jandhyala
-
హాస్యం ఒక ఇమ్యూనిటీ బూస్టర్
ఏ ప్రత్యేకతా లేకపోవడమే మధ్యతరగతి ప్రత్యేకత. ఏదైనా ప్రత్యేకత కోసం ప్రయత్నించడం కూడా మధ్యతరగతి ప్రత్యేకతే. కవిత్వం చదవడమో కొత్త వంట నేర్చుకోవడమో సంగీతం సాధన చేయడమో ‘క’ భాషో, కలం స్నేహమో ఏవైనా హాస్యాలు తెచ్చేవే. మందహాసాలు పూయించేవే. కోవిడ్ మన పెదాల మీద నవ్వులు దోచుకుపోయింది. నవ్వు చాలా పెద్ద ఇమ్యూనిటీ బూస్టర్. జంధ్యాల వర్థంతి సందర్భంగా ఆయన నవ్వులు తలుచుకుని ఆ కామిక్ టానిక్ తాగుదామా? ఔత్సాహికులతో కొంచెం గడబిడే. వీళ్లు తమకు ఫలానాది వచ్చు అని గట్టిగా నమ్ముతారు. ఫలానాది నిజంగా తెలిసినవాళ్లు గతుక్కుమంటారు. ‘చారు ఎలా చేయాలో ఒక పాత్ర చేత చెప్పించి కథ అంటావా’ అంటాడు పొట్టి ప్రసాద్ ‘చంటబ్బాయ్’లో శ్రీలక్ష్మితో. ఏమో. అది కథెందుకు కాదు. ‘నెత్తికి రీటా కాలికి బాటా నాకిష్టం సపోటా’ ఇది కూడా కవిత్వమే అని అనుకుంటుంది శ్రీలక్ష్మి. కాని పొట్టి ప్రసాద్ మాత్రం ‘నీకూ నాకూ టాటా... నన్నొదిలెయ్ ఈ పూట’ అని పారిపోవడానికి చూస్తాడు. ‘మనిషికి కాసింత కళాపోషణ ఉండాలి’ అని పూర్వం ముళ్లపూడి మునివర్యుడు అన్నాడు నిజమే. ఆ పోషణ ఎదుటివారి ప్రాణాలకై సాగే అన్వేషణ కారాదు కదా. పెళ్లిచూపులకు వచ్చిన సుత్తి వీరభద్రరావు నోరు మూసుకుని పిల్లను చూసి ఊరుకోకుండా ‘నాకు పాటలు పాడేవారం టే ఇష్టం’ అని అంటాడు పెళ్లికూతురైన శ్రీలక్ష్మి తో. అది శ్రీలక్ష్మి మనసులో పడిపోతుంది. నాకు పాట రాకపోయినా ఇతను పెళ్లి చేసుకున్నాడు.. ఇతన్ని ఏనాటికైనా నా పాటతో మెప్పిస్తాను అని హార్మోనియం పెట్టె ముందేస్కోని సా.. కీ.. కే...ఙ అనే రాగం తీస్తూ ఉంటుంది. భరించువాడు భర్తే అయితే సుత్తి వీరభద్రరావు నిజంగా భర్తే. అయితే ఈ కళలలో రాణించాలనే పిచ్చి స్త్రీలకే ఉండదు. పురుషులకు కూడా ఉంటుంది. ‘నడుస్తోంది నడుస్తోంది నడుస్తోంది జీవితం’ అని కవిత్వానికి తగులుకుంటాడు సుత్తి వీరభద్రరావు తాను కవి అని నమ్మి ‘పుత్తడిబొమ్మ’ సినిమాలో. ఊళ్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటే అతడు పంచ రత్నాలు చదివిస్తాడు. ‘రంగ పెళ్లికొడుకు... గంగ పెళ్లికూతురు.. కిష్టిగాడు గంగ తండ్రి... వీరమ్మ రంగ తల్లి... ఇక మున్ముందు కిష్టిగాడు రంగమామ.. వీరమ్మ గంగ అత్త.. గంగను సింగారించి రంగకు జత కలిపారు... ’ ఇలా సాగుతుంది సుత్తి కవిత్వం. జనం ఇలా కాదని అతన్ని శిక్షించడానికి ఏకంగా ఏనుగునే బహూకరిస్తారు. ఏంటో.. బతుకులిలా ఏడుస్తున్నాయి అని అంటారుగాని అవి ఏడుస్తున్నాయా? వెతికితే ఎంత నవ్వు. ‘లేడీస్ స్పెషల్’లో శ్రీలక్ష్మి ఇంటికి ఎవరొచ్చినా తంటే. ఉదాహరణకు పోస్ట్‌మేన్ వచ్చి లెటర్ ఇస్తే అతణ్ణి పరీక్షగా చూసి ‘మీరు కనకమేడల సుందర్రావు కదూ’ అంటుంది. అతను ఆశ్చర్యపోతాడు. ‘మీకెలా తెలుసు’ అంటాడు. ‘నేను కుక్కమూతుల కుటుంబరావు గారి అమ్మాయిని. మీరు నన్ను పెళ్లిచూపులు చూసెళ్లిన పద్నాలుగో పెళ్లికొడుకు. ఆ రోజు మా అమ్మగారు మీకు తొక్కుడులడ్లు కారప్పూసా పెట్టారు. నేను సామజ వర గమనా పాడుతుంటే మీరు పారిపోయారు’ అని గుర్తు చేస్తూ ఉంటుంది. ఆమె పాటను గుర్తు చేసుకుని అతడు హడలిపోతూ ‘అది చెవిలో విషప్రయోగమండీ’ అంటాడు. సినిమా పిచ్చోళ్లు కూడా ఉంటారు ఇళ్లల్లో. భర్తకు సినిమా చూసే తీరిక ఉండదు. భార్యకు సినిమా కథ చెప్పక మనసు ఆగదు. ‘శ్రీవారి ప్రేమలేఖ’లో భర్త నూతన్ ప్రసాద్‌కు భార్య శ్రీలక్ష్మి తాను చూసొచ్చిన సినిమా కథలు చెబుతుంటుంది. కాని ఎలా? టైటిల్స్ నుంచి. ‘ఏబిసిడిఇఎఫ్ ప్రొడక్షన్స్ వారి ‘చిత్రవధ’.. కథానువాదం, దర్శకత్వం– శకుని, తారాగణం– జబ్బర్, ఉన్ని.. ’ ఆమె చెప్పే కథలకు సూపర్ ఫ్లాప్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ల కంటే ఎక్కువ బాధ నూతన్ ప్రసాద్‌కు. సగటు జీవితాల్లో తిప్పలను చూసి ఏడ్వలేక నవ్వాడు దర్శకుడు జంధ్యాల. వాటిని చూపించి, ఎగ్జాగరేట్ చేసి నవ్వించే ప్రయత్నం చేశాడు. చెప్పిందే చెప్పే పెద్దవాళ్లను ‘సుత్తి’ చేశాడు. ఆ దెబ్బలకు నలిగిపోయే వాళ్లకు కూడా ఒక చాన్స్ ఇచ్చి ‘రివర్స్ హామరింగ్’ వేసే చాన్స్ ఇచ్చాడు. కోడిని వేళ్లాడగట్టి అదే చికెన్ కర్రీ అని తినేసేవాళ్లను, మొగుని వొంటి మీద బట్టలు తప్ప తక్కినవన్నీ స్టీలు సామాన్ల వాడికేసి స్పూన్లు గరిటెలు తీసుకునే సాధ్వీమణులను, చనిపోయిన సంతానాన్ని తలుచుకుంటూ ప్రతివాడిని ‘బాబూ చిట్టీ’ అని కావలించుకునే వెర్రిబాగుల పాత్రలను చూపి కాసేపు హాయిగా నవ్వించాడు. నవ్వడం ఒక భోగం అన్నాడు జంధ్యాల. మార్కెట్లో ఇప్పుడు రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు అమ్ముతున్నారు. కాని హాస్యం అనే గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్లను రెగ్యులర్‌గా ఇస్తూ తెలుగు వారి ఆరోగ్యాన్ని సుసంపన్నం చేసిన వాడు జంధ్యాల. ఎన్ని కష్టాలు ఉన్నా నవ్వడం మర్చిపోకూడదు. నవ్వే మనిషినే ఇష్టపడతాడు మనిషి. నవ్వే మనిషిని చూసి ధైర్యం తెచ్చుకుంటాడు. తోడు నవ్వుదామని చూస్తాడు. నవ్వుతూ ఉందాం. ఇటీవలి బాధల్ని వేదనల్ని భయాలను పూర్తిగా మర్చిపోయేంత వరకూ మంచి హాస్యాన్ని మూడు పూటలా తీసుకుంటూనే ఉందాం. – సాక్షి ఫ్యామిలీ -
‘అహా నా పెళ్ళంట’ మూవీలో కోట పాత్రకు ముందుగా ఎవరిని అనుకున్నారో తెలుసా!
రాజేంద్ర ప్రసాద్ తొలి కామెడీ చిత్రం ఆహా నా పెళ్లంట. ఆదివిష్ణు రాసిన సత్యం గారి ఇల్లు నవల ఆధారంగా 1987 వచ్చిన ఈ మూవీకి జంధ్యాల దర్శకత్వం వహించారు. తెలుగు సినీ చరిత్రలో కామెడీ సినిమాల ట్రెండ్‌కు రెడ్ కార్పెట్ పరిచిన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో రాజేంద్రప్రసాద్ కామెడీ హీరోగా అన్నివర్గాల ప్రేక్షకుల అలరించాడు. అంతేగకా హాస్య బ్రహ్మ బ్రహ్మనందంను నటుడిగా పరిచయం చేసిన చిత్రం కూడా ఇదే. ఇందులో బ్రహ్మి నత్తివాడిగా.. అరగుండు పాత్రలో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఈ మూవీలో ఇప్పటికి ప్రత్యేకంగా గుర్తు చేసుకునే పాత్ర పిసినారి లక్ష్మీపతి. ఈ పాత్రలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఒదిగిపోయారు. చెప్పాలంటే ఆహా నా పెళ్లంట మూవీ గుర్తు వస్తే చాలు ముందుగా గుర్తోచ్చే పాత్ర కోట శ్రీనివాస్‌దే. ఇంటి దూలానికి బతికి ఉన్న కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ చికెన్ కూరతో అన్నం తింటున్నట్టుగా ఆస్వాధించిన సన్నివేశం ఇప్పటికి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇక చూట్టాలు ఇంటికి వస్తే ఇలా చేయాలంటూ ఆ సన్నివేశాన్నే ఉదహరణగా తీసుకుంటూ చమత్కరిస్తుంటారు. అంతేగాక బట్టలను పొదుపు చేసేందుకు పేపర్ చుట్టుకుని పడుకోవడం ఇలా ఎన్నో సీన్లలో పిసినారి లక్ష్మిపతిగా కోట తన నటనతో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ఇప్పటికీ ఆ సీన్లు గుర్తోస్తే నవ్వని వారుండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ పాత్రను తాను తప్ప ఇంకెవరూ చేయలేరేమో అన్నంతగా కోట పిసినారి లక్ష్మీపతి పాత్రలో ఒదిగిపోయాడు. అంతలా ఆ పాత్రను పండించిన కోట శ్రీనివాస్‌ను మొదట తీసుకునేందుకు నిర్మాత రామానాయుడు ఒప్పుకొలేదట. ఈ విషయాన్ని స్వయంగా కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్య్వూలో చెప్పాడు. ఎందుకంటే ఈ మూవీకి పిసినారి లక్ష్మిపతి పాత్రే కీలకం. అది పండితేనే ఈ సినిమా హిట్ లేదంటే పరాజయం చూడాల్సిందే. అంతటి ఈ ప్రధాన పాత్రకు కోట శ్రీనివాస రావును తీసుకోవాలని డైరెక్టర్ జంధ్యాల రామానాయుడికి సూచించాడట. అయితే ఈ పాత్ర కోటతో వద్దని ప్రముఖ నటుడు రావుగోపాలరావుతో చేయించాలని ఆయన అనుకున్నట్లు కోట వివరించాడు. అయితే జంధ్యాల మాత్రం ఆయనను తప్ప ఇంకేవరిని లక్ష్మీపతి పాత్రకు ఒప్పుకోలేదట. ఈ విషయంపై రామానాయుడు, జంధ్యాల దాదాపు 20 రోజుల పాటు వాదించుకున్నారని ఆయన అన్నాడు. అయితే కోట నటించిన మండలాధీశుడు చిత్రం విడుదల తర్వాత జంధ్యాల ఈ పాత్రకు కోటను ఫిక్స్ అయ్యారట, దీంతో ఆ మూవీలో పిసినారి పాత్రకు కోటను తప్ప ఇంకేవరిని తీసుకున్న పరాజయం తప్పదని తెల్చి చెప్పాడట. దీంతో రామానాయుడు చివరకు ఈ పాత్రకు కోట శ్రీనివాసరావును ఓకే చేశారట. కాగా ఒక రోజు చెన్నై వెళ్లడానికి కోట శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టుకు వెళ్తుండా అక్కడ ఆయనకు రామానాయుడు కనిపించారట. కోటను చూసిన ఆయన ఇక్కడకు రావయ్యా నీతో ఓ విషయం చెప్పాలని పిలిచాడట. జంధ్యాలతో ఓ సినిమా ప్లాన్ చేశా అని, అందులో లక్ష్మీపతి పాత్ర గురించి కోటకు చెప్పి. జంధ్యాలతో జరుగుతున్న వాదన గురించి కూడా వివరించాడట. వాదన ఎందుకండీ ఈ క్యారెక్టర్‌కు రావు గోపాలరావే న్యాయం చేస్తాడని ఆయన బదులిచ్చినట్లు తెలిపారు. కానీ రావుగోపాలరావుకు ఎంత మేకప్ వేసినా ఆయన ముఖంలో ప్యూర్‌నెస్ రాదని జంధ్యాల అంటున్నారని రామానాయుడు ఆయనతో అన్నారని, ఏం చెప్పాలో అర్థంకాక సందిగ్ధంలో ఉన్న కోటకు ఆ పాత్రను నువ్వే చేయాలని బంపర్ ఆఫర్ ఇచ్చేశాడట రామానాయుడు. -
నాన్నను తలిస్తే ధైర్యం
ఎన్నో సినిమాలకు డైలాగ్స్ రాసినా, దర్శకత్వం వహించినా జంధ్యాల ఇష్టపడింది మాత్రం ‘ఆపద్బాంధవుడు’లో చేసిన ఆడపిల్ల తండ్రి పాత్రనే. స్త్రీలు కూడా సరదాగా తీసుకునేలా ఆయన వారిపై జోకులు వేశారు గానీ నొచ్చుకునేలా కాదు. ఆయనకు దేవుడు ఇద్దరు అమ్మాయిలను ఇచ్చాడు. ఆయన దేవుడి దగ్గరకు వెళ్లిపోయినా ఆయన జ్ఞాపకాలు వారికి స్థైర్యాన్ని ఇస్తూనే ఉన్నాయి. హాస్యబ్రహ్మగా పేరు సంపాదించుకున్న జంధ్యాలకు కొంచెం లేటు వయసులో సాహితి, సంపద కవలపిల్లలుగా పుట్టారు. వారి ముద్దుమురిపాలు పూర్తిగా చూడకుండానే, ‘మాకు హాస్యాన్ని పంచడానికి రావయ్యా’ అంటూ స్వర్గలోకం నుంచి పిలుపు వచ్చినట్టుంది వెళ్లిపోయారు.‘నాన్న ప్రేమను ఆస్వాదించినది తక్కువ రోజులే అయినా ఆ ఆప్యాయతను మరచిపోలేం. సినిమాల ద్వారా నాన్న చిరంజీవిగా ఉండిపోయారు’ అంటూ తండ్రి జ్ఞాపకాలను తడుముకోకుండా సాక్షితో పంచుకున్నారు సాహితి, సంపద. సాహితి: మాకు నాలుగేళ్ల వచ్చేసరికి నాన్న మాకు దూరమైపోయారు. ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ ఆఖరి సంవత్సరం ఇంటెర్న్‌షిప్‌లో ఉన్నాను. నాన్నని ఎక్కువ కాలం చూడకపోయినా, ఆయన జ్ఞాపకాలను అందరినోటా విని తెలుసుకుంటున్నాం. నాన్న గురించి మాట్లాడమని ఎవరడిగినా నాన్న సినిమాలే గుర్తుకు వస్తాయి. సంపద: మేమిద్దరం కవల పిల్లలం. సాహితి కంటె నేను ఒక్క నిమిషం చిన్నదానిని. బి.కామ్. సిఏ చేస్తున్నాను. సాహితి – సంపద: మా బారసాలకు మేమే అందరినీ ఆహ్వానిస్తున్నట్లుగా ఆహ్వాన పత్రిక వేయించారు నాన్న. సాహితి: బారసాలలో నేను పెన్ను ముట్టుకున్నాను. సంపద: నేను డబ్బులు ముట్టుకున్నాను. సాహితి – సంపద: మా పుట్టిన రోజుకి తీసిన సీడీలు చూస్తే ఎంత గ్రాండ్‌గా చేశారో అర్థం అవుతుంది. ఏనుగులు, గుర్రాలు, ఎర్ర తివాసీ... ఎంతో ఘనంగా చేశారు. సినిమా పరిశ్రమ తరలి వచ్చింది. ఏయన్నార్ అంకుల్, ‘ఏమిటయ్యా! పెళ్లిలా చేస్తున్నావు’ అన్నారట నాన్నతో. నాన్న బతికి ఉంటే ప్రతి పుట్టినరోజు ఇలాగే చేసేవారేమో. సాహితి: నేను నారాయణరెడ్డి తాతగారి జేబులో నుంచి పెన్ను తీసుకున్నానట. అప్పుడు ఆయన ‘పేరుకి తగ్గట్టు పెన్ను తీశావు’ అన్నారట. మేం అన్నం తినకుండా మారాం చేస్తుంటే నాన్న మమ్మల్ని కారులో నెక్లెస్రోడ్కి తీసుకెళ్లి తినిపించేవారని అమ్మ చెబుతుంటే, నాన్నకు మా మీద ఎంత ప్రేమో అనిపిస్తుంది. అవకాశం ఉన్నప్పుడు ఇంటిల్లిపాదినీ ప్రివ్యూకి తీసుకెళ్లే వారట నాన్న. నాన్న తీసిన సినిమాలలో ‘అహనా పెళ్లంట’ చిత్రంలోని బ్రహ్మానందంగారి కామెడీ, డైలాగులు ఇష్టం. హాస్య సంభాషణలే నాన్న ప్రత్యేకత. ‘నాలుగు స్తంభాలాట’, ‘వివాహæభోజనంబు’ సినిమాలు బాగా ఇష్టం. ‘వివాహభోజనంబు’లో సుత్తి వీరభద్రరావు అంకుల్, ‘హైదరాబాదు, సికింద్రాబాదు, అహమ్మదాబాదు...’ అంటూ నగరాల పేర్లు, విజయవాడ వీధుల పేర్లన్నీ చెప్పిన సీన్లు బాగా ఇష్టం. సంపద: ‘చంటబ్బాయ్’లో శ్రీలక్ష్మి ఆంటీ ‘నన్ను కవిని కాదన్నవాడిని కత్తితో పొడుస్తాను’ అని కవిత్వం చెప్పడం సరదాగా అనిపిస్తుంది. సాహితి: చాలా సీన్లు చూస్తుంటే, మా ఇంట్లో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తుంటాయి. జీవితంలో తాను ప్రేరణ పొందిన వాటిని పాత్రలుగా సృష్టించి, హాస్యాన్ని పండించారు నాన్న. ‘రావూ – గోపాలరావూ’ చిత్రంలో రాధాకుమారి ‘స్టీల్ సీత’ పాత్ర అమ్మ వాళ్ల ఫ్రెండ్‌ను చూసి తీశారని అమ్మే చెప్పింది. సంపద: ‘మొగుడు – పెళ్లాలు’ చిత్రంలో ఒక దృశ్యంలో ఇంటికి వచ్చిన బంధువులంతా ఎక్కడా కాలు పెట్టడానికి లేకుండా పడుకుంటారు. అది నాన్న జీవితంలో జరిగిందే. అమ్మవాళ్లు వాళ్ల పెళ్లిరోజున బయటకు వెళదామనుకున్నారుట. ఈలోగా అమ్మ వాళ్ల చుట్టాల వాళ్లు ఒక బస్సులో మా ఇంటికి వచ్చేశారట. ఇల్లంతా నిండి మెట్ల మీద పడుకున్నారట. సాహితి: ‘ఆనందభైరవి’ చిత్రంలో శ్రీలక్ష్మి పాత్రకు ఈల వేయడం అలవాటు. రాజమండ్రి లో ఉంటున్న మా అత్త కామేశ్వరిని చూసి ఆ సీన్లు పెట్టారట. ఆవిడ సినిమాకి వెళ్లినప్పుడు మంచి సీన్ వస్తే విజిల్ వేస్తారు. సంపద: అమ్మవాళ్లు చెన్నైలో ఉండగా నీళ్ల ఇబ్బందులు ఉండటంతో, నీళ్లు వదిలినప్పుడు చిన్న చిన్న గ్లాసుల్లో కూడా పట్టుకునేవారుట. ఆ సీన్‌ని దృష్టిలో ఉంచుకుని, ‘అహ నా పెళ్లంట’ చిత్రంలో నీళ్ల కరవు సీన్‌ను హాస్యం చేశారట నాన్న. తన జీవితంలో ఎక్కడ ఏ మేనరిజమ్ చూసినా దానిని తన సినిమాలలో పెట్టే వారని మా గణేశ్ బావ ఇప్పటికీ చెబుతుంటాడు. సాహితి: నాన్న రాసిన ‘పరమబోరింగ్ మొహం’ డైలాగులని డబ్స్మాష్లో చేశాను. ‘చంటబ్బాయ్’, ‘అహ నా పెళ్లంట’ చిత్రాలలో సన్నివేశాలు కూడా చేశాను. మా సంపద ఏదైనా సినిమా చూస్తే బ్యానర్ నుంచి శుభం కార్డు వరకు కథ ఆపకుండా చెప్తుంది. నాన్న ఉండి ఉంటే ‘శ్రీవారికి ప్రేమలేఖ’ చిత్రంలో శ్రీలక్ష్మి పాత్ర పుట్టింది అనుకునేవారేమో. సంపద: ‘ష్!గప్‌చుప్’ చిత్రంలో ఏవిఎస్ పాత్ర భలే నవ్వొస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ల కామెడీ బాగా ఇష్టం. వారంతా నాన్న సినిమాలు వేసుకుని చూసి సినిమాలు తీస్తారని చెప్పడం విన్నాను. సాహితి: నాన్న రాసిన నాటకాలను షార్ట్ ఫిల్మ్స్‌లా తీయాలనుకుంటున్నాం. అందులో మేమే నటించాలనుకుంటున్నాం. నాన్న రాసుకున్న స్క్రిప్ట్ మా దగ్గర రెడీగా ఉన్నాయి. వాటిని ప్రచురించాలని కూడా ఉంది. సాహితి: నాన్న అంటే ఒక ధైర్యం. సంపద: నాన్న అంటే అభిమానం, గౌరవం. – సంభాషణ: వైజయంతి పురాణపండ చాలా కాలం తరవాత ఇద్దరం పుట్టడంతో ‘నేను ఒకటి కోరుకుంటే నాకు భగవంతుడు రెండు ఇచ్చాడు’ అన్నారట. నాన్న ఏది చేసినా చాలా ప్రత్యేకంగా విలక్షణంగా ఉంటుంది. నేను (సాహితి) కొంచెం సన్నగా ఉంటాననని నన్ను రస్కు అని, నేను (సంపద) కొద్దిగా బొద్దుగా ఉంటానని నన్ను బన్ను అని పిలిచేవార ని అమ్మ చెప్పింది. – సాహితి నాన్న బయటకు నవ్వేవారు కాదట. సీరియస్ గా ఉంటూ, అందరినీ నవ్వించేవారట. అమ్మ తెలుగు మాట్లాడుతూ ఒత్తులు సరిగ్గా పలకలేకపోతే ‘ఒత్తుల డబ్బా పక్కన పెట్టుకో’ అనేవారని అమ్మచెబుతూ ఉంటుంది. నాయనమ్మతో కలిసి అమ్మ మైసూర్‌పాక్ వంటివి చేస్తుంటే ‘రాళ్లు పెట్టి కొట్టుకుని తినాలా, మామూలుగానే చేశావా’ అని సరదాగా ఆట పట్టించేవారట. – సంపద -
అంత అబద్ధం ఎలా రాశారు?
విజయనగరం సంస్కృత కళాశాలలో వినాయక నవరాత్రులు కళాశాల ప్రిన్సిపాల్ మానాప్రగడ శేషశాయి ఘనంగా జరిపించేవారు. ప్రతి సాయంత్రం ముందు ఒక సాహిత్య ప్రసంగం, తరువాత ఒక సంగీత కార్యక్రమం ఉండేది. ఆ రెండు రంగాల్లో మేటి ఘనాపాఠీలందరూ మా కళ్ళకు, వీనులకు విందు చేసేవారు. అప్పటి ఆ కళాశాల విద్యార్థిగా ఒక మరచిపోలేని సంఘటన. 1972లో ఒకనాటి ప్రసంగంలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్య శాస్త్రి తన ఉద్యోగ జీవితంలోని ఒక సంఘటన వివరించారు. ఆయన గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు, ఒక ఆదివారం తన ఇంటికి కొంతమంది విద్యార్థినులు వచ్చారట. వారిని వరండాలో ఉన్న కుర్చీలలో కూర్చోమని, ఇంట్లోకి పోయి, మంచినీరు తెచ్చి ఇస్తుండేసరికి ఆ అమ్మాయిలు ‘‘మాస్టారూ! మీరు రాసిన ఉదయశ్రీ పుస్తకంలో ‘కూర్చుండ మాయింట కుర్చీలు లేవు’ అని ఓ పద్యం రాశారు కదా! ఇక్కడ ఇన్ని కుర్చీలు ఉండగా అక్కడ అంత అబద్ధం ఎలా రాయగలిగారండీ?’ అని ప్రశ్నించారట. అనుకోని ఆ ప్రశ్నకు అవాక్కయిన కరుణశ్రీ ‘‘ఇవన్నీ మీలాంటి అతిథులు కూర్చోడానికి తగిన కుర్చీలు. నేనా పద్యం సకలలోక పాలకుడైన భగవంతుని గూర్చి రాసినది. ఆయన కూర్చోడానికి తగిన కుర్చీ నేనెక్కడి నుండి తేగలను? అందుకే అలా రాయవలసి వచ్చింది’’ అని తిరిగి బదులిచ్చారట. ఆ మాటలకు మేము ఆశ్చర్యానికీ, ఆనందానికీ గురయ్యాం. గార రంగనాథం -
ఇ వి వి సినిమా
-
గుండెల్లో గోదారి
మండపేట నియోజకవర్గంలోని రాయవరం మండలం పసలపూడి గ్రామంలో కొన్ని నెలల పాటు ఉండి.. సిరిసిరిమువ్వ సినిమాను కళాత్మకంగా తీసేందుకు దర్శకుడు కె.విశ్వనాథ్ పడిన తపనను.. ఆయన మహోన్నతికి వెన్నంటి ఉండి సహకరించిన జిల్లావాసులపై.. వల్లమాలిన అభిమానాన్ని విశ్వనాథ్ ఉద్వేగంతో చెప్పేసరికి.. ఆహూతులు పులకరించిపోయారు. మాటలకు అందని ఆనందం అందరిలో కలిగింది. మండపేటలో జరిగిన సత్కార సభలో కృతజ్ఞతాపూర్వకంగా.. జిల్లాతో ఉన్న అనుబంధాన్ని, సినీ దర్శకుడు జంధ్యాలతో ఆత్మీయతను నెమరువేసుకున్నారు. అందుకేనేమో.. నడవలేని స్థితిలో ఉన్నా సరే.. గోదావరి గడ్డపై నిర్వహించే కార్యక్రమానికి ఓపిక చేసుకుని కళాతపస్వి విశ్వనాథ్ వచ్చారు. మండపేట: జిల్లాతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు, పద్మశ్రీ, కె.విశ్వనాథ్ అన్నారు. జంధ్యాల లేని ఈ సభ.. ఆలయం లేని ధ్వజస్తంభాన్ని తలపిస్తోందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సందర్భంగా ఆయనను మండపేట పట్టణ బ్రాహ్మణసేవా సంఘం ఆదివారం ఘనంగా సత్కరించిం ది. స్థానిక సీతారామ కమ్యూనిటీ హాలు వద్ద నిర్వహిం చిన కార్యక్రమానికి విశ్వనాథ్, ప్రముఖ సినీ దర్శకుడు జంధ్యాల సతీమణి అన్నపూర్ణ, కుమార్తెలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని కళాతపస్వి నెమరువేసుకున్నారు. సిరిసిరిమువ్వ చిత్రం షూటింగ్ పసలపూడిలో తీస్తున్నప్పుడు జంధ్యాలతో కలిసి ఈ ప్రాంతమంతా పర్యటించానని, జంధ్యాల అత్తవారి గ్రామం నర్సిపూడి వెళ్లేవారమని చెప్పారు. జంధ్యాలతో అనుబంధాన్ని, జంధ్యాల మహోన్నత వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు. పసలపూడికి చెందిన సినీ నిర్మాత కర్రి రామారెడ్డి, భాస్కరరెడ్డి తదితరులతో ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అందరం కలిసి విందు భోజనాలు చేసేవారమన్నారు. ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉందని, నడవలేకున్నా తనను పట్టుబట్టి తీసుకువచ్చి, జీవితంలో ఓ మధుర జ్ఞాపకాన్ని నింపారంటూ బ్రాహ్మణ సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. విశ్వనాథ్‌ను సత్కరిస్తున్న బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు విశ్వనాథ్‌కు ఘన సత్కారం బ్రాహ్మణ సేవా సంఘ అధ్యక్షుడు పిడపర్తి భీమశంకరశాస్త్రి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీరామశర్మ, సంఘ నాయకులు అవసరాల వీర్రాజు, శివకోటి శేష సుబ్రహ్మణ్యం తదితరులు విశ్వనాథ్‌ను ఘనంగా సత్కరించారు. మండపేటలోని ఐఎస్డీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యినపకోళ్ల సత్యనారాయణ (ఐఎస్ఎన్), ఆలిండియా ఆర్యవైశ్య మహాసభ జాతీయ అధ్యక్షుడు కాళ్లకూరి నాగబాబు తదితరులు కూడా ఆయనను సత్కరించారు. అనంతరం జంధ్యాల సతీమణి అన్నపూర్ణను ఘనంగా సత్కరించారు. తమ ఆహ్వానాన్ని మన్నించి మండపేట వచ్చిన విశ్వనాథ్‌కు మండపేట పట్టణ బ్రాహ్మణసేవా సంఘం కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం సీతారామ మందిరంలో జరిగిన బ్రాహ్మణ కార్తిక వన సమారాధనలో విశ్వనాథ్ పాల్గొన్నారు. రామచంద్రపురం డీఎస్పీ జేవీ సంతోష్, జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు దంతుర్తి సత్యప్రసాద్, సంఘ నాయకులు పేరి కామేశ్వరరావు, రాణి శ్రీనివాసశర్మ, గాడేపల్లి సత్యనారాయణమూర్తి, కందర్ప హనుమాన్, కళ్లేపల్లి ఫణికుమార్, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. -
హహ్హహ్హా ...లాఫింగ్ సిక్నెస్...!
మెడి క్షనరీ జంధ్యాల చెప్పినట్లు నవ్వలేకపోవడం తప్పనిసరిగా ఒక రోగం. కానీ అప్రయత్నంగా వికటాట్టహాసం చేయడం లేదా అనియంత్రితంగా ఏడ్వటం కూడా ఒక జబ్బేనట. అయితే, ఇది ఒక ఆదిమ తెగకు మాత్రమే పరిమితం. ‘లాఫింగ్ సిక్నెస్’ అని పిలిచే ఈ జబ్బు నరాలపై నియంత్రణ కోల్పోవడం వల్ల వచ్చేది. పపువా న్యూ గినియాలోని ‘ మానవభక్షణ’ చేసే ఆదిమ తెగల్లో పంధొమ్మిది వందల యాభై అరవైలలో ఈ జబ్బు కనిపించేది. ట్రాన్స్మిసిబుల్ స్పంజిఫామ్ ఎన్‌కెఫలోపతి అనే నరాల జబ్బుల వర్గానికి లాఫింగ్ సిక్నెస్ చెందుతుందట. ఈ జబ్బును ‘కురు’ అని కూడా పిలిచేవారు. స్వజాతీయుల మెదడును తినే సమయంలో ఆ మెదడుకు ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఇది వస్తుందని డాక్టర్లు కనుగొన్నారు. సరిగ్గా నడవలేకపోవడం, మాట ముద్దగా రావడం, మింగడం కష్టం కావడం... ఇవన్నీ లాఫింగ్ సిక్నెస్ లక్షణాలు. కురు అంటే వణుకుతుండటం అని స్థానిక భాషలో ఆ పదానికి అర్థం. -
ఒక మేక... ఒక ఏనుగు...
హిట్ క్యారెక్టర్ పూర్తి పేరు : మామిళ్లపల్లి వీరభద్రరావు పుట్టింది : 1948 జూన్ 6న ఫస్ట్ మూవీ : జాతర (1980) లాస్ట్ మూవీ : చూపులు కలిసిన శుభవేళ (1988) టోటల్ పిక్చర్స్ : 180కు పైగా మరణం : 1988 జూన్ 30న టాప్ టెన్ మూవీస్ 1. నాలుగు స్తంభాలాట (1982) 2. శ్రీవారి ప్రేమలేఖ (1984) 3. ఆనంద భైరవి (1984) 4. బాబాయ్-అబ్బాయ్ (1985) 5. పుత్తడి బొమ్మ (1985) 6. రెండు రెళ్లు ఆరు (1986) 7. మారుతి (1986) 8. అహ నా పెళ్లంట (1987) 9. వివాహ భోజనంబు (1988) 10. చూపులు కలిసిన శుభవేళ (1988) సినిమా పేరు: పుత్తడి బొమ్మ (1985) డెరైక్ట్ చేసింది: జంధ్యాల సినిమా తీసింది: ఎస్. వెంకటరత్నం మాటలు రాసింది: జంధ్యాల ‘సుత్తి’ వీరభద్రరావు రేర్ కమెడియన్. సీరియస్ ఫేస్‌తో కనిపిస్తూనే సిల్వర్ స్క్రీన్‌పై ఆయన పేల్చినన్ని ఫన్ గన్లు ఇంకెవరూ పేల్చలేదేమో. ఎంత త్వరగా క్లిక్కయ్యాడో, అంతే తొందరగా వెళ్లిపోయాడాయన. 41 ఏళ్లకే కన్ను మూయడం తెలుగు హాస్యాభిమానుల దురదృష్టం. ఎయిటీస్‌లో రిలీజైన సినిమాలన్నింటిలోనూ దాదాపుగా వీరభద్రరావు ఉన్నారు. ఇక జంధ్యాల డెరైక్షన్‌లో సినిమా అంటే వీరభద్రరావు ఉండి తీరాల్సిందే. ‘పుత్తడి బొమ్మ’ సినిమా ఫ్లాప్ అయినా, ఈయన కేరెక్టర్ మాత్రం సూపర్ హిట్. ఆ ఊళ్లో వాళ్లు పులిని చూస్తే భయపడరు. సింహం కనబడితే పారిపోరు. ఏ ఖడ్గమృగం ఎదురుపడ్డా వణికిపోరు.కానీ, ‘మేక’ ఆమడదూరంలో కనిపిస్తే మాత్రం అందరికీ ఒకటీ రెండూ వచ్చేస్తాయ్. మేక అంటే అంత భయం. కాదు కాదు అంత వణుకు. చిత్రంగా ఉంది కదూ! అయితే మీకు మేకను ఇంట్రడ్యూస్ చేయాల్సిందే! మేక అంటే జంతువనుకునేరు. అదో మనిషి పేరు. లాల్చీ పైజామా, మెడలో శాలువా, గాంధీగారి కళ్లద్దాలు, మెడలో వేలాడే సంచి... ఇదీ అతని గెటప్. దాదాపుగా మీకు అర్థమైపోయే ఉంటుంది. మేక అంటే ‘మేధావి కవి’ అని అర్థం. శ్రీశ్రీ లాగా షార్ట్ నేమ్ పెట్టుకోవాలని ఇలా పెట్టుకుని తగలడ్డాడన్నమాట. ఇతగాడి అడుగుల శబ్దం వినబడితే చాలు... ఆ రోడ్డంతా కర్ఫ్యూ విధించినట్టుగా ఖాళీ. ముక్కుతూ మూల్గుతూ కాళ్లీడ్చుకుని నడిచేవాళ్లు సైతం... ఇతగాడికి దొరికితే హుసేన్ బోల్ట్ కన్నా స్పీడ్‌గా పరిగెట్టేస్తారు. అవును మరి... అదంతా అతగాడి కవితల మహత్యం. మచ్చుకు ఒకటి రుచి చూడండి. ‘‘నీలి ఆకాశానికి జలుబు చేసింది...వెండి నేలకు వేడి చేసింది... చల్లగాలికి పైత్యం చేసింది...ఈ ప్రకృతికే జబ్బు చేసింది...’’ నిజంగా ఈ కవిత వింటే మనకే జలుబు చేసి, పైత్యం వచ్చి, జబ్బు వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది కదూ. ఇంకొక్కటి రుచి చూడండి...‘‘కోడి కూసింది... కొక్కొరక్కో కొక్కొరక్కోమేక అరిచింది... మే మే మే మే...కుక్క మొరిగింది... భౌ భౌ భౌ భౌ’’ ఇదెలా ఉంది? అసలు విషయం మరిచిపోయాం. ఇతగాడికో ఊతపదం కూడా ఉంది. ప్రతి మాటకీ వెనుక ‘నీ మొహం మండ’ అని అంటుంటాడు. ఆ ఊళ్లోవాళ్లు ఇతని కవిత్వం దెబ్బకి జడుసుకుని పారిపోతున్నారు. దాంతో ఏటిగట్టున తిష్ట వేసి కొత్తగా ఊళ్లోకొచ్చేవాళ్లకి తన కవితల దెబ్బ రుచి చూపిస్తున్నాడు మేక. చిన్న పిల్లలు కనపడితే పది పైసలు ఆశ చూపించి మరీ కవితలు వినిపిస్తుంటాడు. ఆ దెబ్బకు వాళ్లు వారం దాకా లేవలేనంత నీరసపడిపోతుంటారు.ఆ ఊళ్లో తాగుబోతు కిష్టిగాడున్నాడు. ఎప్పుడూ ‘మందో రామచంద్రా...’ అని అల్లల్లాడిపోతుంటాడు. ఆ కిష్టిగాడికి 200 రూపాయలు లంచమిచ్చి మరీ వాళ్లమ్మాయి పెళ్లిలో తన కవి సమ్మేళనం పెట్టించుకుంటాడు మేక. పెళ్లి భోజనం తిందామని లొట్టలేసుకుని వచ్చిన వాళ్లంతా... ఈ మేకను చూసి పరుగో పరుగు... ఆ ఊళ్లో కొంతమంది మీటింగ్ పెట్టుకున్నారు. ‘‘ఈ మేక వల్ల మనకూ మన ఊరికీ భద్రత లేకుండా పోయింది. ఏదో ఒకటి చేయాలి’’ అని ఒకడు ఆవేశపడిపోయాడు. ‘‘మర్డర్ చేసేయమంటారా?’’ అని ఇంకొకడు కత్తి నూరడం మొదలుపెట్టాడు. ‘‘ముల్లుని ముల్లుతోనే తీయాలి. కవిని కవితోనే కనుమరుగు చేయాలి. మన ఊరంతా కలిసి ఈ మేకకు ఘనసన్మానం చేద్దాం. ఏనుగుపై ఊరేగించి ఆ ఏనుగునే బహుకరించేద్దాం. కాకినాడలో ఇంతకు మించి మెదడు తినేసే కవి ఒకడున్నాడు. వాడి పేరు క్షుర. అంటే క్షుద్ర రచయిత. అతగాడికి మన మేకను అంటగడదాం. ఆ బాధ పడలేక, ఈ ఏనుగుని మేపలేక మేకగాడు కుయ్యోమొర్రోమంటాడు’’ అని ఒక పెద్దాయన ఉచిత సలహా పారేశాడు. అందరూ ఈ సన్మానానికి చందాలేసుకోవడానికి సిద్ధమయ్యారు. అటుగా వెళ్తున్న మేక ఈ గుంపుని చూసి దగ్గరకొచ్చాడు. తనకు సన్మానం చేయబోతున్నారనే సంగతి తెలుసుకుని సంకలు గుద్దుకున్నాడు. ‘‘గజారోహణంతో పాటు గజ బహుమానం కూడానా. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తర్వాత నాకే దక్కుతోందీ గౌరవం. నేను కూడా నా వాటాగా నూటపదహార్లు ఇస్తా’’ అని సంబరపడిపోయాడు. సన్మానం అద్దిరిపోయింది. మేకను ఏనుగు మీద ఊరేగించారు. ఆ తర్వాత ఆ ఏనుగుని మేకకు గిఫ్ట్‌గా ఇచ్చేశారు. ఏనుగుని చూసుకుని తెగ మురిసిపోయాడు మేక. ఆ రాత్రి ఆనందంతో నిద్రపోలేదు. తెల్లారింది. ఇప్పుడు అసలు కథ మొదలైంది.పేద్ద మేడ. అది మేక గారి మేడ. ఆ మేడ ముందు ఏనుగు. ఆకలితో ఏనుగు ఒక్కసారిగా ఘీంకరించింది. ఉలిక్కిపడ్డాడు మేక. ‘‘ఓహో... దీనికి టిఫిన్ తినే టైమ్ అయ్యిందన్నమాట’’ అని బయటికొచ్చాడు. ఏం పెట్టినా గుట్టుక్కుమనిపిస్తోంది ఏనుగు. ఎంత పెట్టినా చిటికెలో స్వాహా. ఫస్ట్ రోజు బానే ఉంది. రెండో రోజు బానే ఉంది. ఇక రోజూ దీన్ని మేపలేక మేక, నిజంగానే పీక తెగిన మేకలాగా అరుస్తున్నాడు. చిన్న డాబా. అది మేకగారి డాబానే. ఏనుగు గారి క్షుద్బాధ తీర్చడం కోసం మేడ అమ్మేసి ఈ డాబాలో చేరాడు. ‘‘తినవే నీ మొహం మండా... నీ ఆకలి మండిపోను... ఏది తిన్నా దిగదుడుపే... పందులు తిన్నా పరగడుపే... ఆదమరిస్తే నన్నూ మింగేసేలా ఉన్నావే. నీకు లాగూ చొక్కా కూడా కుట్టించాల్సి వచ్చుంటే మాడి మసై పోయుండేవాణ్ణి’’ అని తిడుతూనే ఏనుగుకి మేత పెడుతున్నాడు మేక. ఇంతలో ‘జై వీరేంద్రాయనమః’ అంటూ ‘క్షుర’ ప్రత్యక్షమయ్యాడు. ‘‘నేను రాసిన ‘మహా పీనుగ’ నవలలోని ఓ ఘట్టాన్ని వినిపిస్తాను తమరికి’’ అంటూ కపాలాలు, ప్రేతాలు, రక్తం, శ్మశానం, జబ్రకదబ్ర అంటూ ‘క్షుర’ తాను రాసింది వినిపిస్తుంటే, ఇక్కడ ‘మేక’కు మూర్ఛవచ్చినంత పనైంది. పెంకుటిల్లు. ఇప్పుడు మేకగారు ఇక్కడే ఉంటున్నారు. ‘‘ఇక నా వల్ల కాదు. మేడ మింగేసావ్. డాబా నమిలేశావ్. ఇదిగో ఈ పెంకుటింట్లోకి తెచ్చావ్. కావాలంటే ఆ పెంకులన్నీ మింగేయ్’’ అంటూ మేక ఆ ఏనుగుని తెగ తిడుతున్నాడు. అదేమో ఆకలితో అరుస్తోంది.‘‘నువ్వు శాకాహారివి కాబట్టి సరిపోయింది. అదే ఏ చికెనో, మటనో, ఫిష్షో అంటే చచ్చుండేవాణ్ణి’’ అని వాపోయాడు మేక. ఇంతలో ‘క్షుర’ ఎంటరయ్యాడు. మూలిగే మేక మీద తాటిపండు పడటమంటే ఇదేనేమో! పాపం... మేక! పూరి పాక. ఇది మేకగారి ప్రెజెంట్ అడ్రస్. పాక ముందు నులక మంచం వేసుకుని పీనుగులా పడున్నాడు మేక. ఆ పక్కనే ఏనుగు.ఇంతలో ఊళ్లోవాళ్లొచ్చి గొడవ గొడవ. ‘‘ఈ ఏనుగుని ఇంట్లో కట్టేసుకోవచ్చుగా. ఇలా రోడ్ల మీద వదిలేస్తే ఎలా?’’ అని అరిచాడొకడు. ‘‘అది పట్టే ఇల్లే ఉంటే ఈ గుడిసెలో ఎందుకుంటాను నాయనా’’ అన్నాడు మేక చాలా నీరసంగా. ‘‘ఈ ఏనుగు మా కల్లు పాకలో దూరి కల్లంతా తాగేసింది. ఇప్పుడు మా పరిస్థితేంటి?’’ అని అడిగాడు ఇంకొకడు. ‘‘దీని మొహం మండ. నాకు గంజి లేకుండా చేసి, ఇది మాత్రం కల్లు తాగిందా? నేను మాత్రం ఏం చేయగలను?’’ అని దీనంగా అన్నాడు మేక. చివరకు మేకకు ఈ గుడిసె కూడా మిగిలేట్టు లేదు. ‘‘అయ్యా... పది పైసలు దానం చేయండి’’ అంటూ అడుక్కుంటున్నాడు మేక. నడిచే ఓపిక లేదు. అందుకే ఏనుగెక్కి మర అడుక్కుంటున్నాడు. అప్పుడు గాని, మేకకు జ్ఞానోదయం కాలేదు. ఊళ్లో వాళ్లనెలా హింసించాడో తెలిసింది. సన్మానం పరమార్థం బోధపడింది.తాడిని తన్నేవాడుంటే, వాడి తలను తన్నేవాడు ఇంకొకడుంటాడట. మన మేకగారికి అదే జరిగింది. ఇక మేక జన్మలో కవిత్వం చెప్పడు. ఇది ఏనుగు గ్యారంటీ. - పులగం చిన్నారాయణ మంచి కామెడీ ఎపిసోడ్ ఇది! జంధ్యాలగారి దగ్గర నేను చాలా చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశా. జంధ్యాలగారు, వీరభద్రరావుగారు ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. జంధ్యాలగారు 39 సినిమాలు డెరైక్ట్ చేస్తే, 18 చిత్రాల్లో వీరభద్రరావు ఉన్నారు. ‘పుత్తడి బొమ్మ’ షూటింగంతా రాజమండ్రికి సమీపంలోని తొర్రేడు గ్రామంలో జరిగింది. ఏనుగు ఎపిసోడ్ మాత్రం మద్రాసుకు సమీపంలోని ఓ పల్లెటూళ్లో చేశాం. ఈ కామెడీ ట్రాక్ చాలా బావుంటుంది. ఈ సినిమా అంతా హెవీ సెంటిమెంట్. ఈ ఎపిసోడ్ బాగా రిలీఫ్ ఇస్తుంది. 30 ఏళ్ల తర్వాత ఇప్పుడు తలుచుకున్నా ఈ ట్రాక్ బాగా నవ్వు తెప్పిస్తుంది. - పుల్లారావు, దర్శకుడు-నిర్మాత (ఈ చిత్రానికి అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేశారు) -
రండి.. వాంగో.. ఆయియే.. ప్లీజ్ కమ్...
చిత్రం : రెండు రెళ్లు ఆరు (1986) డెరైక్ట్ చేసింది : జంధ్యాల సినిమా తీసింది : జి. సుబ్బారావు మాటలు రాసింది : జంధ్యాల పూర్తి పేరు : రాళ్లపల్లి వెంకట నరసింహారావు పుట్టింది : 1946 ఆగస్టు 15న తూ.గో.జిల్లా, రాచపల్లిలో ఫస్ట్ సినిమా : స్త్రీ వందో సినిమా : టై లేటెస్ట్ సినిమా : భలే భలే మగాడివోయ్ (2015) టోటల్ మూవీస్ : 600 కు పైగానే రాళ్లపల్లి టాప్-10 మూవీస్ 1. ఊరుమ్మడి బతుకులు 2. తూర్పు వెళ్లే రైలు, 3. అభిలాష, 4. అన్వేషణ, 5. శ్రీవారికి ప్రేమలేఖ 6. శుభలేఖ, 7. రేపటి పౌరులు 8. సగటు మనిషి, 9. ఆలయ శిఖరం 10. ఛలో అసెంబ్లీ రాళ్లపల్లి... యాక్టింగ్‌లో ‘రత్నాల’పల్లి. కామెడీ, సెంటిమెంట్, విలనీ... ఏదైనా సునాయాసంగా చేసి పారేయగల గ్రేట్ ఆర్టిస్ట్. కానీ మన తెలుగు ఇండస్ట్రీ రాళ్లపల్లిని ఇంకా గొప్పగా వాడుకుని ఉండాల్సింది. ప్చ్. ఏం చేస్తాం!! జంధ్యాల తీసిన ‘రెండు రెళ్లు ఆరు’లో ఆయన సకల భాషా నైపుణ్యాన్ని చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఇద్దరు చైనా వాళ్లు కలుసుకుంటే చైనీస్ భాషలో మాట్లాడుకుంటారు. ఇద్దరు బెంగాలీ వాళ్లు తారసపడితే బెంగాలీలో ముచ్చటించుకుంటారు. ఇక తమిళం వాళ్లయితే మాట్లాడుకున్నా... పోట్లాడుకున్నా... అంతా అరవంలోనే. అదే మన తెలుగువాళ్లయితే మాత్రం ఇంగ్లీషులో మాట్లాడుకుంటారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అనుకోండి. దౌర్భాగ్యం అనుకోండి. ఇంకేదైనా అనుకోండి.కానీ ఈ తికమక దగ్గర మాత్రం అలాంటి కందిపప్పులుడకవు. పెసరపప్పులుడకవు. అతగాడు బెంగాలీ వాడితో బెంగాలీలో మాట్లాడగలడు. హిందీ వాడితో హిందీలో బోల్గలడు. తెలుగువాడితో ఆంగ్లం, అరవం, కన్నడం, హిందీ... ఇలా అన్నీ మాట్లాడేయగలడు. ఎందుకంటే తికమకకు అన్ని భాషలూ వచ్చు. అలాగని అతగాడు సకల విద్యా పారంగతుడనుకునేరు. ఈ ‘తికమక’ పేరు వెనుక కథేంటో, అతగాడి బహుభాషా నైపుణ్యం వెనుక కిటుకేమిటో మనం చెప్పేకన్నా అతగాడే చెప్పుకోవడం బెటర్. ఎందుకంటే - ఎవడి డప్పు వాడే కొట్టుకోవాల్సిన ట్రెండ్ ఇది మరి. అదో పల్లెటూరు. బస్సు నుంచి ఓ మిస్సు దిగింది. ట్రాక్టర్ దగ్గర వెయిటింగ్లో ఉన్న తికమక. చకచకా ఆ మిస్సు దగ్గరకెళ్లి ‘‘నమస్తే... హిందీ, వణక్కం... తమిళ్, గుడ్‌మార్నింగ్... ఇంగ్లీష్, నమస్కారం... తెలుగు’’ అన్నాడు. ఆ అమ్మాయి అయోమయంగా ఇతని వైపు చూసింది. ‘‘ఆలస్యం అయినందుకు క్షమించాలి. నిన్న రావాల్సిన ఉత్తరం అలవాటు ప్రకారం ఆలస్యంగా ఈ రోజు వచ్చింది. బండి లేటైపోతుందని ట్రాక్టర్ తీసుకొచ్చా. రండి... తెలుగు, వాంగో... తమిళ్, ఆయియే... హిందీ, ప్లీజ్ కమ్... ఇంగ్లీష్’’ అని ఆమె సూట్‌కేస్ అందుకుని ట్రాక్టర్ మీద పెట్టాడు. ఆమె ట్రాక్టర్ ఎక్కి కూర్చుంది. ‘‘మీ పెదనాన్నగారు మీ గురించి ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తున్నారు’’ అని చెబుతూ ట్రాక్టర్ స్టార్ట్ చేశాడు తికమక. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా ‘‘పెదనాన్న గారెవరు?’’ అనడిగింది. తికమక అయోమయపడిపోయి ‘‘సర్వానందంగారు... ఆయనే మీ పెదనాన్నగారు. ఇంతకూ మీ పేరు విఘ్నేశ్వరి కాదా?’’ అనడిగాడు.ఆ అమ్మాయి చాలా తాపీగా ‘‘నా పేరు వెంకటలక్ష్మి... విఘ్నేశ్వరి కాదు’’ అంది. వెంటనే తికమక ట్రాక్టర్ ఆపేశాడు. ‘‘మా గొప్ప పనిచేశావ్ కానీ, దిగు దిగవమ్మా. గాలి తీసేసిన ట్రాక్టర్ ట్యూబ్‌లాంటి మొహం చూసే అనుకున్నా. ఎవరు ఎవరి కోసం ఏ బండి కనిపించినా ఎక్కేయడమేనా...’’ అంటూ ఆమె సూట్‌కేస్‌ని కింద గిరాటు వేసినంత పనిచేసి మరీ విసుక్కున్నాడు. సరిగ్గా అప్పుడే ఇంకో బస్సు ఆగింది. అందులోంచి ఓ అమ్మాయి విత్ లగేజ్ దిగింది. ఓసారి జరిగిన పొరపాటుతో తికమక ఆమె వైపు అనుమానంగా చూస్తూ ‘‘నీ పేరు కూడా వెంకటలక్ష్మేనా?’’ అనడిగాడు. ఆమె కంగారుగా ‘‘కాదు... నా పేరు వింధ్య. కాదు కాదు... విఘ్నేశ్వరి’’ అంది. తికమక మొహం వెలిగిపోయింది. ‘‘అమ్మాయిగారూ... మీ కోసమే వచ్చా. నన్ను చిన్నప్పుడెప్పుడో చూశారు. గుర్తుండను లెండి. ఇకాతే కా హమారా గామ్ దోయే ద్యూరే’’ అన్నాడు. అసలే కంగారులో ఉన్న విఘ్నేశ్వరి ఈ అర్థంగాని భాషతో ఇంకా కంగారుపడిపోయింది. ‘‘ఇది బెంగాలీ భాషమ్మా. అంటే ఇక్కడ నుంచీ మన ఊరు రెండు మైళ్లు ఉంటుందని అర్థం’’ అని వివరణ ఇచ్చాడు తికమక. విఘ్నేశ్వరి ట్రాక్టర్ ఎక్కింది. తికమక ట్రాక్టర్ని ఊరు వైపు పరుగులెత్తిస్తూ ‘‘ఇంగానా పత్తు నిమిషం నమ్మూరు పోయిదం’’ అన్నాడు. ‘‘ఇదేం భాష?’’ అని ఆమెలో మళ్లీ ఆశ్చర్యం. ‘‘మలయాళం... అంటే పది నిమిషాల్లో ఇక్కడ నుంచీ వెళ్లిపోతామని అర్థం...’’ చెప్పాడు తికమక. ‘‘నీ పేరేంటి?’’ అడిగింది విఘ్నేశ్వరి.‘‘తికమక’’ అని చెప్పాడతను.‘‘ఏ భాషలో?’’ అని తికమకగా అడిగింది విఘ్నేశ్వరి. ‘‘అన్ని భాషల్లోనూ. తెలుగుకి ‘తి’, కన్నడకు ‘క’, మలయాళానికి ‘మ’, కొంకణికి ‘క’. ఆ భాషల పట్ల గౌరవంతో నా పేరుని ఇలా పెట్టుకున్నా. మీకు బోర్ అనిపించకపోతే నా గురించి కొంత చెప్పాలి. నేను మిలట్రీలో వంటవాడిగా పని చేసి, అంట్లు తోమలేక ఆ పని మానేశాను. అక్కడుండగా అన్ని భాషల సైనికులతో మాట్లాడ్డం కోసం ఈ భాషలన్నీ నేర్చుకున్నా. ఇప్పుడు నేను 14 భారతీయ భాషలు మాట్లాడగలను. 4 భాషలు రాయగలను. ఇదీ నా ఫ్లాష్‌బ్యాక్’’ అని తికమక చెప్పడం పూర్తయ్యేసరికి ఇల్లు వచ్చేసింది. విఘ్నేశ్వరి ట్రాక్టర్ మీద నుంచి దిగి, ఆ ఇంటిని కళ్లు పెద్దవి చేసి మరీ చూసింది. ‘‘ఇదేనమ్మా మీ ఇల్లు. 50 గదులు... 101 గుమ్మాలు... 151 అద్దాలున్న బంగ్లా... మీరు ఇక్కడే పెరిగారనుకోండి. మరిచిపోయారనుకుని ఊరకనే చెబుతున్నా. వెల్కమ్... ఇంగ్లీష్. ఏవా ఏవా... మరాఠీ. దయచేయండి... తెలుగు, వాంగో.. తమిళ్’’అంటూ విఘ్నేశ్వరిని లోపలకు తీసుకెళ్లాడు తికమక. అక్కడ సర్వానందం వేయికళ్లతో వెయిటింగ్. కళ్లు కనబడకపోయినా, చెవులు వినబడకపోయినా విఘ్వేశ్వరిని చూసి సంబరపడిపోయాడా పెద్దాయన. ‘‘ప్రయాణం చేసి అలిసిపోయుంటావ్. గదిలోకెళ్లి రెస్ట్ తీసుకోమ్మా’’ అని ఆమెకు గదిని చూపించమని తికమకకు పురమాయించాడాయన. తికమక ఆమెనో గదిలోకి తీసుకెళ్లి ‘‘దిసీజ్ యువర్ రూమ్... ఇంగ్లీషు. యే ఆప్ కా కమరా హై... హిందీ. యే తుమ్కో రూమ్... మరాఠీ. ఇదు ఉంగళ్ రూమ్... తమిళ్. ఇది నిమ్మ రూమ్... కన్నడ. ఇది మీ గది... తెలుగు’’ అని చెప్పేసి వెళ్లిపోయాడు. ఇప్పుడర్థమైందిగా తికమక కేరెక్టరైజేషన్. ఆ ఇంట్లో వాళ్లకు అతను తలలో నాలుక. నచ్చనివాళ్లకు తలలో పేను. సర్వానందంగారికి నమ్మినబంటు.ఇక్కడో ఫ్లాష్‌బ్యాక్ చెప్పాలి. చిన్నతనంలోనే విఘ్నేశ్వరిని, వెంకట శివంకిచ్చి పెళ్లి చేయిస్తారు సర్వానందంగారు. విఘ్నేశ్వరికి, వెంకట శివానికి మధ్య ఉప్పుకు నిప్పుకు ఉన్నంత వైరం. ఇద్దరూ వేర్వేరు చోట్ల పెరిగి పెద్దవుతారు. వారినెలాగైనా మళ్లీ కలపాలని సర్వానందంగారి చివరి కోరిక. వాళ్లిద్దరూ సిటీ నుంచి ఈ పల్లెటూరికొస్తారు. కానీ వారిద్దరూ రియల్ కాదు. తమ ఫ్రెండ్షిప్ కోసం వచ్చి ఇద్దరూ ఇరుక్కున్నారు. తప్పించుకుందామని చూస్తే ‘గూఢచారి 116’లాగా తికమక. ఫైనల్‌గా ఓ రాత్రి ఇద్దరూ గేటు దూకి పారిపోబోతుంటే లటిక్కిన పట్టేసుకుని సర్వానందం ముందు నిలబెట్టాడు తికమక.‘‘దూజన బావనే జాత్... బెంగాలీ. దస్గయా... పంజాబీ. తప్పిచ్చుక్కు హోహోడుగురు... కన్నడ. పారిపోతున్నారు.... తెలుగు’’ అని పెద్దాయనకు చెప్పాడు. వాళ్లిద్దరూ తికమకను కొరకొరా చూశారు. తికమక ఒకటే భాషలో నవ్వాడు. నవ్వు ఏ భాషలోనైనా ఒకటే కదా. తెలుగులో ఒకలాగా, తమిళంలో ఒకలాగా నవ్వు ఉండదు కదా. ఏది ఏమైనా తికమక లాంటి నమ్మినబంటు దొరికితే ఎవరికైనా... రొంబ సంతోషం... తమిళం. జాస్త్ ఆనంది... మరాఠీ. చాలా సంతోషం... తెలుగు. - పులగం చిన్నారాయణ -
లాస్ట్ మినిట్ లో ఆ వేషం సృష్టించారు..
‘సుత్తి’ని కూడా కామెడీకి వాడుకున్న ఘనత జంధ్యాలది. 33 ఏళ్లుగా ‘సుత్తి’ అనే పదం తెలుగు నాట ఓ నానుడై పోయింది. అందుకు నాంది ఈ ‘నాలుగు స్థంభాలాట’ సినిమా. ఈ ‘సుత్తి’ పుణ్యమా అని నటుడు వేలు కొన్నేళ్ల పాటు కామెడీ ప్రపంచాన్ని ఏలిపారేశారు. రేపు (శుక్రవారం) ‘సుత్తి’ వేలు జయంతి. ఈ సందర్భంగా ఆయన ‘సుత్తి’నోసారి స్తుతించుకుందాం. సినిమా పేరు : నాలుగు స్థంభాలాట (1982) డెరైక్ట్ చేసింది : జంధ్యాల సినిమా తీసింది : ‘నవతా’ కృష్ణంరాజు మాటలు రాసింది : జంధ్యాల వీరభద్రం అంటే అందరికీ దడా, వణుకూ, హడల్. అలాగని ఆయనో అరివీర భయంకరుడైన రౌడీనో, దాదానో, ఖూనీకోరో అనుకుంటే మాత్రం మీరు చికెన్ కర్రీలో కాలేసినట్టే. ఆఫ్ట్రాల్ ఆయనో పెద్ద మనిషంతే. ఓ భార్యా... ఓ కొడుకూ... ఓ కూతురూ... ఓ గుమాస్తా... కొంతమంది అనాధ పిల్లలూ. ఇదీ అతని లైఫ్‌బుక్ ప్రొఫైల్. తెలుగంటే పడి చస్తాడు. ఇంగ్లీషంటే ఏడ్చి చస్తాడు. ఏదైనా లెక్క ప్రకారం ఉంటాడు. తిక్కగా కూడా ఉంటాడు. చాదస్తాన్ని జిరాక్స్ చేస్తే అచ్చం వీరభద్రంలానే ఉంటుంది. వీరభద్రం బాధిత పీడితుల్లో నెంబర్‌వన్ క్యాండిడేట్ ఎవరంటే - గుమాస్తా గుర్నాథం. బతకలేక బడిపంతుల్లాగా, గతిలేక ఈ గుమాస్తా గిరీ వెలగబెడుతుంటాడు పాపం. ఆలస్యంగా వచ్చినా వీరభద్రంతో చిక్కే. పెందలాడే వచ్చినా చిక్కే. ఆ రోజు గుర్నాథం ఎంటరయ్యీ ఎంటరవ్వడంతోటే వీరభద్రంతో అక్షింతలు చల్లించుకున్నాడు. ‘‘బుద్ధి లేదటయ్యా నీకు! కాస్త పెందలాడే వచ్చి లెక్కాడొక్కా చూద్దామన్న జ్ఞానం ఉండక్కర లేదటయ్యా గుర్నాథం!’’ అని కయ్‌మన్నాడు వీరభద్రం. ‘‘అదేంటయ్యా... ఈ రోజు రోజూ కన్నా పావుగంట ముందొస్తేనూ’’ అని కౌంటరిచ్చాడు గుర్నాథం. ‘‘ఆ... ఆ... ముందెందుకొచ్చావ్. అసలు ముందెందుకొచ్చావని అడుగుతున్నాను. కాలజ్ఞానం లేకపోతే ఎలా పైకొస్తావ్. జ్ఞానం లేదటయ్యా. నిన్నూ, ఈ దేశాన్నీ బాగుచేయడం నావల్ల కాదు’’ అని రెచ్చిపోయాడు వీరభద్రం. ‘‘మహాప్రభో... ఇలా సుత్తి దెబ్బలు కొట్టకండి. అర్భకపు వెధవని. త్వరగా మీ సుత్తి దాచేయండి మహాప్రభో... దాచేయండి’’ అంటూ వీరభద్రం కాళ్ల మీద పడిపోయాడు గుర్నాథం. అయినా ఆపకుండా క్లాస్ పీకుతూనే ఉన్నాడు వీరభద్రం. ఈ గోల కారణంగా గుర్నాథం సరిగ్గా చిట్టాపద్దులు కూడా రాయలేకపోతున్నాడు. ‘కత్తి సుబ్బారావు’ పేరుకి బదులు ‘సుత్తి సుబ్బారావు’ అని రాసేసి వీరభద్రంతో చీవాట్లు కూడా తింటాడు. ఆ రోజు చిట్టాపద్దులు చెక్ చేస్తున్నాడు వీరభద్రం. గుర్నాథం టెన్షన్‌గా చూస్తున్నాడు. ఓ చోట తప్పు చేసి దొరికేశాడు. ‘‘సిగ్గూ ఎగ్గూ ఉన్న సన్నాసివైతే... ఇలా పిల్లల భోజనాల పద్దులో తలనొప్పి బిళ్లల ఖర్చు రాస్తావా?... చెప్పు ఎందుకొచ్చాయివి?’’ అని ఇల్లెగిరిపోయేలా అరిచాడు వీరభద్రం. ‘‘అయ్యా! అవి నేను వేసుకున్నవండయ్యా’’ అని భయంతో కూడిన, వినయంతో కూడిన గౌరవంతో జవాబిచ్చాడు గుర్నాథం. ‘‘చేతులతో పని చేస్తుంటే తలకు, మొలకు నొప్పులేవిటి నీ శ్రాద్ధం’’ అని మళ్లీ అరిచాడు వీరభద్రం. ‘‘చేతులతో చేస్తే రాదండయ్యా... కానీ ఈ మధ్య నా చేతుల కంటే చెవులకే పని ఎక్కువయిపోయిందండయ్యా.. మీ సుత్తి పుణ్యమా అని’’ అసహనంగా సమాధానమిచ్చాడు గుర్నాథం. ‘‘అందుకే ఉదయాన్నే లేవగానే సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేయమన్నాను. దాంతో నీ దగ్గరకు ఏ జబ్బూ రాదు గాక రాదు. అసలు సూర్య నమస్కారాల యొక్క ప్రాధాన్యత తెలుసా నీకు?’’ అని ‘సుత్తి’ కొట్టడం స్టార్ట్ చేశాడు వీరభద్రం. పాపం గుర్నాథం చెవులు మూసుకున్నాడు. కళ్లు మూసుకున్నాడు. నోరు మూసుకున్నాడు. అన్నీ మూసుకున్నా సరే... వీరభద్రం వదిలి చావడే! వీధి అరుగు మీద గుర్నాథం గుర్రుపెట్టి నిద్ద రోతున్నాడు. వీరభద్రం కూతురు వచ్చి నిద్రలేపి ‘‘బాబాయ్ గారూ! ఇక్కడ పడుకున్నారేంటి?’’ అనడిగింది. ‘‘అమ్మాయ్... ఏం చేస్తాం? మీ నాన్నగారి సుత్తి కారణంగా నాకేమీ తెలియడం లేదు’’ అని వాపోయాడు. ‘‘అవునూ! మీరెప్పుడూ సుత్తి... సుత్తి అంటుంటారు. అంటే ఏంటండీ?’’ అని ఆసక్తిగా అడిగిందా అమ్మాయి. గుర్నాథం ‘సుత్తి’ హిస్టరీ చెప్పడం మొదలుపెట్టాడు. ‘‘ఈ సుత్తి అనే పదం కలియుగంలో కాదమ్మా... త్రేతాయుగంలోనిది. వనవాసానికి వెళ్లిన శ్రీరామచంద్రుణ్ణి వెతుక్కుంటూ భరతుడు కూడా అడవికి వెళ్లాడు. అక్కడ రాములవారిని కలిసి ‘‘అయ్యా! నువ్వు వెనక్కు తిరిగొచ్చేసి... రాజ్యమేలుకో తండ్రీ’’ అనడిగాడు. దానికి శ్రీరామచంద్రుడు ‘‘తమ్ముడూ భరతా! పితృ వాక్య పరిపాలనాదక్షుడైన ఓ పుత్రుడిగా, సత్యశీలత కలిగిన ఓ వ్యక్తిగా, ఆడిన మాట తప్పని ఓ మనిషిగా, జాతికి నీతి నేర్పగల ఓ పుణ్యపురుషుడిగా, ప్రజల శ్రేయస్సు కాంక్షించే ఓ రాజకుమారుడిగా... నాన్నగారి మాట నేను జవదాటలేను. తమ్ముడూ! నేను రాజ్యానికి రాను... రాజ్యానికి రాలేను’’ అని చెప్పాడు. ఆ వాక్ప్రవాహానికి శోష వచ్చి పడిపోయిన భరతుడు కాసేపటికి తేరుకుని ‘‘అన్నయ్యా! నేను రాను అని ఒక్క మాట చెబితే చాలదా... ఇంత సుత్తి ఎందుకూ?’’ అన్నాడు. ఇలా ఆ భరతుడి నోట్లోంచి రాలిన ‘సుత్తి’ భారతదేశంలో వాడుకలోకొచ్చిందన్న మాట. అమ్మా... ఈ సుత్తుల్లో చాలా రకాలున్నాయి. ఒక్కోడు ఠంగు ఠంగుమని గడియారం గంటకొట్టినట్టు సుత్తేస్తాడు. మీ నాన్నగారిలాగా. దాన్ని ఇనుప సుత్తి అంటారు. అంటే ఐరన్ హేమరింగ్ అన్నమాట. ఇంకోడు సుత్తేసినట్టు తెలీయకుండా మెత్తగా వేస్తాడు. రబ్బరు సుత్తి. అంటే.. రబ్బర్ హేమరింగ్ అన్నమాట. ఇంకోడు అందరికీ కలిపి సామూహికంగా సుత్తేస్తాడు. సామూహిక సుత్తి. దీన్నే మాస్ హేమరింగ్ అన్నమాట. అంటే... రాజకీయనాయకుల మీటింగులు ఈ టైప్ అన్నమాట. పోతే... ఇంకో టైప్ ఉంది. మీ నాన్నగారు సుత్తేద్దామని వచ్చారనుకో! నేనే ఎదురు తిరిగి సుత్తేశాననుకో! ఉత్తినే అనుకుందాం. ఇది జరిగేపని కాదనుకో. దీన్ని ఎదురు సుత్తి అంటారు. రివర్స్ సుత్తి అంటారు. రివర్స్ హేమరింగ్ అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే నాది సుదీర్ఘ సుత్తి అవుతుందమ్మా. అంటే... ప్రొలాంగ్డ్ హేమరింగ్ అన్నమాట. వెళ్లమ్మా వెళ్లు... వెళ్లి నీ పని చేసుకో’’ అని ఆవులిస్తూ ఆ అరుగు మీదే తుండుగుడ్డ వేసుకుని మునగదీసుకు పడుకున్నాడు గుర్నాథం. పాపం గుర్నాథం కల నిజం కావాలని... అతని సుత్తికి వీరభద్రం చిత్తయిపోవాలని... మనసారా సుత్తిస్తూ కోరుకుందాం! - పులగం చిన్నారాయణ లాస్ట్ మినిట్‌లో ఈ గుర్నాథం పాత్ర సృష్టించారు! ‘‘జంధ్యాల గారి తొలి సినిమా ‘ముద్ద మందారం’ నాక్కూడా ఫస్ట్ పిక్చర్. అందులో హోటల్ మేనేజర్‌గా చాలా చిన్న వేషం వేశా. ఆయన రెండో సినిమా ‘మల్లె పందిరి’లో కూడా చేశా. ‘నాలుగు స్థంభాలాట’ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతుంటే వెళ్లి జంధ్యాల గారిని కలిశా. నాలుగైదు రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి రమ్మన్నారు. వీరభద్రరావు గారికి గుమాస్తా వేషం. మొదట స్క్రిప్టులో ఈ వేషం లేదు. ఏదో వంటవాడి వేషం అనుకుని సత్తిబాబుతో చేయించాలనుకున్నారట. అయితే అది కథకు అడ్డం పడుతుందని, లాస్ట్ మినిట్‌లో ఈ గుమాస్తా వేషం సృష్టించారు. ‘సుత్తి’ అనే పదం ఇంత క్లిక్ అవుతుందని, అదే నా ఇంటిపేరు అవుతుందని అస్సలు అనుకోలేదు. ఈ ‘సుత్తి’తో నేను పాపులరైపోయి, సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోయా. ఈ గుమాస్తా గుర్నాథం పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి ఎనిమిది గంటలు పట్టింది. చాలా ఓపిగ్గా నాతో డబ్బింగ్ చెప్పించారు. జంధ్యాల గారు డెరైక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ దాదాపుగా నాకు స్థానం దక్కడం నా అదృష్టం.’’ - కీ.శే. ‘సుత్తి’ వేలు (గతంలో జరిపిన సంభాషణ ఆధారంగా...) -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - జంధ్యాల
-
నా ఫిజిక్‌కి ఆ పాత్రలే సూటవుతాయి!
సంభాషణం ఆయన చాలా సినిమాల్లో ఉంటారు. చాలా పాత్రల్లో కనిపిస్తారు. కానీ ఆయన గురించి అందరికీ తెలిసింది తక్కువ. తెలుసుకునే ప్రయత్నం చేస్తే... కమెడియన్గామాత్రమే మనకు పరిచయమైన ఆయనలో... మరెన్నో గొప్ప ప్రతిభలు దాగివున్నాయని తెలుస్తుంది. తన గురించి మనకు తెలియని ఆ విషయాల గురించి ఇలా చెప్పుకొచ్చారు జెన్నీ... మీ అసలు పేరు జెన్నీయేనా? కాదు... పోలాప్రగడ జనార్దనరావు. షార్టకట్లో జెన్నీ అయ్యింది. మీ మూలాల గురించి చెప్పండి..? నేను తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో పుట్టాను. బీకాం వరకూ రాజమండ్రిలో చదివాను. తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకాం పూర్తి చేశాను. ఈసీఐఎల్‌లో అకౌంట్స్ మేనేజర్‌గా పని చేసి రిటైరయ్యాను. నటన వైపు అడుగులెలా పడ్డాయి? నా పదో యేటనే నేను నాటకాల్లో నటించడం మొదలుపెట్టాను. యువనటుడిగా ఎదిగిన తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చింది. అప్పట్లో పెద్ద పెద్ద దర్శకులంతా నాటకాలకు ముఖ్య అతిథులుగా వస్తుండేవారు. ఓసారి అలా వచ్చిన జంధ్యాలగారు నా నటన చూసి ఇష్టపడి ‘అహనా పెళ్లంట’లో అవకాశం ఇచ్చారు. సరిగ్గా అప్పుడే పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చింది. దాంతో జూనియర్ ఆర్టిస్టులను మద్రాసు నుంచి తీసుకొస్తే బోలెడు ఖర్చవుతుందని హైదరాబాద్‌లో ఉన్నవాళ్లనే ఎంచుకునేవారు. దాంతో నాకు వరుస అవకాశాలొచ్చాయి. ఒకేలాంటి పాత్రలు ఎక్కువ చేస్తారెందుకు? కావాలనేం చేయను. ‘యమలీల’లో ఎడిటర్ పాత్ర చూసి వరుసగా అలాంటివే ఇచ్చారు చాలామంది. ‘హలోబ్రదర్’ హిట్టయ్యాక ఇరవై ముప్ఫై సినిమాల్లో మార్వాడీగానే చేశాను. చేసిన నాలుగొందల సినిమాల్లో ఓ వంద సినిమాల్లో చర్చి ఫాదర్‌గా చేసుంటాను. ఒక్కసారి ఒక పాత్రలో క్లిక్ అయ్యామంటే వరుసగా అవే వస్తాయి. అన్ని చాన్సులు రావడం అదృష్టమే అయినా... వరుసగా అవే చేయాల్సి రావడం మాత్రం దురదృష్టమే. హాస్యాన్నే ఎంచుకోవడానికి కారణం? ఏ రాజకుమారుడిగానో చేస్తే నన్నెవరూ చూడలేరు. సీరియస్ పాత్రలూ, సిక్స్ ప్యాకులూ మనకి సెట్ కావు. నా ఫిజిక్‌కి అచ్చంగా సూటయ్యేది కామెడీనే. కాబట్టి దర్శకులు నన్ను కమెడియన్‌గానే ప్రమోట్ చేశారు. నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. అందుకే హాస్య పాత్రల్ని ఆనందంగా స్వీకరించాను. అలాగే కొనసాగాను. మీలోని నటుడు తృప్తి చెందినట్టేనా? నిజానికి ఉద్యోగం వల్ల నేను నటనమీద చాలాకాలం పూర్తి దృష్టి పెట్టలేకపోయాను. 2000వ సంవత్సరంలో వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక ఇక నటనకే అంకితమైపోయాను. అదృష్టంకొద్దీ నాటకాలు నాకు మంచి రహదారి వేశాయి. దానికితోడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అసిస్టెంట్ డెరైక్టర్స్‌గా ఉన్న శ్రీను వైట్ల, వీవీ వినాయక్ లాంటి వాళ్లు నన్ను గుర్తుపెట్టుకుని ఇప్పటికీ చాన్సులిస్తున్నారు. మా అమ్మ అనేది... ‘గోదావరికి చెంబు పుచ్చుకువెళ్తే చెంబుడునీళ్లు దక్కుతాయి, బిందె పట్టుకుని వెళ్తే బిందెడు నీళ్లు దక్కుతాయి, అది మన ప్రాప్తం, అలాగని పెద్ద గంగాళం తీసుకెళ్తే మోయలేక నడుం విరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ అత్యాశకు పోవద్దు’ అని. అందుకే నేను వచ్చినదానితో సంతృప్తి చెందుతాను. నాటకాలు వదిలేశారా? లేదు. శంకరమంచి పార్థసారథి అనే మంచి రచయిత, తల్లావజ్జల సుందరం అనే మంచి దర్శకుడు ఉన్నారు. వీరు సంవత్సరానికి ఒక్క గొప్ప నాటకాన్నైనా సృష్టిస్తుంటారు. మేమంతా కలసి శ్రీమురళీకళానిలయం సంస్థ ద్వారా ఇప్పటికీ నాటకాలు వేస్తూనే ఉన్నాం. తీరిక వేళల్లో ఏం చేస్తుంటారు? నాకసలు తీరికే లేదు. ఓ పక్క సినిమాలు, నాటకాలు. మరోపక్క మూకాభినయం. వెయ్యికి పైగా మైమ్ ప్రదర్శినలిచ్చిన ఏకైక భారతీయుణ్ని నేను. చాలామందికి నేర్పిస్తున్నాను కూడా. మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోను, నిజాం కాలేజీలోనూ థియేటర్ ఆర్ట్స్ ఫ్యాకల్టీగా కూడా చేస్తున్నాను. ఇవి కాక రచనా వ్యాసంగం. యాభై కథల వరకూ రాశాను. ఓ పదిహేను కథలు బహుమతులు కూడా గెల్చుకున్నాయి. మీ తర్వాత మీ కుటుంబం నుంచి ఎవరైనా ఇండస్ట్రీకొచ్చారా? లేదు. మా అబ్బాయికిగానీ, అమ్మాయికిగానీ ఆ ఆసక్తి ఏర్పడలేదు. బాబు బాగా చదవుకుని బ్యాంకింగ్ రంగంలో స్థిరపడ్డాడు. అమ్మాయికి పెళ్లైపోయింది. భవిష్యత్ ప్రణాళికలేంటి? ప్రణాళికలు వేసుకోను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ పోతాను. ఉన్నంతకాలం నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ గడిపేస్తే చాలు. -
జంధ్యాలకు గౌరవ డాక్టరేట్!
రచయిత నుంచి దర్శకుడిగా ఎదిగి, సకుటుంబ వినోద చిత్రాలతో ఒక దశాబ్దిన్నర కాలం పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఘన సినీ చరిత్ర - జంధ్యాలది. రచన, దర్శకత్వాల ద్వారా కొన్ని తరాలు చెప్పుకొనే కామెడీతో వెండితెరను వెలిగించిన ఆయనకు తాజాగా ఒక అరుదైన గౌరవం లభించింది. మరణించిన 14 ఏళ్ళ తరువాత ఇప్పుడు ఆయనకు గౌరవ డాక్టరేట్ లభించింది. అమెరికాకు చెందిన అకాడెమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, యునెటైడ్ నేషన్ ఆర్గనైజేషన్‌కు అనుబంధమైన స్వస్త ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్లు ఈ నవంబర్ 1న బెంగళూరులో ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేశాయి. స్వర్గీయ జంధ్యాల తరఫున ఆయన సతీమణి అన్నపూర్ణ ఈ పత్రాన్ని స్వీకరించారు. మనిషి ఉండగానే అవసరం లేకపోతే మర్చిపోయే సినీ (మాయా) ప్రపంచంలో ఒక వ్యక్తి భౌతికంగా కనుమరుగైన ఇన్నేళ్ళకు ఇలాంటి గౌరవం దక్కడం నిజంగా విశేషమే! -
జన్మంటూ ఉంటే స్విస్‌లో పుట్టాలి!
జీవితాన్ని బాగా ఇష్టపడతారు నటుడు అలీ. భూత, భవిష్యత్, వర్తమానాలపై ఆయనకు నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. దేన్నీ తేలిగ్గా తీసుకోరు. ఎదురైన ప్రతి అనుభవాన్నీ ప్రేమిస్తారు. కాసేపు మాట్లాడితే చాలు.. జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి.. ఇలా నాన్‌స్టాప్‌గా ఎన్నో విషయాలు చెబుతారు. ఆయన అభిరుచుల్ని తెలుసుకోవడానికి చేసిన చిరు ప్రయత్నం... వాళ్లిద్దరి సినిమాలూ పక్కన పెడితే నేను లేను! నా జీవితంపై అయిదుగురి ప్రభావం బలంగా ఉంది. వారు.. నా గురువుగారు శ్రీపాద జిత్‌మోహన్ మిత్రా, దర్శకులు కె. రాఘవేంద్రరావు, జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి. బాల్యంలోనే రాజమండ్రిలో కళాకారుడిగా నా ప్రయాణం మొదలైంది. అప్పుడు మా గురువు మిత్రాగారే అన్నీ తానై నన్ను నడిపించారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో మిమిక్రీ ప్రోగ్రామ్‌లు చేశాను. ఇక, సినిమాల్లోకొచ్చాక... వెన్నంటి ఉండి నడిపించింది - రాఘవేంద్రరావుగారు. ఒక వ్యక్తిగా ఆయనను చూసి చాలా నేర్చుకున్నా. ఇక, జంధ్యాల గారి సినిమాల్లో నేను నటించింది తక్కువైనా, కమెడియన్‌గా నాపై అంతులేని ప్రభావాన్ని చూపించారాయన. ఇక ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి. వీళ్లిద్దరి సినిమాలను పక్కన పెట్టి అలీని చూస్తే ఏమీ కనిపించదు. దశాబ్దం పాటు నా వేలు పట్టుకొని నడిపించారు ఈవీవీ. నన్ను హీరోను చేసి కెరీర్‌ను పూర్తిగా మార్చేశారు కృష్ణారెడ్డి. ఈ అయిదుగుర్నీ జీవితంలో మర్చిపోలేను. మళ్లీ జన్మంటూ ఉంటే స్విస్‌లో పుట్టాలి! కళాకారుణ్ణి కావడం వల్ల, ముఖ్యంగా సినిమా నటుణ్ణి అవడం వల్ల.. ప్రపంచం మొత్తం తిరగగలిగాను. ఎన్ని దేశాలు తిరిగినా... ఓ అయిదు ప్రాంతాలు మాత్రం నా మనసులో అలా నిలిచిపోయాయి. అవే.. రాజమండ్రి, కేరళ, కన్యాకుమారి, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్. వీటిల్లో రాజమండ్రి నా జన్మస్థలం. నటుడిగా నేను ఓనమాలు దిద్దింది కూడా అక్కడే. సో... రాజమండ్రిని అభిమానించడంలో తప్పేం లేదు. ఇక కన్యాకుమారి విషయానికొస్తే... ‘సీతాకోక చిలుక’ సినిమా అక్కడే ఎక్కువ తీశారు. సినీ నటునిగా నా తొలి అడుగులు పడ్డవి అక్కడే. అందుకే కన్యాకుమారి ఓ తీపి జ్ఞాపకంగా నిలిచిపోయింది నాకు. న్యూజిలాండ్ అంటే ఇష్టపడడానికి కారణం... అక్కడ కాలుష్యం సున్నా. నేరాలు శూన్యం. ఎంత ఉండాలో అంతే ఉండే జన సాంద్రత. స్విట్జర్లాండ్ విషయానికొస్తే... ‘ఇక్కడేమైనా కర్ఫ్యూ పెట్టారా!’ అన్నట్లు ఉంటుంది. చాలా ప్రశాంత వాతావరణం. మనం కలలో కూడా చూడనన్ని అందమైన రంగులతో రకరకాల పూలమొక్కలు రోడ్డు పక్కనే దర్శనమిస్తుంటాయి. అంతేకాదు... ఏదైనా పని ఉంటే తప్ప జనం ఇళ్ల నుంచి బయటకు రారు. ‘మళ్లీ జన్మంటూ ఉంటే... స్విస్‌లోనే పుట్టాలి’ అనిపిస్తుంది అక్కడి వాతావరణం. చివరగా కేరళ. అక్కడ ఇంట్లో అయిదుగురు సభ్యులుంటే... నలుగురు పనిచేస్తారు. రాష్ట్రాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి వ్యక్తీ కష్టపడతాడు. ఇళ్ల ముందు ఆకులు రాలినా... వాటిని చిమ్మి, కుప్పగా పోసి, కిరోసిన్ పోసి తగులపెడతారు. నీట్‌గా ఉంటారు. నీతిగా ఉంటారు. అమ్మాయిలైతే అందంగా ఉంటారు. దాదాపు అందరూ చదువుకున్నవాళ్లే. నా జీవితం ఆధారంగా బోల్డన్ని పుస్తకాలు రాయొచ్చు! నేను పుస్తకాలు చదవను. అయినా... నా జీవితంలోనే కావాల్సినన్ని ఘట్టాలున్నాయి. వాటి ఆధారంగా బోల్డన్ని పుస్తకాలు రాయొచ్చు. తల్లిదండ్రుల దగ్గర పెరగాల్సిన వయసులో వాళ్లను వదులుకొని దూరంగా బతికాను. మా ఊరు కాని ఊరు మద్రాసులో, భాష కాని భాష మధ్య నాకంటూ నేపథ్యం కానీ, ఎవరి సహాయం, తోడు కానీ లేకుండా కొన్నేళ్ల పాటు జీవనం సాగించాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. ఇది మామూలు విషయం కాదు. నాది మామూలు జన్మ కాదని నేను నమ్ముతాను. నా జీవితమనే పుస్తకాన్ని ఎప్పటికప్పుడు నెమరువేసుకోవడమే నాకు సరిపోతుంది. ఇక వేరే పుస్తకాలు చదివే టైమ్ ఎక్కడిది! - బుర్రా నరసింహ -
పదకొండున్నరకి లంచ్ ఎందుకు చేయించారో అప్పుడర్థమైంది...
హీరో రాజేంద్రప్రసాద్ - దర్శకుడు జంధ్యాలది హిట్ కాంబినేషన్. రెండు రెళ్లు ఆరు, అహ నా పెళ్లంట, వివాహ భోజనంబు, జయమ్ము నిశ్చయమ్మురా, విచిత్ర ప్రేమ, ప్రేమ జిందాబాద్... ఇలా అరడజను చిత్రాలు వీరి కలయికలో రూపొందాయి. జంధ్యాలంటే రాజేంద్రప్రసాద్‌కి ప్రాణం. తమది జన్మజన్మల బంధం అంటారాయన. జంధ్యాలతో పరిచయం నుంచి ఇప్పటికీ గుర్తొచ్చే సంఘటనల దాకా రాజేంద్రుని మదిలోని జ్ఞాపకాలు ‘సాక్షి’కి ప్రత్యేకం. ఓ సినిమా షూటింగ్ పని మీద వైజాగ్ వెళ్లాను. కారులో భీమిలి వైపు వెళ్తుంటే, రోడ్డు పక్కన నందమూరి బాలకృష్ణ కనిపించాడు. నేను కారు దిగి ‘‘ఇదేంటి బాలా..! ఇక్కడేం చేస్తున్నావ్?’’ అనడిగా. ఆ పక్కన కొండ మీద కెమెరా యూనిట్ చూపించి ‘‘ ‘బాబాయ్-అబ్బాయ్’ షూటింగ్ జరుగుతోంది’’ అని చెప్పాడు. ఆ సినిమాకి దర్శకుడు జంధ్యాలగారు. నన్నాయనకు పరిచయం చేశాడు బాలకృష్ణ. ఆయన వెంటనే ‘‘ఈ సీన్ చేయడానికి ట్యాక్సీ డ్రైవర్ పాతిక టేక్‌లు తిన్నాడు. ఆ వేషం మీరు వేస్తారా?’’ అనడిగారు. నేను ఎస్, నో చెప్పక ముందే డ్రైవర్ దగ్గర్నుంచీ ఖాకీ చొక్కా తీసేసుకుని నాకిచ్చి వేసుకోమన్నారు. అంత పెద్ద వ్యక్తి అడిగితే చేయననడం బాగోదని, ఏదో ఓ ట్రాన్స్‌లో ఉన్నట్టుగా నేను ఆ ట్యాక్సీ డ్రైవర్ వేషం చేసేశాను. సింగిల్ టేక్‌లో షాట్ ఓకే. ‘‘ఏంటండీ... నాతో మరీ జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేయించారు’’ అన్నాను. ‘‘దేవుడు మనిద్దర్నీ కలిపాడు. చూద్దాం... ఏమవుతుందో’’ అన్నారాయన. కొన్ని రోజుల తర్వాత... జంధ్యాలగారి నుంచి ‘రెండు రెళ్ళు ఆరు’ కోసం కబురొచ్చింది. చంద్రమోహన్‌గారు, నేనూ హీరోలం. నాపై తీసిన ఫస్ట్ షాట్ డైలాగ్ ఏంటో తెలుసా? ‘‘ఏంటయ్యా... నేను కమెడియన్లా కనిపిస్తున్నానా? నేను హీరోని’’. ఇంతవరకూ బాగానే ఉంది. ఆ నెక్ట్స్ షాట్ మాత్రం నన్ను ఇరుకున పడేసింది. విఠలాచార్య సినిమాల్లో హీరో నరసింహరాజు కాస్ట్యూమ్ లాంటి దొకటి తీసుకొచ్చి నన్ను వేసుకోమన్నారు. రాజు గెటప్ అన్న మాట. నేను గుర్రం మీద ఓ పాడుబడిన కోట దగ్గరకు వెళ్లి ‘ఇది ఎవరి సంస్థానం?’ అనడగడంతో సినిమా టైటిల్స్ మొదలవుతాయి. ‘ఏమిటీ పిచ్చి డెరైక్షన్... ఎవడు డెరైక్టర్?’ అని నేను అడిగినప్పుడు, ఆ షాట్ ఫ్రీజ్ చేసి జంధ్యాల గారి పేరు వేస్త్తారన్నమాట. ఇలా మీ గురించి నేను కామెంట్ చేస్తే ‘జనం నన్ను తిడతారండీ’ అన్నాను. ‘‘రేపు థియేటర్లో చూడు... జనం దీనికి క్లాప్స్ కొడతారు’’ అని జంధ్యాలగారు ఒత్తిడి చేయడంతో, నేను ఇబ్బంది పడుతూనే ఆ షాట్ చేశాను. నిజంగానే ఆ షాట్‌కి థియేటర్లో క్లాప్స్ పడ్డాయి. ‘రెండు రెళ్లు ఆరు’లో నాది చాలా మంచి వేషం. ప్రముఖ మెజీషియన్ బీవీ పట్టాభిరామ్‌గారు, జంధ్యాల గారికి క్లోజ్ ఫ్రెండ్. ఈ సినిమాలో నేను కొన్ని మేజిక్స్ చేయాలి. అందుకోసం నన్ను పట్టాభిరామ్గారి దగ్గర మూడు రోజులు మేజిక్స్ నేర్చుకోమన్నారు. ఒక్క రోజులోనే నేర్చేసుకుని జంధ్యాల గారికి చూపిస్తే ఆనందపడిపోయారు. ఇక ‘వివాహ భోజనంబు’లో నాతో తొలిసారిగా లేడీ గెటప్ వేయించారు. అది జంధ్యాలగారి గొప్పతనమే. ‘వివాహ భోజనంబు’లో హీరోయిన్ ఇంటి ఎదురుగా నేను కానిస్టేబుల్ వేషంలో ఉండే ఎపిసోడ్లో నాకు అస్సలు డైలాగులు ఉండవు. అప్పుడు నేనిచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కి పొట్ట పట్టుకుని నవ్వాల్సిందే. డైలాగులు కూడా లేకుండా కామెడీ పుట్టించాలంటే జంధ్యాల గారి తర్వాతే ఎవరైనా. ‘వివాహ భోజనంబు’ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. అప్పుడు టైమ్ ఉదయం పదకొండున్నర అవుతోంది. జంధ్యాలగారు నా దగ్గరకొచ్చి ‘‘బాగా ఆకలేస్తోంది. లంచ్‌కి వెళ్దాం పద’’ అన్నారు. ఇప్పుడు లంచ్ ఏంటండీ? అన్నాను. బలవంతంగా తీసుకెళ్లారు. జంధ్యాలగారు మంచి భోజన ప్రియులు. మేం రెగ్యులర్‌గా కలిసే భోంచేస్తుంటాం. నేను ఆయన కోసమని లంచ్ చేస్తున్నాను. అయితే అంత ఆకలి అన్న జంధ్యాలగారు పెద్దగా తినడం లేదు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే, కర్చీఫ్‌తో తుడుచుకుంటున్నారు. సమ్‌థింగ్ రాంగ్ అనిపించి, ‘‘ఏం జరిగిందండీ?’’ అనడిగాను. ఆయన ఏం మాట్లాడలేదు. నా లంచ్ పూర్తయ్యాక, ‘‘ప్రసాద్..! అర్జంట్‌గా మీ ఊరు బయల్దేరు. మీ నాన్నగారు నిన్ను చూడాలనుకుంటున్నారట. కారు రెడీ’’ అని చెప్పారు. నాకు విషయం అర్థమైపోయింది. మా నాన్నగారు చనిపోయారన్న వార్త తెలిసి, ఇలా చేశారని అర్థమైంది. నా గురించి ఎంత కేర్ తీసుకున్నారో అనిపించింది. మా ఇద్దరి కాంబినేషన్లో నెంబర్‌వన్ - ‘అహ నా పెళ్లంట’. ఆ సినిమా గురించి మాట్లాడుకోని తెలుగువాడు ఉండరంటే అతిశయోక్తి కాదు. నిర్మాత డి. రామానాయుడు గారికి స్టోరీ లైన్ చెబితే నచ్చేసింది. కానీ ఫుల్ స్క్రిప్ట్ ఉంటేనే షూటింగ్ మొదలుపెడతానని చెప్పారట. మరి ఈయనకు పౌరుషం వచ్చిందో ఏమో, రాత్రికి రాత్రి కూర్చుని ‘అహ నా పెళ్లంట’ స్క్రిప్ట్ రాసేశారు. నేను చాలామంది దర్శకులతో పని చేశాను కానీ, జంధ్యాల తరహా పనితీరు ఎక్కడా చూడలేదు. ఆయన షూటింగ్ అంటే ఓ పిక్నిక్ కింద లెక్క. ఎంత సందడిగా ఉంటుందో. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ ఫన్ ఉంటుంది. అలాగే ఎవర్నీ హర్ట్ చేసిన సందర్భం లేదు. బాగా కోపం వచ్చిందంటే... ఓ చోట సెలైంట్‌గా కూర్చునేవారు తప్ప, ఒక్క పరుష వాక్యం మాట్లాడేవారు కాదు. చుట్టుపక్కల జరిగేవాటి నుంచే ఆయన బోలెడంత కామెడీ పుట్టిస్తారు. అప్పటికప్పుడు సీన్లు సృష్టించేస్తారు. స్పాట్ ఇంప్రొవైజేషన్స్ బ్రహ్మాండం. జంధ్యాల ఎంత గొప్పగా రాసేవారో, అంత గొప్పగా మాట్లాడేవారు. అంతకన్నా గొప్పగా డెరైక్షన్ చేసేవారు. ఆయనలోని మరో గొప్ప విషయం - ఏదీ శ్రుతి మించకపోవడం. బూతు అనేది ఆయన అక్షరాల్లో భూతద్దం వేసినా కనబడదు. అంతా సహజత్వమే. ఎక్కడా కృత్రిమత్వం ఉండదు. ఆయన కామెడీ ప్రాణంతో ఉన్న బొమ్మ లాంటిది. జంధ్యాల ఓ క్రియేటివ్ జీనియస్. కొంతమంది గొప్ప గొప్ప వాళ్లని దేవుడు ఏదో అర్జంట్ పని ఉన్నట్టుగా పైకి తీసుకుపోతాడు. ఈ కెరీర్లో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అందమైన కల జంధ్యాలగారు. ఆయన ఎప్పుడూ గుర్తొస్తుంటారు. జంధ్యాలగారు నాకు బ్రదరా? బాబాయా? బావా? తండ్రా? స్నేహితుడా? ఏమో... మా ఇద్దరి మధ్య ఏదో రుణానుబంధం ఉన్నట్టే అనిపిస్తుంది. ఓ బిడ్డను చూసుకున్నట్టుగానే నన్ను చూసుకున్నారు. జంధ్యాల గారు బతికి ఉండి ఉంటే మా కాంబినేషన్లో మరిన్ని ‘అహ నా పెళ్లంట’లు వచ్చేవి. -
సినీ కళా పూర్ణోదయ కర్తకు ఎనిమిది పదులు
ఎనభై రెండేళ్ల తెలుగు సినీ ప్రస్థానంలో కొన్ని వందల మంది నిర్మాతలు, వేలకొద్దీ సినిమాలు వచ్చాయి. కానీ, జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు సినిమా కీర్తిని వ్యాపింపజేసిన నిబద్ధత గల నిర్మాతలు, సినిమాల సంఖ్య మాత్రం కొద్దే. ముఖ్యంగా, తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములా బాట పట్టిన 1970, ’80లలో అలాంటి అరుదైన మంచి చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకోవడం ఆషామాషీ విషయం కాదు. ‘శంకరాభరణం’ లాంటి ఆణిముత్యాలతో ఆ ఘనతను అందుకున్న అరుదైన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు. కాకినాడ కాలేజీ రోజుల్లోనే ‘ఇన్స్పెక్టర్ జనరల్’ లాంటి నాటకాలు ప్రదర్శించి, హీరో అవుదామని సినీ రంగానికి వచ్చిన కళాప్రియుడు ఏడిద. డబ్బింగ్ కళాకారుడిగా, తరువాత చిన్నాచితకా వేషాల ఆర్టిస్టుగా ప్రయత్నించిన ఆయన నిర్మాతగా స్థిరపడినప్పుడూ ఆ కళాభిరుచిని వదులుకోకపోవడం విశేషం. నిర్మాతగా ఆయన తీసినవి పట్టుమని పది చిత్రాలే. ‘పూర్ణోదయా మూవీ క్రియేషన్స్’ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారా తెలుగు సినిమా తల్లికి పదికాలాలు నిలిచే పట్టు చీరల్లాంటి సినిమాలు కట్టబెట్టారు. ఏ దేశం వెళ్ళినా, ఇవాళ తెలుగువారు సగర్వంగా చెప్పుకొనే ‘శంకరాభరణం’ (’80), ‘సాగర సంగమం’ (’83), ‘స్వాతిముత్యం’ (’86) లాంటి కళాఖండాలు నిర్మాతగా ఆయన అభిరుచిని పదుగురికీ పంచాయి. ప్రేక్షకుల అభిరుచిని పెంచాయి. మన సినిమాకు ప్రశంసలు, పురస్కారాలు తెచ్చాయి. నిర్మాతగా తాను ఇంతటి కీర్తి ప్రతిష్ఠలు ఆర్జించడానికి దర్శకుడు కె. విశ్వనాథ్, రచయిత జంధ్యాల లాంటి ఎంతోమంది సృజనశీలురు కారణమని ఆయన ఎప్పుడూ నిజాయితీగా నమ్రతతో చెబుతుంటారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి సినీ అవార్డుల కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేసి, ప్రస్తుతం చిత్ర నిర్మాణానికి దూరంగా విశ్రాంతి జీవితం గడుపుతున్నారాయన. వయోభారం ఇబ్బంది పెడుతున్నా, చెన్నై, హైదరాబాద్‌ల మధ్య తిరుగుతూ, ఇప్పటికీ ముఖ్యమైన సినీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సినిమా పట్ల తరగని ఆయన ప్రేమకు దర్పణం. ఇవాళ్టితో 80 ఏళ్లు పూర్తి చేసుకొన్న ఈ సినీ కళాపూర్ణోదయ కర్తకు శుభాకాంక్షలు. -
'నింగి, నేల ఉన్నంత వరకు నవ్విస్తూనే ఉంటా'
మూడు దశాబ్దాల సినీ జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశానని.. అవన్నీ తన హృదయ ఫలకంపై తీపి గుర్తులుగా మిగిలిపోయాయని ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మనందం వెల్లడించారు. నింగి, నేల ఉన్నంత వరకు ప్రేక్షకులకు వినోదం పంచుతునే ఉంటానని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి మూడు దశాబ్దలు పూరైన సందర్భంగా చెన్నైలో బ్రహ్మనందం విలేకర్లతో మాట్లాడారు. తాను చిత్ర పరిశ్రమకు రెండేళ్ల ముందే వచ్చిన 1986లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'చంటబ్బాయి' చిత్రం తనకు బ్రేక్ ఇచ్చిందని... నాటి జ్ఞాపకాల దొంతరలో నిక్షిప్తమైన స్మృతులను ఆయన ఈ సందర్భంగా నెమరేసుకున్నారు. వెయ్యికి పైగా చిత్రాలలో నటించినట్లు చెప్పారు. తాను ఈ రోజు ఇంత విజయం సాధించానంటే చిత్ర దర్శకులు,నిర్మాతలే ప్రధాన కారణమన్నారు. షూటింగ్ సమయంలో లైట్ బాయ్స్ నుంచి మేకప్ ఆర్టిస్ట్‌ల వరకు వారితో ఉన్న అనుబంధాన్ని బ్రహ్మనందం ఈ సందర్భంగా విశదీకరించారు. అటు తెలుగు ఇటు తమిళ చిత్ర రంగంలో సినిమాలలో నటిస్తు 58 ఏళ్ల బ్రహ్మనందం మహా బిజీగా ఉన్నారు. -
హాస్యమాల జంధ్యాల
సంగీతం, సాహిత్యం, హాస్యం ఈ మూడు కలిస్తేనే జంధ్యాల. ఈయన పేరు వెంకటదుర్గా శివసుబ్రమణ్య శాస్త్రి. డెబ్బయ్యో దశకంలో ఆధునిక తెలుగు సినిమాల్లో తన హాస్య సంభాషణలతో నవ్వుల హరివిల్లును పూయించిన ఘనత కేవలం జంధ్యాలకు మాత్రమే దక్కుతుంది. మనందరినీ కడుపుబ్బ నవ్వించిన జంధ్యాల జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. అన్నానగర్, న్యూస్‌లైన్ : రాజ్‌కపూర్ తన ఆత్మగురువు అని జం ద్యాల ఒకసారి వేటూరితో అన్నారట. అందుకేనేమో ఆయన చిత్రంలో ప్రేమ గొప్పదనాన్ని గురించి తెలిపే ఒక పాట తప్పనిసరిగా ఉండాల్సిందే. అది కూడా వేటూరి సుందరరామ్మూర్తిది మాత్రమే ఉండేలా ఆయన శ్రద్ధ వహించేవారు. జంధ్యాల మనసు వెన్నముద్ద అయితే ఆయన కళ్లు వెన్నెల పొద్దులు, ఆయన మాటలు జలపాత సున్నితాలు, నవరసాలన్నింటిలోనూ జంధ్యాల హాస్య రసాన్నే అవపోసన పట్టారు. నవ్వులను పండించారు. పెద్ద కళ్లేపల్లెలో మూడు రోజుల పాటు సాగే తెలుగు వసంతోత్సవాలు జంధ్యాలకు అత్యంత ఇష్టమైనవి. ఎందుకంటే అక్కడ ఆయన తన జోకులతో కళా రసికులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడమే కాక తన పొట్టను కూడా చెక్కలు చేసుకునేలా నవ్వేవారు. వేలుగాడు, స్టువర్టుపురం పోలీసు స్టేషన్, స్టేషన్ మాస్టరు సినిమాల్లో జంధ్యాల రాసిన సంభాషణలు ప్రాసక్రీడగా జగత్ విఖ్యాతమయ్యాయి. ముళ్లపూడిని గురువుగా భావించే జంధ్యాలకు బ్రాహ్మణీకపు ప్రథమ కోపాలూ, గ్రంధాక్షరీ శాపాలు కూడా హాస్యంలోని ప్రధాన వస్తువులే అయ్యూయి. రెండు జళ్ల సీత సినిమాలో జంధ్యా ల రాసిన ఊరగాయ స్త్రోత్రాలు - దండకాలూ, మాయాబజార్ సినిమాలోని పింగళివారు రాసిన గోంగూరోపాఖ్యానాన్ని తల పింప చేస్తాయి. వేటూరి అంటే జంధ్యాలకు ఆరోప్రాణం అందుకే ఆయన చేత మల్లెపూవు చిత్రంలో కకుమభంజనం స్వాములవారి పాత్ర వేయించి మురిసిపోయారు. అందుకే జంధ్యాల మృతి చెందినపుడు వేటూరు దుఃఖం ఆపుకోలేక జంధ్యాల జీవితం ఎంత చిన్నదైనా.. అది తనకు మనుచరిత్రే అని బాధపడ్డారు. ఒక సభలో బాలు, ఎస్.జానకి, శైలజ ప్రసంగించి శ్రోతల కనుల వెంట నీరు తెప్పిస్తే ఆ సభకే అతిథిగా వచ్చిన జంధ్యాల మైకు ముందుకొచ్చి ఇంత వరకు ‘పాడు’ మనుషులు ముగ్గురొచ్చి కంట తడి పెట్టించారని ప్రసంగం ప్రారంభించగానే సభలో నవ్వులు మార్మోగాయి. శ్రీరమణ మహర్షి వేదాంతం రమణోపనిషత్తులనే గ్రంధ రూపంలో వచ్చినట్లుగానే జంధ్యాల చమత్కారాలు చెణుకులు కూడా ఒక జం ద్యోపనిషత్తు గ్రంథంగా తేవడానికి ఆయన అభిమానులం తా ప్రయత్నిస్తే భేషుగ్గా ఉంటుంది. కాలధర్మాన్ని, జీవనతత్వాన్ని 50ఏళ్ల వయసులో గ్రహించిన జంధ్యాల తృతీయ పురుషార్థాన్ని దాటి వెళ్లిపోయిన మహాజ్ఞాని. ఆయన గుర్తుగా మిగిలినవి హాస్య చిత్రాలు మాత్రమే. ఇదీ ప్రస్థానం జంధ్యాల 1951 జనవరి 14(మకర సంక్రాంతి రోజు)న నరసాపురంలో జన్మించారు. విజయవాడలో బీకాం గ్రాడ్యుయేట్‌గా బయటకు వచ్చారు. సిరిసిరి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1983లో జంధ్యాల 12 నెలల వ్యవధిలో 80 సినిమాలకు మాటలు రాశారు. 1984, 87, 1992ల్లో ఆనందభైరవి, పడమటి సంధ్యారా గం, ఆపద్బాంధవుడు చిత్రాలకు ఉత్తమ దర్శక, ఉత్తమ కథ, ఉత్తమ సంభాషణల రచయతగా మూడు సార్లు నంది అవార్డులు పొందారు. రెం డు రెళ్లు ఆరు, ఆపద్బాంధవుడు చిత్రాల్లో నటించారు. చూపులు కలిసిన శుభవేళ, భారతీయుడు, ఇద్దరు, పడమట సంధ్యారాగం, అరుణాచలం, భామనే సత్య భామనే చిత్రాల్లోని కొన్ని ముఖ్య పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. భారత ప్రభుత్వం జంధ్యాలను పద్మశ్రీతో సత్కరించింది. సీఏ చదవాలని చెన్నైకు వచ్చి గుమ్మడి ప్రోద్బలంతో సంభాషణలు - కథా రచయితగా అవతారమెత్తారు. ఆత్మాహుతి, గుండెలు మార్చబడును, ఏక్‌దిన్‌కే సుల్తాన్ అనేది జంధ్యాలకు పేరు తెచ్చిన నాటకాలు. ఇందులో ఏక్ దిన్కా సుల్తాన్ పది వేల సార్లు ప్రదర్శితమవడమే కాకుండా, దాని తాలుకూ ముద్రణా ప్రతులు 15 సార్లు పునర్ముద్రణకు నోచుకున్నాయి. -
జంధ్యాలగారిలా క్లీన్ మూవీస్ చేయాలనేది నా లక్ష్యం
ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చూస్తోంది యువతరమే. అందుకే దర్శక, నిర్మాతలు యూత్నే టార్గెట్ చేస్తున్నారు. కొందరైతే, కుర్రకారుని వలలో వేసుకోడానికి ద్వందార్థ సంభాషణలకు కూడా తెగబడుతున్నారు. కానీ.. ఈ మధ్య ఓ సినిమా వచ్చింది. దాన్ని యువతరం సినిమా అనలేం, కుటుంబ కథాచిత్రం అని కూడా అనలేం. పోనీ ప్రేమకథ అందామా! అంటే.. అది కూడా కరెక్ట్ కాదు. అది అందరి కథ, అందరికీ నచ్చే కథ. అశ్లీలత అనేది మచ్చుకైనా కనిపించని కథ. అదే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. తొలి సినిమాతోనే... అందరి మనసుల్నీ దోచేసిన ఆ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... ఇండస్ట్రీలో హిట్ రాగానే... నిర్మాతలు అడ్వాన్సులతో ముంచెత్తేస్తారు. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? అడ్వాన్సులు అందుకుంటున్నారా? నా పరిస్థితి అచ్చం మీరు చెప్పినట్టే ఉంది. అయితే.. అడ్వాన్సులు మాత్రం అందుకోవడం లేదు. ‘నా తొలి సినిమా ప్రమోషన్ పనులే ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పుడే నెక్ట్స్ సినిమా గురించి ఆలోచించలేను’ అని గట్టిగా చెప్పేస్తున్నా. కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నా. నా తర్వాత సినిమా ఏంటో త్వరలో తెలియజేస్తా. కథ రెడీగా ఉందా? ప్రస్తుతం అదే పనిలో ఉన్నా. కథ ఓ కొలిక్కి వచ్చింది. ఇది కూడా తొలి సినిమా లాగా భిన్నమైన కథాంశమే. లిటిల్బిట్ జర్నీ కూడా ఉంటుంది. ప్రేమ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. కొందరు దర్శకులు ఎఫర్ట్ మొత్తం తొలి సినిమాకే పెట్టేస్తున్నారు. మలి సినిమాకొచ్చేసరికి దెబ్బ తింటున్నారు. ఈ విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు? కథ ఫర్ఫెక్ట్గా ఉండాలి. స్క్రీన్‌ప్లే ఇంటిలిజెంట్‌గా ఉండాలి. ‘వీడు ఏదో గమ్మత్తు చేశాడ్రా’ అనిపించాలి. అలా ఉంటే విజయం తథ్యం. యువతరం చూస్తున్నారు కదా.. అని ప్రేమకథల వెంటే పడకూడదు... ఎప్పటికప్పుడు కొత్తగా వెళ్లాలనేది నా అభిమతం. సాధ్యమైనంత వరకూ నా సినిమాల్లో హ్యూమర్, మెసేజ్ ఉండేలా చూసుకుంటాను. జంధ్యాలగారు తీసిన సినిమాల్లా క్లీన్ మూవీస్ తీయాలనేది నా లక్ష్యం. నాకు తొలి విజయం కంటే మలి విజయమే ఇంపార్టెంట్. మీ నాన్నగారు మేర్లపాక మురళి రచయిత కదా. ఆయన ప్రభావం మీపై ఎంత? చాలా ఉంది. కళలపట్ల ఆసక్తి నాకు ఆయన నుంచే సంక్రమించింది. చిన్నప్పట్నుంచీ నాకు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు నాన్న. బుక్ కంప్లీట్ చేస్తే ఇరవై రూపాయలు ఇచ్చేవారు. పోనుపోనూ పుస్తకాలు చదవడం నాకు వ్యసనంలా మారింది. చివరకు నేనే ఆయనకు డబ్బులిచ్చి పుస్తకాలు తెమ్మనేవాణ్ణి. చలం, బుచ్చిబాబు, శ్రీశ్రీ, తిలక్ ఇలా మహామహుల పుస్తకాలు చదివేశాను. అనుకోకుండా డెరైక్టర్ అయ్యారా? లేక మీ లక్ష్యం కూడా ఇదేనా? నా లక్ష్యం ఇదే. ఇంటర్ టైమ్‌లోనే డెరైక్టర్ని అవుతానని నాన్నతో చెప్పాను. ‘బీటెక్ పూర్తి చేశాక నీ ఇష్టం వచ్చినట్లు చేయ్’ అన్నారాయన. ఆళ్లగడ్డలో ఇంజినీరింగ్ బయోటెక్నాలజీ చేశాను. కోర్స్ పూర్తవ్వగానే, అన్నమాట ప్రకారం చెన్నయ్ ఎల్వీప్రసాద్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేర్పించారు నాన్న. అయితే, డెరైక్షన్ కోర్స్ అంటే సెల్ఫ్ సెక్యూరిటీ ఉండదని నాన్న ఫీలింగ్. అందుకే.. నాన్న కోసం సినిమాటోగ్రఫీ కోర్స్‌లో చేరాను. కానీ, ఎక్కువగా డెరైక్షన్ క్లాసుల్లోనే ఉండేవాణ్ణి. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ అవకాశం ఎలా వచ్చింది? చెన్నయ్‌లో కోర్స్ పూర్తి చేసుకొని హైదరాబాద్ రాగానే.. ‘ఖర్మరా దేవుడా’ అనే షార్ట్ ఫిలిం చేశాను. అది బాగా పాపులర్ అయ్యింది. వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ చిత్రోత్సవాలో బెస్ట్ షార్ట్ఫిలింగా ఎంపికైంది. దర్శకుడు హరీష్‌శంకర్ చేతులపై జ్ఞాపిక అందుకున్నాను. తర్వాత తన సినిమాకు పనిచేయమని హరీష్ అడిగారు. కలుద్దామనుకునేలోపు ఆయన ఫారిన్ వెళ్లిపోయారు. ఈ గ్యాప్‌లో తయారు చేసుకున్న ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ కథను సందీప్‌కిషన్‌కి చెప్పాను. తనకు బాగా నచ్చేసింది. తనే కథ వినిపించమని నన్ను పలువురు నిర్మాతల వద్దకు పంపారు. కథ అయితే.. అందరికీ నచ్చేది కానీ, సందీప్ అనగానే.. బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అని భయపడేవారు. ఓసారి మా ఊరు రేణిగుంటలో ఉండగా, ‘చోటా కె.నాయుడు కథ వింటారట’ రమ్మని సందీప్ నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లి చోటాగారికి కథ చెప్పాను. ఆయనకు కథ తెగ నచ్చేసింది. వెంటనే.. జెమినీ కిరణ్‌గారికి చెప్పించారు. ఆయనకూ నచ్చడంతో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ పట్టాలెక్కింది. ఈ సినిమా విడుదలవ్వగానే మీకు దక్కిన గొప్ప కాంప్లిమెంట్? సినిమా విడుదలైన రోజు ఓ ఫిలిం జర్నలిస్ట్ అన్నారు.. ‘నేను మంచి దర్శకుల మీద ఇటీవలే ఓ బుక్ రాశాను. మీ సినిమా నెల రోజులు ముందు విడుదలైనట్లయితే... నా బుక్‌లో మీరూ ఉండేవారు’ అని. ఈ సినిమా విషయంలో ఎన్ని ప్రశంసలు దక్కినా... ఆయన అన్నమాట మాత్రం నాకు అమితానందాన్నిచ్చింది.