రండి.. వాంగో.. ఆయియే.. ప్లీజ్ కమ్... | hit | Sakshi
Sakshi News home page

రండి.. వాంగో.. ఆయియే.. ప్లీజ్ కమ్...

Published Wed, Sep 30 2015 11:06 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

రండి.. వాంగో..  ఆయియే.. ప్లీజ్ కమ్... - Sakshi

రండి.. వాంగో.. ఆయియే.. ప్లీజ్ కమ్...

చిత్రం : రెండు రెళ్లు ఆరు (1986) 
డెరైక్ట్ చేసింది : జంధ్యాల 
సినిమా తీసింది : జి. సుబ్బారావు   
మాటలు రాసింది : జంధ్యాల

 
పూర్తి పేరు     :     రాళ్లపల్లి వెంకట నరసింహారావు
పుట్టింది     :         1946 ఆగస్టు 15న  తూ.గో.జిల్లా, రాచపల్లిలో
ఫస్ట్ సినిమా    :    స్త్రీ
వందో సినిమా    :    టై
లేటెస్ట్ సినిమా    :    భలే భలే మగాడివోయ్ (2015)
టోటల్ మూవీస్    :    600 కు పైగానే

 
రాళ్లపల్లి టాప్-10 మూవీస్

 1. ఊరుమ్మడి బతుకులు
 2. తూర్పు వెళ్లే రైలు,  3. అభిలాష,
 4. అన్వేషణ,   5. శ్రీవారికి ప్రేమలేఖ
 6. శుభలేఖ,   7. రేపటి పౌరులు
 8. సగటు మనిషి, 9. ఆలయ శిఖరం
 10. ఛలో అసెంబ్లీ
 
రాళ్లపల్లి... యాక్టింగ్‌లో ‘రత్నాల’పల్లి. కామెడీ, సెంటిమెంట్, విలనీ... ఏదైనా సునాయాసంగా చేసి పారేయగల గ్రేట్ ఆర్టిస్ట్. కానీ మన తెలుగు ఇండస్ట్రీ రాళ్లపల్లిని ఇంకా గొప్పగా వాడుకుని ఉండాల్సింది. ప్చ్. ఏం చేస్తాం!! జంధ్యాల తీసిన ‘రెండు రెళ్లు ఆరు’లో ఆయన సకల భాషా నైపుణ్యాన్ని చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు.
 
ఇద్దరు చైనా వాళ్లు కలుసుకుంటే చైనీస్ భాషలో మాట్లాడుకుంటారు. ఇద్దరు బెంగాలీ వాళ్లు తారసపడితే బెంగాలీలో ముచ్చటించుకుంటారు. ఇక తమిళం వాళ్లయితే మాట్లాడుకున్నా... పోట్లాడుకున్నా... అంతా అరవంలోనే. అదే మన తెలుగువాళ్లయితే మాత్రం ఇంగ్లీషులో మాట్లాడుకుంటారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అనుకోండి. దౌర్భాగ్యం అనుకోండి. ఇంకేదైనా అనుకోండి.కానీ ఈ తికమక దగ్గర మాత్రం అలాంటి కందిపప్పులుడకవు. పెసరపప్పులుడకవు. అతగాడు బెంగాలీ వాడితో బెంగాలీలో మాట్లాడగలడు. హిందీ వాడితో హిందీలో బోల్‌గలడు. తెలుగువాడితో ఆంగ్లం, అరవం, కన్నడం, హిందీ... ఇలా అన్నీ మాట్లాడేయగలడు. ఎందుకంటే తికమకకు అన్ని భాషలూ వచ్చు. అలాగని అతగాడు సకల విద్యా పారంగతుడనుకునేరు. ఈ ‘తికమక’ పేరు వెనుక కథేంటో, అతగాడి బహుభాషా నైపుణ్యం వెనుక కిటుకేమిటో మనం చెప్పేకన్నా అతగాడే చెప్పుకోవడం బెటర్. ఎందుకంటే - ఎవడి డప్పు వాడే కొట్టుకోవాల్సిన ట్రెండ్ ఇది మరి.

అదో పల్లెటూరు. బస్సు నుంచి ఓ మిస్సు దిగింది. ట్రాక్టర్ దగ్గర వెయిటింగ్‌లో ఉన్న తికమక. చకచకా ఆ మిస్సు దగ్గరకెళ్లి ‘‘నమస్తే... హిందీ, వణక్కం... తమిళ్, గుడ్‌మార్నింగ్... ఇంగ్లీష్, నమస్కారం... తెలుగు’’ అన్నాడు. ఆ అమ్మాయి అయోమయంగా ఇతని వైపు చూసింది. ‘‘ఆలస్యం అయినందుకు క్షమించాలి. నిన్న రావాల్సిన ఉత్తరం అలవాటు ప్రకారం ఆలస్యంగా ఈ రోజు వచ్చింది. బండి లేటైపోతుందని ట్రాక్టర్ తీసుకొచ్చా. రండి... తెలుగు, వాంగో... తమిళ్, ఆయియే... హిందీ, ప్లీజ్ కమ్... ఇంగ్లీష్’’ అని ఆమె సూట్‌కేస్ అందుకుని ట్రాక్టర్ మీద పెట్టాడు. ఆమె ట్రాక్టర్ ఎక్కి కూర్చుంది.
 
‘‘మీ పెదనాన్నగారు మీ గురించి ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తున్నారు’’ అని చెబుతూ ట్రాక్టర్ స్టార్ట్ చేశాడు తికమక. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా ‘‘పెదనాన్న గారెవరు?’’ అనడిగింది. తికమక అయోమయపడిపోయి ‘‘సర్వానందంగారు... ఆయనే మీ పెదనాన్నగారు. ఇంతకూ మీ పేరు విఘ్నేశ్వరి కాదా?’’ అనడిగాడు.ఆ అమ్మాయి చాలా తాపీగా ‘‘నా పేరు వెంకటలక్ష్మి... విఘ్నేశ్వరి కాదు’’ అంది. వెంటనే తికమక ట్రాక్టర్ ఆపేశాడు. ‘‘మా గొప్ప పనిచేశావ్ కానీ, దిగు దిగవమ్మా. గాలి తీసేసిన ట్రాక్టర్ ట్యూబ్‌లాంటి మొహం చూసే అనుకున్నా. ఎవరు ఎవరి కోసం ఏ బండి కనిపించినా ఎక్కేయడమేనా...’’ అంటూ ఆమె సూట్‌కేస్‌ని కింద గిరాటు వేసినంత పనిచేసి మరీ విసుక్కున్నాడు.

 సరిగ్గా అప్పుడే ఇంకో బస్సు ఆగింది. అందులోంచి ఓ అమ్మాయి విత్ లగేజ్ దిగింది. ఓసారి జరిగిన పొరపాటుతో తికమక ఆమె వైపు అనుమానంగా చూస్తూ ‘‘నీ పేరు కూడా వెంకటలక్ష్మేనా?’’ అనడిగాడు. ఆమె కంగారుగా ‘‘కాదు... నా పేరు వింధ్య. కాదు కాదు... విఘ్నేశ్వరి’’ అంది. తికమక మొహం వెలిగిపోయింది. ‘‘అమ్మాయిగారూ... మీ కోసమే వచ్చా. నన్ను చిన్నప్పుడెప్పుడో చూశారు. గుర్తుండను లెండి. ఇకాతే కా హమారా గామ్ దోయే ద్యూరే’’ అన్నాడు. అసలే కంగారులో ఉన్న విఘ్నేశ్వరి ఈ అర్థంగాని భాషతో ఇంకా కంగారుపడిపోయింది. ‘‘ఇది బెంగాలీ భాషమ్మా. అంటే ఇక్కడ నుంచీ మన ఊరు రెండు మైళ్లు ఉంటుందని అర్థం’’ అని వివరణ ఇచ్చాడు తికమక.

విఘ్నేశ్వరి ట్రాక్టర్ ఎక్కింది. తికమక ట్రాక్టర్‌ని ఊరు వైపు పరుగులెత్తిస్తూ ‘‘ఇంగానా పత్తు నిమిషం నమ్మూరు పోయిదం’’ అన్నాడు. ‘‘ఇదేం భాష?’’ అని ఆమెలో మళ్లీ ఆశ్చర్యం. ‘‘మలయాళం... అంటే పది నిమిషాల్లో ఇక్కడ నుంచీ వెళ్లిపోతామని అర్థం...’’ చెప్పాడు తికమక. ‘‘నీ పేరేంటి?’’ అడిగింది విఘ్నేశ్వరి.‘‘తికమక’’ అని చెప్పాడతను.‘‘ఏ భాషలో?’’ అని తికమకగా అడిగింది విఘ్నేశ్వరి. ‘‘అన్ని భాషల్లోనూ. తెలుగుకి ‘తి’, కన్నడకు ‘క’, మలయాళానికి ‘మ’, కొంకణికి ‘క’. ఆ భాషల పట్ల గౌరవంతో నా పేరుని ఇలా పెట్టుకున్నా. మీకు బోర్ అనిపించకపోతే నా గురించి కొంత చెప్పాలి. నేను మిలట్రీలో వంటవాడిగా పని చేసి, అంట్లు తోమలేక ఆ పని మానేశాను. అక్కడుండగా అన్ని భాషల సైనికులతో మాట్లాడ్డం కోసం ఈ భాషలన్నీ నేర్చుకున్నా. ఇప్పుడు నేను 14 భారతీయ భాషలు మాట్లాడగలను. 4 భాషలు రాయగలను. ఇదీ నా ఫ్లాష్‌బ్యాక్’’ అని తికమక చెప్పడం పూర్తయ్యేసరికి ఇల్లు వచ్చేసింది. విఘ్నేశ్వరి ట్రాక్టర్ మీద నుంచి దిగి, ఆ ఇంటిని కళ్లు పెద్దవి చేసి మరీ చూసింది.

‘‘ఇదేనమ్మా మీ ఇల్లు. 50 గదులు... 101 గుమ్మాలు... 151 అద్దాలున్న బంగ్లా... మీరు ఇక్కడే పెరిగారనుకోండి. మరిచిపోయారనుకుని ఊరకనే చెబుతున్నా. వెల్‌కమ్... ఇంగ్లీష్. ఏవా ఏవా... మరాఠీ. దయచేయండి... తెలుగు, వాంగో.. తమిళ్’’అంటూ విఘ్నేశ్వరిని లోపలకు తీసుకెళ్లాడు తికమక. అక్కడ సర్వానందం వేయికళ్లతో వెయిటింగ్. కళ్లు కనబడకపోయినా, చెవులు వినబడకపోయినా విఘ్వేశ్వరిని చూసి సంబరపడిపోయాడా పెద్దాయన. ‘‘ప్రయాణం చేసి అలిసిపోయుంటావ్. గదిలోకెళ్లి రెస్ట్ తీసుకోమ్మా’’ అని ఆమెకు గదిని చూపించమని తికమకకు పురమాయించాడాయన. తికమక ఆమెనో గదిలోకి తీసుకెళ్లి ‘‘దిసీజ్ యువర్ రూమ్... ఇంగ్లీషు. యే ఆప్ కా కమరా హై... హిందీ. యే తుమ్‌కో రూమ్... మరాఠీ. ఇదు ఉంగళ్ రూమ్... తమిళ్. ఇది నిమ్మ రూమ్... కన్నడ. ఇది మీ గది... తెలుగు’’ అని చెప్పేసి వెళ్లిపోయాడు.

 
ఇప్పుడర్థమైందిగా తికమక కేరెక్టరైజేషన్. ఆ ఇంట్లో వాళ్లకు అతను తలలో నాలుక. నచ్చనివాళ్లకు తలలో పేను. సర్వానందంగారికి నమ్మినబంటు.ఇక్కడో ఫ్లాష్‌బ్యాక్ చెప్పాలి. చిన్నతనంలోనే విఘ్నేశ్వరిని, వెంకట శివంకిచ్చి పెళ్లి చేయిస్తారు సర్వానందంగారు. విఘ్నేశ్వరికి, వెంకట శివానికి మధ్య ఉప్పుకు నిప్పుకు ఉన్నంత వైరం. ఇద్దరూ వేర్వేరు చోట్ల పెరిగి పెద్దవుతారు. వారినెలాగైనా మళ్లీ కలపాలని సర్వానందంగారి చివరి కోరిక. వాళ్లిద్దరూ సిటీ నుంచి ఈ పల్లెటూరికొస్తారు. కానీ వారిద్దరూ రియల్ కాదు. తమ ఫ్రెండ్‌షిప్ కోసం వచ్చి ఇద్దరూ ఇరుక్కున్నారు. తప్పించుకుందామని చూస్తే ‘గూఢచారి 116’లాగా తికమక. ఫైనల్‌గా ఓ రాత్రి ఇద్దరూ గేటు దూకి పారిపోబోతుంటే లటిక్కిన పట్టేసుకుని సర్వానందం ముందు నిలబెట్టాడు తికమక.‘‘దూజన బావనే జాత్... బెంగాలీ. దస్గయా... పంజాబీ. తప్పిచ్చుక్కు హోహోడుగురు... కన్నడ. పారిపోతున్నారు.... తెలుగు’’ అని పెద్దాయనకు చెప్పాడు. వాళ్లిద్దరూ తికమకను కొరకొరా చూశారు. తికమక ఒకటే భాషలో నవ్వాడు. నవ్వు ఏ భాషలోనైనా ఒకటే కదా. తెలుగులో ఒకలాగా, తమిళంలో ఒకలాగా నవ్వు ఉండదు కదా. ఏది ఏమైనా తికమక లాంటి నమ్మినబంటు దొరికితే ఎవరికైనా... రొంబ సంతోషం... తమిళం. జాస్త్ ఆనంది... మరాఠీ. చాలా సంతోషం... తెలుగు.
 - పులగం చిన్నారాయణ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement