![Senior Actress Jamuna Entry Into Films Due To Mahanati Savitri - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/27/Jamuna11.jpg.webp?itok=liKCIud5)
సీనియర్ నటి జమున(86) ఇకలేరు. అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నూమూశారు. జమున స్వస్థలం కర్ణాటక అయినా ఆమె పెరిగింది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోనే. జమున తల్లిదండ్రులది కులాంతర వివాహం. తండ్రి వ్యాపారవేత్త కావడంతో గుంటూరు జిల్లా దుగ్గిరాలకు వలస వచ్చారు.
దీంతో ఏడేళ్ల వయసు నుంచి ఆమె దుగ్గిరాలలో పెరిగారు. మహానటి సావిత్రి నాటకాలు వేసే సమయంలో ఓసారి దుగ్గిరాలకు వచ్చారు. ఆమెతో మాట్లాడుతున్నప్పుడు సినిమాలపై ఆసక్తిని గమనించిన సావిత్రి స్వయంగా జమునను చిత్ర పరిశ్రమలోకి ఆహ్వానించారు. అలా 15ఏళ్ల వయసులోనే జమున సినీరంగ ప్రవేశం చేశారు.
జమున నటించిన తొలిచిత్రం 'పుట్టిల్లు'. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న జమున ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య వంటి అగ్రహీరోలతో జతకట్టారు. 200కు పైగా సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారామె. జమున ఇక లేరనే వార్త సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment