rallapalli
-
అప్పులబాధతో ఇంటిసామాన్లు అమ్మిన కమెడియన్.. ఎడమచేత్తో!
ఎక్కువమందికి కుడిచేతి వాటం, చాలా తక్కువమందికి ఎడమచేతి వాటం ఉంటుంది. కమెడియన్ రాళ్లపల్లి వెంకట నరసింహారావుది కుడిచేతివాటం.. కానీ ఆయన ఎడమచేత్తో భోజనం చేసేవారట! అంతేకాదు, పొరపాటున ఆయన తినేటప్పుడు ఎవరైనా అదేంటి? ఎడమ చేతితో భోజనం చేస్తున్నారు? అని అడిగారంటే వెంటనే తింటున్న ప్లేటు పక్కన పడేసి చేతులు కడుక్కునేవారట! ఎందుకయా.. అంటే తాను భోజనం చేసేటప్పుడు ఎవరైనా ఎడమచేత్తో తింటున్నావేంటని ప్రశ్నిస్తే ఆ భోజనాన్ని వదిలేస్తాను, ఇది నియమంగా పెట్టుకున్నాను అని గతంలో చెప్పారు. ఎవరైనా అడిగితే.. ఇదేం నియమం? అన్న ప్రశ్నకు.. ప్రతిసారి లెఫ్ట్ హ్యాండ్‌తోనే తింటానని అయ్యప్ప దేవునికి మొక్కుకున్నాను. మధ్యలో ఎవరైనా దానిగురించి అడిగితే అన్నం తినకుండా లేచేస్తాను. నేను అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు ఈ నియమాన్ని దీక్షగా కొనసాగిస్తాను అని తెలిపారు. కానీ ఆ లక్ష్యమేంటనేది చెప్పలేదు. ఒకవేళ లక్ష్యం నెరవేరకపోతే జీవితాంతం ఇదే పాటిస్తానని నిర్ణయించుకోవడం గమనార్హం. ప్రతి ఏడాది.. బీకామ్ చదివిన రాళ్లపల్లి రైల్వేలో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఈయన అయ్యప్ప భక్తుడు. తన జీవితంలో దాదాపు 28 సార్లు శబరిమల వెళ్లారు. ఆగస్టు 15 ఆయన జన్మదినం. ప్రతి ఏడాది ఆరోజు ఓ పేదకళాకారుడికి సన్మానం చేసి 50 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలోనూ ఈ నియమాన్ని తప్పలేదు. నాటకాలంటే ఆయనకు ప్రాణం.. ఒకానొక దశలో వాటికోసం అప్పులు కూడా చేశారు. ఏ స్థాయిలో అంటే ఓసారి ఇంట్లోని సోఫాను కూడా అమ్మేశారు. అప్పులవాళ్ల భయంతో ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్లేవారు. ఇవన్నీ ఆయన శిష్యుడు తనికెళ్ల భరణి కళ్లారా చూశాడు. డబ్బు కోసం అంతలా ఇబ్బందిపడ్డారు. సినీ ఇండస్ట్రీకి వచ్చాకే ఆర్థిక పరిస్థితి మెరుగైంది. అదే బలహీనత ఆయనకున్న బలహీనత దానం చేయడం.. ఎంతోమందిని చదివించారు, పెళ్లిళ్లు చేశారు. ఆయన మంచితనాన్ని సొమ్ము చేసుకున్నవారూ ఉన్నారు. రాళ్లపల్లి జీవితంలో అత్యంత విషాదకర ఘటన.. పెద్ద కూతురు విజయమాధురి మరణం.. డాక్టర్ చదువు కోసం రష్యా వెళ్తూ చనిపోయింది. ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్తుండగా.. ఆ జర్నీలో తనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ఆగ్రా రీచ్ అయ్యేలోపు చనిపోయింది. నీ పుట్టుకకు, నీ చావుకు కారణం నేనే అంటూ రాళ్లపల్లి గుండె పగిలేలా ఏడ్చారు. కూతుర్ని డాక్టర్ చేయాలన్నది ఆయన కల.. అందుకోసమే రష్యా పంపించాలనుకున్నారు. ఇంతలోనే కూతురు మరణించడంతో మానసికంగా కుంగిపోయారు. రాళ్లపల్లి సినిమాల సంగతి.. రాళ్లపల్లి స్త్రీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు. శుభలేఖ, బడాయి బసవయ్య, జగన్నాథ రథచక్రాలు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, అగ్నిపుత్రుడు, భలే మొగుడు, బామ్మ మాట బంగారు బాట, కూలీ నెం.1, చంద్రలేఖ, కలిసుందాం రా, నిన్ను చూడాలని, సింహాద్రి, నా అల్లుడు.. ఇలా అనేక సినిమాల్లో నటించారు. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకుని అందుకోసం విశేషంగా కృషి చేశారు. రెండు నంది అవార్డులు అందుకున్న ఈ అనంతపురవాసి 2019 మేలో కన్నుమూశారు. చదవండి: పేద ప్రజల కోసం రజనీకాంత్ బిగ్ ప్లాన్..? -
కీచక టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్ అరెస్టు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కీచక టీడీపీ నేత రాళ్లపల్లి ఇంతియాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఇంతియాజ్ లైంగిక వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇంతియాజ్‌పై 306, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి ప్రేమించకపోతే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానని బెదిరించడంతో భయపడిపోయిన ఓ ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుంది. టీడీపీ నాయకుడి బెదిరింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ బలవన్మరణానికి ముందు సెల్ఫీ వీడియోలో చెప్పింది. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లిలో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎర్రబల్లికి చెందిన కురుబ శ్రీనివాసులు, రాధమ్మ దంపతుల ఏకైక కుమార్తె సంధ్యారాణి(17). అన్నమయ్య జిల్లా మొలకలచెరువులోని మెడల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అనుచరుడైన నల్లచెరువుకు చెందిన తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శి రాళ్లపల్లి ఇంతియాజ్.. ఫేస్బుక్లో సంధ్యారాణితో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ప్రేమించాలంటూ వేధించడం మొదలెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఎర్రబల్లికి వెళ్లి వారి తల్లిదండ్రుల సమక్షంలోనే తనని ప్రేమించాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటీవల సంధ్యారాణి తల్లిదండ్రులతో కలిసి పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి గుడి వద్దకు వెళ్లగా.. అక్కడికీ వచ్చి మరీ వేధించాడు. తనను ప్రేమించకుంటే ఫొటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానంటూ బెదిరించాడు. దీంతో సంధ్యారాణి తీవ్ర భయాందోళలనకు లోనైంది. ఈ క్రమంలోనే దసరా సెలవులకు ఇంటికొచ్చిన సంధ్యారాణి బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. -
తనికెళ్ళ భరణి.. వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!
వెబ్‌డెస్క్: సంప్రదాయాన్ని ఎవరైనా నిలబెడుతున్నారంటే చాలూ ‘నమస్తే అన్నా..’ వాళ్ల కోసం ఎంత దూరమైన వెళ్తాడు ఆయన. బహుశా సినీ రంగంలో ఇంత సాహితీ యావ ఉన్న నటుడు మరోకరు లేరేమో!. ఈ తోట రాముడు... పరమశివుడినే ‘ఏరా’ అంటూ జిగిరీ దోస్తుగా సంభోధిస్తుంటాడు. అదేమంటే... గది గంతే అంటాడు. ఆ ముక్కంటి ప్రియ భక్తుడైనందుకేమో.. ఈ భరణి కూడా వెరీమచ్ ఫ్రెండ్లీ మరి!. కళాధరణి ఈ సాహితీ భరణి 1954, జులై 14న సికింద్రాబాద్‌లో పుట్టాడు తనికెళ్ళ భరణి. నటుడికన్నా ముందు ఆయన ఒక మంచి రచయిత.. సాహితీవేత్త. నటుడిగా బిజీ అయ్యాక మాట మాట్లాడితే ‘కలం మడిచి జేబులో పెట్టేశాన’ని అంటుంటాడు. కానీ ఆ కలానికి సాగటమే తప్ప ఆగటం తెలీదు. పద్యాలు అలవోకగా చెప్పే ఆయన కవితా ధార... మాటలతో ఆయన ఆడుకునే తీరు.. చూస్తే ఎవరైనా ఆయన వీరాభిమానిగా అయిపోవటం ఖాయం. ‘‘కదలిపోతోంది... భావన వదిలి పోతోంది. వెళ్లలేక వెళ్లలేక ఒదిగిపోతోంది. ఒదిగిపోయిన భావనలతో కవితలల్లాను. కవితలన్నీ మనసులో కలమెట్టి రాశాను. కవితలను రాసి రాసి అలసిపోయాను. అలసిపోయిన నాకు చక్కని తలపు కలిగింది. తలపులన్నీ వలపులై నన్ను బాధ పెట్టాయి. బాధలో నా భావనలను చెదరగొట్టాను. వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయాయి. భావనలు వెళ్లిపోయాయి నన్ను వదిలి వెళ్లిపోయాయి’’... అని ఆయన చెప్తుంటే ‘వాహ్ వా... వాహ్ వా...’ అనకుండా ఉండలేం మరి! గురువు రాళ్లపల్లి లేకుంటేనా.. డెబ్భై దశకం మధ్యలో తనికెళ్ల భరణి సరదాగా నాటకాలు వేస్తుండేవాడు. ఆ టైంలోనే నటుడు రాళ్లపల్లి పరిచయం అయ్యారు. భరణిలోని రచనా పటిమను గుర్తించి ప్రోత్సహించాడు రాళ్లపల్లి. అలా నాటకాలకు డైలాగులు రాయడం మొదలుపెట్టాడు. అటుపై థియేటర్ ఆర్ట్స్‌లో డిప్లోమా చేశాడు. గురువు రాళ్లపల్లి ప్రోత్సాహంతో చెన్నైకి చేరి సినిమా డైలాగుల రచయితగా అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. ఆనాడు రాళ్లపల్లి లేకుంటే.. ఈనాడు తనికెళ్ళ భరణి ఇలా మన ముందు ఉండేవాడు కాదేమో. ఇలాంటి వ్యక్తిని తెలుగు ప్రజానీకానికి అందించిన రాళ్లపల్లికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకోవాలి. లేకుంటే చెడు సావాసాలతో ఈ సాహితి పిపాసి జైలుకు పోయేవాడేమో! శివుడంటే ప్రాణం తెలంగాణా యాసలో ఇంత చక్కటి శివస్తుతిని పలికించగలగడం భరణి ఇస్టయిల్. నిషాని వాడిలా శివుడిని పూజిస్తూ ఆయన చెప్పిన పద్యాలు శభాష్ శంకరా. శివుడి లయలో ఈ ప్రపంచపు అన్ని కోణలని తాకతూ అభినవ భక్త కన్నప్పలా ఆయన వర్ణించిన తీరు సామాన్యుడికి సైతం అర్థమయ్యే భాషలో రచించిన తనికెళ్లకు సలాం కొట్టక ఉండలేం. సర్వం శివమయం జగత్ అనే శివ ఫిలాసఫీని సింపుల్ గా చెప్పగలిగిన సాహితివేత్త తనికెళ్ల భరణి. ‘చెంబుడు నీళ్లు పోస్తే ఖుష్... చిటికెడు బూడిద పోస్తే బస్... వట్టి పుణ్యానికి మోక్షమిస్తవు గదా శబ్బాష్‌రా శంకరా...’ అన్నాడు. అది వింటే శివుడు కూడా భరణి భుజంపై చేయి వేసి హీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటాడేమో! నైజాం అభిమానం యాదగిరి, భువనగిరి అంటూ పేర్లు పెడుతూ కమెడియన్లకు, విలన్లకు తెలంగాణ యాసను అంటగట్టి గేలి చేస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తం కావడం మనం చూశాం.. చూస్తున్నాం. కానీ, నైజాం భాషను, తెలంగాణ యాసను ఎలా పలకాలో తెలియకనే సినిమాల్లో వ్యంగ్యంగా వాడుతున్నారనేది భరణి అభిప్రాయం. ‘‘సినీ పరిశ్రమలోని ఏ వ్యక్తికీ తెలంగాణ భాషపై కోపంగానీ, దాన్ని అవమానించాలన్న ఉద్దేశం ఎవరికీ ఉండదు. ఉచ్ఛరించే విధానం తెలీకనే కామెడీ కోసం ఆ భాషను వాడేసుకుంటున్నారని’’ ఆయన చెప్తుంటారు. అంతేకాదు ఓ హీరోయిన్ ను పూర్తి స్థాయి తెలంగాణలో మాట్లాడించాలన్న ఉద్దేశంతోనే విజయశాంతితో మొండిమొగుడు-పెంకి పెళ్లాం చిత్రాన్ని తీసినట్లు ఆయన చెప్తుంటారు. గతి మార్చింది ‘శివ’నేనా? దొరబాబు, పాతసామాన్లోడు, నానాజీ, తోటరాముడు, మాణిక్యంగాడు, చేపలక్రిష్ణగాడు.. ఇట్లా 800 సినిమాలకు నటనతో అలరించాడు తనికెళ్ల భరణి. ప్రారంభంలో కామెడీ వేషాలు వేసిన ఆయన.. ‘శివ’తో నానాజీ పాత్రతో విలన్‌గా ఓ మెట్టు పైకి ఎక్కాడు. ఇది కూడా శివుడి ఆజ్ఞ ఏమో!.. అప్పటి నుంచి విలన్ క్యారెక్టర్లలో భరణి నటన కొనసాగింది. అటుపై కమెడియన్‌గా, సపోర్టింగ్ రోల్స్, కమెడియన్ విలన్‌గా.. 2000 సంవత్సరం తర్వాత తండ్రి, బాబాయ్ లాంటి హుందా క్యారెక్టర్లతో అలరిస్తోంది భరణి నటన. అన్నట్లు దర్శకత్వ కోణంతో ఆయన అందించిన ‘మిథునం’.. తెలుగు ప్రేక్షకులకు మాంచి అనుభూతిని కూడా పంచింది. -
శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు
తిరుమల: తిరుమల వెంకటేశ్వరస్వామిని సోమవారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. హీరో శ్రీరామ్ తన కుటుంబ సభ్యులతో కలసి ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామిని దర్శించుకున్నారు. అలాగే ప్రముఖ సినీయర్ నటుడు రాళ్లపల్లి నరసింహారావు కూడా స్వామి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
ఆయన హాస్యానికే బ్రహ్మ
ఇంటర్వ్యూ - ప్రముఖ హాస్యనటుడు రాళ్లపల్లి నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం... నవ్వలేక పోవడం ఒక రోగం.. అనడమే కాదు అందులోని రెండో సూత్రాన్ని తూ.చా. తప్పకుండా పాటించి అంతులేని కీర్తిని మూటగట్టుకున్నారు జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి. రచరుుతగా, దర్శకుడిగా ఆయన సినిమాల్లో ఎంతోమందికి అవకాశమిచ్చి ఉన్నతస్థానంలో నిలబెట్టారు. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి వంటి ఎంతోమంది హాస్యనటులు ఆయన సినిమా నుంచి పుట్టుకొచ్చినవారే. నటుడు రాళ్లపల్లి నరసింహశాస్త్రి కూడా ఎన్నో జంధ్యాల సినిమాల్లో నటించి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఇటీవల జరిగిన జంధ్యాల 13వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా జంధ్యాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. జంధ్యాల గురించి చెప్పండి తెలుగు భాష ఉన్నంతకాలం జంధ్యాల అందరి గుండెల్లో చిరస్థారుుగా నిలిచిపోతారు. హాస్యం గురించి మాట్లాడే ప్రతిచోటా ఆయనుంటారు. జంధ్యాల.. హాస్యానికే పర్యాయపదం. ఆయన సినిమాలపై మీ అభిప్రాయం ప్రవాసాంధ్రులు జంధ్యాల సినిమాలు చూడటానికే ప్రాధాన్యత ఇస్తారు. తమ వద్ద ఎప్పుడూ ఆయన సినిమా సీడీలు ఉంచుకుం టారు. స్వదేశానికి దూరంలో ఉన్నా జంధ్యాల సినిమా చూసి స్వదేశం లో ఉన్నామని భావిస్తామని చాలామంది ఎన్నారైలు నాకు చెప్పారు. జంధ్యాలతో మీ అనుబంధం జంధ్యాలతో నా సంబంధం దైవికమైనది. ఆయన దర్శకత్వంలో పది సినిమాలకుపైగా నటించాను. ఆ సినిమాల్లో రాళ్లపల్లి కనిపించడు. పాత్రే కనిపిస్తుంది. ఆ పాత్ర పోషించింది నేనేనా.. అన్న అనుమానం నాకు అప్పుడప్పుడూ కలుగుతుంది. రెండురెళ్ల ఆరు, అహ నా పెళ్లంటా.., శ్రీవారికి ప్రేమలేఖ, బావా బావా పన్నీరు సినిమాలు జంధ్యాలను అంచనా వెయ్యటానికే.. జంధ్యాల హాస్య చిత్రాలకే పరిమితం కాలేదు. సర్వసమానత్వం కోరుతూ తీసిన ‘నెలవంక’, కళాకారులకు జాతిమత కులబేదం లేదని చెప్పిన ‘ఆనందభైరవి’ ఆయన దర్శకత్వ ప్రతిభకు పరాకాష్ట. నేటి హాస్య సినిమాలపై ఆయన ప్రభావం.. ఈరోజు హాస్య చిత్రాలకు మాటలు రాసేవారు, దర్శకత్వం చేసేవారిలో చాలామంది జంధ్యాల శిష్యులే. హాస్యం ఎలా పండించాలో ఆయన నుంచే నేర్చుకున్నారు. దర్శకుడిగా ఆయన విజయ రహస్యం.. జంధ్యాల వంటి దర్శకులు అరుదుగా కనిపిస్తారు. ఆయన సినిమాల్లో హాస్యం అతికించినట్టు ఉండదు. సినిమాల్లో భాగంగా ఉంటుంది. జంధ్యాల పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. నాటక రంగం నుంచి రావటం వల్ల ప్రతి సన్నివేశంలో జీవించేవారు. ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో మాధవయ్య సినిమా ద్వారా అజరామరమైన కీర్తి సాధించారు. అందుకే జంధ్యాల మన మధ్య లేకపోయినా ఆయన చిరంజీవిగానే ఉన్నారని నేను భావిస్తాను. -
అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయా!
నాటకాలు, సినిమా - రెండూ ఆయన కళ్ళు. ఇప్పటికి ఏకంగా ఎనిమిది వేల పైచిలుకు నాటకాల్లో జీవించారు. ఎనిమిది వందలకు పైగా సినిమాల్లో నటించారు. కానీ, విసుగూ విరామం లేని నాలుగు దశాబ్దాల సినీ జీవితం తరువాత ఇవాళ రాని అవకాశాల కోసం పరిగెత్తలేని పరిస్థితి రాళ్ళపల్లి వెంకట నరసింహారావుది. నాలుగు రాళ్ళు వెనకేసుకోని జీవితం.. ఎదిగిన బిడ్డను దూరం చేసిన దైవం.. మారుతున్న సినీ ప్రపంచపు నైజం.. వీటి మధ్య ఎవరైనా ఏం చేస్తారు? రాళ్ళపల్లి మాత్రం తనకు ఇష్టమైన రంగస్థల శాఖలో పరిశోధన చేస్తున్నారు. మానని గాయాలకు మందు వెతుక్కుంటున్నారు... అదీ ఈ అరవై ఎనిమిదేళ్ళ వయసులో! అసలు ఏమైందో, ఏమిటో, రాళ్ళపల్లి ఏం చెబుతున్నారో చదవండి... ముప్ఫై అయిదేళ్ళు యంత్రంలా పనిచేశాక, ఈ స్తబ్దత ఇబ్బందిగా ఉందా? రాళ్లపల్లి: ఇబ్బందే మరి. పని చేయడానికి అలవాటు పడ్డవాడు ఖాళీగా ఉండాలంటే పిచ్చెక్కిపోతుంది. పది పదిహేను రోజులైనా పనుంటే, మిగతా సమయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేటాయించొచ్చు. కానీ నెలంతా పనే లేకుండా ఉండటమంటే... ప్రశాంతత ఎక్కడుంటుంది. ఖర్చులేమన్నా తగ్గాయా అంటే... అదీ లేదు. 800 పై చిలుకు సినిమాలు చేశా. వాటిల్లో సవ్యంగా డబ్బులిచ్చిన వాళ్లు ఎంతమంది? పైగా మా రోజుల్లో పారితోషికాలూ తక్కువే. పెద్దగా వెనకేసుకుందీ ఏమీ లేదు. ఈ మధ్య ఏమైనా సినిమాలు చేశారా? రాళ్లపల్లి: ఏవో చేశాన్లేండి.. అన్నీ అరకొర వేషాలే. ఈ పాత్రలు చేస్తుంటే.. మేనేజర్‌గా పనిచేసిన చోటే గుమాస్తాగిరి వెలగబెడుతున్న ఫీలింగ్. నటుడు అనేవాడికి హోమ్‌వర్క్ చేసుకునే స్థాయిలో పాత్ర ఉండాలి. జాబ్ శాటిస్ఫ్యాక్షన్ ఎలాగూ లేదు. పోనీ జేబు శాటిస్ఫ్యాక్షన్ అయినా ఉండాలిగా? మా రోజుల్లో మానవతా విలువలుండేవి. ఈ రోజుల్లో అదీ లేదు. మీ ఇంటికొస్తే ఏమిస్తారు? మా ఇంటికొస్తే ఏం తెస్తారు? అన్నట్లు తయారయ్యారంతా. అంటే... కళాకారుడైనందుకు బాధ పడుతున్నారా? లేదు లేదు. కళాకారుణ్ణి అయినందుకు ఎప్పుడూ గర్విస్తా. ఆర్టిస్ట్‌గా నాకు అవకాశాలు తగ్గొచ్చు కానీ... ప్రేక్షకహృదయాల్లో నా స్థానాన్ని మాత్రం ఎవరూ చెరిపేయలేరు కదా. రంగస్థలంపై నేను ఇప్పటికీ బిజీగానే ఉన్నా. అసలు మీ నట ప్రస్థానం ఎలా మొదలైందో చెప్పండి? మాది పశ్చిమ గోదావరి జిల్లాలోని రాచపల్లి. 1958లోనే హైదరాబాద్ వచ్చేశాం. టెన్త్‌తో పాటు ఇంటర్ రెండేళ్లూ నాంపల్లి ప్రభుత్వ కళాశాలలో చదివా. టెన్త్‌లో ఉన్నప్పుడే రంగస్థల ప్రవేశం జరిగింది. తొలి నాటకం ‘కన్యాశుల్కం’. కరటకశాస్త్రి శిష్యుడు ‘మహేంద్రం’ నా తొలిపాత్ర. కథకు తగ్గట్టు ఆ నాటకంలో కొంతభాగం స్త్రీగా నటించాలి. నా పాత్రకు మంచి పేరొచ్చింది. అడపాదడపా నాటకాలు వేస్తూనే సైఫాబాద్ కాలేజ్‌లో బీఎస్సీ చేశాను. మొత్తం ఎన్ని నాటకాల్లో నటించి ఉంటారు? రాళ్లపల్లి: 8 వేలకు పై చిలుకే. కాలేజ్ రోజుల్లోనే ‘మారని సంసారం’ నాటిక రాశా. అంతర్ కళాశాలల పోటీల్లో దాన్ని ప్రదర్శిస్తే.. ఉత్తమ రచన, ఉత్తమ నటుడు అవార్డులు లభించాయి. భానుమతిగారి నుంచి అందుకున్నా. బీఎస్సీ పూర్తవగానే రైల్వేలో కొన్నాళ్లు ప్యూన్‌గా పనిచేశా. అప్పుడే కేంద్రప్రభుత్వ సాంస్కృతిక శాఖ నాటక పోటీలు పెట్టింది. ఆ పోటీల్లో మళ్లీ ఉత్తమనటుడు, ఉత్తమ రచన అవార్డులు లభించాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మా రైల్వే సిబ్బంది చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. నా మెడలో లావాటి మల్లెపూల దండ వేశారు. నాకు నోట మాట రాలేదు. కన్నీళ్లు వచ్చాయి. నా జీవితంలో ఎన్ని సన్మానాలు జరిగినా, నా దృష్టిలో అదే పెద్ద సన్మానం. బీఎస్సీ చదివి.. రైల్వే ప్యూన్‌గా పనిచేశారా! రాళ్లపల్లి: మా మూడో అన్నయ్య రైల్వేలోనే పనిచేస్తారు. ‘ఖాళీగా ఉండడం దేనికి! దరఖాస్తు చేయి. మంచి ఉద్యోగం వచ్చాక మారొచ్చు’ అన్న ఆయన సలహా మేరకు ఆ ఉద్యోగానికి అప్లై చేశా. ఇంటర్వ్యూకెళితే... ‘బీఎస్సీ చదివి ప్యూన్ ఉద్యోగం ఏంటి? ఇవ్వం పో..’ అనేశారు. మారు మాట్లాడకుండా వచ్చేశా. తీరా చివరకు ఎంపికైన అభ్యర్థుల జాబితా చూస్తే.. అందులో తొలి పేరు నాదే. తొలిరోజే మా సూపరింటెండెంట్ గంటయ్యగారు మా బేస్మెంట్లో ఉన్న బల్లలు, కుర్చీలు నాతో మోయించేశారు. కాఫీ కప్పులు కూడా కడిగించారు. కేఏ చంద్రశేఖరన్ అని... అప్పట్లో మా పై అధికారి. ఓ సందర్భంలో ఆయన ఏదో అడిగితే, సీరియస్‌గా ఇంగ్లిష్‌లో సమాధానం చెప్పా. ‘ఎవడయ్యా వీడు ఇంగ్లిష్‌లో సమాధానమిస్తున్నాడు’ అని తోటి ఉద్యోగుల్ని అడిగారాయన. ‘చదువుకున్నవాడండీ... తప్పని పరిస్థితుల్లో ఈ చిరుద్యోగం చేస్తున్నాడు.. ’ అన్నారు వాళ్లు. ‘అవునా... ఇక నుంచి ఏ పనులు పడితే ఆ పనులు అతనికి చెప్పొద్దు. అతని చదువుకు తగ్గట్టుగా పనులుండాలి’ అని పురమాయించారు. తర్వాత ‘సాంగ్ అండ్ డ్రామా డివిజన్’లో జాబ్ వచ్చింది. అప్పుడు చంద్రశేఖరన్గారే మంచి ముహూర్తం చూసి, ఉద్యోగం నుంచి రిలీవ్ చేశారు. 1970 జనవరి 4న ఢిల్లీ వెళ్లి ఉద్యోగంలో చేరా. కుటుంబనియంత్రణ, జాతీయసమైక్యత.. ఇలా వివిధ అంశాలపై నాటకాలు వేస్తూ రాష్ట్రమంతా తిరగడం నా డ్యూటీ. ఏడాదికి వందకు తగ్గకుండా ప్రదర్శనలివ్వాలి. ఇచ్ఛాపురం నుంచి హిందూపురం దాకా తిరిగా. అలా ఎనిమిదేళ్లు చేశా. ‘చుట్టుముట్టండి, ధర్మశాల, చౌరస్తా’ నాటకాలన్నీ వేశా. బుర్రకథకు వంత కూడా చెప్పేవాణ్ణి. మరి సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? రాళ్లపల్లి: కొమ్మూరి వేణుగోపాలరావు గారి ‘హారతి’ నవలను కొత్త హీరోహీరోయిన్లతో సినిమాగా చేయనున్నట్లు పత్రికా ప్రకటన వచ్చింది. కె.ప్రత్యగాత్మ దర్శకుడు. ‘హీరో వేషాలకు మీరెలాగూ పనికిరారు. ఇంకేదైనా వేషానికి ఉపయోగపడతారేమో.. ఓ ఉత్తరం ముక్క రాయొచ్చుగా!’ అన్నది నా అర్ధాంగి స్వరాజ్యలక్ష్మి. ఓ రాయి వేసి చూద్దామని ఆ ప్రకటన మీదే ఉన్న అడ్రస్‌కి ఉత్తరం రాశా. ‘నా హైట్ ఆరడుగులు ఉండదు. నా ముఖం అందంగా చంద్రబింబంలా ఉండదు. పదిహేనేళ్ల రంగస్థల అనుభవమైతే.. ఉంది. నటునిగా అవకాశం ఉంటే చూద్దురు’ అని... నేను వేసిన నాటకాల జాబితా కూడా రాసి పోస్ట్ చేశా. ఆ ఉత్తరం ప్రత్యగాత్మగారికి బాగా నచ్చింది. వెంటనే టెలిగ్రాం వచ్చింది. కబురు తీసుకొని మద్రాస్ రెలైక్కి... ప్రసాద్ స్టూడియోలో అడుగుపెట్టా. లోపల రాచకొండ విశ్వనాథశాస్త్రి, సి.నారాయణరెడ్డి, ప్రత్యగాత్మ కూర్చొని ఉన్నారు. నాకు మేకప్ టెస్ట్ చేశారు. ‘నువ్వు వేసిన నాటకాల్లో ఒక డైలాగ్ చెప్పు’ అన్నారు ప్రత్యగాత్మ. చెప్పాను. ‘పనికొస్తాడు..’ అన్నారు సినారె, రాచకొండ. అలా ‘స్త్రీ’(1973) సినిమాలో తొలి అవకాశం దక్కింది. ఆ తర్వాత అరకొర పాత్రలు కొన్ని చేసినా.. నా కెరీర్‌ని మలుపు తిప్పింది ‘ఊరుమ్మడి బతుకులు’(1976). అందులో నా పాత్ర పేరు తాగుబోతు హరిశ్చంద్రుడు. ఆ పాత్రకు నంది అవార్డు వచ్చింది. తర్వాత ఏడాది విడుదలైన ‘చిల్లరదేవుళ్లు’(1977)లోని వీరిగాడి పాత్ర కూడా గుర్తింపునిచ్చింది. తర్వాత మళ్లీ అంత పేరు తెచ్చిన సినిమా ‘చలిచీమలు’(1978). నటునిగా మీకు సంతృప్తినిచ్చిన పాత్ర? రాళ్లపల్లి: ‘సీతాకోక చిలుక’.. గొప్ప పాత్ర. ‘అభిలాష’ గుర్తుంచుకోదగ్గ పాత్ర. ‘కంచుకాగడా’.. గద్దర్ని పోలి ఉండే విప్లవకారుని పాత్ర. ‘రేపటిపౌరులు’.. సింప్లిసిటీ మినిస్టర్ పాత్ర. అర్ధరాత్రి స్వతంత్రం, భూపోరాటం, అన్వేషణ, సగటు మనిషి’, మణిరత్నం ‘బొంబాయి’... ఇలా చాలానే ఉన్నాయి. ‘బొంబాయి’లోని హిజ్రా పాత్రకు మణిరత్నం దృష్టిలో మీరెలా మెదిలారు? రాళ్లపల్లి: ‘తెలుగు నటుల్లో ఈజ్ ఉన్నవాడు కావాలి.. నటిస్తున్నట్లు కనిపించకూడదు. అలాంటి నటుడెవరైనా ఉన్నారా?’ అని మణిరత్నం అడిగితే... రామ్‌గోపాల్‌వర్మ నా పేరు సూచించారట. నిజానికి అంతకు ముందు కూడా కొన్ని సినిమాల్లో హిజ్రాగా చేశా. అయితే... వాటి ట్రీట్మెంట్ అంత నాచురల్‌గా అనిపించదు. అవన్నీ ఒక ఎత్తు... ‘బొంబాయి’లోని పాత్ర మరో ఎత్తు. ఆ పాత్రలో చూసి అందరూ షాకయ్యారు! రాళ్లపల్లి: నన్ను గుర్తు పట్టనివాళ్లు కూడా ఉన్నారు. ‘బొంబాయి’లో నేను చేశానంటే.. ‘ఎక్కడున్నారు?’ అనడుగుతారు. మిగిలిన సినిమాల్లా కాకుండా ఆ సినిమాలో నా డ్రస్కోడ్ కూడా భిన్నంగా, సహజంగా ఉంటుంది. ఉత్తరాది పద్ధతి ప్రకారం పంజాబీ డ్రస్ తొడిగించి ఓ పక్క కూర్చోబెట్టారు. మేకప్ వేసి కూడా రెండ్రోజుల పాటు నాపై షాట్స్ తీయలేదు. ఇతర షాట్స్ తీస్తుంటే చూస్తూ కూర్చునే వాణ్ణి. షూటింగ్ చేస్తూ మధ్య మధ్యలో నా వైపు చూస్తూ ఉండేవారు మణిరత్నం. మూడోరోజున మేకప్ వాళ్లను పిలిచి ‘పంజాబీ డ్రస్ తీసేయండి’ అన్నారు. పాత చీర తెప్పించి కట్టించారు. ‘ఇప్పుడు నిజంగా హిజ్రాలా ఉన్నా’రన్నారు మణిరత్నం. మానవత్వం, భావోద్వేగాలు హిజ్రాలకూ ఉంటాయని చెప్పే ఆ పాత్ర ఓ రకమైన బాధ కలిగిస్తుంది. మీ కుటుంబంలో ఆర్టిస్టులున్నారా? కళలు ఎలా అలవడ్డాయి మీకు? రాళ్లపల్లి: నిజంగా దైవదత్తమే. మా ఇంట్లో ఆర్టిస్టులైతే ఎవరూ లేరు. మా నాన్నగారు స్కూల్ మాస్టర్. పేరు రాళ్లపల్లి వెంకట్రావు. అమ్మ గృహిణి. పేరు కామేశ్వరమ్మ. మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాకు ఇద్దరు అక్కయ్యలు, ముగ్గురు అన్నయ్యలు. నేనే అందరికంటే చిన్నవాణ్ణి. స్కూల్ మాస్టరైన నాన్న జీతం 14 రూపాయలు. ఆ జీతంతోనే ఏ బాదరబందీ లేకుండా మా జీవితాలు సాగిపోయేవి. ఎల్కేజీలో చేరాలంటే యాభైవేల రూపాయలు కట్టే దౌర్భాగ్యపు పరిస్థితి అప్పట్లో లేదు. స్కూల్ ఫీజులు ఉచితం. కరెంటూ ఉండేది కాదు. అందరూ కిరోసిన్ దీపాల ముందు కూర్చుని చదువుకున్నవాళ్లమే. ఎందుకో తెలీదు కానీ చిన్నప్పటి నుంచే కళలపై మక్కువ. ఆ ఇష్టమే కళాకారుణ్ణి చేసింది. మీ ఇంటి పేరు రాళ్లపల్లి. మరి మీ అసలు పేరు? రాళ్లపల్లి: రాళ్లపల్లి వెంకట నరసింహారావు. తొలినాళ్లలో ‘ఆర్.వి.నరసింహారావు’ అని టైటిల్స్‌లో వేసేవారు. ‘తూర్పు వెళ్లే రైలు’ చేస్తున్నప్పుడు దర్శకుడు బాపు గారు.. ‘ఎందుకయ్యా అంత పెద్ద పేరు? ‘రాళ్లపల్లి’.. బావుందిగా!’ అన్నారు. ‘నరికేయండి సార్’ అన్నాను. అప్పట్నుంచి రాళ్లపల్లి నా పేరై కూర్చుంది. ఈ వయసులో ఎం.ఫిల్ చేస్తున్నట్టున్నారు! రాళ్లపల్లి: ఇంతకాలం గురువులు చెప్పింది చేశా. నిజానికి నాకు తెలిసిందెంత? ఇప్పటి దాకా నేను చేసిందేమిటి? చేయాల్సింది ఎంత ఉంది? అనే విషయాలు తెలుసుకోవడానికే ఈ ఎం.ఫిల్. తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల శాఖలో చేస్తున్నా. ఈ వయసులో ఈ చదువు దేనికి? అనే కోణంలో మాత్రం ఆలోచించొద్దు. నా దృష్టిలో ఈ యూనివర్సంతా యూనివర్సిటీనే. అందులో మనిషి అనేవాడు, ముఖ్యంగా కళాకారుడు నిరంతర విద్యార్థి. అన్నీ చెప్పారు కానీ... మీ పిల్లల గురించి చెప్పలేదు? రాళ్లపల్లి: నాకు ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి విజయమాధురి. రెండో అమ్మాయి రష్మిత. పెద్దమ్మాయి 1994లో చనిపోయింది. నా జీవితంలోనే అతి పెద్ద దుర్ఘటన అది. మెడిసన్ చదవడానికి రష్యా వెళ్లాలి. శుభ్రంగా... మద్రాస్‌లో ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగొచ్చు. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి రష్యాలో దిగొచ్చు. కానీ ఆ అమ్మాయి అలా కాకుండా ఢిల్లీ దాకా ఫ్రెండ్స్‌తో కలిసి ట్రైన్లో వెళతానంది. తన కోరిక కాదనలేక స్వయంగా నేనే ట్రైన్ ఎక్కించా. నాకు మద్రాసులో చిన్న చిన్న పనులు ఉన్నాయి. వాటిని ముగించుకొని మరుసటి రోజు ఫ్లైటెక్కి ఢిల్లీ వెళ్లి... అక్కడ అమ్మాయిని రష్యా ఫ్లయిట్ ఎక్కించి వీడ్కోలు ఇవ్వాలనుకున్నా. కానీ నాకంత అవకాశం ఇవ్వలేదు దేవుడు. ట్రైన్ ఢిల్లీ చేరేలోపే ఆ అమ్మాయికి వైరల్ ఫీవర్ వచ్చింది. రైల్లోనే ప్రాణాలు వదిలింది. 1994 సెప్టెంబర్ 29.. నా జీవితంలో అత్యంత దుర్దినం. అప్పట్నుంచీ డిప్రషన్‌లోకి వెళ్లిపోయాను. ఇక రెండో అమ్మాయి విషయానికొస్తే ఎం.సి.ఏ పాసయ్యింది. పెళ్లి కూడా చేసేశా. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటారు. ఇప్పుడొస్తున్న సినిమాలైనా చూస్తుంటారా? రాళ్లపల్లి: 1994 సెప్టెంబర్ 22న ‘బొబ్బిలిసింహం’ ప్రివ్యూ చూశాను. ఆ తర్వాత వారం రోజులకు మా పెద్దమ్మాయి హఠాన్మరణంతో నిరాశానిస్పృహలు ఆవరించాయి. థియేటర్‌కెళ్లి సినిమాలు చూడడం మానేశా. ఈ మధ్య మా తనికెళ్ల భరణి పిలిస్తే.. కాదనలేక ‘మిథునం’ చూశా. ఈ ఇరవై ఏళ్లలో థియేటర్లో చూసిన సినిమాలు ఈ రెండే. టీవీల్లో వస్తున్నప్పుడు మాత్రం చూస్తుంటాను. నచ్చకపోతే చానల్ తిప్పేస్తా. ఇప్పుడున్నంత విశృంఖలత్వం మా రోజుల్లో లేదండీ. వ్యాపారాత్మక ధోరణే తప్ప కళాత్మక దృక్పథంతో ఒక్కరూ ఆలోచించడం లేదు. ఒకవేళ ఆలోచించినా... వాళ్లకు అవకాశాలు రావు. అదీ పరిస్థితి. - బుర్రా నరసింహ నేను వంట బాగా చేస్తానని చాలామంది అంటుంటారు. కమల్‌హాసన్, వంశీ లాంటి వాళ్లకు నా వంట చాలా ఇష్టం. ‘మీకెప్పుడూ చేతినిండా సినిమాలుండాలనేది నా ఆకాంక్ష. ఒక వేళ లేకపోతే.. నా దగ్గరకొచ్చేయండి. వారానికి రెండ్రోజులు వండిపెట్టండి చాలు. జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటాను’ అనేవాడు కమల్ హాసన్. ఇక వంశీ అయితే... షూటింగ్ స్పాట్‌లోకి కూరగాయల్ని తెప్పించి నా ముందు పడేసేవాడు. ‘మీకు సాయంత్రం దాకా షాట్స్ లేవు. ఈ పనిలో ఉండండి’ అనేవాడు. నాతో తనకు చనువెక్కువ. వీళ్లు మాత్రమే కాదు. సినీ ప్రముఖులందరూ నా చేతి వంట రుచి చూసినవారే.