Rallapalli Venkata Narasimha Rao
-
అప్పులబాధతో ఇంటిసామాన్లు అమ్మిన కమెడియన్.. ఎడమచేత్తో!
ఎక్కువమందికి కుడిచేతి వాటం, చాలా తక్కువమందికి ఎడమచేతి వాటం ఉంటుంది. కమెడియన్ రాళ్లపల్లి వెంకట నరసింహారావుది కుడిచేతివాటం.. కానీ ఆయన ఎడమచేత్తో భోజనం చేసేవారట! అంతేకాదు, పొరపాటున ఆయన తినేటప్పుడు ఎవరైనా అదేంటి? ఎడమ చేతితో భోజనం చేస్తున్నారు? అని అడిగారంటే వెంటనే తింటున్న ప్లేటు పక్కన పడేసి చేతులు కడుక్కునేవారట! ఎందుకయా.. అంటే తాను భోజనం చేసేటప్పుడు ఎవరైనా ఎడమచేత్తో తింటున్నావేంటని ప్రశ్నిస్తే ఆ భోజనాన్ని వదిలేస్తాను, ఇది నియమంగా పెట్టుకున్నాను అని గతంలో చెప్పారు. ఎవరైనా అడిగితే.. ఇదేం నియమం? అన్న ప్రశ్నకు.. ప్రతిసారి లెఫ్ట్ హ్యాండ్‌తోనే తింటానని అయ్యప్ప దేవునికి మొక్కుకున్నాను. మధ్యలో ఎవరైనా దానిగురించి అడిగితే అన్నం తినకుండా లేచేస్తాను. నేను అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు ఈ నియమాన్ని దీక్షగా కొనసాగిస్తాను అని తెలిపారు. కానీ ఆ లక్ష్యమేంటనేది చెప్పలేదు. ఒకవేళ లక్ష్యం నెరవేరకపోతే జీవితాంతం ఇదే పాటిస్తానని నిర్ణయించుకోవడం గమనార్హం. ప్రతి ఏడాది.. బీకామ్ చదివిన రాళ్లపల్లి రైల్వేలో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఈయన అయ్యప్ప భక్తుడు. తన జీవితంలో దాదాపు 28 సార్లు శబరిమల వెళ్లారు. ఆగస్టు 15 ఆయన జన్మదినం. ప్రతి ఏడాది ఆరోజు ఓ పేదకళాకారుడికి సన్మానం చేసి 50 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలోనూ ఈ నియమాన్ని తప్పలేదు. నాటకాలంటే ఆయనకు ప్రాణం.. ఒకానొక దశలో వాటికోసం అప్పులు కూడా చేశారు. ఏ స్థాయిలో అంటే ఓసారి ఇంట్లోని సోఫాను కూడా అమ్మేశారు. అప్పులవాళ్ల భయంతో ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్లేవారు. ఇవన్నీ ఆయన శిష్యుడు తనికెళ్ల భరణి కళ్లారా చూశాడు. డబ్బు కోసం అంతలా ఇబ్బందిపడ్డారు. సినీ ఇండస్ట్రీకి వచ్చాకే ఆర్థిక పరిస్థితి మెరుగైంది. అదే బలహీనత ఆయనకున్న బలహీనత దానం చేయడం.. ఎంతోమందిని చదివించారు, పెళ్లిళ్లు చేశారు. ఆయన మంచితనాన్ని సొమ్ము చేసుకున్నవారూ ఉన్నారు. రాళ్లపల్లి జీవితంలో అత్యంత విషాదకర ఘటన.. పెద్ద కూతురు విజయమాధురి మరణం.. డాక్టర్ చదువు కోసం రష్యా వెళ్తూ చనిపోయింది. ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్తుండగా.. ఆ జర్నీలో తనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ఆగ్రా రీచ్ అయ్యేలోపు చనిపోయింది. నీ పుట్టుకకు, నీ చావుకు కారణం నేనే అంటూ రాళ్లపల్లి గుండె పగిలేలా ఏడ్చారు. కూతుర్ని డాక్టర్ చేయాలన్నది ఆయన కల.. అందుకోసమే రష్యా పంపించాలనుకున్నారు. ఇంతలోనే కూతురు మరణించడంతో మానసికంగా కుంగిపోయారు. రాళ్లపల్లి సినిమాల సంగతి.. రాళ్లపల్లి స్త్రీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు. శుభలేఖ, బడాయి బసవయ్య, జగన్నాథ రథచక్రాలు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, అగ్నిపుత్రుడు, భలే మొగుడు, బామ్మ మాట బంగారు బాట, కూలీ నెం.1, చంద్రలేఖ, కలిసుందాం రా, నిన్ను చూడాలని, సింహాద్రి, నా అల్లుడు.. ఇలా అనేక సినిమాల్లో నటించారు. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకుని అందుకోసం విశేషంగా కృషి చేశారు. రెండు నంది అవార్డులు అందుకున్న ఈ అనంతపురవాసి 2019 మేలో కన్నుమూశారు. చదవండి: పేద ప్రజల కోసం రజనీకాంత్ బిగ్ ప్లాన్..? -
రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..
‘ఆయన స్ఫటికం’ అంటారు తనికెళ్ల భరణి. క్రిస్టల్ క్లియర్ అని. ఆ స్ఫటికంలో తనని తాను చూసుకున్నారు.తనని మాత్రమే కాదు..తనకో ఆదర్శాన్నీ.. తనకో అయ్యప్పనీ..తనకో గురువుగారినీ.. చూసుకున్నారు. ఇప్పుడు ఆయన జ్ఞాపకాల్నితడికళ్లతో తడిమి తడిమి చూసుకుంటున్నారు.రాళ్లపల్లితో మొదలైన తనికెళ్ల ప్రయాణంలో..ఎన్నో మలుపులు..మరపురాని మరెన్నో తలపులు.చదవండి. సాక్షి ఎక్స్‌క్లూజివ్. రాళ్లపల్లిగారితో మీ పరిచయం గురించి..? తనికెళ్ల భరణి: అప్పుడు నేను హైదరాబాద్‌లోని రైల్వే కాలేజీలో చదువుతున్నాను. కాలేజీలో ఓ నాటకం వేయాల్సి వచ్చింది. ‘అద్దె కొంప’ అనే నాటకం. నేను రాసిందే. స్వీయానుభవాలతో రాసిన ఆ నాటకానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ దెబ్బతో మా చదువులు నాశనం. ఎప్పుడైతే నాటకం క్లిక్ అయిందో అప్పుడే సీతాఫల్ మండిలో ‘నవీన్ కళామందిర్’ అని ఓ నాటక సమాజాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. అప్పుడు నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా నాటకానికి రాళ్లపల్లిగారిని పిలవాలనుకున్నాం. అప్పటికి ఆయనకు పెళ్లి జరిగి 14 రోజులే అయింది. మేం వెళ్లి ‘మీరు రావాలి సార్’ అన్నాం. ‘నాటకం కదా వస్తాను లే’ అన్నారు. ఆయనతో నా పరిచయం అదే. రాళ్లపల్లిగారు వస్తున్నారంటే ఒక ఉద్వేగం. స్టేజి మీద ‘ఇప్పుడు రాళ్లపల్లిగారు స్వగతంగా మాట్లాడతారు’ అన్నాను. ‘లేదు. ప్రకాశంగానే మాట్లాడతాను’ అని మొదలుపెట్టారాయన. ఆ తర్వాత నుంచి కాలేజీకి వచ్చిపోయేప్పుడు రాళ్లపల్లిగారింట్లో గడపడం అలవాటై అక్కడే ఉండిపోయేంతగా దగ్గరైపోయాను. నాటక రంగంలో అప్పటికే ఆయన పాపులరా? అవును. ఆయన అప్పటికే ‘సాంగ్ అండ్ డ్రామా డివిజన్’ అనే ప్రభుత్వ సంస్థలో పని చేస్తున్నారు. ఆయనా బీకామ్ చదివారు. కానీ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్‌తో రైల్వేలో క్లాస్ ఫోర్ జాబ్ వచ్చింది. ఆ తర్వాత సాంగ్ అండ్ డ్రామా డివిజన్‌కు వచ్చారు. నాకు తెలిసి అప్పట్లో సీతాఫల్మండి ప్రాంతంలో ‘అయ్యప్ప స్వామి’ గురించి ప్రచారం చేసినవారిలో రాళ్లపల్లిగారు మొదటివారు. అక్కడ ఓ తమిళియన్ ఉండేవారు. ఆయన శబరిమల వెళుతుండేవారు. అది తెలిసి ఈయన అయ్యప్ప గురించి చెప్పడం మొదలుపెట్టారు. రాళ్లపల్లిగారు 28సార్లు శబరిమల వెళ్లారు. ఆయన ద్వారా శబరిమలకు వెళ్లడం మాకూ అలవాటైంది. మా అనుబంధం ఎంత గాఢతను సంతరించుకుందంటే.. నేను నాటకాల్లో ఎక్కువగా నటిస్తున్నానని మా నాన్నగారు ఇంట్లో నుంచి గెంటివేశారు. అప్పుడు రాళ్లపల్లిగారి ఇంటికి వెళ్లాను. అక్కడే ఉండేవాణ్ణి. రాళ్లపల్లిగారి నాటకాలకి స్పందన ఎలా ఉండేది? విపరీతమైన ప్రేక్షకాదరణ ఉండేది. వైజాగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉంది కదా. అక్కడి నాటకాల అధినేత మంత్రి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ‘కన్యాశుల్కం’ నాటకాన్ని రవీంద్రభారతిలో రాష్ట్రపతి ముందు ప్రదర్శించారు. చాలా కీర్తిప్రతిష్టలు వచ్చాయి. రాళ్లపల్లిగారు కన్యాశుల్కం, వరకట్నం వంటి నాటకాలు వేస్తే కచ్చితంగా వన్స్మోర్లు వచ్చేవి.ఒక మనిషి ఇంతలా ఓ పాత్రలో ఒదిగిపోగలరా? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయే స్థాయిలో ఆయన నటించేవారు.ఆయన నాటక వైభవాన్ని చూశాం మేం. ప్రతి సంవత్సరం ఆయన నాటకం వేసేవారు. ఆగస్ట్ 15 ఆయన పుట్టినరోజు. ఆ రోజు ఓ పేద కళాకారుడికి సన్మానం చేసి 50 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆయన ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. 50 వేలు ఎలా? అప్పు చేసేవారో ఏమో కానీ 50 వేల రూపాయలు ఇచ్చేవారు. లాస్ట్ ఇయర్ దాకా ఇచ్చారు. ఆయన నాటకాలు తీసే విధానం చాలా గొప్పగా ఉండేదట? అవును. నాటకం చేస్తే ప్రాణం పెట్టేవారు. 5 గంటలకు అంటే సరిగ్గా ఆ టైమ్‌కే రిహార్సల్ మొదలుపెట్టాలి. అది కూడా ఒక వైభవంగా ఉండేది. సినిమా లెవల్లో ఉండేది. ఖర్చంతా ఆయనదే. అన్నీ లెక్క వేసి.. వెయ్యి రూపాయిలు ప్రొడక్షన్ వస్తుంటే ఖర్చు 3 వేలు ఉండేది. అయితే ఆయన దగ్గర నేను నేర్చుకున్నదేంటంటే ఎప్పుడైతే నాటకం ఇలా అయిపోయిందో, ఎప్పుడైతే ఆయన ఇండస్ట్రీకి వెళ్లారో నాటకానికి ఇంత ఖర్చు చేయడం అనవసరం అని నేను అనుకున్నాను. ప్రయోగాత్మకంగా ఐదు రూపాయలతో మొదలెట్టా. ఖర్చు తగ్గించా. మ్యూజిక్ తీసేశా. ఉధృతంగా, ఉద్యమంలా నాటకాలు వేసేవాళ్లం. రాళ్లపల్లిగారిని మీరు ఏమని పిలిచేవారు? గురువుగారూ అని పిలిచేవాణ్ణి. ‘ఏమయ్యా... భరణీ’ అనేవారు. గురువుగారి భార్యను ‘మాస్టారు’ అని పిలిచేవాళ్లం. ఎందుకంటే ఆమె టీచర్. వాళ్లది చాలా అన్యోన్యమైన దాంపత్యం. నిజం చెప్పాలంటే వారి ఇల్లు ఒక సత్రంలా ఉండేది. టిఫిన్లు.. భోజనాలు.. కాఫీలు.. టీలు ఇలా వచ్చినవాళ్లందరికీ సమకూరుస్తుండేవాళ్లు. నాటకాలంటే గురువుగారికి ఎంత మమకారం అంటే.. ఒకానొక దశలో వాటి కోసం అప్పులు చేయడం ప్రారంభించారు. ఏ స్థాయిలో అప్పులు అంటే.. ఆయన ఇంట్లో నుంచి ఓసారి ఓ సోఫాను నా కళ్లముందు నుంచి పట్టుకుపోయారు. డబ్బు కోసం ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డారు. ‘పర్లేదు.. గురువుగారూ.. మేం ఉన్నాం’ అని చెప్పేవాళ్లం. అయితే అప్పుడు మేం నిరుద్యోగులం. ఆయన నేతృత్వంలో నాటకాలు వేసేవాళ్లం. పరమ పరాకాష్ట ఏంటంటే... అప్పులవాళ్ల బాధ భరించలేక ఒకసారి ఇంటికి సైకిల్ మీద వచ్చి వెనక గుమ్మం మీద నుంచి దిగి మేడ మీదకు వచ్చి కోడిగుడ్డు సైజ్ దీపం పెట్టి... ‘ముగింపు లేని కథ’ అనే నాటకం రాశారు. దాదాపు మేం వందసార్లు ఆ నాటకాన్ని ప్రదర్శించాం. వేసిన ప్రతిసారీ ‘ఉత్తమ నాటకం’ అనిపించుకుంది. అప్పుడు నాకు 25 ఏళ్లు ఉంటాయి. అందులో నేను 70 ఏళ్లకు పైబడిన మామ పాత్ర చేశాను. ప్రదర్శించిన వందసార్లూ ఆ పాత్ర వేయడం ఓ మరచిపోలేని అనుభూతి. మీ గురువుగారి సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ గురించి? ‘స్త్రీ’ అనే సినిమాలో చిన్న వేషం వచ్చింది. చిన్నదైనా సినిమాల్లోకి వెళుతున్నారంటే గొప్ప కదా. మేమంతా రాళ్లపల్లిగారిని సీతాఫల్ మండిలో రిక్షాలో కూర్చోబెట్టుకుని, మేం అటూ ఇటూ కూర్చొని, అదే.. మాకు మెర్సిడెస్ బెంజ్.. ఆయన్ను తీసుకెళ్లి ట్రైన్ ఎక్కించాం. అమ్మగారి (రాళ్లపల్లిగారి సతీమణి) గురించి బాధపడవద్దు అని చెప్పాం. మీ గురువుగారితో మీరు పంచుకున్న ‘బెస్ట్ మూమెంట్స్’లో మరచిపోలేనివి ఏమైనా..? చాలా ఉన్నాయి. అప్పుడు నేను నిరుద్యోగిని. గురువుగారు సాంగ్ అండ్ డ్రామా కంపెనీకి సీతాఫల్ మండి నుంచి సైకిల్ వేసుకుని సోమాజిగూడ వెళ్లేవారు. వెళ్లేటప్పుడు నన్ను ముందు కూర్చోబెట్టుకుని పద్యాలు పాడుకుంటూ సైకిల్ తొక్కేవారు. సాయంత్రం నేను ఆయన్ను కూర్చోబెట్టుకుని సైకిల్‌పై సీతాఫల్ మండి నుంచి తీసుకొచ్చేవాణ్ణి. పేదరికం.. ఆ మధ్యతరగతి జీవితం.. ఇలా అన్నీ కలిసి ఎంజాయ్ చేశాం. ఈయనకు బేసిక్‌గా ఉన్న వ్యసనం, బలహీనత ‘దానం’ చేయడం. మన దగ్గర 1000 రూపాయలు ఉంటే.. వంద రూపాయలు ఇవ్వడం దానం. 500 ఇవ్వడం అపూర్వం. కానీ వెయ్యి రూపాయలు దానం చేయడం అంటే.. అది గురువుగారే చేయగలరు. ఆయన శిష్యుల్లో ఎవరూ అలా ఉన్నదంతా దానం చేసేయకూడదని చెప్పలేదా? గొప్ప గొప్పవారు ఏదైనా చేస్తుంటే చూసి నేర్చుకోవాలి కానీ ఎందుకు అని అగడకూడదు. ఆయన తత్వం అది. ఊటీలో షూటింగ్ జరుగుతోంది ఓసారి. అప్పటికి ఆయన సినిమాకు పదివేల రూపాయలు పారితోషికం తీసుకునేవారు. ఆ షూటింగ్లో వందమంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ చలికి వణికిపోతున్నారు. అది చూసిన రాళ్లపల్లిగారు చలించిపోయి తనకు రావాల్సిన డబ్బులను ముందుగానే నిర్మాత నుంచి తీసుకుని ఆ డబ్బులతో వారికి షాల్స్ కొని తీసుకువచ్చారు. ఇలాంటి ఓ వెయ్యి సంఘటనలను నేను చెప్పగలను. ఎంతోమందిని చదివించారు, పెళ్లిళ్లు చేశారు. ఎన్నో దానాలు చేశారు. ఆయన మంచితనాన్ని సొమ్ము చేసుకున్నవారూ ఉన్నారు. నాకు కోపం వచ్చేది. కానీ ఆయనకు దానం ఓ వ్యసనం. కర్ణుడిలా అన్నమాట. అప్పట్లో ఆటోవాళ్లు కొట్టుకునేవారు ఆయన్ను తీసుకెళ్లడానికి. మీటర్ 100 అయితే 500 ఇచ్చేవారు. ఆయన ‘స్ఫటికం’లాంటి వ్యక్తి. ‘క్రిస్టల్ క్లియర్’ అంటారు కదా అలా. డబ్బు ఉన్నా లేకున్నా ఆయన సంతోషానికి కొదవ ఉండేది కాదు. మా గురువుగారు ‘నిత్య సంతోషి’. మీ సినిమా కెరీర్... మీరు రచించి, రాళ్లపల్లిగారు నటుడిగా చేసిన సినిమాల గురించి? నేను చెన్నై వెళ్లినప్పుడు ఓ సందర్భంలో గురువుగారు దర్శకుడు వంశీకి నన్ను పరిచయం చేశారు. ఆయన నాకు కథ చెప్పి కొన్ని రోజులు టైమ్ ఇచ్చి ఏడు సీన్లు రాసుకుని తీసుకు రమ్మన్నారు. నేను చాలా స్పీడ్‌గా ఉండేవాణ్ణి. వంశీ ఉదయం చెప్పగానే నేను సాయంత్రానికల్లా ఏడు సీన్లు రాసేశాను. అయితే నా సినిమా కెరీర్ మొదలైంది సుమన్ నటించిన ‘కంచు కవచం’తో. ఆ సినిమాకు రచయితగా, నటుడిగా చేశాను. ఆ తర్వాత వంశీ ‘ఆలాపన, లేడీస్ టైలర్’.. చేశాను. ‘లేడీస్ టైలర్’ సూపర్ హిట్. అప్పట్నుంచి రైటర్‌గా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాళ్లపల్లి గారివి కూడా వీటిలో చాలా మంచి పాత్రలు.ఓ తమాషా సంఘటన చెబుతాను. వంశీగారి ప్రతి సినిమాలో రాళ్లపల్లిగారు ఉంటారు. ఓ సినిమా కథ రాస్తున్నప్పుడు ఓ పాత్రకు రాళ్లపల్లిగారి పేరు రాశారు వంశీ. ఆ పేరు కొట్టేసి నేను ఇంకో పేరు రాసి, వేరే పాత్ర (బోయవాడి)కు గురువుగారి పేరు రాశాను. అప్పుడు వంశీ ‘ఆయన ఇంట్లో ఉంటూ ఆయన తిండి తింటూ మీ గురువుగారి పేరు కొట్టేశావేంటి? ఆయనకు ద్రోహం చేస్తున్నావేంటి?’ అన్నారు. లేదు సార్.. ఆ వేషం బాగుంటుంది అన్నాను. ఆ పాత్ర గురువుగారికి నిజంగా మంచి పేరు తెచ్చింది. రాళ్లపల్లిగారు బాగా వంట చేస్తారట? అవును. వంట సంగతి అడిగితే ఓ సంఘటన గుర్తొచ్చింది. ఓసారి గురువుగారి భార్య పుట్టింటికి వెళ్లారు. రవీంద్రభారతిలో నాటకం అయిపోయి మేం ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయింది. స్టవ్ ఉంది. బియ్యం కడిగాం. చూస్తే అగ్గిపెట్టె లేదు. ఎలాగా అనుకున్నాం. ఆయనకో అలవాటు ఉండేది. చెవిలో అగ్గిపుల్లలు పెట్టుకుని తిప్పేవారు. దాన్ని అలా పైకి విసిరేవారు. అది గుర్తొచ్చి అటకమీద చూస్తే రెండు అగ్గిపుల్లలు ఉన్నాయి. వాటిలో ఒకటి బాగుంది. ఒక్క అగ్గిపుల్లతో స్టవ్ వెలిగించాలి. వెలిగించలేకపోతే ఆ రోజు పస్తే. మీరు వెలిగించండి సార్ అన్నాను. నేను వెలిగించడం మిస్సయిందనుకోండి.. నా వల్ల పస్తు ఉండాల్సి వస్తుందేమో అని టెన్షన్. మొత్తానికి వెలిగించాం. ఆ రోజు భోజనం తిన్నాం. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. వంట అద్భుతంగా చేసేవారు. షూటింగ్లో ఈయన సీన్స్ ముందుగా తీసి, ఏదోటి చేసి పెట్టవయ్యా అనేవారు దర్శకులు. ఆయన ఇష్టాలేంటి? డప్పు బాగా కొట్టగలరు. సంగీతం బాగా వింటారు. పాటలు, పద్యాలు చాలా అందంగా పాడతారు. వంట చేయడం సరే సరి. వాటితోపాటు ఆయనకు ఎప్పటికైనా ఒక్క ఇంటర్నేషనల్ అవార్డ్ తీసుకోవాలనే కోరిక ఉండేది. మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శిష్యులను అడిగేవారా? ఏనాడూ అడిగింది లేదు. ఆ ఇంట్లో మనిషిగా నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే డబ్బు లేక నేను ఇబ్బందిపడతానని, ఫీల్ అవుతానని నేను నిద్ర లేవక ముందే నా వెనక జేబులోనో, పర్స్లోనో డబ్బులు పెట్టేవారు. (గద్గద స్వరంతో, చెమర్చిన కళ్లతో కాసేపు మౌనం). చెబితే అతిశయోక్తి అనిపిస్తుంది కానీ నేను శబరిమల వెళ్తుండేవాణ్ణి. నా ముందు మా గురువుగారు ఉండేవారు. ఆయనే నాకు అయ్యప్పలా కనిపిస్తుండేవారు. ఏ మాత్రం కల్మషం లేని వ్యక్తి. ప్యూర్ హ్యూమన్. పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అనుకునేవారా? లౌకికం కొంచెం తక్కువ. ఎప్పుడైతే కూతురు పోయిందో డిటాచ్ అయిపోయారు. ఆ తర్వాత అంతా పరమేశ్వరుడే చూసుకున్నాడు. దైవ భక్తి చాలా ఎక్కువేమో? బాగా. 28 సార్లు శబరికి వెళ్లారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటికి ‘మహాతేజ’ అని పేరు పెట్టుకున్నారు. అంటే.. అయ్యప్ప పేరు. ఆ పేరుని నేను మా అబ్బాయికి పెట్టాను. పిల్లాడ్ని తీసుకెళ్లి ఆయన ఒళ్లో పడుకోబెట్టి ‘మీరే పిలవండి సార్’ అన్నాను. రాళ్లపల్లిగారి ఆరోగ్యం ఎప్పుడు దెబ్బతింది? మీరు చివరిసారిగా ఎప్పుడు కలిశారు? కూతురు చనిపోయాక కుంగిపోయారు. 10 ఏళ్ల క్రితం కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది. అయినా గమ్మత్తేటంటే పోయిన వారం ఇంటికి వెళ్లినప్పుడు కూడా ఉత్సాహంగానే ఉన్నారు. ఉదయాన్నే నిద్ర లేవడం ఆయనకు అలవాటు. గంధం బొట్టు పెట్టుకుంటారు. వారం క్రితం ఉత్సాహంగా మాట్లాడిన వ్యక్తి ఇలా హఠాత్తుగా దూరం అవుతారని అనుకోం కదా. ఈ బాధను మాటల్లో చెప్పలేను (చెమర్చిన కళ్లతో). మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జరిగిన ఏదైనా ఓ సంఘటన గురించి? ఏదో ఫంక్షన్‌కి వెళ్లాం. నేను, నా ఫ్యామిలీ ఆయనతో పాటు వెళ్తున్నాం. మా పాప నోట్లో పాలపీక ఉంది. అది పడిపోయింది ఎక్కడో. ఇక గోల. పాలపీక కొనడానికి డబ్బులు లేవు. పీక పావలా అన్నమాట. పావలా కోసం ఇల్లంతా వెతికాను. ఆ తర్వాత గురువుగారే వెళ్లి ఓ ఫ్రెండ్ ఇంటి తలుపు కొడితే 20 రూపాయిలు ఇచ్చారు. పాల పీక కొని, మిగతా డబ్బుని అప్పటికప్పుడు ఖర్చు పెట్టేశారు. నటుడిగా మీ గురువుగారి దగ్గర మీరు పొందిన ప్రశంసలు? ‘ముగింపు లేని కథ’ నాటకంలో గురువుగారిది హీరో పాత్ర. ఇంకో వారంలో నాటకం వేయాలి. ఆయనకు సినిమా అవకాశం వచ్చి వెళ్లిపోయారు. నాటకానికి మళ్లీ రావాలి. అసలే కాంపిటీషన్. పోటీకి నాలుగు రోజులు ఉండగా టెలిగ్రామ్ పంపారు. ‘నేను రాలేపోతున్నాను. గాడ్ బ్లెస్ యు. బాగా చేయండి’ అని. నా గుండె ఆగిపోయింది. ఆ వేషం ఎవరు వేయాలి? అప్పుడు నా వేషం ఇంకొకరికి ఇచ్చి ఆయన పాత్ర నేను వేశా. అది నాకు పెద్ద చాలెంజ్. రాళ్లపల్లి గారి నాటకంలో ఆయనకే ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. అంత పెద్ద పాత్ర ఎలా వేయాలా అని రాత్రింబవళ్లు ప్రాక్టీస్ చేసి వేశాను. బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. ఆ అవార్డ్ తీసుకెళ్లి ఇది నా తరఫున ‘గురుదక్షిణ సార్’ అని చెప్పాను. చాలా సంతోషపడ్డారు.మామూలుగా శిష్యులకు పేరు వస్తుంటే కొందరు గురువులు అసూయపడతారు. అసూయ ఉండొచ్చేమో. కానీ ఆయన నా పట్లే కాదు ఎవరి పట్లా అసూయ పడేవారు కాదు. ఆయన మంచి రైజ్‌లో ఉన్నప్పుడు ఎవరో ఒకరిని రికమండ్ చేస్తుండేవారు. రాళ్లపల్లిగారి జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఆయన పెద్ద కుమార్తె విజయ మాధురి మరణం. ఆ తర్వాత చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయారట? ఆ అమ్మాయి డాక్టర్ చదువు కోసం రష్యాకు వెళ్తూ చనిపోయింది. ఢిల్లీ వరకూ ఫ్లైట్‌లో పంపించే స్తోమత ఆయనకు ఉంది. స్టూడెంట్స్ అందరూ ట్రైన్లో వెళ్తారు. పరిచయాలు అవుతాయని ట్రైన్లో వెళ్లింది. తనతో పాటుగా వాళ్ల మేనమామ వెళ్లారు. వరంగల్‌లో ఎక్కడో దిగిపోయారాయన. జర్నీలో తనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ఆగ్రా రీచ్ అయ్యే ముందే చనిపోయింది. కూతురి భౌతికకాయాన్ని చూసి, ‘నీ పుట్టుకకు, నీ చావుకి కారణం అయింది కూడా నేనే’ అంటూ చాలా ఏడ్చారు. కూతుర్ని డాక్టర్ని చేయాలన్నది ఆయన కల. అందుకే రష్యా పంపించాలనుకున్నారు. కూతురి మరణం తర్వాత మానసికంగా కుంగిపోయారు. ప్రతి ఒక్కరికీ మానసికంగా.. ఎందుకు? ఎందుకు? అని డిప్రెషన్లో ఉన్న టైమ్‌లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ ట్విస్ట్ వస్తుంది. గురువుగారి రెండో అమ్మాయికి పెళ్లి అయింది. కొడుకు లాంటి అల్లుడు దొరికాడు. అక్కడ నుంచి ఆయన మానసికంగా కొంచెం పుంజుకోవడం మొదలెట్టారు. అల్లుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. చిన్నమ్మాయి, అల్లుడు అమెరికాలో ఉంటారు. అమ్మాయి వచ్చేసింది. అల్లుడు నాకు ఫోన్ చేసి, ‘నేను వచ్చే వరకూ ఉంచుతారా’ అని చాలా వేడుకోలుగా అడిగాడు. చాలా బాధ కలిగింది. అది గొప్ప విషయం కూడా. అలాంటి అల్లుడు దొరకడం అదృష్టం. అల్లుడి కోసమే గురువుగారి అంత్యక్రియలు 20న అనుకున్నాం. -
రత్నంలాంటి నటుడు
సినిమాల్లో వేషాలు కావాలంటే ఎలా అడగాలి? ఉన్న ప్లస్ పాయింట్లన్నీ చెప్పాలి. కానీ ‘నా ఎత్తు ఆరడుగులు ఉండదు. నా ముఖం అందంగా ఉండదు’ అని మైనస్ పాయింట్లు చెప్పుకుంటారా? రాళ్లపల్లి చెప్పారు. ఈ రెండు మైనస్లతో పాటు ఒక ప్లస్ చెప్పారు. ‘15 ఏళ్ల రంగస్థలం అనుభవం ఉంది’.. ఇదొక్కటే రాళ్లపల్లి ప్లస్ పాయింట్. మైనస్, ప్లస్ రాసి దర్శకుడు ప్రత్యగాత్మకి ఓ జాబు పంపించారు రాళ్లపల్లి. ఆ ఉత్తరం ప్రత్యగాత్మకి నచ్చింది. రాళ్లపల్లికి కబురు వచ్చింది. హైదరాబాద్ నుంచి మద్రాస్ రైలెక్కారు రాళ్లపల్లి. అది ప్రసాద్ స్టూడియో. రచయిత సి. నారాయణరెడ్డి (సినారె), దర్శకుడు ప్రత్యగాత్మ కూర్చుని ఉన్నారు. ‘ఏదీ నువ్వు చేసిన నాటకాల్లో ఒక్క డైలాగ్ చెప్పు’ అన్నారు. చెప్పారు రాళ్లపల్లి. ‘పనికొస్తాడు’ అని కితాబు ఇచ్చారు సినారె. ఓకే అన్నారు ప్రత్యగాత్మ. ‘స్త్రీ’ (1973) చిత్రంలో అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి ‘భలే భలే మగాడివోయ్’ (2015) వరకూ దాదాపు 850 చిత్రాల్లో నటించిన రాళ్లపల్లి (73) ఇక లేరు. కొంత కాలంగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. అనంతపురం జిల్లాలోని కంబదూరులో 1945 ఆగస్ట్ 15న జన్మించారు రాళ్లపల్లి వెంకట నరసింహారావు. 1958లోనే హైదరాబాద్‌లో వీరి కుటుంబం స్థిరపడింది. చిన్నప్పటి నుంచి రాళ్లపల్లికి నాటక రంగంపట్ల ఆసక్తి ఎక్కువ. పదో తరగతిలో ఉన్నప్పుడే ‘కన్యాశుల్కం’ నాటకం ద్వారా రంగస్థల ప్రవేశం చేశారు. చదువుకుంటూ, నాటకాల్లో నటిస్తూ బీఎస్సీ పూర్తి చేశారు. నటుడే కాదు రాళ్లపల్లిలో మంచి రచయిత కూడా ఉన్నారు. కాలేజీ రోజుల్లో ఆయన రాసి, నటించిన ‘మారని సంసారం’ నాటికకు ఉత్తమ రచన, నటుడు అవార్డులు లభించాయి. అప్పటి బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి చేతుల మీదుగా అ అవార్డులు అందుకున్నారాయన. బీఎస్సీ పూర్తయ్యాక తన అన్నయ్య సలహా మేరకు రైల్వేలో ప్యూన్ జాబ్‌లో చేరారు రాళ్లపల్లి. కుర్చీలు, బల్లలు తుడవడం, కాఫీ కప్పులు కడగడం.. ఇలా అన్నీ చేశారు. ఓ సందర్భంలో పై అధికారి ఏదో అంటే సీరియస్‌గా ఇంగ్లిష్‌లో సమాధానం చెప్పారు రాళ్లపల్లి. ఆ తర్వాత ఆయన రాళ్లపల్లి వివరాలు కనుక్కుంటే బీఎస్సీ చదువుకున్నాడని తెలుసుకుని, అప్పటినుంచి చదువుకు తగ్గ పనులు మాత్రమే చెప్పడం మొదలుపెట్టారు. ప్యూన్ ఉద్యోగం చేస్తుండగానే ‘సాంగ్ అండ్ డ్రామా డివిజన్’లో రాళ్లపల్లికి జాబ్ వచ్చింది. 1970 జనవరి 4న ఢిల్లీలో కొత్త ఉద్యోగంలో చేరిన ఆయన జాతీయ సమైక్యత, కుటుంబ నియంత్రణ.. ఇలా సామాజిక అంశాలతో నాటకాలు వేశారు. ఎనిమిదేళ్ల పాటు నిరవధికంగా నాటకాలు వేశారు రాళ్లపల్లి. ఆయన జీవితకాలంలో దాదాపు 8 వేల నాటకాల్లో నటించారు. నాటకాలతో బిజీగా ఉన్నప్పుడే నూతన హీరో హీరోయిన్లతో కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో ‘హారతి’ నవలను సినిమాగా తీయనున్నట్లు వచ్చిన పత్రికా ప్రకటన రాళ్లపల్లి దృష్టిలో పడింది. ‘మీరెలాగూ హీరోగా పనికి రారు. వేరే ఏదైనా పాత్రలకు పనికొస్తారేమో.. ఓ ఉత్తరం రాయొచ్చు’గా అని భార్య స్వరాజ్యలక్ష్మి చెప్పిన మీదట.. ‘నా ఎత్తు అంతంత మాత్రమే.. ’ అంటూ ప్రత్యగ్మాతకు రాశారు. అలా ‘స్త్రీ’ సినిమాకి అవకాశం తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు. రాళ్లపల్లి కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘ఊరుమ్మడి బతుకులు’ (1976). అందులో రాళ్లపల్లి చేసిన తాగుబోతు హరిశ్చంద్రుడు పాత్ర ఆయనకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘చిల్లర దేవుళ్లు’లో చేసిన వీరిగాడి పాత్ర, ‘చలి చీమలు’ కూడా రాళ్లపల్లికి మంచి పేరు తెచ్చాయి. ‘సీతాకోక చిలుక’, ‘అభిలాష’, ‘కంచు కాగడా’, ‘రేపటి పౌరులు’, ‘అన్వేషణ’, ‘శుభలేఖ’ వంటి చిత్రాలు రాళ్లపల్లిలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించాయి. ‘అభిలాష’ సినిమాలో చిరంజీవిని కాపాడే జైలు వార్డన్ శర్మగా ఆయన చేసిన నటన విపరీతంగా ఆకట్టుకుంది. ఇంకా వంశీ సినిమాలు ‘ఆలాపన, ఏప్రిల్ 1 విడుదల, శ్రీ కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్’లో మంచి పాత్రలు చేశారు. జంధ్యాల ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘అహ నా పెళ్లంట’, ‘రెండు రెళ్ల ఆరు’లో మంచి పాత్రలు చేశారు. మణిరత్నం ‘బొంబాయి’లో చేసిన హిజ్రా క్యారెక్టర్ రాళ్లపల్లికి పలు ప్రశంసలు తెచ్చిపెట్టింది. సినీ కెరీర్ ఆరంభించిన తొలి నాళ్లలో టైటిల్ కార్డ్స్‌లో ‘ఆర్.వి. నరసింహారావు’ అని వేసేవారు. ‘తూర్పు వెళ్లే రైలు’ సినిమా చేసేటప్పుడు ఆ చిత్రదర్శకుడు బాపు.. అంత పొడవాటి పేరు ఎందుకు? అని ‘రాళ్లపల్లి’ అని వేశారు. అప్పటినుంచి ‘రాళ్లపల్లి’గా గుర్తుండిపోయారు. కళాకారులు నిరంతర విద్యార్థులు అంటారు రాళ్లపల్లి. అది ఆచరణలోనూ చూపెట్టారాయన. 70 ఏళ్లకు దగ్గరపడుతున్న సమయంలో తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల శాఖలో ఎంఫిల్ చేశారాయన. 800 పై చిలుకు చిత్రాల్లో నటించిన రాళ్లపల్లి కెరీర్‌పరంగా హ్యాపీ. వ్యక్తిగతంగా 1994లో ఓ విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్ద కుమార్తె విజయ మాధురి మెడిసిన్ చదవడానికి రష్యా ప్రయాణం అయినప్పుడు మార్గ మధ్యలో వైరల్ ఫీవర్ ఎటాక్ కావడంతో చనిపోయారు. తన జీవితంలో జరిగిన అతి పెద్ద దుర్ఘటన అది అని పలు సందర్భాల్లో రాళ్లపల్లి ఆవేదనను వ్యక్తం చేశారు. ఆయన చిన్నకుమార్తె రష్మిత ఎంసీఏ చేశారు. ప్రస్తుతం కుటుంబంతో సహా రష్మిత అమెరికాలో ఉన్నారు. ఆమె హైదరాబాద్ చేరుకున్నాక రాళ్లపల్లి అంత్యక్రియలు 20న మహాప్రస్థానంలో జరుగుతాయని ఆయన సన్నిహితులు తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ మంచి సహాయనటుడు, హాస్య నటుడిని కోల్పోయింది. రత్నం లాంటి నటుడు రాళ్లపల్లి. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన చేసిన పాత్రలు గుర్తుండిపోతాయి. కళాకారుడు కన్నుమూసినా, తాను చేసిన పాత్రల్లో జీవించే ఉంటాడు. ప్రజల హృదయాల్లో చిరంజీవిగా నిలిచే ఉంటాడు. రాళ్లపల్లి మృతికి పలువురు చిత్రరంగ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. నాటకం, సినిమా, టీవీ రంగాల్లో నటుడిగా, కథా రచయితగా, దర్శకుడిగా రాళ్లపల్లిగారు కోట్లాది అభిమానులను సంపాదించారు. ఆయన మృతి చెందడం నన్ను తీవ్ర విచారానికి గురి చేసింది. వాళ్ల కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను. – వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెన్నైలోని వాణి మహల్లో డ్రామాలు వేస్తున్నప్పుడు రాళ్లపల్లి గారిని కలిశాను. ఆయన నటన చూసి ముగ్ధుడినయ్యాను. నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. చక్కని స్నేహశీలి. చాలా రోజుల తర్వాత ఆ మధ్య ’మా’ ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాను. ‘ఎలా ఉన్నావు మిత్రమా?’ అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు. ఇంతలో ఆయన తనువు చాలించారంటే బాధగా అనిపిస్తోంది. – నటుడు చిరంజీవి సినిమాల్లోని పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు. వంటగదిలోని పాత్రలతో భోజనప్రియులతో ‘ఆహా.. ఏమి రుచి’ అనిపించగలరు రాళ్లపల్లి. నటుడు కమల్‌హాసన్, దర్శకుడు వంశీలకు రాళ్లపల్లి వంటకాలంటే చాలా మక్కువ. ‘‘మీకు ఎప్పుడూ సినిమాలుండాలనేది నా ఆకాంక్ష. ఒకవేళ లేకపోతే నా దగ్గరకొచ్చేయండి.. వారానికి రెండు రోజులు వండి పెట్టండి చాలు. జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటాను’’ అని రాళ్లపల్లితో కమల్ ఓ సందర్భంలో అన్నారు. ఇక దర్శకుడు వంశీ అయితే షూటింగ్ స్పాట్‌కే కూరగాయలు తెప్పించి మరీ రాళ్లపల్లితో వంట చేయించుకుని ఎంతో ఇష్టంగా తీనేవారు. ఇంకా రాళ్లపల్లి వంటలను ఇష్టంగా ఆరగించిన ప్రముఖులు చాలామందే ఉన్నారు. -
రండి.. వాంగో.. ఆయియే.. ప్లీజ్ కమ్...
చిత్రం : రెండు రెళ్లు ఆరు (1986) డెరైక్ట్ చేసింది : జంధ్యాల సినిమా తీసింది : జి. సుబ్బారావు మాటలు రాసింది : జంధ్యాల పూర్తి పేరు : రాళ్లపల్లి వెంకట నరసింహారావు పుట్టింది : 1946 ఆగస్టు 15న తూ.గో.జిల్లా, రాచపల్లిలో ఫస్ట్ సినిమా : స్త్రీ వందో సినిమా : టై లేటెస్ట్ సినిమా : భలే భలే మగాడివోయ్ (2015) టోటల్ మూవీస్ : 600 కు పైగానే రాళ్లపల్లి టాప్-10 మూవీస్ 1. ఊరుమ్మడి బతుకులు 2. తూర్పు వెళ్లే రైలు, 3. అభిలాష, 4. అన్వేషణ, 5. శ్రీవారికి ప్రేమలేఖ 6. శుభలేఖ, 7. రేపటి పౌరులు 8. సగటు మనిషి, 9. ఆలయ శిఖరం 10. ఛలో అసెంబ్లీ రాళ్లపల్లి... యాక్టింగ్‌లో ‘రత్నాల’పల్లి. కామెడీ, సెంటిమెంట్, విలనీ... ఏదైనా సునాయాసంగా చేసి పారేయగల గ్రేట్ ఆర్టిస్ట్. కానీ మన తెలుగు ఇండస్ట్రీ రాళ్లపల్లిని ఇంకా గొప్పగా వాడుకుని ఉండాల్సింది. ప్చ్. ఏం చేస్తాం!! జంధ్యాల తీసిన ‘రెండు రెళ్లు ఆరు’లో ఆయన సకల భాషా నైపుణ్యాన్ని చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఇద్దరు చైనా వాళ్లు కలుసుకుంటే చైనీస్ భాషలో మాట్లాడుకుంటారు. ఇద్దరు బెంగాలీ వాళ్లు తారసపడితే బెంగాలీలో ముచ్చటించుకుంటారు. ఇక తమిళం వాళ్లయితే మాట్లాడుకున్నా... పోట్లాడుకున్నా... అంతా అరవంలోనే. అదే మన తెలుగువాళ్లయితే మాత్రం ఇంగ్లీషులో మాట్లాడుకుంటారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అనుకోండి. దౌర్భాగ్యం అనుకోండి. ఇంకేదైనా అనుకోండి.కానీ ఈ తికమక దగ్గర మాత్రం అలాంటి కందిపప్పులుడకవు. పెసరపప్పులుడకవు. అతగాడు బెంగాలీ వాడితో బెంగాలీలో మాట్లాడగలడు. హిందీ వాడితో హిందీలో బోల్గలడు. తెలుగువాడితో ఆంగ్లం, అరవం, కన్నడం, హిందీ... ఇలా అన్నీ మాట్లాడేయగలడు. ఎందుకంటే తికమకకు అన్ని భాషలూ వచ్చు. అలాగని అతగాడు సకల విద్యా పారంగతుడనుకునేరు. ఈ ‘తికమక’ పేరు వెనుక కథేంటో, అతగాడి బహుభాషా నైపుణ్యం వెనుక కిటుకేమిటో మనం చెప్పేకన్నా అతగాడే చెప్పుకోవడం బెటర్. ఎందుకంటే - ఎవడి డప్పు వాడే కొట్టుకోవాల్సిన ట్రెండ్ ఇది మరి. అదో పల్లెటూరు. బస్సు నుంచి ఓ మిస్సు దిగింది. ట్రాక్టర్ దగ్గర వెయిటింగ్లో ఉన్న తికమక. చకచకా ఆ మిస్సు దగ్గరకెళ్లి ‘‘నమస్తే... హిందీ, వణక్కం... తమిళ్, గుడ్‌మార్నింగ్... ఇంగ్లీష్, నమస్కారం... తెలుగు’’ అన్నాడు. ఆ అమ్మాయి అయోమయంగా ఇతని వైపు చూసింది. ‘‘ఆలస్యం అయినందుకు క్షమించాలి. నిన్న రావాల్సిన ఉత్తరం అలవాటు ప్రకారం ఆలస్యంగా ఈ రోజు వచ్చింది. బండి లేటైపోతుందని ట్రాక్టర్ తీసుకొచ్చా. రండి... తెలుగు, వాంగో... తమిళ్, ఆయియే... హిందీ, ప్లీజ్ కమ్... ఇంగ్లీష్’’ అని ఆమె సూట్‌కేస్ అందుకుని ట్రాక్టర్ మీద పెట్టాడు. ఆమె ట్రాక్టర్ ఎక్కి కూర్చుంది. ‘‘మీ పెదనాన్నగారు మీ గురించి ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తున్నారు’’ అని చెబుతూ ట్రాక్టర్ స్టార్ట్ చేశాడు తికమక. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా ‘‘పెదనాన్న గారెవరు?’’ అనడిగింది. తికమక అయోమయపడిపోయి ‘‘సర్వానందంగారు... ఆయనే మీ పెదనాన్నగారు. ఇంతకూ మీ పేరు విఘ్నేశ్వరి కాదా?’’ అనడిగాడు.ఆ అమ్మాయి చాలా తాపీగా ‘‘నా పేరు వెంకటలక్ష్మి... విఘ్నేశ్వరి కాదు’’ అంది. వెంటనే తికమక ట్రాక్టర్ ఆపేశాడు. ‘‘మా గొప్ప పనిచేశావ్ కానీ, దిగు దిగవమ్మా. గాలి తీసేసిన ట్రాక్టర్ ట్యూబ్‌లాంటి మొహం చూసే అనుకున్నా. ఎవరు ఎవరి కోసం ఏ బండి కనిపించినా ఎక్కేయడమేనా...’’ అంటూ ఆమె సూట్‌కేస్‌ని కింద గిరాటు వేసినంత పనిచేసి మరీ విసుక్కున్నాడు. సరిగ్గా అప్పుడే ఇంకో బస్సు ఆగింది. అందులోంచి ఓ అమ్మాయి విత్ లగేజ్ దిగింది. ఓసారి జరిగిన పొరపాటుతో తికమక ఆమె వైపు అనుమానంగా చూస్తూ ‘‘నీ పేరు కూడా వెంకటలక్ష్మేనా?’’ అనడిగాడు. ఆమె కంగారుగా ‘‘కాదు... నా పేరు వింధ్య. కాదు కాదు... విఘ్నేశ్వరి’’ అంది. తికమక మొహం వెలిగిపోయింది. ‘‘అమ్మాయిగారూ... మీ కోసమే వచ్చా. నన్ను చిన్నప్పుడెప్పుడో చూశారు. గుర్తుండను లెండి. ఇకాతే కా హమారా గామ్ దోయే ద్యూరే’’ అన్నాడు. అసలే కంగారులో ఉన్న విఘ్నేశ్వరి ఈ అర్థంగాని భాషతో ఇంకా కంగారుపడిపోయింది. ‘‘ఇది బెంగాలీ భాషమ్మా. అంటే ఇక్కడ నుంచీ మన ఊరు రెండు మైళ్లు ఉంటుందని అర్థం’’ అని వివరణ ఇచ్చాడు తికమక. విఘ్నేశ్వరి ట్రాక్టర్ ఎక్కింది. తికమక ట్రాక్టర్ని ఊరు వైపు పరుగులెత్తిస్తూ ‘‘ఇంగానా పత్తు నిమిషం నమ్మూరు పోయిదం’’ అన్నాడు. ‘‘ఇదేం భాష?’’ అని ఆమెలో మళ్లీ ఆశ్చర్యం. ‘‘మలయాళం... అంటే పది నిమిషాల్లో ఇక్కడ నుంచీ వెళ్లిపోతామని అర్థం...’’ చెప్పాడు తికమక. ‘‘నీ పేరేంటి?’’ అడిగింది విఘ్నేశ్వరి.‘‘తికమక’’ అని చెప్పాడతను.‘‘ఏ భాషలో?’’ అని తికమకగా అడిగింది విఘ్నేశ్వరి. ‘‘అన్ని భాషల్లోనూ. తెలుగుకి ‘తి’, కన్నడకు ‘క’, మలయాళానికి ‘మ’, కొంకణికి ‘క’. ఆ భాషల పట్ల గౌరవంతో నా పేరుని ఇలా పెట్టుకున్నా. మీకు బోర్ అనిపించకపోతే నా గురించి కొంత చెప్పాలి. నేను మిలట్రీలో వంటవాడిగా పని చేసి, అంట్లు తోమలేక ఆ పని మానేశాను. అక్కడుండగా అన్ని భాషల సైనికులతో మాట్లాడ్డం కోసం ఈ భాషలన్నీ నేర్చుకున్నా. ఇప్పుడు నేను 14 భారతీయ భాషలు మాట్లాడగలను. 4 భాషలు రాయగలను. ఇదీ నా ఫ్లాష్‌బ్యాక్’’ అని తికమక చెప్పడం పూర్తయ్యేసరికి ఇల్లు వచ్చేసింది. విఘ్నేశ్వరి ట్రాక్టర్ మీద నుంచి దిగి, ఆ ఇంటిని కళ్లు పెద్దవి చేసి మరీ చూసింది. ‘‘ఇదేనమ్మా మీ ఇల్లు. 50 గదులు... 101 గుమ్మాలు... 151 అద్దాలున్న బంగ్లా... మీరు ఇక్కడే పెరిగారనుకోండి. మరిచిపోయారనుకుని ఊరకనే చెబుతున్నా. వెల్కమ్... ఇంగ్లీష్. ఏవా ఏవా... మరాఠీ. దయచేయండి... తెలుగు, వాంగో.. తమిళ్’’అంటూ విఘ్నేశ్వరిని లోపలకు తీసుకెళ్లాడు తికమక. అక్కడ సర్వానందం వేయికళ్లతో వెయిటింగ్. కళ్లు కనబడకపోయినా, చెవులు వినబడకపోయినా విఘ్వేశ్వరిని చూసి సంబరపడిపోయాడా పెద్దాయన. ‘‘ప్రయాణం చేసి అలిసిపోయుంటావ్. గదిలోకెళ్లి రెస్ట్ తీసుకోమ్మా’’ అని ఆమెకు గదిని చూపించమని తికమకకు పురమాయించాడాయన. తికమక ఆమెనో గదిలోకి తీసుకెళ్లి ‘‘దిసీజ్ యువర్ రూమ్... ఇంగ్లీషు. యే ఆప్ కా కమరా హై... హిందీ. యే తుమ్కో రూమ్... మరాఠీ. ఇదు ఉంగళ్ రూమ్... తమిళ్. ఇది నిమ్మ రూమ్... కన్నడ. ఇది మీ గది... తెలుగు’’ అని చెప్పేసి వెళ్లిపోయాడు. ఇప్పుడర్థమైందిగా తికమక కేరెక్టరైజేషన్. ఆ ఇంట్లో వాళ్లకు అతను తలలో నాలుక. నచ్చనివాళ్లకు తలలో పేను. సర్వానందంగారికి నమ్మినబంటు.ఇక్కడో ఫ్లాష్‌బ్యాక్ చెప్పాలి. చిన్నతనంలోనే విఘ్నేశ్వరిని, వెంకట శివంకిచ్చి పెళ్లి చేయిస్తారు సర్వానందంగారు. విఘ్నేశ్వరికి, వెంకట శివానికి మధ్య ఉప్పుకు నిప్పుకు ఉన్నంత వైరం. ఇద్దరూ వేర్వేరు చోట్ల పెరిగి పెద్దవుతారు. వారినెలాగైనా మళ్లీ కలపాలని సర్వానందంగారి చివరి కోరిక. వాళ్లిద్దరూ సిటీ నుంచి ఈ పల్లెటూరికొస్తారు. కానీ వారిద్దరూ రియల్ కాదు. తమ ఫ్రెండ్షిప్ కోసం వచ్చి ఇద్దరూ ఇరుక్కున్నారు. తప్పించుకుందామని చూస్తే ‘గూఢచారి 116’లాగా తికమక. ఫైనల్‌గా ఓ రాత్రి ఇద్దరూ గేటు దూకి పారిపోబోతుంటే లటిక్కిన పట్టేసుకుని సర్వానందం ముందు నిలబెట్టాడు తికమక.‘‘దూజన బావనే జాత్... బెంగాలీ. దస్గయా... పంజాబీ. తప్పిచ్చుక్కు హోహోడుగురు... కన్నడ. పారిపోతున్నారు.... తెలుగు’’ అని పెద్దాయనకు చెప్పాడు. వాళ్లిద్దరూ తికమకను కొరకొరా చూశారు. తికమక ఒకటే భాషలో నవ్వాడు. నవ్వు ఏ భాషలోనైనా ఒకటే కదా. తెలుగులో ఒకలాగా, తమిళంలో ఒకలాగా నవ్వు ఉండదు కదా. ఏది ఏమైనా తికమక లాంటి నమ్మినబంటు దొరికితే ఎవరికైనా... రొంబ సంతోషం... తమిళం. జాస్త్ ఆనంది... మరాఠీ. చాలా సంతోషం... తెలుగు. - పులగం చిన్నారాయణ -
నన్ను నేను పనిలో నిమగ్నం చేసుకుంటున్నాను
అవిశ్రాంతం -అరవై తర్వాత రాళ్లపల్లి వెంకట నరసింహారావు... ఇంత పొడవు పేరు చెబితే అయోమయం కలుగుతుంది. రాళ్లపల్లి... అనగానే చక్కటి ఉచ్ఛారణ, స్పష్టమైన హావభావాల వ్యక్తీకరణతో అనేక పాత్రలు కళ్ల ముందు మెదులుతాయి. నాటకరంగ నేపథ్యమే తనను ఇంత వరకు నడిపించిందని చెప్పే రాళ్లపల్లి ‘చెడ్డసినిమా ఉంటుందేమో కానీ చెడ్డ నాటకం ఉండదంటారు. రాబోయే ఆగస్టు 15వ తేదీతో డెబ్బైలోకి అడుగు పెట్టనున్న ఆయన అరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా జీవితాన్ని ‘అవిశ్రాంతం’గా మలుచుకున్న వైనం ఆయన మాటల్లోనే... ‘‘అరవై ఐదేళ్లు దాటిన తర్వాత వృత్తిలో కొంత విరామం దొరికినట్లయింది. అప్పటి వరకు ఏడాదికి 365 రోజులు పని చేసిన స్థితి నుంచి నా పని వారానికి మూడు రోజులకే పరిమితమైంది. అది నేను తెచ్చుకున్న విరామం కాదు. ఇండస్ట్రీలో కొత్త నీరు ప్రభావంతో వచ్చిన విరామం. విద్యార్థి అవతారమెత్తి ఆ ఖాళీని బిజీగా మలుచుకున్నాను. 2011లో మాస్టర్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కోర్సులో చేరాను. డిస్టింక్షన్లో పాసయ్యాను కూడా. ఇప్పుడు ఎం.ఫిల్ చేస్తున్నాను. రిటన్ టెస్ట్ పూర్తయింది. థీసిస్ సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత పీహెచ్‌డి చేద్దామనుకుంటున్నాను. అరవై ఆరేళ్ల విద్యార్థి! ఇన్నేళ్లు నటించిన తర్వాత ఇంక నటన గురించి చదువుకోవడమేంటి- అని విచిత్రంగా అనిపిస్తుందేమో కానీ, విద్యార్థిదశను ఆస్వాదించాను. ఈ తరం యువతతో కలిసి చదువుకోవడం నాకూ- వారికీ పరస్పరం ఉపయుక్తంగానే సాగింది. గతంలో సాంఘిక నాటకాలు రాసిన నేపథ్యం ఉండడంతో నటన, ఉచ్చారణ, అభినయం వంటి అంశాలలో పాఠాలు చెప్పగలిగినంత పట్టు వచ్చింది. ఏదైనా అంశం మీద ఉపన్యసించగలిగిన సామర్థ్యం అలవడింది. నాటకం చూడాలి లేదా చదవాలి! నా దైనందిన జీవితం ఎప్పుడూ ఉదయం ఐదూ ఐదున్నరకే మొదలవుతుంది. పూజ, ధ్యానం తర్వాత ఉపాహారం. ఏదైనా ఓ నాటకాన్ని తీసుకుని చదవడం, మిత్రులను సంప్రదించి నాటక ప్రదర్శన, సాధన గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో మునిగిపోతాను. భోజనం తర్వాత ఓ అరగంట సేపు టీవీ చూస్తాను. సాయంత్రమైతే రవీంద్రభారతిలోనో, తెలుగు విశ్వవిద్యాలయం థియేటర్లోనో ప్రదర్శించే నాటకాలకు ఆహ్వానాలు సిద్ధంగా ఉంటాయి. మూడు రోజుల కిందట కూడా జ్యోతిరావు ఫూలే మీద నాటకం చూశాను. 1966లో రాష్ట్రపతి భవన్లో రాష్ర్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఎదుట ‘మృచ్ఛకటికం’ నాటకాన్ని ప్రదర్శించడం... వంటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఈ విరామమే తగిన సమయం. నాటకానికి టికెట్టు కొనడమా! థియేటర్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించే నాటకాలకు తప్పకుండా వెళ్తుంటాను. మిత్రబృందంతో కలిసి నాటకాలు ప్రదర్శిస్తుంటాను. నేను పదిసార్లు అమెరికాకు వెళ్లాను. ప్రతిసారీ ఏదో ఒక నాటకాన్ని చూసేవాడిని. మన దగ్గర టికెట్ కొని నాటకం చూసే అలవాటే లేదు. అలాగని నాటకానికి ఆదరణ తగ్గలేదు. కళాపోషకులు ఆసక్తి కొద్దీ ప్రదర్శిస్తే చూసే వాళ్లు మాత్రం ఉన్నారు. గత ఏడాది యాంకర్ ఝాన్సీ మొదలైన వాళ్లం కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించినప్పుడు చాలా మంది వచ్చారు. అలాగే ఒంగోలులో నాటక ప్రదర్శనకు రాత్రి తొమ్మిదికి మొదలైనా సరే ప్రేక్షకులు ఉన్నారు. సమాజానికి సందేశాన్నిచ్చే నాటకం ప్రధానస్రవంతిలోకి రావాలని కోరుకుంటూ పని చేసుకుపోవడం మా వంతు. ఇంకా నాటకాలు వేయడం వల్ల మేము నాటకరంగానికి చేస్తున్న మేలు ఏమీ ఉండదు. ఇదంతా మమ్మల్ని మేము పనిలో నిమగ్నం చేసుకుని సంతోషంగా ఉండడానికే. కళాకారులకు ప్రోత్సాహంగా... పేదరికంలో ఉన్న రంగస్థల నటులకు సన్మానం చేసి పదివేల నుంచి పాతిక వేల వరకు నగదు బహుమతినివ్వడం అనే ఓ వ్యాపకాన్ని పెట్టుకున్నాను. మిత్రుల సహకారంతో ఎనిమిదేళ్లుగా ఆగస్టు 15వ తేదీన నా పుట్టిన రోజు నాడు ఒకరికి బహుమతి ఇస్తున్నాను. మందుల వంటి కనీస ఖర్చులకు ఇబ్బంది పడుతున్న వారికి నా శక్తి కొద్దీ నేను అందిస్తున్న చిన్న ఆసరా. నాకు చేతనైంది నటించడం... నేర్పించడం నేను మూడు వేల నాటకాలు వేశాను, ఏడు వందలకు పైగా సినిమాలు చేశాను. నాకు చేతనైంది నటించడం, ఎలా నటించాలో నేర్పించడం, చక్కటి కథను ఆసక్తికరమైన కథనంతో తీర్చిదిద్దడం వంటివే. బహుశా అవే నన్ను అవిశ్రాంతంగా ఉంచుతూ నన్నింకా బతికిస్తున్నాయేమో! (నవ్వు) - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు:రాజేశ్ రెడ్డి ముగింపు లేని కథ, మారని సంసారం, జీవన్మృతుడు నాటకాలను రాశారు. వరవిక్రయం నాటకాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చి పాతికకు పైగా ప్రదర్శనలిచ్చారు.