ఎక్కువమందికి కుడిచేతి వాటం, చాలా తక్కువమందికి ఎడమచేతి వాటం ఉంటుంది. కమెడియన్ రాళ్లపల్లి వెంకట నరసింహారావుది కుడిచేతివాటం.. కానీ ఆయన ఎడమచేత్తో భోజనం చేసేవారట! అంతేకాదు, పొరపాటున ఆయన తినేటప్పుడు ఎవరైనా అదేంటి? ఎడమ చేతితో భోజనం చేస్తున్నారు? అని అడిగారంటే వెంటనే తింటున్న ప్లేటు పక్కన పడేసి చేతులు కడుక్కునేవారట! ఎందుకయా.. అంటే తాను భోజనం చేసేటప్పుడు ఎవరైనా ఎడమచేత్తో తింటున్నావేంటని ప్రశ్నిస్తే ఆ భోజనాన్ని వదిలేస్తాను, ఇది నియమంగా పెట్టుకున్నాను అని గతంలో చెప్పారు.
ఎవరైనా అడిగితే..
ఇదేం నియమం? అన్న ప్రశ్నకు.. ప్రతిసారి లెఫ్ట్ హ్యాండ్‌తోనే తింటానని అయ్యప్ప దేవునికి మొక్కుకున్నాను. మధ్యలో ఎవరైనా దానిగురించి అడిగితే అన్నం తినకుండా లేచేస్తాను. నేను అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు ఈ నియమాన్ని దీక్షగా కొనసాగిస్తాను అని తెలిపారు. కానీ ఆ లక్ష్యమేంటనేది చెప్పలేదు. ఒకవేళ లక్ష్యం నెరవేరకపోతే జీవితాంతం ఇదే పాటిస్తానని నిర్ణయించుకోవడం గమనార్హం.
ప్రతి ఏడాది..
బీకామ్ చదివిన రాళ్లపల్లి రైల్వేలో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఈయన అయ్యప్ప భక్తుడు. తన జీవితంలో దాదాపు 28 సార్లు శబరిమల వెళ్లారు. ఆగస్టు 15 ఆయన జన్మదినం. ప్రతి ఏడాది ఆరోజు ఓ పేదకళాకారుడికి సన్మానం చేసి 50 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలోనూ ఈ నియమాన్ని తప్పలేదు. నాటకాలంటే ఆయనకు ప్రాణం.. ఒకానొక దశలో వాటికోసం అప్పులు కూడా చేశారు. ఏ స్థాయిలో అంటే ఓసారి ఇంట్లోని సోఫాను కూడా అమ్మేశారు. అప్పులవాళ్ల భయంతో ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్లేవారు. ఇవన్నీ ఆయన శిష్యుడు తనికెళ్ల భరణి కళ్లారా చూశాడు. డబ్బు కోసం అంతలా ఇబ్బందిపడ్డారు. సినీ ఇండస్ట్రీకి వచ్చాకే ఆర్థిక పరిస్థితి మెరుగైంది.
అదే బలహీనత
ఆయనకున్న బలహీనత దానం చేయడం.. ఎంతోమందిని చదివించారు, పెళ్లిళ్లు చేశారు. ఆయన మంచితనాన్ని సొమ్ము చేసుకున్నవారూ ఉన్నారు. రాళ్లపల్లి జీవితంలో అత్యంత విషాదకర ఘటన.. పెద్ద కూతురు విజయమాధురి మరణం.. డాక్టర్ చదువు కోసం రష్యా వెళ్తూ చనిపోయింది. ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్తుండగా.. ఆ జర్నీలో తనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ఆగ్రా రీచ్ అయ్యేలోపు చనిపోయింది. నీ పుట్టుకకు, నీ చావుకు కారణం నేనే అంటూ రాళ్లపల్లి గుండె పగిలేలా ఏడ్చారు. కూతుర్ని డాక్టర్ చేయాలన్నది ఆయన కల.. అందుకోసమే రష్యా పంపించాలనుకున్నారు. ఇంతలోనే కూతురు మరణించడంతో మానసికంగా కుంగిపోయారు.
రాళ్లపల్లి సినిమాల సంగతి..
రాళ్లపల్లి స్త్రీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు. శుభలేఖ, బడాయి బసవయ్య, జగన్నాథ రథచక్రాలు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, అగ్నిపుత్రుడు, భలే మొగుడు, బామ్మ మాట బంగారు బాట, కూలీ నెం.1, చంద్రలేఖ, కలిసుందాం రా, నిన్ను చూడాలని, సింహాద్రి, నా అల్లుడు.. ఇలా అనేక సినిమాల్లో నటించారు. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకుని అందుకోసం విశేషంగా కృషి చేశారు. రెండు నంది అవార్డులు అందుకున్న ఈ అనంతపురవాసి 2019 మేలో కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment