ఆయన హాస్యానికే బ్రహ్మ
ఇంటర్వ్యూ - ప్రముఖ హాస్యనటుడు రాళ్లపల్లి
నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం... నవ్వలేక పోవడం ఒక రోగం.. అనడమే కాదు అందులోని రెండో సూత్రాన్ని తూ.చా. తప్పకుండా పాటించి అంతులేని కీర్తిని మూటగట్టుకున్నారు జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి. రచరుుతగా, దర్శకుడిగా ఆయన సినిమాల్లో ఎంతోమందికి అవకాశమిచ్చి ఉన్నతస్థానంలో నిలబెట్టారు. బ్రహ్మానందం, శ్రీలక్ష్మి వంటి ఎంతోమంది హాస్యనటులు ఆయన సినిమా నుంచి పుట్టుకొచ్చినవారే. నటుడు రాళ్లపల్లి నరసింహశాస్త్రి కూడా ఎన్నో జంధ్యాల సినిమాల్లో నటించి కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఇటీవల జరిగిన జంధ్యాల 13వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా జంధ్యాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
జంధ్యాల గురించి చెప్పండి
తెలుగు భాష ఉన్నంతకాలం జంధ్యాల అందరి గుండెల్లో చిరస్థారుుగా నిలిచిపోతారు. హాస్యం గురించి మాట్లాడే ప్రతిచోటా ఆయనుంటారు. జంధ్యాల.. హాస్యానికే పర్యాయపదం.
ఆయన సినిమాలపై మీ అభిప్రాయం
ప్రవాసాంధ్రులు జంధ్యాల సినిమాలు చూడటానికే ప్రాధాన్యత ఇస్తారు. తమ వద్ద ఎప్పుడూ ఆయన సినిమా సీడీలు ఉంచుకుం టారు. స్వదేశానికి దూరంలో ఉన్నా జంధ్యాల సినిమా చూసి స్వదేశం లో ఉన్నామని భావిస్తామని చాలామంది ఎన్నారైలు నాకు చెప్పారు.
జంధ్యాలతో మీ అనుబంధం
జంధ్యాలతో నా సంబంధం దైవికమైనది. ఆయన దర్శకత్వంలో పది సినిమాలకుపైగా నటించాను. ఆ సినిమాల్లో రాళ్లపల్లి కనిపించడు. పాత్రే కనిపిస్తుంది. ఆ పాత్ర పోషించింది నేనేనా.. అన్న అనుమానం నాకు అప్పుడప్పుడూ కలుగుతుంది. రెండురెళ్ల ఆరు, అహ నా పెళ్లంటా.., శ్రీవారికి ప్రేమలేఖ, బావా బావా పన్నీరు సినిమాలు జంధ్యాలను అంచనా వెయ్యటానికే.. జంధ్యాల హాస్య చిత్రాలకే పరిమితం కాలేదు. సర్వసమానత్వం కోరుతూ తీసిన ‘నెలవంక’, కళాకారులకు జాతిమత కులబేదం లేదని చెప్పిన ‘ఆనందభైరవి’ ఆయన దర్శకత్వ ప్రతిభకు పరాకాష్ట.
నేటి హాస్య సినిమాలపై ఆయన ప్రభావం..
ఈరోజు హాస్య చిత్రాలకు మాటలు రాసేవారు, దర్శకత్వం చేసేవారిలో చాలామంది జంధ్యాల శిష్యులే. హాస్యం ఎలా పండించాలో ఆయన నుంచే నేర్చుకున్నారు.
దర్శకుడిగా ఆయన విజయ రహస్యం..
జంధ్యాల వంటి దర్శకులు అరుదుగా కనిపిస్తారు. ఆయన సినిమాల్లో హాస్యం అతికించినట్టు ఉండదు. సినిమాల్లో భాగంగా ఉంటుంది. జంధ్యాల పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. నాటక రంగం నుంచి రావటం వల్ల ప్రతి సన్నివేశంలో జీవించేవారు. ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో మాధవయ్య సినిమా ద్వారా అజరామరమైన కీర్తి సాధించారు. అందుకే జంధ్యాల మన మధ్య లేకపోయినా ఆయన చిరంజీవిగానే ఉన్నారని నేను భావిస్తాను.