌ జానకివి.
పాతికేళ్లపాటు తెలుగు తెరను ఏలావు.
నీ మార్గము నీదయ్యి నీ దుర్గము నీకు నిలిచింది.

ప్రజల అభిమానమే నీకు పద్మభూషణ్‌.
ప్రేక్షకుల ఆరాధనే రఘుపతి వెంకయ్య.
నీకు అలంకారమైన అలకతో మా నుంచి వీడ్కోలు తీసుకున్నావని సర్ది చెప్పుకుంటున్నాము.
మరోసారి దుగ్గిరాల నుంచి పద్యమై పలుకు.
మరోసారి అపర సత్యభామవై మువ్వల సడి చెయ్యి.
అలక తీరాక తిరిగి వస్తావు కదూ!


సత్రాజిత్తు కుమార్తె సత్యభామ.
తప్పు.
నిప్పాణి శ్రీనివాసరావు కుమార్తె సత్యభామ.
ఒప్పు.
తెలుగువారికి సంబంధించినంత వరకు సత్యభామది దుగ్గిరాల.


‘అమ్మా... కాఫీ’...
బంగారు బుగ్గలతో, మెరిసే కళ్లతో, గారాబంగా పెరిగి, పెంకిగా మారి, కాలు నేలన పెట్టకుండా, నిద్ర కళ్లతో లేచి కాఫీ అడిగే గారాల పట్టి ఎవరు? ఇంకెవరు జమున. ‘గుండమ్మ కథ’లో ఆ పాత్రను జమునే చేయాలి. కానీ...

‘గుండమ్మ కథ’ సినిమా తీయబోయే ముందు.
నిర్మాత చక్రపాణి ఇంట్లో పంచాయితీ.
ఒక గదిలో ఎన్‌.టి.ఆర్, ఏ.ఎన్‌.ఆర్‌. మరో గదిలో జమున, ఆమె తండ్రి నిప్పాణి శ్రీనివాసరావు.
‘క్షమాపణ పత్రం రాసివ్వమనండి సరిపోతుంది... జమునతో కలిసి పని చేస్తాం’ అని ఎన్‌.టి.ఆర్, ఏ.ఎన్‌.ఆర్‌ల గది నుంచి ప్రతిపాదన వచ్చింది.
‘క్షమాపణ రాసేది లేదు. నా తప్పేమిటో చెప్పమనండి’ జమున నుంచి జవాబు.
ఈ తగాదా తీర్చకపోతే గుండమ్మ కథ పట్టాలెక్కదు.
చక్రపాణి రెండు గదుల వైపు మార్చి మార్చి చూశాడు.

‘భూకైలాస్‌’ క్లయిమాక్స్‌ సీన్‌. మద్రాసు సముద్ర ఒడ్డున తీస్తున్నారు. ఆత్మలింగం చేజార్చుకున్న రావణుడు అంతకంతకూ పెరిగి పెద్దదవుతున్న ఆ లింగాన్ని మోయలేక, తనతో తీసుకెళ్లలేక, దానికి తల కొట్టుకుని ఆత్మత్యాగం చేయబోతున్న దృశ్యం అది. ఎన్‌.టి.ఆర్‌ మీద తీస్తున్నారు. ఆ సమయంలో నారదుడైన అక్కినేని పరిగెత్తుకొని రావాలి. మండోదరి పాత్ర పోషిస్తున్న జమున కూడా పరిగెత్తుకుని రావాలి.
ఎండ మండిపోతోంది.
అప్పటికే జమున షూటింగ్‌కి ఆలస్యంగా వస్తున్నదని అక్కినేనికి అభ్యంతరం ఉంది. కాలు మీద కాలు వేసుకుని కూచుంటున్నదని ఎన్‌.టి.ఆర్‌కు అసౌకర్యం ఉంది. జమునకు ఇవన్నీ తెలియవు. ఆ ఎండలో ఇంకా రాని జమున కోసం ఎదురు చూస్తూ అక్కినేని, ఎన్‌.టి.ఆర్‌ ఒక నిర్ణయం తీసుకున్నారు. మరునాడు ఇండస్ట్రీ అంతా ఆ నిర్ణయం విని హాహాకారాలు చేసింది. అచ్చొచ్చోలు విడిచింది. ఇక మీదట ఎన్‌.టి.ఆర్, ఏ.ఎన్‌.ఆర్‌లు జమునతో నటించబోవడం లేదు. బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ఇటీవల మొదలైంది. కాని తెలుగులో బాయ్‌కాట్‌ చూసిన తొలి హీరోయిన్‌ జమున.

ఊ... అంటావా మావా ఉహూ అంటావా మావా. కొత్త పాట. విశేషం ఏముంది?
ఊ అను ఉఊ అను ఔనను ఔనవునను... జమున పాట. ఏనాడో జమున ఉఊ అంది. ఔనవునని అనలేకపోయింది. పెద్ద హీరోలు బాయ్‌కాట్‌ చేస్తే ఏంటి? తానొక నటి. తనకు సామర్థ్యం ఉంది. తను పని చేయగలదు. ఎన్‌.టి.ఆర్, ఏ.ఎన్‌.ఆర్‌లు లేకపోతే ఇక హీరోలే లేరా? అయినా తెర మీద జమున ఉంటే ఇక ఆవిడే ఒక హీరో లెక్క.
1959, 60, 61... దాదాపు మూడేళ్ల పాటు అక్కినేని, ఎన్‌.టి.ఆర్‌ జమునతో పని చేయలేదు. జమున ఆగిందా... ఆగలేదు. హిందీకి వెళ్లింది. జూబ్లీ హీరో రాజేంద్ర కుమార్‌తో ‘హమ్‌రాహీ’ చేసి హిట్‌ కొట్టింది. అందులో ‘ముజ్‌ కో అప్‌ నే గలే లగాలో’ పాటకు ముబారక్‌ బేగం, ‘మన్‌రే తూహీ బతా క్యా గావూ’ పాటకు లతా మంగేష్కర్‌ జమునకు ప్లేబ్యాక్‌ ఇచ్చారు. ‘మూగ మనసులు’ హిందీ రీమేక్‌ మిలన్‌లో అదే గౌరి పాత్రను వేసి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు సాధించింది. ‘బేటి బేటె’ సినిమాలో సునీల్‌ దత్‌కు హీరోయిన్‌గా చేసింది. తెలుగులో జగ్గయ్య, జె.వి.రమణమూర్తి, కృష్ణ, శ్రీధర్, హరనాథ్‌ వీరితో పని చేసింది. ఈలోపు జమున లాంటి గ్లామర్‌ స్టార్‌ లేక కొన్ని సినిమాలు ఏ.ఎన్‌.ఆర్, ఎన్‌.టి.ఆర్‌లవి వెలవెలబోయాయి. ఎన్‌.టి.ఆర్, ఏ.ఎన్‌.ఆర్‌లు లేక జమున పెద్ద సినిమాలు చేయలేకపోయింది. ఇరు పక్షాలా నష్టం. ఈ నష్టాన్ని నివారించి అందరినీ కలిపి ‘గుండమ్మ కథ’ తీయాలని చక్రపాణి నిశ్చయం.

‘సార్‌. క్షమాపణలు వద్దు ఏమొద్దు. వాళ్లనూ కూచోబెట్టండి. నన్నూ కూచోబెట్టండి. కావాలంటే నన్ను నాలుగు చివాట్లు పెట్టండి. ఏదో తెలియని రోజుల్లో తెలియని ప్రవర్తన. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను’ అంది జమున, చక్రపాణితో.
‘ఏమయ్యా రామారావు, నాగేశ్వరరావూ. ఈ బాయ్‌కాట్‌ వల్ల భవిష్యత్తు తరాలకు మీరో తప్పు మార్గం చూపిస్తున్నారు. ఇలా వద్దు. అంతా కలిసి పని చేయండి. నా గుండమ్మ ఇప్పటికే ఆలస్యమై ఏడుస్తోంది’ అన్నాడు చక్రపాణి.
సమస్య సద్దుమణిగింది. జమున గెలవకపోయి ఉండవచ్చు. కాని ఓడలేదు.

గుంటూరు జిల్లాలో పక్కపక్క ఊళ్ల నుంచి ఇద్దరు హీరోయిన్లు వచ్చారు. సావిత్రి, జమున.
కృష్ణా జిల్లాలో పక్క పక్క ఊళ్ల నుంచి ఇద్దరు హీరోలు వచ్చారు. అక్కినేని, ఎన్‌.టి.ఆర్‌.
ఈ నలుగురు తెలుగు సినిమాలకు ‘స్వర్ణచతుష్టయం’. ఆ స్వర్ణ చతుష్టయం నటించి సూపర్‌హిట్‌ కొట్టిన సినిమా గుండమ్మ కథ.

జమున తండ్రి నిప్పాణి శ్రీనివాసరావు మధ్వ బ్రాహ్మణులు. కన్నడిగులు. జమున తల్లి కౌసల్యాదేవి వైశ్యులు. తెలుగు. వ్యాపారం నిమిత్తం శ్రీనివాసరావు హంపిలో ఉండగా పెద్ద కూతురుగా జమున పుట్టింది. ఆమెకు ఆరేడేళ్లు ఉండగా శ్రీనివాసరావు పసుపు, పొగాకు వ్యాపారానికి వీలుగా ఉంటుందని కాపురాన్ని ‘దుగ్గిరాల’కు మార్చాడు. అలా దుగ్గిరాల జమునకు రెండో జన్మస్థలం అయ్యింది. జమున తల్లికి హరికథలు చెప్పడం వచ్చు. ఆమె కచ్చేరీల్లో మధ్య మధ్య చిన్నారి జమునను స్టేజీ ఎక్కించి పాట పాడించేది. దుగ్గిరాలలో చదువుతూ స్కూల్లో కూడా జమున ఆడేది, పాడేది. నాటకాల వాళ్లు విని బాలనటిగా బతిమిలాడి తీసుకెళ్లేవారు. ‘ఢిల్లీ చలో’, ‘మా భూమి’, ‘ఖిల్జీ రాజ్య పతనం’... వీటిలో జమున బాలనటి. మండూరులో ‘ఖిల్జీ రాజ్యపతనం’ నాటకం వేయాలని ఒక తెలుగు మాస్టారు వచ్చి జమునను తీసుకెళ్లాడు. రైలు దిగి పొలాల మీద నడుస్తూ మండూరు చేరుకోవాల్సి ఉంటే జమున నడవలేక మారాము చేసింది. పాపం... ఆ తెలుగు మాస్టారు జమునను ఎత్తుకొని అంతదూరమూ నడిచి వెళ్లాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒక సినిమాలో జమున–

అనురాగము విరిసేనా ఓ రేరాజా
అనుతాపము తీరేనా...

అనే పాటకు అభినయించింది. ఆ రోజు ఆమెను భుజాల మీద ఎత్తుకుని నడిచిన తెలుగు మాస్టారు ఆ పాటలో పడక్కుర్చీలో కూచుని ఆస్వాదిస్తుంటాడు. అతని పేరు జగ్గయ్య.

గరికపాటి రాజారావు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ‘పుట్టిల్లు’ జమున మొదటి సినిమా. షాపుకారు జానకి, కృష్ణకుమారి, జమున... వీరు మాత్రమే స్ట్రయిట్‌గా హీరోయిన్‌ వేషాలతో చిత్ర ప్రవేశం చేశారు. మిగిలిన వారు చిన్న పాత్రలు వేసి, ఎదిగి, హీరోయిన్‌లు అయ్యారు. 16 ఏళ్ల వయసులో జమున ‘పుట్టిల్లు’ లో చాలా మెచ్యూరిటీ ప్రదర్శించాల్సిన పాత్రను పోషించింది. కాని గరికపాటి, జమునల జంటను ప్రేక్షకులు మెచ్చలేదు. ‘పతియే ప్రత్యక్షదైవమే’ థీమ్‌తో సినిమాలు వస్తున్న ఆ రోజుల్లో ‘పుట్టిల్లు’ సినిమా వ్యసనపరుడైన భర్తను నిరాకరించి తనకు తాను నిలబడే భార్య పాత్రను చూపించేసరికి జనం హడలెత్తి తెరను చింపేస్తామన్నారు. మూడ్రోజుల్లో బాక్సులు తిరిగొచ్చేసరికి క్లయిమాక్స్‌ మార్చి తీసి మళ్లీ అతికించినా ఫలితం రాలేదు. ఆ తర్వాత జమున నటించిన రెండు మూడు సినిమాలు ఆడలేదు. వెనక్కు వెళ్లిపోదామనుకుంటూ ఉండగా ‘మిస్సమ్మ’ సినిమాలో మెరిసి నిలబడింది. ఆ సినిమా నాటికే స్టార్లుగా మారిన అక్కినేని, ఎన్‌.టి.ఆర్, సావిత్రిల సరసకు అతి త్వరగా చేరింది. అయితే ప్రతి నటికి ఒక సిగ్నేచర్‌ కేరెక్టర్‌ దొరకాలి. అలాంటి కేరెక్టర్‌ జమునకు దొరికింది. ఆ పాత్రే సత్యభామ.

సత్యభామ పాత్రంటే తెలుగు నాటకాల్లో పాపులర్‌. స్థానం నరసింహారావు ఆ పాత్రను పోషిస్తూ పాత్ర ఆంగిక, అభినయ, ఆహార్యాలను స్థిరపరిచేశాడు. ప్రేక్షకులు ఎవరైనా ఆయనతో పోల్చి వెండితెర సత్యభామను అంచనా కడతారు. జమున సత్యభామ పాత్రను మొదట తెలిసీ తెలియని వయసులో ‘వినాయక చవితి’ చిత్రంలో పోషించింది. అసలైన సత్యభామగా ఎన్‌.టి.ఆర్‌తో ‘శ్రీ కృష్ణ తులాభారం’లో నటించింది. స్థానం నాటకాల్లో పాపులర్‌ చేసిన ‘మీరజాల గలడా నా యానతి’ పాటను అంతకు దీటుగా అభినయించింది. పెంకితనం, మొండితనం, స్వాతిశయం వీటితో పాటు తెలియని అమాయకత్వాన్ని సత్యభామకు జోడించడంతో జమున సత్యభామ అయ్యింది. సత్యభామ జమున అయ్యింది. కృష్ణుడి వేషంలో ఉన్నా ఎన్‌.టి.ఆర్‌ అంతటి వాడి కిరీటాన్ని కాలితో తన్నాలి. జమున ధైర్యంగా తన్నగలిగింది. అలాంటి షాట్‌ చేశాక సీనియర్‌ ఆర్టిస్ట్‌కు ‘సారీ’ చెప్పాలన్న పరిణితి అప్పటికే ఆమెకు వచ్చేసింది. ‘సారీ సార్‌’ అని ఎన్‌.టి.ఆర్‌తో అంటే ‘ఇట్స్‌ ఆల్‌రైట్‌... యాక్టింగే కదా’ అని ఆయన ఈజీగా తీసుకున్నారు. తెలుగువారికి కృష్ణుడు ఎన్‌.టి.ఆర్‌. సత్యభామ జమునే.

తెలుగువారి తొలి గ్లామర్‌ స్టార్‌ కాంచన మాల. తర్వాతి గ్లామర్‌ స్టార్‌ జమున. భానుమతి, సావిత్రి, అంజలి... వీరంతా పెర్‌ఫార్మర్లు. వీరి పక్కన అందరూ సరిపోరు. కాని ఎవరి పక్కనైనా అందంగా సరిపోయే స్టార్‌గా జమున తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 25 ఏళ్లు ఏలింది. హరనాథ్‌తో ‘లేత మనసులు’ పెద్ద హిట్‌ సాధించింది. అందులోని ‘హలో మేడమ్‌ సత్యభామా’, ‘అందాల ఓ చిలుకా అందుకో నా లేఖ’ పాటల్లో జమున జాంపండులా ఉందని ప్రేక్షకులు మురిసిపోయారు. ఒక సీనియర్‌ హీరోయిన్‌ అయి ఉండి, పెద్ద స్టార్‌ అయి ఉండి చలంతో ‘మట్టిలో మాణిక్యాలు’ హిట్‌ కొట్టింది జమున. అందులో ‘నా మాటే నీ మాటై చదవాలి’ పాట అతి మధురం. ముచ్చటం. ఫీల్డ్‌కు వచ్చిన కొత్తల్లో జమునను ‘హంపీ సుందరి’ అని, ‘ఆంధ్రా నర్గిస్‌’ అని పిలిచేవారు. చిత్రంగా నర్గిస్‌కు చిరఖ్యాతి తెచ్చి పెట్టిన ‘మదర్‌ ఇండియా’ను జమునే తెలుగులో చేసింది. ఆ సినిమా పేరు ‘బంగారు తల్లి’.

సినిమా వాళ్లు సినిమా వాళ్లనే చేసుకుంటున్న రోజుల్లో ఆ ఆనవాయితీని తప్పించి లెక్చరర్‌ను వివాహం చేసుకుంది జమున. కొడుకు పుడితే అక్కినేని భార్య అన్నపూర్ణ వచ్చి ‘సిజేరియన్‌ అటగదా. ఇన్నాళ్లూ నువ్వొక్కదానివే సన్నగా ఉన్నావనుకున్నాను. ఇకపై లావెక్కిపోతావు’ అని నిట్టూర్చి వెళ్లింది. కాని జమున మారలేదు. కొడుకు పుట్టిన తర్వాత కూడా పదేళ్ల పాటు హీరోయిన్‌గా కొనసాగింది. సగటు ప్రేక్షకుడి డ్రీమ్‌ గర్ల్‌గానే ఉంది. ఒక ఔత్సాహికుడికి జీవితంలో ఒకసారైనా జమున పక్కన నటించి ఆమెతో ఒక డ్యూయెట్‌ పాడాలని కోరిక. అందుకోసం ఆ ఔత్సాహికుడు భారీ డబ్బు ఖర్చు పెట్టి, పెద్ద తారాగణంతో సినిమా తీశాడు. జమునకు వారితో వీరితో రికమండేషన్‌ చేయించి తన పక్కన నటించేలా ఒప్పించాడు. ఆమె ఆకర్షణ అలా ఉండేది. అన్నట్టు ఆ సినిమా పేరు ‘బొబ్బిలి యుద్ధం’. ఆ ఔత్సాహికుడు సీతారామ్‌.
మురిపించే అందాలే
అవి నన్నే చెందాలే...


‘మిస్సమ్మ’, ‘చిరంజీవులు’, ‘సతీ అనసూయ’, ‘గులే బకావళి కథ’, ‘మంగమ్మ శపథం’, ‘రాముడు భీముడు’, ‘మూగనోము’.... జమున హిట్లు ఎన్నో ఉన్నాయి. ‘మూగ మనసులు’ స్క్రిప్ట్‌ మొత్తం తయారయ్యాక సావిత్రి విని ఇందులో గౌరి పాత్ర నేను వేస్తాను... రాధ పాత్రను జమునకు ఇవ్వండి. గౌరి పాత్ర చాలా బాగుంది’ అన్నదట. ‘గౌరిగా నువ్వు బాగోవు. అది జమునకే కరెక్ట్‌’ అని అక్కినేని సర్దిచెప్పారట. ‘మూగ మనసులు’ సినిమాలో జమున విశ్వరూపం చూపింది. గోదారి గట్టు మీద తన పాద ముద్రలను శాశ్వతంగా విడిచింది. రాయీ రప్పా కాని మామూలు మనుషులను కదిలించింది. కొత్త తరం వచ్చాక తన ప్రాభవాన్ని కాపాడుకుంటూ పక్కకు తప్పుకుంది జమున. చిల్లర మల్లర క్యారెక్టర్లు వేయలేదు. ఆమె వేసే క్యారెక్టర్‌ ‘పండంటి కాపురం’లో రాణి మాలినీ దేవిలా ఉండాలి. అంత పవర్‌ఫుల్‌గా ఉండాలి. ఉంది. పండంటి కాపురం సూపర్‌ హిట్‌ కావడంలో జమున పాత్ర ఒక ముఖ్య కారణం.

జమున తాను రిటైరై పోయినా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. చివరి నిమిషం వరకూ గ్లామర్‌తోనే కనిపించింది. తెల్లజుట్టు జమునను ఎవరూ చూడలేదు. ఉత్సాహం లేని జమునను ఎవరూ చూడలేదు. స్వాతిశయం తప్పిన జమునను ఎవరూ చూడలేదు. సినిమా రంగంలో ఎన్నో ప్రతికూలతలు దాటి, ఎదురు నిలిచి, తన స్థానాన్ని పొందింది జమున.
ఆమె రాకతో ఒక వెన్నెల వచ్చింది.
ఆమె వీడ్కోలుతో ఆ వెన్నెల జ్ఞాపకాల్లోనే మిగిలింది.

పగలే వెన్నెల... జగమే ఊయల
కదలే ఊహలకే కన్నులుంటే...

 

జమున హిట్‌ సాంగ్స్‌లో కొన్ని..
1. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా... (మూగ మనసులు)
2. నీ మది చల్లగా స్వామీ నిదురపో... (ధనమా దైవమా)
3. ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి... (దొరికితే దొంగలు)
4. అంతగా నను చూడకు.. ఇంతగా గురి చూడకు... (మంచి మనిషి)
5. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... (మూగనోము)
6. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ గుట్టు తెలిసిందిలే... (రాముడు భీముడు)
7. మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాట... (మట్టిలో మాణిక్యం)
8. వసంత గాలికి వలపులు రేగ... (శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ)
9. నన్ను దోచుకొందువటే...  (గులేబకావళి కథ)
10. బులి బులి ఎర్రని బుగ్గల దానా... (శ్రీమంతుడు)
11. మనసా కవ్వించకే నన్నిలా... (పండంటి కాపురం)
12. రివ్వున సాగే రెపరెపలాడే... (మంగమ్మ శపథం)
13. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలుకలు రెండు .. (రాము)
14. బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే... (మిస్సమ్మ)
15. ప్రేమ యాత్రలకు బృందావనమూ నందనవనమూ ఏలనో.. (గుండమ్మ కథ)
16. నువ్వూ నేనూ నడిచేది ఒకే బాట... ఒకే మాట (డబ్బుకు లోకం దాసోహం)

ఖదీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement